ఈ సట్టేడువారాల.. నెలరోజులూ మన దగ్గర ఊర్లల్ల ఇది పెద్ద పాలపండుగ ! నియమంగల్ల వ్యవసాయ పండుగ!!
ఇప్పుడు కాలం మారింది. వెనుకట ఉన్నంత నిష్ఠనియమం లేకపోవచ్చుగాక, కానీ వారంకట్టుకొని, పాలను నివేదించే దీక్షమాత్రం నడుస్తంది.
డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి
సట్టి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి! తెలంగాణల ఇదే మల్లన్నబోనాల మాసం!! ఈ మార్గశిర/సట్టి మాసాన్నే- సట్టివారాలు & సట్టేడువారాలు అంటరు. అంటే 4+3 (ఆది+బుధవారాలు ) అని అర్థం.
ఈ సట్టిల పాలనివేదన పరమ నిష్ఠగ చేస్తరు. ఈ ఆచారం తెలంగాణల అనాదినుండి వస్తున్నది
కాకతీయుల కాలంల ఇది కోస్తావరకు వ్యాప్తి చెందింది. గోదావరి జిల్లాల శైవమంతా.. ఇవే మూలాలు కలిగింది. నిజానికి ఇదే సుబ్బారాయుడి పాలకావళ్ళ పండుగ ముచ్చట.
వారం కట్టుడు
శైవ సంప్రదాయన్ని పాటించే పాడిగలిగిన కుటుంబాలు ప్రతి ఆదివారం పాలను మల్లన్నదేవునికే కేటాయిస్తరు. ఇల్లువాకిలి & పొయ్యి – దాలి అలుకువూతలు చేసి పాలపూజ, నివేదన పూర్తయేవరకూ ఎవరూ పాడిముట్టరు. ఆ రోజటి పాలను నిత్యావసరాలకు అసలు వాడుడే ఉండది. ఆరోజు పూజ తర్వాత కూడా పాడి బయటికి ఇయ్యరు. ఇది ఏడాదిపొడుగూ ప్రతి ఆదివారం జరిగే ఒక శ్రేష్టమైన క్షీరదీక్ష!
దండివారం
మార్గశిర శుద్ధపాడ్యమి మొదలు శుద్ధషష్ఠి వరకు వారంకట్టుకుని దైవానికి పాలమొక్కు జరుపుడే దండివారం. ఈ ఆరురోజులు పాలు, అన్ని పాలపదార్థాలు కేవలం దేవుని అవసరాలకు, నివేదన తర్వాత ఇంటి అవసరాలకే! బయటికి.. పాలు, పెరుగు, చల్ల, వెన్న, నెయ్యి ఇయ్యరు. తీసిపెట్టిన నెయ్యి షష్ఠినాటి పూజకు ఓరకుపెడుతూ మిగిలిన చల్లను తిరిగి పశువుల కుడితిలనే పోస్తరు. విస్తరివేసి భోజనంపెట్టి చల్లపెరుగు వడ్డించుడు తప్ప-బిచ్చగాండ్లకు, ఇంటిచాకలికి కూడా పాడి ఇచ్చుడులేదు.
గుడికేగి నిత్యంబు – కుంచెడు పాలు
పడరున కారగింపగ – బెట్టుమమ్మ !
~పాల్కుఱికి సోమన్న ((గొడగూచి కథ; బసవపురాణంలోని భక్తురాలి కథ)
ఇది పూర్తిగ పాడిపంటల కట్టుబాటుతో సాగే దీక్ష కనుక ధనం, ధాన్యం కూడా బయటికి అసలు ఇచ్చుడే ఉండది. ఆఖరునాడు ఈ పాలుపెరుగు, నెయ్యి… బోనాలకోసం పరమాన్నాల నివేదనలకోసం మాత్రమే కేటాయిస్తరు.
షష్ఠినాడు పట్టుపాలతో వండిన బెల్లం పరమాన్నం, కట్టడి నెయ్యితో చేసిన నేతిబెల్లప్పాల నివేదనతో దండివారం పాలుపెరుగు కట్టడి సమాప్తమైతది. కానీ ఏడాదంత ప్రతి ఆదివారంపూట యధావిధిగా జరుపుడే!
వారం కట్టుకునుడు
దండివారం వంతన/ఆచారం లేని వారు ఈ సట్టివారాలల్ల ఏదో ఒకవారం, వారం కట్టుకుంటరు.
సొమవారం నుండి ఆదివారం వరకు ఏడురోజులు…బుధవారం నుండి ఆదివారం వరకు ఐదురోజులు… శుక్రవారం నుండి ఆదివారం వరకు మూడురోజులు…ఇట్లా తమతమ శక్తి, ఓపికకొద్ది రకరకాలుగ కొనసాగుద్ది.
పాలుపెరుగు కట్టుబాట్లు, పైస & ధాన్యం కట్టుబాట్లు, దండివారానికి పాటించినట్టే ఉంటయి, నిష్ఠల.. తేడాలేదు.
ఆదివారంనాడు మల్లన్నదేవునికి రెండుతీర్ల బోనాలు చేసి వాడకట్టందరిని పరమాన్నం, కాయగూరల భోజనంతో ఆత్మీయంగ అరుసుకునుడుతోటి వారం తంతు ముగుస్తది.
ఇప్పుడు కాలం మారింది, మనలనూ మార్చిందిగద! వెనుకట ఉన్నంత నిష్ఠనియమం లేకపోవచ్చుగాక, కానీ వారంకట్టుకొని, పాలను నివేదించే దీక్షమాత్రం నడుస్తంది.
వంతన ఉన్నవారు పరమాన్నపు భోజనాలకుపిలుస్తరు తంతులేనివారు అతిథి దేవుళ్లై కడుపారా తినితరిస్తరు.
ఈ సట్టేడువారాల.. నెలరోజులూ మన దగ్గర ఊర్లల్ల ఇది పెద్ద పాలపండుగ ! నియమంగల్ల వ్యవసాయ పండుగ!! అన్నదానమే… తెలంగాణ బోనాలకు, పరమార్థం అంతరార్థం !!
తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలను లోతుగా తరచి చూసి అందలి ఔన్నత్యాన్ని శాస్త్రీయతను తెలిపే రచనలు చేసే డా. మట్టా సంపత్కుమార్ రెడ్డి చక్కటి కవి. వృత్తిరీత్యా వారు ఉపన్యాసకులు.
అనాదిగ వస్తున్న పండుగలు ప్రకృతితో మమేకం చేస్తు ఉత్సాహంగ ఇల్లంత జరుపుకునేవి. వ్యక్తులుగ మనం మారి వ్యవస్థను తప్పు పడుతున్న కాలం. కుటుంబ ఆనందాలను పాతరేసి ఇంకా చెప్పాలంటే మూఢనమ్మకాలని పేరు తగిలించి వికృత ఆనందం పొందుతున్న రోజులు. కని ఇంకా చాలచోట్ల ఆనందంగా జరుపుకుంటూ సమాజానికి హితవు చేస్తున్న అమాయక ప్రజ. పాల పండుగ సట్టేడు వారాల అనాది పండుగ,గుర్తుచేస్తూ మంచి వ్యాసాన్ని అందించిన రచయితకు కృతజ్ఞతలు.
నమస్కారము సర్,
మంచి విలువైన సమాచారం.