నీళ్లు దొరక్క గొంతెండి ప్రాణాలు పోతాయేమోనని భయం తప్ప వానలు ఎక్కువై వరదనీరు ముంచెత్తితే అందులో మునిగి ఊపిరాడక చస్తామనే భయం మాకు ఎప్పుడూ లేదు.
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి
పదేళ్ల కిందట కడపకి వెళ్ళేప్పుడంతా ఖాజీపేట దగ్గర పెద్ద వంకకు వంతెన కడుతూ నిర్మాణ సామగ్రి అంతా వంక మధ్యలో వదలివేసి ఉండటం బస్సులో పోతూ గమనించే వాన్ని. ఆ వంతెన నిర్మాణం దాదాపు రెండేళ్ల పైగా కొనసాగింది. నాకెప్పుడూ ఆశ్చర్యం – వానలు కురిసి పెద్దవంక పొర్లితే ఆ సామాగ్రి అంతా కొట్టుకుపోతుంది గదాయని. వాళ్ళెందుకు వాటిని గట్టున పెట్టరో అర్థం కాదు. చాలా మందిని అడిగాను కూడా. “అంత లావు వానేడ వస్తాదిలే” అని పెదవి విరుస్తారే తప్ప నాలా ఎవరూ అభద్రతాభావానికి గురికాలేదు. ఆ కాంట్రాక్టర్ గుండె ధైర్యం మీద నాకు ఆశ్చర్యం. తర్వాత అనిపించింది కరువు మీద అతనికి ఎంత నమ్మకమోగదా అని.
ఇట్లాంటి నమ్మకాలన్నిటినీ వమ్ము చేస్తూ వరద రుచి చూపించింది ప్రకృతి. చెయ్యేరు పొంగింది. ఎప్పుడూ కాళ్ళకింద అచేతనంగా పడి ఉండే నది ఇంత పని చేస్తుందని నమ్మలేక పోయారు. వరద ఉధృతి అంత లావు డ్యాము కట్టను కోసింది. పైరుపొలాల్ని దున్నేసింది. చెట్లుచేమల్ని కూకటేర్లతో సహా లేపేసింది. ఇండ్లను పడదొబ్బింది. పశువుల్ని మింగింది. మనుషుల్ని చంపింది. ఇన్ని రోజులూ ఎండిన ఎదలతో పక్కనే పడుకొని ఉన్న ఈ వంకకు ఇంత ఆకలి ఉంటుందనీ, ఇంత కర్కశంగా ప్రవర్తిస్తుందనీ ఊహించలేక పోయారు.
మా చెరువులు, డ్యాములు, వంతెనలు కరువు దెబ్బకు తట్టుకునేంత దృఢంగా నిర్మించబడి ఉంటాయి గాని, వరదల దెబ్బకి కాదు. అందుకే ఈ విలయం.
మా చెరువులు, డ్యాములు, వంతెనలు కరువు దెబ్బకు తట్టుకునేంత దృఢంగా నిర్మించబడి ఉంటాయి గాని, వరదల దెబ్బకి కాదు. అందుకే ఈ విలయం. ఇళ్లు కూలిపోయి నిల్చొనేందుకు కూడా తావులేదు. తాగను నీళ్లు లేవు. తినేందుకు తిండి లేదు. మార్చుకునేందుకు బట్టలు లేవు. చుట్టుపక్కల రైతులు తోచిన కాడికి కూడూగుడ్డ అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. వంటిమిట్ట దగ్గరి నడింపల్లె లోని మా బంధువు భాస్కరరెడ్డి చుట్టపక్కాల వద్ద కొంత సొమ్ము జమ చేసి బాధితుల కోసం సాయం చేస్తుంటే మా అబ్బాయికి తెలిసి ఆ విషయం నాకు చెప్పాడు. తను రాంకీ ఫౌండేషన్ లో పని చేస్తున్నాడు. దాని సీఈఓ యమ్వీ రామిరెడ్డి నా మిత్రుడు. సోదర సమానుడు. ఆయన దృష్టికి విషయం తీసుకెళ్లగా, యాజమాన్యంతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుని నాకు తెలియజేశాడు. రమారమి వెయ్యిమంది వరద బాధితులకు సరిపడే దుప్పట్లు,పంచెలు, చీరలు, టవాళ్ళు, వంటపాత్రలు, పళ్ళేలు, గ్లాసులు, సబ్బులు వగైరాలన్నీ కొని రాత్రి 10 గంటల కల్లా వాహనానికెత్తి బయల్దేరదీశాడు. కంపెనీ ప్రతినిధిగా మా అబ్బాయిని పంపించాడు. ఆ వస్తువుల్ని వరద బాధితులకు అందజేసే బాధ్యత నాకు అప్పగించారు. మిత్రుడు నారాయణ రెడ్డి, సుకేశ్ , భాస్కర్ రెడ్డి ఇంకో 20 మంది వలంటీర్లతో వరద బాధితులకు అందించేందుకు పూనుకున్నాము. సమస్యను తన దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించడం, కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడం, అమలు చేయడం, అంత పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చి బాధితుల వద్దకు చేర్చటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. యమ్వీ రామిరెడ్డికి ఎంతైనా కృతజ్ఞతలు తెలుపవలసిన అవసరం ఉంది.
వరదబాధిత ప్రాంతానికి దగ్గర్లోనే ఉన్నాం. తర్వాత విషయాలు మరో కథనంలో.
ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాయలసీమ రైతు బిడ్డ, వృత్తి రీత్య ఉపాధ్యాయులు. ఇటీవల వారి నవల ‘కొండపొలం’ సినిమాగా వచ్చిన విషయం తెలిసిందే. వారి ఇ -మెయిల్ SANNAPUREDDY12@GMAIL.COM