Editorial

Monday, December 23, 2024
కథనాలుజల విలయంలో ... సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి తెలుపు

జల విలయంలో … సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి తెలుపు

నిన్నటిదాకా పైరుకు పాలపీకలుగా వుండే నీటి జాలు ఇప్పుడు ఉరితాళ్ళుగా మారి మెడకు బిగించి నేలకేసి బాదినట్లుగా వుంది. కరెంటు మోటార్లు లేవు. స్టార్టర్లు లేవు. స్తంభాలు పడిపోయాయి. తీగలు దారులకు అడ్డంగా వూగుతున్నాయి. ఏ యింట చూసినా కన్నీరే. ఏ పంటనేల చూసినా ఆర్తరావాలే.

మళ్ళీ ట్రాక్టర్లు ఎక్కాము. ఇప్పటిదాకా నేను చేసిన ప్రయాణాల్లోకల్లా ఇది ప్రత్యేకమైంది. జీవితంలో మరచిపోలేనిది. మరోమాటలో చెప్పాలంటే ఒక భయానక స్వప్నం లాంటిది.

సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి

ఎప్పుడూ స్తబ్ధంగా పడివుండే ‘చెయ్యేరు’ జూలు విదిల్చి, సంకెళ్లను తెంచుకొని కన్నుగానకుండా పరుగులు తీస్తే, దాని పాదాల కింద పడిన పల్లెలు, పొలాలు, చెట్లు, జంతువులు, మనుషులు, చివరకు కొండచరియలు కూడా మట్టిలో కలిసిపోయాయి. ఆ విలయం సృష్టించిన విషాదం తాలూకు కన్నీటి జడిలోని ఒక్క బిందువునైనా తుడవాలనే తాపత్రయంతో ఇంటినుంచి బైల్దేరాను – తోడుగా మిత్రుడు నారాయణరెడ్డి, సుకేశ్ కుమార్ రెడ్డిలతో.

మేము ఒంటిమిట్ట దగ్గరకు వెళ్ళేసరికి ఫౌండేషన్ వారు పంపించిన సహాయ సామాగ్రిని తీసుకొని మా అబ్బాయి శ్రీనాథ్, భాస్కర్ అక్కడకు వచ్చి ఉన్నారు. శ్రీరామ నవమి కల్యాణ మండపం వద్ద వలంటీర్ల సహాయంతో రాంకీఫౌండేషన్ వారు పంపించిన వస్తువులన్నిటినీ చిన్నచిన్న మూటలుగా కట్టించే సరికి మధ్యాహ్నమయ్యింది. మూటలన్నింటినీ రెండు ట్రాక్టర్లకు పేర్చి, పైన పాలిథిన్ కవర్లు కప్పి బిగించి కట్టి వరదబాధిత గ్రామాలకు బైల్దేరాము.

నందలూరు దాటగానే చెయ్యేరు ఎదురైంది. బ్రిడ్జి కింద ఏమీ తెలియనట్లు పరుగులు తీస్తోన్న ఏటిని చూడగానే గతంలో ఎప్పుడు యీ దారిన పోతున్నా ఎండిన ఎదలతో, గర్భంనిండా పిచ్చికంప పెరిగి, చింపిరి చింపిరిగా పడివున్న పిచ్చిపిల్లలా కనిపించేది. ఇప్పుడేమో చెంగుచెంగున గెంతుతోన్న అల్లరి పిల్లలా ఎదురయ్యింది. ఎవరో ఎక్కడో గిళ్లారు. ఏదో తప్పుడు పని చేశారు. మనస్సును గాయపరిచారు. లేకుంటే ఇంత ఉగ్రరూపం దాల్చివుండేది కాదు. ప్రధాన రహదారి మీద కూడా ఇంతలా వీరంగం తొక్కివుండేది కాదు. బస్సును సైతం యీడ్చుకు పోయిందట – మనుషుల ప్రాణాలతో సహా.

మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు గారు వరద పీడిత గ్రామాల్లో సంచరిస్తున్నారట. భద్రతా కారణాల దృష్ట్యా కొత్తవాళ్ళనెవ్వరినీ ఆ గ్రామాలకు వెళ్ళనీయటం లేదట.

రెండు ట్రాక్టర్లు రెండు జీవులతో బాధిత ప్రాంతాలకు వెళ్లే దారికేసి మలుపు తిరగబోతోంటే పోలీసులు అడ్డగించారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు గారు వరద పీడిత గ్రామాల్లో సంచరిస్తున్నారట. భద్రతా కారణాల దృష్ట్యా కొత్తవాళ్ళనెవ్వరినీ ఆ గ్రామాలకు వెళ్ళనీయటం లేదట. ట్రాక్టర్లకు కట్టిన బ్యానర్లను చూపించి ఫౌండేషన్ చేసే సహాయం గురించి చెప్పినా వాళ్ళు వినుకోలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ రోజుటికి సహాయకార్యక్రమాలకు సాధ్యమయ్యేట్టు లేదు. ఈ సామాగ్రి ఎక్కడ ఉంచాలో తెలీటం లేదు. భాస్కర్ రెడ్డి చెప్పాడు- జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి గారి గెస్ట్ హౌస్ వద్ద ఉంచుదామని. అక్కకు వెళ్ళాలన్నా వరద ముంపుకు గురైన గ్రామాలకు వెళ్లే దారిలోనే వెళ్లాలి. పోలీసులు వెళ్లనీయడం లేదు. చుట్టూ తిరిగి వెళ్లే మరోదారి ఉందని చెప్పాడు భాస్కర్ రెడ్డి. మా వాహనాలతో బాటు మేమూ ఆ దారి పట్టాము. ఇప్పటికీ కొండచిలువల్లా కదలాడే వంకలూ, వరద నీరు తెచ్చి మేట వేసిన చెత్తా చెదారంతో నిండిన పొలాలూ, బురదమయమై నీళ్ళూరుతూ వున్న పల్లె వీధులు, నిండా తొణుకులతో భయం గొలుపుతూ వున్న చెరువులూ వరద బీభత్సం తాలూకు కొసవిసుర్లను మాకు పరిచయం చేస్తూ వుండగా ఆకేపాటి అమర్నాథరెడ్డి గారి గెస్ట్ హౌస్ వద్దకు వెళ్లాము.

జడ్పీ చైర్మన్ గారు లోపలే ఉన్నారు. నన్ను పరిచయం చేసుకోగానే ఆయన గుర్తు పట్టారు. గతంలో ఒకటి రెండు సార్లు అబ్బిగారి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నందలూరు గొబ్బిళ్ళవారి హై స్కూల్ లో జరిగిన కేతు విశ్వనాథరెడ్డి అవార్డు సభలో ఆయన పాల్గొన్నారు. వందల సంఖ్యలో వచ్చిన రచయితలకూ, సాహిత్యాభిమానులకూ ఆయన భోజనవసతి కల్పించారు.

ఆయన మాకు ఓ సూచన చేశారు. “సహాయం చేసే వాళ్ళందరూ పులపత్తూరు, తొగురుపేట, మందపల్లెలకే సామగ్రిని అందజేస్తున్నారు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన పల్లెలు నాలుగున్నాయి. నూతిపల్లె, చింతలకోన, బగ్గిడిపల్లె, ఏకిలపల్లెలు. ఇక్కడి ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవ్వరూ అక్కడికి పోలేకున్నారు.” అని.

“ఒక్క రోజు నాకు సమయం ఇవ్వండి. డోజర్లు, ట్రాక్టర్లు, జెసిబిలు పెట్టి అక్కడికి దారి చేయిస్తాను. మీతోబాటు నేనూ వస్తాను. అందరం వాళ్ళను పరామర్శించుదాం. వస్తురూపేణా ఇచ్చే సహాయం ఒక ఎత్తయితే, వాళ్ళను పరామర్శించి మీకోసం మేమున్నామని ధైర్యం చెప్పడం మరో గొప్ప సహాయం అవుతుంది” అన్నాడు.

ఆయన సూచన చాలా మంచిదిగా అనిపించింది.

పసుపు బట్టలు తొడిగి, మెడలో రుద్రాక్షమాల ధరించి, కుడి చేతికి తిరుమల కంకణం కట్టి…. ఆయన శ్రీనివాస మాల ధరించి ఉన్నాడు. ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో ఆకేపాడు నుంచి కుక్కలదొడ్డి దారిన అన్నమయ్య నడిచిన కాలిదారివెంట తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని రావటం ఆయనకు అలవాటు.
అప్పుడే పొలాలనించి వచ్చిన ఆవుల వద్ద పాలు పిండి టీ కాచి ఇచ్చారు. తాగిన తర్వాత ఆయన వద్ద సెలవు తీసుకుని వెనుదిరిగాము.

ఇంకా ఎవరూ చేరుకోని కొత్త ప్రాంతాలకు మేము చేరుకొని సహాయం చేయబోతున్నందుకు లోలోపల ఉత్కంఠగా ఉంది.


జలవిలయానికి బలయిపోయిన పల్లెల్లో పులపత్తూరు, తొగురుపేట, మందపల్లెలకే ప్రథమస్తానం. అది కాదనలేని సత్యం. ప్రభుత్వాన్నించి వాళ్ళకు పెద్ద సహాయం అందాల్సిందే. అప్పటిదాకా అందించే చిన్నచిన్న సహాయాలు మిగతా పదిహేను పైగా గ్రామాలకు అందాలి. ఎప్పుడూ ప్రజల్లో తిరిగే మనిషి కాబట్టి జడ్. పి. చైర్మన్ అమరనాథరెడ్డి గారు ఆ విషయం గ్రహించారు కాబట్టే మాకా సూచన చేశారు.
మొదటిరోజుటి మా ప్రయత్నాలూ, ఆటంకాలూ, కొత్త వ్యూహాలు తెలిసికొన్న రాంకీ ఫౌండేషన్ వారు అదనంగా మరో ఐదువందల టీషర్టులు, నైట్ ప్యాంట్లు రాత్రికి రాత్రే ఖరీదు చేసి బస్తాల్లో కట్టి బస్సుకు వేశారు. వాటిని కడపలో అందుకొని ఆకేపాటికి తీసికెళ్ళాము. 24వ తేది మద్యాహ్నం రెండుగంటలకు వాన కురుస్తోన్నా లెక్కజేయకుండా రెండు ట్రాక్టర్ల సరుకుతో, మేమో ఇరవైమందిమి, అమరనాథరెడ్డి గారి మనషులొక పదిహేను మందితో దారిబట్టాము. పులపత్తూరు వరకు వెళ్ళేసరికి పైన్నించి కురిసే వానకన్నా మా కళ్ళేఎక్కువగా కురవబట్టాయి.

ఏదీ పైరు? పొలాలు ఎక్కడ? కంచెలు గట్లు ఏపక్కనున్నాయి? “అయ్యా మా పొలం ఇక్కడేన్నో వుండేదయ్యా! ఈ గట్టున చెట్టుండేది. ఆ పక్కన పుట్టుండేది. మాచేలను ఏరెత్తక పోయిందయ్యా!” అంటూ గట్టున్నే విలవిలలాడే రైతు. పక్కనే చేలనిండా ఇసుక మేటవేసి అంతా నాదేనంటోన్న ఏరు.

ఏదీ పైరు? పొలాలు ఎక్కడ? కంచెలు గట్లు ఏపక్కనున్నాయి? “అయ్యా మా పొలం ఇక్కడేన్నో వుండేదయ్యా! ఈ గట్టున చెట్టుండేది. ఆ పక్కన పుట్టుండేది. మాచేలను ఏరెత్తక పోయిందయ్యా!” అంటూ గట్టున్నే విలవిలలాడే రైతు. పక్కనే చేలనిండా ఇసుక మేటవేసి అంతా నాదేనంటోన్న ఏరు.

నిన్నటిదాకా పైరుకు పాలపీకలుగా వుండే నీటి జాలు ఇప్పుడు ఉరితాళ్ళుగా మారి మెడకు బిగించి నేలకేసి బాదినట్లుగా వుంది. కరెంటు మోటార్లు లేవు. స్టార్టర్లు లేవు. స్తంభాలు పడిపోయాయి. తీగలు దారులకు అడ్డంగా వూగుతున్నాయి. ఏ యింట చూసినా కన్నీరే. ఏ పంటనేల చూసినా ఆర్తరావాలే. “ఇరవై సెంట్ల నేలున్నే సాలు – ఏటి పున్నేన బతుకుతా వుంటిమి. నేలంతా పెరక్కపాయె ఏరు. ఇంగ ఎవురి దాపున బతికేము?” ప్రశ్న. సమాధానం లేని ప్రశ్న.

పులపత్తూరు నించి దారి చేయించారు అమరనాథరెడ్డి గారు. అయినా కార్లు వెళ్ళవు. అందరమూ ట్రాక్టర్లపైకి ఎక్కాము.

చింతలకోన వూరు గట్టుమీంచి ఏటిలోకి దిగివుంది. వరద బీభత్సం లేకుంటే వూరిలోంచి ఏటికేసి చూస్తే ఎంతందంగా వుంటుందనీ! ఎదురుగా ఆకాశమంత ఎత్తు కొండ. దాని పాదాల వద్ద వయ్యారంగా మెలికలు తిరుగుతూ చెయ్యేరు. చెట్లూ, పశువులూ, మనుషులూ, కాలిబాటలూ కన్నుల పండువగా వుండేది. ఇప్పుడు అదే చెయ్యేరు జలఖడ్గాన్నెత్తి ఆ దృశ్యాలన్నింటినీ తునాతునకలుగా ఖండించి వేసింది. అంత ఎత్తు, లావుకొండను పైకి ఎగమల్లి అందినకాడికి జలప్రవాహం కోసేయడంతో కొండపైపొరలన్నీ అక్కడక్కడా కిందకు జారిపోయిన దృశ్యాలు స్పష్టంగా కనిపించి చూసేవాళ్ళను ఆశ్చర్యపరుస్తున్నాయి.

ఇప్పటిదాకా ఏ సహాయహస్తాలూ యీ నేల మీద అడుగు పెట్టలేదుట. జడ్. పి. చైర్మన్ గారి కృషి వల్ల మేము వెళ్ళగలిగాము. పడిపోయిన ఇల్లూ, కొట్టుకుపోయిన పైరూ, ఇసుక మేటవేసిన పొలాలకు పరిహారం చెల్లించలేముగాని తాత్కాలిక ఉపశమనాన్నిచ్చేందుకూ, ధైర్యాన్ని కలిగించేందుకూ మా అడుగులు సహాయపడవచ్చు.

బగ్గిడిపల్లెలో సహాయం అందించేసరికి బాగా చీకటి పడింది. అక్కన్నించి ఆరు కిలోమీటర్లకు పైగా కొండల్లో ప్రయాణిస్తే ఏకిలపల్లె వస్తుందిట.

ఇప్పటిదాకా నేను చేసిన ప్రయాణాల్లోకల్లా ఇది ప్రత్యేకమైంది. జీవితంలో మరచిపోలేనిది. మరోమాటలో చెప్పాలంటే ఒక భయానక స్వప్నం లాంటిది.

మళ్ళీ ట్రాక్టర్లు ఎక్కాము. ఇప్పటిదాకా నేను చేసిన ప్రయాణాల్లోకల్లా ఇది ప్రత్యేకమైంది. జీవితంలో మరచిపోలేనిది. మరోమాటలో చెప్పాలంటే ఒక భయానక స్వప్నం లాంటిది.

దారి పూర్తిగా మట్టిబాట. సుద్దచెక్కలతో కూడిన మట్టి. పూర్తిగా కొండచెంపల మీదుగా తొలుచుకొంటూ చేసిన దారి. తడిసి నానిన మట్టి, బండపేలికలతో పరచుకొన్న దారి. కొండ నడుంవంపు మీదుగా గాటు పెట్టినట్టుగా చేసిన దారి. కింద అగాథమైన లోయ. జారితే ఎముకలు కూడా దొరకనంత లోతు. ఆ బీభత్సమంతా వానజల్లులు రాలే ఆ చీకటిరాత్రి మాకు కనిపించలేదుగాని, చెబుతూవుంటే అర్థమైంది. ఎత్తికుదేసే రాళ్ళు, చక్రాలు కూరుకుపోయే బురదనేలతో కూడిన దారి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏకిలపల్లెకు వెళ్ళాము. అక్కడ అడుగు పెట్టగానే నేను సంధించిన మొదటి ప్రశ్న “ఈవూరు కట్టించిన పెద్దమనిషి ఎవురయ్యా? “అని. ఎప్పుడో 250 ఏళ్ళ క్రితం ఏకిల కులస్తుడైన పాలెగాడొకడు వూరు కట్టాడుట. బగ్గిడిపల్లె బలిజకులస్తుల్ని కూడా అతనే తెచ్చి పెట్టాడట. తర్వాత వాళ్ళు కిందకు దిగివచ్చి వూరు కట్టుకొన్నారట. పెద్దచెంబు నిండా మంచినీళ్ళు తెచ్చి యిచ్చారు. చాలా రుచిగా వున్నాయి.
వాళ్ళకు సహాయాన్నందించి తిరిగి వచ్చేటపుడు మాకు కష్టాలు మొదలయ్యాయి. ముందుట్రాక్టర్ సాగిపోగా వెసుకట్రాక్టర్ బురదదారిలో లోయవైపు ఒరిగింది. చైర్మన్ గారు ఎక్కిన ట్రాక్టర్ అది. పైనున్న వాళ్ళంతా అరచుకొంటూ కిందకు దిగదూకారు. ట్రాలీ లోయలోకి జారిపోతుందేమో అనుకొన్నారు. ఇంజన్ వూడదీసుకొని, ట్రాలీ అక్కడే వదిలేసి ముందుకు కదిలారు. ఏమాత్రం భయపడకుండా అందరికీ ధైర్యం చెబుతూ మాలధారణలో ఉన్నందున కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా నడిచి వస్తూవున్న జడ్. పి. ఛైర్మన్ అమరనాథరెడ్డి గారిని చూస్తూవుంటే నాకు ఆశ్చర్యం కలిగింది. మిగిలిన జనమంతా రెండవ ట్రాక్టర్లో ఎక్కారు.

అప్పుడు మొదలైంది అసలుసిసలైన భయం. ట్రాక్టర్ చక్రాలు జారుతూ వున్నాయి. ఇంజన్ భోపెడుతూవుంది. బురదనేలలో ఎక్కలేక రొదపెడుతూ వుంది. గింజుకొంటోంది. ఎవ్వరికీ ప్రాణంలో ప్రాణం లేదు. దిగి నడుద్దామనుకొంటే చీకటిదారి. అందులోనూ అడవిమార్గం.

ఈరోజుటి ప్రయాణాన్నంతా మననంజేసికొని, ఇంత కష్టసాధ్యమైన ప్రయాణం ఎప్పుడూ ఎరుగని విషయాన్ని గుర్తుజేసికొంటూ వుంటే హఠాత్తుగా ఓ విషయం స్ఫురణకు వచ్చి ఉలిక్కిపడ్డాను.

ఉన్నట్టుండి ఒకచోట బండి లాగలేక వెనక్కి జారసాగింది. అందరూ అరచుకొంటూ కిందకు దిగి చక్రాలకింద బండరాళ్ళు వేశారు. బండి ఆగింది. మనుషులంతా దిగడంవల్ల ముందుకు కదిలింది. ఒక భయానక అనుభవం తర్వాత, ఇంత రిస్క్ ఎందుకు తీసికొన్నామా అనేంత భయం తర్వాత, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాత్రి పదిగంటలకు గానీ బైటిప్రపంచంలోకి రాలేక పోయాము.

అమరనాథరెడ్డి గారిలో ఎలాంటి టెన్షనూ కనిపించలేదు. మొహంమీద నవ్వు చెరగలేదు. అలిసిపోలేదు. కనిపించిన వారినల్లా ఆప్యాయంగా పలుకరించడం ఆపలేదు. అంతటి స్థితప్రజ్ఞత కలిగి వుండటం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. అంతటి హోదా కలిగివుండి కూడా ఎలాంటి రక్షణ లేకుండా, ఆ వానరాత్రి, దారీతెన్నూ లేని ప్రాంతాలకు ఒక మంచిపని కోసం సాధారణ జనాభాలో కలిసి పయనించడం ఆయన అసాధారణ వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది.

ఈ విషయాలన్నీ రాంకీ సియ్యీవో యమ్వీ రామిరెడ్డి గారికి చెప్పగానే చాలా సంతోషించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

రాత్రి 12 గంటలైంది కడప చేరుకొనేసరికి.

ఈరోజుటి ప్రయాణాన్నంతా మననంజేసికొని, ఇంత కష్టసాధ్యమైన ప్రయాణం ఎప్పుడూ ఎరుగని విషయాన్ని గుర్తుజేసికొంటూ వుంటే హఠాత్తుగా ఓ విషయం స్ఫురణకు వచ్చి ఉలిక్కిపడ్డాను. ఈ ప్రయాణాన్ని ఆ పల్లెల జనం రోజూ చేస్తూనే వున్నారుగదా! ఒక్కసారికే మేమింతగా వేసటబడి మరెప్పుడూ ఇట్లాంటి సాహసం చేయకూడదని నిర్ణయించుకొంటూ వుంటే వాళ్ళు ఈ ప్రయాణాన్ని జీవితాంతం బతుకుపోరాటంలో భాగంగా కొనసాగిస్తూనే వున్నారుగదా!

ఆ భావన రాగానే నా దుర్భలత్వం మీద నాకే జాలేసింది.

ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాయలసీమ రైతు బిడ్డ, వృత్తి రీత్య ఉపాధ్యాయులు. ఇటీవల వారి నవల ‘కొండపొలం’ సినిమాగా వచ్చిన విషయం తెలిసిందే. “మా చెరువులు, డ్యాములు, వంతెనలు కరువు దెబ్బకు తట్టుకునేంత దృఢంగా నిర్మించబడి ఉంటాయి గాని, వరదల దెబ్బకి కాదు. అందుకే ఈ విలయం” అంటూ ఇంతటి విలయంలో బాధితులకు అండగా ఉండేందుకు ఎలా వీలైందో రాసిన మొదటి భాగం ఇక్కడ చదవండి. వీడియో క్లిప్ ఇది క్లిక్ చేసి చూడండి.రచయిత  ఇ -మెయిల్ SANNAPUREDDY12@GMAIL.COM

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article