నేడు సెప్టెంబర్ 24
క్రీ.శ 1557 సెప్టెంబర్ 24 నాటి సంబటూరు (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో శ్రీమన్మహామండలేశ్వర నందేల అహోబలేశ్వర మహారాజుల కుమారుడు చిన్న అహోబిలేశ్వరదేవమహారాజు సంబటూరు ప్రతినామమైన శ్రీభాష్యపురం కేశవపెరుమాళ్ళ తిరణాల్లకు, ప్రసాదాలకు చిడిపిరాల గ్రామంలో కొమాళ్ళకాలవ వద్ద బత్తుల కాల్వ వద్ద 13 పుట్ల ఒక కుంచ రెండు గుంటల భూమిని, మొత్తం 50 వరహాల క్షేత్రాన్ని అవధరించినట్లు, ఆ ప్రసాదంలో నాల్గవ వంతు భాజనపల్లి కృష్ణమాచార్యులకిచ్చేటట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XXXI నెం 118].
అట్లే 1581 సెప్టెంబర్ 24 నాటి బుక్కపట్నం శాసనంలో శ్రీరంగరాయలు రాజ్యం చేస్తుండగా వారి కార్యకర్తలైన ప్రధాని మేగోటి తిమ్మనాయనింగారి ఆనతిని దళవాయి వెంకటప్పనాయనింగారు కొత్తచెరువు బుకసాగరం చందేశ్వరీ దేవరకు అనేక భూములను సర్వమాన్యంగా యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం.293].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా