Editorial

Monday, December 23, 2024
కథనాలుతెలంగాణ ఒక నిషిద్ధ ఆలోచన - ఎస్.రామకృష్ణ

తెలంగాణ ఒక నిషిద్ధ ఆలోచన – ఎస్.రామకృష్ణ

S. Ramakrishna

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం (TJF) తెచ్చిన ‘తెలంగాణ, మే 31 2001’ పుస్తకంలోని ఐదో వ్యాసం ఇది. “దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ జర్నలిజంలో తెలంగాణ ఒక నిషిద్ధ ఆలోచన” అని సూటిగా చెబుతూ సీనియర్ జర్నలిస్టు, వివిధ ఆంగ్ల పత్రికల్లో పనిచేసి విశేష అనుభవం గడించిన ఎస్.రామకృష్ణ కోస్తా జర్నలిస్టుల తాలూకు వలస దృక్పథాన్ని నిశితంగా విమర్శించారు. వార్తలను అందించడంలో ఒకే ప్రపంచాన్ని రెండు భిన్న కోణాల నుండి చూడటంవల్ల వచ్చే ఇబ్బంది గురించి చెబుతూనే తెలంగాణ ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక జీవనశైలి అన్నింటికీ మించిన ఇక్కడి ప్రజల నెమ్మదితనం నిరాడంబరత, కోతలు కొయ్యలేని ‘అశక్తత’ కోస్తా జర్నలిస్టుల దృష్టిలో మైనస్ పాయింట్లు అంటూ తేల్చి చెప్పారు. తెలుగు పత్రికలే కాదు, ఆంగ్ల పత్రికలూ తెలంగాణ అంశాలను రిపోర్ట్ చేసే పద్దతిని సైతం విడమరచి చెబూతూ హైదరాబాద్ లో స్థిరపడిన కోస్తా జర్నలిస్టులు ఇకనైనా తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించడం అవసరం అని ఇరవై ఏళ్ల కిందటే వారు హెచ్చరించడం విశేషం.

వార్తా పత్రికల ప్రధాన కర్తవ్యం ప్రజలకు వార్తల నందించడం. అన్ని పత్రికలు వార్తలనందించడంలో దాదాపు ఒకే మోస్తరుగా కనిపించినా, వార్తలను తమ కనుకూలమైన రీతిలో చూపించడంలో భిన్నంగా ఉంటాయి. తెలుగు పత్రికలకు, ఆ మాటకొస్తే ప్రచార సాధనాలకు వార్తలనందించడంతోపాటు, వాటిని చూపించడంలో కూడా ఎటువంటి తేడాలు లేవు.

మరీ ముఖ్యంగా తెలంగాణ విషయంలో తెలుగు పత్రికలన్నింటినీ ఒకటే దారి. గత ఐదు దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ జర్నలిజంలో తెలంగాణా ఒక నిషిద్ధ ఆలోచన. తెలంగాణా ప్రస్తావన వచ్చినప్పడల్లా కోస్తా జర్నలిస్టులు ఎంత అసహనంగా ఉంటారో, తెలంగాణ జర్నలిస్టులు అంతే ఇబ్బంది పడుతుంటారు. ఒకే చోట పనిచేస్తూ ఒకే ప్రపంచాన్ని రెండు భిన్న కోణాల నుండి చూడటంవల్ల వచ్చే ఇబ్బంది ఇది.

‘తెలంగాణ, మే 31, 2001’ పుస్తకంలోని వ్యాసాలను ‘తెలుపు’ ధారావాహికంగా  ప్రచురిస్తోందని మీకు తెలుసు. ఇప్పటిదాకా అచ్చైన వ్యాసాలను ఆయా శీర్షికలను క్లిక్ చేసి చదువుకోగలరు. తెలంగాణ, మే 31, 2001 – చారిత్రాత్మక సంపాద‌కీయం . మన ప్రతాపరెడ్డికి వందనాలు- కె. శ్రీనివాస్ వ్యాసం. ‘తెలంగాణ’ కార్టునిస్టుల ఖజానా –టి. ఏడుకొండలు.   ఒక ఆత్మ హత్య /ఒక హత్య/ ఒక సామూహిక ఖననం – అంబటి సురేంద్రరాజు.

1990 తరువాత జిల్లా/మినీ ఎడిషన్లు వచ్చాక తెలంగాణ భాషకు/ యాసకు తెలుగు పత్రికల్లో చోటు దొరికింది. అయితే ఆ చోటు అంతకు మించి దాటదు. “నీళ్ళు లేక ప్రజలు పరేషాన్ ” అన్న వార్త సిటీ ఎడిషన్లో బ్యానర్ అవుతుంది. మెయిన్ పేపర్లో కాదు. మెయిన్ పేపర్లను, సంపాదకీయాలను ఆ మాటకొస్తే కార్టూన్లను స్థానిక భాష/యాసలతోపాటు “తెలంగాణా కోణా”నికి అవతల ఉంచడంలో కోస్తా జర్నలిస్టులు విజయం సాధించారు. దీనికి కారణం వివిధ పత్రికల్లో కీలక స్థానాలలో ఈ సొంత జర్నలిస్టులే ఉండటం. ఇంత వరకు ఎవరికీ అభ్యంతరాలుండే అవకాశం లేదు. విచిత్రమేమిటంటే, రెండు మూడు, కొందరు నాలుగైదు దశాబ్దాల నుండి హైదరాబాద్ ఇతర తెలంగాణ జిల్లాలలో స్థిరపడిన కోస్తా జర్నలిస్టులు కూడా ఇప్పటికీ తామీ సొంతం విషయం అంగీకరించక పోవడం.

నాకు కోస్తాలో ఇల్లు, వాకిలీ లేదు. అంగుళం పొలం లేదు. ఉన్న ఆస్తల్లా హైదరాబాద్ లోనే అని చెప్పుకునే సీనియర్ కోస్తా జర్నలిస్టులు కూడా తెలంగాణను ఒక భూతంగా ఒక వలస ప్రాంతంగానే చూస్తారు

నాకు కోస్తాలో ఇల్లు, వాకిలీ లేదు. అంగుళం పొలం లేదు. ఉన్న ఆస్తల్లా హైదరాబాద్ లోనే అని చెప్పుకునే సీనియర్ కోస్తా జర్నలిస్టులు కూడా తెలంగాణను ఒక భూతంగా ఒక వలస ప్రాంతంగానే చూస్తారు
“ఎడ్వర్డ్ సెయిడ్ అనే తత్వవేత్త ఇటీవల తన “ఓరియంటలిజ్”, అనే పుస్తకంలో పాశ్చాత్యులు ఎట్లా తూర్పుదేశాలను చూస్తారో వివరిస్తాడు. “ఓరియంట్ల్’ (తూర్పు దేశాల అధ్యయనం) అనేది ఎన్ని సంవత్సరాలు గడిచినా పశ్చిమ దేశాల వారికి ‘బయటి విషయంగా’నే మిగులుతుంది. ఎందుకంటే తూర్పుదేశాలను పాశ్చాత్యులు ఎన్నటికీ ఓన్ చేసుకోలేరు కనుక.

తెలంగాణ విషయంలో కోస్తా జర్నలిస్టులదీ ఇదే వరస. ఇందాక చెప్పుకున్నట్లు, వార్తలను అందించడంలో కోస్తా, తెలంగాణ జర్నలిస్టుల వాదన పెద్దగా విభేదాలుండవు. కానీ వాటిని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలనేదే సమస్య సృష్టించింది. తెలంగాణ జర్నలిస్టులు కొద్ది మంది ఉండటం, కింది స్థానాల్లో ఉండటంవల్ల సహజంగానే కోస్తా జర్నలిస్టుల మాట అన్ని విషయాల్లోనూ చెల్లుబాటు అవుతుంది.
ఉదాహరణకు తెలుగు పత్రికలు, ఆ మాటకొస్తే ఇంగ్లీషు పత్రికలు తెలంగాణను తీవ్రవాదం. మత ఘర్షణలతో సత మత మయ్యే ప్రాంతంగా చూపుతాయి. కోస్తాలో కులఘర్షణలు లేదా రాయలసీమలో ముఠా కక్షలను విడి విడి సంఘటనలుగా (లేదా రాయలసీమ ముఠా కక్షలను కొంచెం తక్కవ స్థాయి సమస్యగా చిత్రించినా) చూసే పత్రికలు తెలంగాణను మటుకు సంక్షోభంలో చిక్కుకున్న ప్రాంతంగా ప్రాజెక్ట్ చేస్తాయి.
“ఏమిటండీ పత్యేక తెలంగాణా? అదే కనుక వస్తే ఒక వైపు నక్సలైట్లు మరో వైపు మత ఘర్షణలతో ఈ ప్రాంతం అతలాకుతలమవుతుంది” అని అనని కోస్తా జర్నలిస్టుని ఎవరైనా చూశారా? అదీ తెలంగాణ పై వీరికున్న ప్రేమ. దశాబ్దాలుగా ఇక్కడే స్థిరపడినా అది వీరికి పరాయి ప్రాంతమే.

ఈ ప్రాంతంలో మమేకం కాలేక పోవడంవల్ల కోస్తా జర్నలిస్టులు (ఒకటి రెండు చోట్ల కొందరు తెలంగాణేతరులు) తెలంగాణ సమస్యల పట్ల వక్రంగా స్పందిస్తారు.

కరువుకు తుఫానుకు పత్రికల్లో లభించే కవరేజిలో తేడా దీన్ని తెలియజేస్తుంది. నీటి పారుదల ప్రాజెక్టులు, పరిశ్రమలు ఇతర వనరుల ఏర్పాటులో కూడా తెలంగాణకు ఎక్కడ అన్యాయం జరిగినా అది పత్రిక శీర్షికలకెక్కదు. కానీ మంత్రులు, ముఖ్యమంత్రులు తెలంగాణకు ఏ హామీ ఇచ్చినా అది బ్యానరే. ఎందుకంటే జరుగుతున్న మేలంతా తెలంగాణాకే అని చెప్పాలి కనుక.

తెలంగాణ ప్రస్తావన శాసనసభలో వచ్చినప్పుడల్లా అటు ప్రభుత్వం, ఇటు స్పీకరే – “ఆ మాట ఎందుకండీ వెనుకబడిన ప్రాంతాలు అందాం” అంటుంటారు. మాకు వేరే రాష్ట్రం కావాలి అని తెలంగాణ ఎం.ఎల్.ఏలు ఎంత మొత్తుకున్నా, మరునాడు పేపర్ల లో ”వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇన్ని వేలకోట్లు” – అనే ముఖ్యమంత్రి లేదా మరో మంత్రి ప్రకటనే మొదటి పేజీ స్టోరీ అవుతుంది, ఇస్తే గిస్తే ఏ అయిదో పేజిలోనో ఈ ఎం.ఎల్.ఏలు మాట్లాడింది కూడా డబుల్ కాలమ్ వార్త ఇస్తారు.

తెలంగాణ ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక జీవనశైలి అన్నింటికీ మించిన ఇక్కడి ప్రజల నెమ్మదితనం నిరాడంబరత, కోతలు కొయ్యలేని ‘అశక్తత’ కోస్తా జర్నలిస్టుల దృష్టిలో మైనస్ పాయింట్లు.

తెలంగాణ ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక జీవనశైలి అన్నింటికీ మించిన ఇక్కడి ప్రజల నెమ్మదితనం నిరాడంబరత, కోతలు కొయ్యలేని ‘అశక్తత’ కోస్తా జర్నలిస్టుల దృష్టిలో మైనస్ పాయింట్లు. నిజాం షుగర్స్, సింగరేణి కాలరీస్, అజాంజాహి మిల్లు, సిర్పూర్ సర్ సిల్క్ మిల్లు నిరుపయోగ కంపెనీలు.

రాబోయే నీటి విడుదల ప్రాజెక్టులన్నీ లిఫ్ట్ ద్వారా తెస్తామని ప్రభుత్వాలు చెబితే, 2005 నాటికి ఫలానా ప్రాజెక్టు అని రాస్తాయే తప్ప అన్ని వేల ఎకరాలకు కరెంట్ మోటార్ల ద్వారా సేద్యపు నీరందించడం వీలు కాదనే స్టోరీ ఒక్కటి కూడా పత్రికల్లో మనకు కనిపించదు. ఎందుకంటే గ్రావిటీ ఫ్లో కాలువల ద్వారా నీరు వచ్చే అదృష్టం తెలంగాణాకు లేదని కోస్తా జర్నలిస్టులు నమ్ముతారు కనుక.

అనేక సంవత్సరాలుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్న కోస్తా జర్నలిస్టులు ఇకనైనా ఈ పోరాటాన్ని ఇష్టపడటం అవసరం. వారు తమ వలస దృక్పథం విడనాడటం ఇంకా అత్యవసరం.

నల్లగొండ జిల్లాకు చెందిన ఎస్.రామకృష్ణ సీనియర్ జర్నలిస్టు. రాజకీయాల నుంచి పర్యావరణం వరకూ వారు అనేక అంశాలలో దిట్ట. చురుకైన వారి కలం రోజువారీ వార్తలకే కాదు, లోతైన క్షేత్రస్థాయి కథనాలకు, విశ్లేషణలకూ పేరు. న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ నుంచి మెట్రో ఇండియా దాకా, వార్తా సేకరణ నుంచి సంపాదకవర్గ బాధ్యతల దాకా వివిధ స్థాయిలలో పని చేసిన రామకృష్ణ గారు ప్రస్తుతం EXCEL INDIA ఎడిటర్ గా, ప్రచురణ కర్తగా ఉన్నారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article