Editorial

Monday, December 23, 2024
సినిమాఎరుపు నీలం తెలుపు : Shyam Singha Royపై విభిన్న సమీక్ష

ఎరుపు నీలం తెలుపు : Shyam Singha Royపై విభిన్న సమీక్ష

శ్యామ్‌ సింగరాయ్ ఒక అందమైన చిత్రంగా, క్లాసిక్ గా ప్రేక్షకులను ఆకర్షించింది. అయితే టేకింగ్ పరంగానే కాదు, ఇది విప్లవాత్మకమైన ఇతివృత్తంతో రూపొందింది అని కూడా కొందరు అభిప్రాయ పడ్డారు. కళావంతుల కోణంలో కూడా ఇది ప్రత్యేకమైన చిత్రం అని ప్రముఖ నృత్యకారిణి యశోదా ఠాకూర్ కూడా అభిప్రాయ పడ్డారు. ఐతే, అది ‘ఎరుపు, నీలం సమ్మేళనం తెలుపు’ అన్నది ఈ సరికొత్త సమీక్ష.

జి. జగపతిబాబు

మనువాద శక్తులు, తమ బలాన్ని పెంచుకుంటూ, చరిత్రని వక్రీకరిస్తూ, దేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువ్యవస్థను పునఃప్రతిష్ట చేసేందుకు ప్రయత్నిస్తున్న వేళ… మార్క్స్‌, అంబేద్కర్‌, పెరియర్‌, ఫూలే ఆలోచనలతో సాగే తెలుగుచలన చిత్రం శ్యామ్‌ సింగరాయ్.

రాహూల్‌ సాంకృత్యాయన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్‌ 24న పెరియార్‌ వర్థంతి సందర్భంగా విడులైంది. ఈ చిత్రంలోని నాని, కృతిశెట్టి తమ నటనతో ఆకర్షించగా, సాయిపల్లవి దేవదాసి పాత్రలో తన సహజమైన నాట్యంతో, నటనతో ఒదిగిపోయింది. ఇటువంటి సందర్బంలో ఈ సినిమాపై అర్థవంతమైన చర్చ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

శ్యామ్‌సింగరారు (నాని) ఒక బెంగాల్‌ విప్లవ రచయిత. బెంగాల్‌లో జరిగే మనువాద క్రూరత్వ భావాలకు వ్యతిరేకంగా కలంతో పాటు, గళం ఎత్తి నిలదీసిన వ్యక్తిగా కనిపిస్తాడు.

అంబేద్కర్‌ మాదిరి ధిక్కారం

ఒక సన్నివేశంలో, అంటరాని వారుగా పిలవబడే ఒక సమూహం దాహంతో నీటికోసం ఒక బావిదగ్గర ఎదురుచూస్తుంటారు. అప్పుడు శ్యామ్‌సింగరాయ్ ఎవరికి దాహం వేస్తే వారే నీళ్ళు తెచ్చుకోవాలి. ఎవరో ఇస్తారు అని ఎదురుచూడటం దేనికి అని అంటరాని సమూహంలో ఉన్న ఓ వ్యక్తిని అడుగుతాడు. అప్పుడు అక్కడే ఉన్న బ్రాహ్మణులు వారు కిందజాతి వాళ్ళు అనగా, వెంటనే శ్యామ్‌సింగరారు నీళ్లు కూడా కిందనే ఉంటాయి. నేలకూడా కిందనే ఉంటుంది. అయినా ఏ నీటి చుక్కమీద ఏ కులం పేరురాసి ఉంది. వాడు ఇదే ఊరిలో పుట్టాడు, ఇదే ఊరిలో పెరిగాడు. ఇదే మట్టిలో కలిసిపోతాడు. ఆ మట్టిన పండిన తిండినే నువ్వు, నీ పిల్లలు తింటున్నారు అని చెపుతాడు. మరో వ్యక్తి ”వారు అంటరాని వారు” అని అంటాడు. మళ్ళీ శ్యామ్‌సింగరారు అంటరానివాడు అయితే వాడు నడిచిన నేలమీద నువ్వు ఎందుకు నడుస్తున్నావు. వాడు పీల్చిన గాలిని నువ్వు ఎందుకు పీల్చుతున్నావు అని చెపుతూ, ఆ అంటరాని వ్యక్తిని నీళ్లు పట్టుకోమని చెపుతాడు. వెంటనే బ్రాహ్మణులు బెదిరింపులకు దిగుతారు. ఆ బెదిరింపులకు భయపడి ఆ వ్యక్తి వెనక్కి వెళ్ళిపోతాడు. వెంటనే ఆ వ్యక్తిని శ్యామ్‌సింగరాయ్ ఎత్తుకొని భావిలో పడవేస్తాడు. ఇప్పుడు ఈ బావి, నీళ్ళు కూడా అంటరానివే. దాహం వేసిన వాళ్ళు తాగండి, లేనివారు చావండి అని బ్రాహ్మణిజాన్ని దిక్కరిస్తూ, ”కులంకాళ్ళు పట్టుకొని కూర్చోడానికి ఇది రుగ్వేదం కాదు, స్వతంత్య్ర భారతం” అని అంటాడు

అంతేకాదు, నేను ”చాతుర్వర్ణ వ్యవస్థను విశ్వసించను, కుల వ్యత్యాసాలను అంగీకరించను, హిందూ సమాజానికి శాపంగా ఉన్న అంటరానితనాన్ని అంతం చేసేందుకు కృషి చేస్తాను. హిందువుల్లో ఆహారం, పానీయం విషయాల్లో ఎలాంటి నిషేధాలు పాటించను, ఆలయాలు, నీటి వనరులు, పాఠశాలలు వగైరా సదుపాయాల విషయంలో అస్పృశ్యులు అనబడే వారితో సహ అందరికి సమానంగా హక్కులు ఉంటాయని నమ్ముతున్నాను” అని మనుస్మృతి గ్రంథ ప్రతులను దహనం చేసిన అంబేద్కర్‌ దిక్కారాన్ని పోలినవిధంగా ఉంటుందీ సన్నివేశం.

తరువాత ఒక సన్నివేశంలో ఒక తీవ్రవాద ఉద్యమకారుడు తమతో పాటు అడవిబాట పట్టమని అడగగా, శ్యామ్‌సింగరాయ్ ”తూటా ఒక్కరికే ఉపయోగపడుతంది, కానీ అక్షరం లక్షలాది మెదళ్ళనుకదిలిస్తుంది” అంటూ చెప్పే డైలాగ్‌ తుపాకీ గొట్టం ద్వారా మాత్రమే ‘మరో ప్రపంచం’, ప్రజాచైతన్యం సాధ్యం కాదని, ప్రజా చైతన్యం, విప్లవం కోసం కలం అవసరమనే విషయాన్ని గుర్తుచేస్తుంది.

బంధ విముక్తి

తరువాత సన్నివేశంలో ‘దుర్గానవరాత్రులు’ సందర్భంగా జరిగే ఉత్సవాలలో ‘దేవదాసి’ పాత్రలో ప్రత్యక్షమవుతుంది సాయిపల్లవి (మైత్రి చిత్రంలో పేరు). దేవదాసీలు నాట్యం చేసిన తరువాత, ఆమె దేవదాసీలు అలా నాట్యం చేస్తూ దేవుని సన్నిధిలో (గుడిలో) ఉంటూ జీవనం సాగిస్తేనే స్వర్గం ప్రాప్తిస్తుంది అని చెప్పిన సమయంలో… శ్యామ్‌సింగరాయ్ ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో అనేక అద్భుతాల్ని, ప్రకృతి అందాలను చూడకుండా, గుడిలోనే బంధించడం ఏంటని ప్రశ్నించిన సన్నివేశం ఆనాటి దేవదాసీల పరిస్థితినే కాదు, స్త్రీల పరిస్థితిని కూడా తెలుపుతుంది. స్త్రీ ఇంట్లోనే బంధీగా ఉండాలి, పరాయి మగవాళ్ళను చూడరాదు, వంట ఇంటికే పరిమితమవ్వాలి అని చెప్పే మూఢ విశ్వాసాలనూ, దురాచారాలనూ ప్రశ్నిస్తుంది.

ఫూలే ప్రతీక

తరువాత మైత్రి (సాయిపల్లవి) రహస్యంగా శ్యామ్‌తో బయటకి వెళ్లి ప్రకృతిని ఆస్వాదిస్తుంది. ఇలా సాగుతుండగా ప్రతిసారి ఒక మెహంత్‌ (బ్రాహ్మణుడు) వచ్చి తమ శృంగార కోర్కెలను తీర్చుకోవడం కోసం ఈ దేవదాసీలను ఎంచుకుంటూ ఉంటాడు. చివరిరోజు మైత్రి ఈ సంకెళ్ళను తెంచుకొని శ్యామ్‌సింగరాయ్ తో వెళ్ళాలని నిర్ణయించుకున్న సమయంలో ఆ మెహంత్‌ ఒక అమ్మాయిని (చిన్నపిల్ల) కోరుకుంటాడు. అప్పుడు సాయిపల్లవి (మైత్రి), శ్యామ్‌ ఇచ్చిన విప్లవ చైతన్యంతో వ్యతిరేకిస్తుంది. ఈ సన్నివేశంతో దర్శకుడు మనకు స్త్రీ విద్య (చైతన్యం) అవసరాన్ని తెలియజేశాడు. ఈ సందర్భంలో మనం గుర్తుచేసుకోవాల్సిన వారు ఫూలే దంపతులు. వారు స్త్రీ విద్య కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొని పోరాడి సాధించారు.

చివరిగా శ్యామ్‌ ఒక పబ్లిషింగ్‌ హౌస్‌లో పనిచేస్తూ, దేవదాసి వ్యవస్థపై మనువాదంపై, సామాజిక అసమానతలపై, కమ్యూనిస్టు భావాలతో రచనలు చేసి, ముద్రించి పోరాడుతాడు. ఇలా జరుగుతున్న సందర్భంలో తన సొంత అన్నలు పరువు పోతోందని శ్యామ్‌ను హత్యచేస్తారు. ఈ సన్నివేశం సమకాలీన ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది.

కమ్యూనిస్టు చైతన్యం

కథ సారాంశం మొత్తం ఒక కమ్యూనిస్టు ఆలోచనలతో సాగుతూ మార్క్స్‌ రచించిన గ్రంథాలను చదువుతూ కనిపిస్తాడు శ్యామ్‌ (నాని). ఈ మధ్యకాలంలో వచ్చిన జైభీమ్‌, శ్యామ్‌సింగరారు లాంటి సినిమాల ద్వారా మనం అర్థం చేసుకోవల్సినది కమ్యూనిస్టు ఆలోచనలు, భావాలతోనే అంబేద్కరిజాన్ని మరింత అర్థం చేసుకోవచ్చని. అన్ని రకాల వివక్షల నుండీ, అసమానతల నుండీ విముక్తికి కమ్యూనిజం చాలా అవసరం అని, సాహిత్యం ద్వారా ప్రజా చైతన్యం పెరిగి, ప్రశ్నించే తత్వం పెరుగుతుందనీ, ఈ ప్రశ్నించే తత్వం ద్వారా మాత్రమే సామాజిక మార్పు (విప్లవం) సాధ్యమవుతుందని తెలుపుతుంది.

అభినందనలు

మనువాద, ఫ్యూడల్‌ భావాలతో రాజ్యమేలుతున్న ప్రభుత్వాలు ఉన్న సమయంలో ఒక కమ్యూనిస్టు, అంబేద్కర్‌, పెరియర్‌ భావాలతో మనువాదానికి వ్యతిరేకంగా దురాచాలను ఎదిరిస్తూ సినిమాని నిర్మించిన చిత్ర బృందానికి, దర్శకత్వం వహించిన రాహుల్‌ సాంకృత్యాయన్‌ అభినందనలు.

 

వ్యాసకర్త జి.జగపతిబాబు యువకుడు. శ్రీకాకుళంజిల్లా గుత్తావల్లి వాస్తవ్యులు. డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ పరీక్షలకోసం సిద్ధమవుతున్నారు. ఈ సమీక్ష తోలుత నవ తెలంగాణ దిన పత్రికలో ప్రచురితం. 

 

More articles

1 COMMENT

  1. మూసదారిలో ఆలోచించి వ్రాసిన సమీక్ష.మనువాద…రాజ్యాంగాన్ని.. ప్రయత్నిస్తున్న వేళ ఇటువంటి ఆలోచనలు తొందరపాటు చర్యే. దానికితోడు మార్క్సిజం కొంత అంబేద్కర్ ఆలోచనలను కొంత ఇంకా కొందరి సంఘ సంస్కర్తల ఆలోచనలను కలిపి కలగాపులగం చేయడం వ్యాసంలో మసాల జొప్పించడమే.విప్లవం కోసం కలమే ప్రదాన మని చెప్తే అమరు ల త్యాగాలను అపహాస్యం చేయడమే. చివరగా కుటుంబసభ్యులే హత్యచేస్తే దానిని సమకాలీన పరిస్థితి అనడం సబబు కాదని మా అభిప్రాయం. ప్రస్తుత సమాజం ధనిక బీద వర్గాలుగ మాత్రమే చీలింది. ఇక కులాలంటార ఆఆ కులమతాల్లో ఉన్న ధనికులు వారి ఉనికిని చాటుకునే కుట్ర మాత్రమే. వీరి గురించి సమాజానికి స్పష్టత ఉంది.కుహాన మేధావులకు కొదవేలేని సమాజం మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article