Editorial

Wednesday, January 22, 2025
ఆధ్యాత్మికంఈ సృష్టిలో భూమికన్నా ఏది గొప్పది? – గన్నమరాజు గిరిజామనోహరబాబు తెలుపు

ఈ సృష్టిలో భూమికన్నా ఏది గొప్పది? – గన్నమరాజు గిరిజామనోహరబాబు తెలుపు

మహా భారతం అరణ్యపర్వంలో ‘యక్ష ప్రశ్నల’ సందర్భం అనేకాంశాలను సమాజానికి బోధించింది. ఈ సృష్టిలో భూమికన్నా గొప్పది జన్మనిచ్చిన తల్లి. అదేవిధంగా కన్నతండ్రే ఆకాశం కన్నా ఎత్తైనవాడు అని ఒక ప్రశ్నకు ధర్మరాజు గొప్పగా సమాధానం ఇస్తారు.

“మాతరం పితరంబైన సాక్షాత్ప్రత్యక్ష దేవతామ్‌ ।
మాత్వా గృహీ నిషేవేత సదా సర్వ ప్రయత్నతః ॥”

మానవుడైన ప్రతివాడు విధిగా ఆచరించాల్సిన ధర్మాలు కొన్ని ఉన్నాయి. కష్టమైనా, సుఖమైనా తప్పనిసరిగా పాటించాలన్న నిబంధనను భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, స్మృతులు ఖచ్చితంగా నిబద్ధించాయి. ‘‘గృహస్థుడైన వ్యక్తి తప్పనిసరిగా తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులనే ప్రత్యక్షదైవాలుగా భావించి అన్నివిధాల వారిని సేవించుకోవాలి” అంటూ మహానిర్వాణతంత్రం స్పష్టంగా చెప్పింది. మన ఉపనిషోపదాది గ్రంథాలు కూడా ‘‘మాతృదేవో భవ”, ‘పితృదేవోభవ” అని బోధించాయి.

తల్లిదండ్రుల ఔన్నత్యానికి తెలుపే అనేక ఉదాహరణలను శ్రీ గన్నమరాజు గిరిజామనోహరబాబు నేటి ‘ఆధ్యాత్మికం’ శీర్షికలో ఎంతో చక్కగా వివరిస్తున్నారు. చదవండి. అమానాన్నల ఆశీస్సులతో సంతృప్తిగా జీవించండి.

ఆధునిక కాలంతో ఎంతమంది వృద్ధాశ్రమాలకు తల్లిదండ్రులను అప్పగించి తమ బాధ్యతలు తీరిపోయాయని భావిస్తుంటారు. కారణాల అనేకం ఉంటాయి. వాటిని సమన్వయించుకొని మతాపితరుల విషయంలో సరియైన నిర్ణయం తీసుకోవాలి, అది ధర్మం. అంతేతప్ప ఏవేవో కొన్ని కారణాలతో తమ సంతానం నుండి తమ నుండి తల్లిదండ్రులను దూరం చెయ్యరాదు.

వృద్ధాప్యం అనేది పలు అనారోగ్యాలకు, పలు బాధలకు గురిచేయడం ప్రకృతి ధర్మం. అంతేగాక ప్రేమపూర్వకమైన మానవసంబంధాలను ఎక్కువగా వాంఛించే వయసు కూడా వృద్ధాప్యమే. కాబట్టి దానిని పరిగణనలోనికి తీసుకొని మన ప్రవర్తన ఉండాలి. అది మనిషిగా మన బాధ్యతలను తీర్చుకున్నట్టవుతుంది. అందుకే ఈ విషయాన్ని వేదం కూడా ముఖ్యమని భావించి ‘‘అనువ్రతః పితుః పుత్రో, మాత్రా భవతు నమ్మనాః” అని అధర్వణవేదంలో పేర్కొన్నది. ‘‘పుత్రస్థానంలో ఉన్న వ్యక్తి తండ్రి మాటను పాటించేవాడుగా ఉండాలి. తల్లియందు హృదయపూర్వకమైన గౌరవం కలిగి ఉండాలి” అంటే వారి అనుభవాన్ని ప్రేమను గౌరవించి తీరాలన్న శాసనం కనిపిస్తుంది. తండ్రికున్న జీవితానుభవం, తల్లికున్న మాతృప్రేమ మన పురోగతి కారకాలై మనకు మంచి చేస్తాయన్న భావం వేదోక్తితో ద్యోతకమవుతుంది.

తల్లిదండ్రులను సేవించే విధానాన్ని కూడా మహానిర్వాణ తంత్రం ఎంత గొప్పగా చెప్పిందో గమనిస్తే మన బాధ్యతలు అర్థమవుతాయి.

“ఆసనం శయనం వస్త్రం పానం భోజనమేవత ।
తత్తత్సమయ మాదాయ మాత్రే పిత్రే నివేదయేత్‌ ॥”

ఈ మాటలు మనం మన తల్లిదండ్రుల విషయంలో బాగా శ్రద్ధ చూపించాలని మనకు బోధిస్తున్నాయి. వృద్ధాప్యం కారణంగా ఆసనాల విషయంలో, వస్త్రాల విషయంలో, పానీయాల విషయంలో, ఆహారాది విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఒక్కోసారి మనల్ని కూడా ఇబ్బంది పెడుతుంటారు. అయినా ఓర్పు వహించి ‘‘ఆసనము, శయనము, వస్త్రములు, పానీయములు, భోజనము వంటి సుఖకారక వస్తువువుల అవసరం ఏర్పడినప్పుడు సకాలంలో వారికి అవి సమకూర్చుచుండాలి” అన్ని ఈ పనుల వెనక మనకు బాల్యం నుండి వాళ్ళందించిన సౌర్యాలు మనకు గుర్తుండాలి తప్ప విసుగు చూపించే ప్రయత్నం ఎప్పుడూ చూపరాదన్న నిజం అర్థమవుతుంది.

మనకు బాల్యం నుండి వాళ్ళందించిన సౌర్యాలు మనకు గుర్తుండాలి తప్ప విసుగు చూపించే ప్రయత్నం ఎప్పుడూ చూపరాదు.

అందుకే మహాభారతం ఈ ఇద్దరితోబాటు, మనకు విద్యాబుద్ధులు నేర్పి, జ్ఞానదాతయైన గురువును గురించి కూడా చెబుతూ ‘‘మాతాపితరముత్థాయ పూర్వమేవాభివాదయేత్‌” అని బోధించింది. ‘‘నిద్ర మేల్గొనగానే మనం మొదట చేయవలసిన పని అందరికన్నా ముందుగా తల్లికి తండ్రికి తదనంతరం ఆచార్యునికి నమస్కరించాలి” అన్నది. ఒక్కోసారి అవకాశం లేకపోవచ్చు. అటువంటి సందర్భంలో మన మనస్సులోనైన భక్తితో నమస్కరించుకోవాలి అంటే ప్రతినిత్యం వారిని స్మరించుకోవడమనేది మన బాధ్యతగా చెప్పినమాట. అందుకే స్మృతిగ్రంథాలు కూడా ‘‘తయోర్నిత్యం ప్రియం కుర్యాత్‌…’’ అన్నాయి. వారి మాటలు విని నడుచుకొని వాళ్ళను సంతోషపెట్టాలన్న స్పృహ మనకు కలగాలి. అది ప్రధాన విషయం.

‘‘ఈ సృష్టిలో భూమికన్నా గొప్పది ఏది?’’అంటే వానికి ధర్మరాజు ‘‘మాతా గురుతరాధుమేః” అని సమాధానమిచ్చాడు. ఆకాశం కంటే ఎత్తైనదేది? అన్నదానికి ‘‘ఖాత్‌ పితోచ్చర తరస్తథా”.. ‘‘కన్నతండ్రే ఆకాశం కన్నా ఎత్తైనవాడు” అన్న ధర్మరాజు సమాధానం తల్లిదండ్రుల ఔన్నత్యానికి తెలుపుతున్నది.

మహా భారతం అరణ్యపర్వంలో ‘‘యక్ష ప్రశ్నలు” అనే సందర్భం అనేకాంశాలను సమాజానికి బోధించింది. జరిగిన సంభాషణ యక్షుని ప్రశ్నలకు ధర్మరాజు చెప్పిన సమాధానాల రూపంలో ఉంటుంది. అందులో యక్షుడు ధర్మరాజును ప్రశ్నిస్తూ ‘‘కింస్విత్‌ గురుతరం భూమేః” అన్నాడు. ‘‘ఈ సృష్టిలో భూమికన్నా గొప్పది ఏది?’’అంటే వానికి ధర్మరాజు ‘‘మాతా గురుతరాధుమేః” అని సమాధానమిచ్చాడు. ఈ సృష్టిలో భూమికన్నా గొప్పది జన్మనిచ్చిన తల్లిది. ఆమె భూమికన్నా గొప్పది అన్నాడు. అదేవిధంగా ‘‘కింస్విత్‌ ఉచ్చతరంచ ఖాత్‌” అని ప్రశ్నించాడు. ఆకాశం కంటే ఎత్తైనదేది? అన్నదానికి ‘‘ఖాత్‌ పితోచ్చర తరస్తథా”.. ‘‘కన్నతండ్రే ఆకాశం కన్నా ఎత్తైనవాడు” అన్న ధర్మరాజు సమాధానం తల్లిదండ్రుల ఔన్నత్యానికి తెలుపుతున్నది.

పెద్ద పెద్ద స్థాయి ఉద్యోగాల్లో ఉన్నాము కదా! అని కన్నవాళ్ళను తృణీకరించరాదు.

నేటికాలంలో కొన్ని ఇబ్బందులెదురవుతుంటాయి. ఉమ్మడి కుటుంబవ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయిన ఈ సందర్భంలో మనకు కొన్ని కష్టాలు వచ్చినా సమర్థతతో వాటిని అధిగమించాలి. పెద్ద పెద్ద స్థాయి ఉద్యోగాల్లో ఉన్నాము కదా! అని కన్నవాళ్ళను తృణీకరించరాదు. ఈ విషయంలో కూడా ‘‘శుక్రనీతి”-“ప్రాప్యాపి మహతీం వృద్ధిం వర్తేత పితురార్ఞియా” అని ఘంటాపథంగా చెప్పింది.

‘‘గొప్ప అభివృద్ధిని ఉద్యోగ వ్యాపారాదుల్లో తాను సాధించిన, పదోన్నతులు పొందినా కూడా దానికి అతిశయించక తండ్రి మాటను విని తాను నడుచుకోవాలి” ఒక్కోసారి తండ్రి కాలానుగుణంగా ఆలోచించలేకపోవచ్చు. విషయం చర్చించి తనను ఒప్పించవలసిన బాధ్యత పుత్రునిదే. కాలమేదైనా జన్మనిచ్చి పెంచి ప్రయోజకుల్ని చేసిన మాతాపితరులే మనకు ప్రత్యక్షదైవాలు.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article