ప్రతి ఇంటా ఉండదగ్గ మంచి పుస్తకం ఇది .
కథా నాయకుడు యెగార్ ఒక సమర జీవి. అన్ని కాలమాన ప్రాంతాల్లో పెద్దగా కానరాని అజ్ఞాత భాస్కరులకు అతడొక మేలిమి ఉదాహరణ. మనం విన నిరాకరించే అంతరాత్మ. గొడ్డలితో చెక్కిన కోడిపుంజు. అందుకే ‘హంసలను వేటాడొద్దు’ అన్న ఈ నవల ప్రకృతి చిత్రణలో అత్యుత్తమ రచనగా పేర్కొనాలి.
పునర్ముద్రణ పొంది తిరిగి అందుబాటులోకి వచ్చిన ఈ పుస్తకానికి వాడ్రేవు వీర లక్ష్మీదేవి గారు తొలి మాటలు రాయగా నేను తుది పలుకులు రాశాను.
కందుకూరి రమేష్ బాబు
పుస్తకం మూసేసిన తర్వాత కొంతకాలం దాకా యెగార్ మనల్ని వీడిపోడు. కొంతకాలం అని కూడా కాదు, ఎప్పటికీ మనల్ని వీడిపోని మనిషి యెగార్.
రచయిత స్వగతంలో చెప్పినట్లు అడవిలోకి వెళ్ళిన ప్రతిసారీ అతడి జీవితం వినపడుతుంది. అంతేనా? కాదు, జనారణ్యంలో కూడా వినపడుతుంది.
జూలో ఏనుగును చూసినప్పుడే కాదు, వీధిలో కుక్కలను చూసినప్పుడే కాదు, ఇంటిమీద కోడి పుంజును చూసినప్పుడూ అతడి జ్ఞప్తికి వస్తుంటాడు. అంతేనా? కాదు. తెల్లటి హంసలు ఎప్పుడు మీ స్మృతి పథంలోకి వచ్చినా యెగార్ గుర్తొస్తాడు. అంతెందుకు, అది శిల్పమే కానక్కరలేదు, తల దువ్వుకుంటూ ఉండే అందమైన ఒక అమ్మాయి చిత్రం చూసినా అతడు గుర్తొస్తాడు. రోడ్డు పక్కన పడి ఉన్న కలప దుంగలను చూసినా అతడు గుర్తొస్తాడు. ఆక్రందన చేసే పందిని చూసినా తుమ్మెదల ఝంకార నాదం వినిపించినా అతడు గుర్తొస్తాడు. అంతెందుకు ఒక చీమను చూసినా, చీమల పుట్టను చూసినా యెగార్ గుర్తొస్తాడు.
ఇట్లా బోరిస్ వాసిల్యేవ్ రచించిన ‘హంసలను వేటాడొద్దు’ అన్న ఈ నవల, అందలి కథా నాయకుడైన యెగార్ పోలుష్కిన్ అన్న పాత్ర సదా స్ఫూర్తివంతం. నిత్య జీవితంలో పరిపరి విధాలా వారు గొప్ప ప్రేరణ.
నిజానికి అతడెట్లా గుర్తొస్తాడూ అంటే ఆ మనిషి ప్రకృతిలో భాగంగా గుర్తొస్తాడు. కాదు, కాదు. తానే ప్రకృతిగా గుర్తొస్తాడు. మన విధ్వంసాన్ని లేదా వికృతిని గుర్తు చేసే ప్రకృతిగా గుర్తొస్తాడు. నల్ల చెరువును తెల్ల చెరువు చేయడానికి మీరొక అటవీ అధికారి కానక్కరలేదు, మనిషైతే చాలని హెచ్చరించే ఆకాశవాణిగా గుర్తొస్తాడు. ‘భయపడవద్దు, ప్యొదార్ ఇపతోవిచ్ … బతకటానికి భయపడవద్దు’ అని చివరి రోజున కూడా అతడు అంటున్నప్పుడు మొత్తం మానవాళిని హెచ్చరించే పంచ భూతాలుగా అరుదెంచుతాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అతడి స్ఫూర్తి నిత్య జీవితంలో మనల్ని మానవీయం చేయదు. పాకృతికం చేస్తుంది. అదీ అతడి విశేషం.
చిత్రమేమిటంటే, ఇప్పుడే మీరంతా పుస్తకం చదవడం పూర్తి చేసిన వారే. అతడు లేడన్న సంగతి ఎరిగి దుఃఖ సముద్రంలో కూరుకుపోయిన వారే. కానీ అతడు నిష్క్రమణ ఎంత బాధకు గురి చేసిందో, స్వచ్ఛమైన కళ్ళుగల అతడి కుమారుడు కొల్కా తాలూకు ఉనికి అంతకన్నా గొప్ప సంతోషం కలిగిస్తుంది. నవలలో రచయిత చిట్ట చివరి వాక్యం చూడండి. ‘నల్ల చెరువు ఇప్పుటికీ ఇంకా నల్లగా ఉండిపోయింది. అది కొల్కా కోసం ఎదురు చూస్తోందని నాకు అనిపిస్తోంది” అంటాడు. వారికి అనిపించినట్లే మనల్నీ ఆ ఆశావాదం ఆవరిస్తుంది. అందుకే ఏనుగు మొదలు పంది దాకా – పైన చెప్పిన వేటిని చూసినా ఆ తండ్రి మాత్రమే కాదు, కొడుకూ గుర్తుకు వస్తాడు. ఒక పడవను చూసినా, ఒక కవితను చదివినా వారిద్దరూ గుర్తొచ్చి భవిష్యత్తుపై గొప్ప భరోసా కలుగుతుంది. బహుశా నాకే కాదు, మీకూ అలాంటి భావం కలుగుతుందని నా నమ్మిక. మంచి మనుషులు, మంచి పుస్తకం చేసే పని ఏమిటీ అంటే ఇదే అని నా అభిప్రాయం.
‘అసమర్థుడు’ అని అందరూ భావించిన ఆ వ్యక్తి, చేతగాని వాడుగా ప్రతి ఒక్కరి చేత చీత్కారింపబడ్డ ఆ వ్యక్తి, అందరి మూలంగానూ అపరాధ భావనకు గురిచేయబడిన ఆ వ్యక్తి – ఎందుకు నిత్యం స్ఫూర్తినిస్తూ ఉంటాడూ?
మీకు తెలుసు, యెగార్ పోలుష్కిన్ అన్న ఈ నవలా నాయకుడు అతి సాధారణమైన వ్యక్తి అని. అతడు సున్నిత మనస్కుడు. ఎంతో భావుకుడు. తాత్వికుడు. నిజాయితీ పరుడు. స్వార్థ చింతన లేనివాడు. ఇసుమంతైనా ద్వేష భావం లేనివాడు. సౌందర్యాధకుడు. యోధుడు. మనిషిని, ప్రకృతినీ గౌరవించేవాడు. మనసు పెట్టి పని చేసేవాడు. ఓపిక పట్టేవాడు, ఆనందం అనుభవించే వాడు. ఇవన్నీ తనకూ మనకూ తెలిసినవి. కానీ లోకులున్నారే, వారి దృష్టిలో అతడేమిటీ అన్నది ముఖ్యం. “యెగార్ ఏమీ చేతకానివాడు. అసమర్థుడు, మూర్ఖుడు”.
అవునా?
మరి, ‘అసమర్థుడు’ అని అందరూ భావించిన ఆ వ్యక్తి, చేతగాని వాడుగా ప్రతి ఒక్కరి చేత చీత్కారింపబడ్డ ఆ వ్యక్తి, అందరి మూలంగానూ అపరాధ భావనకు గురిచేయబడిన ఆ వ్యక్తి – ఎందుకు నిత్యం స్ఫూర్తినిస్తూ ఉంటాడూ? అదే ఈ నవల కథాంశం.
సామాన్యులు, నిర్భాగ్యులు, నిస్సహాయులు, దురదృష్టవంతులు అని మనం అనుకునే చాలా మంది వాస్తవానికి సమర్థులు, నిండు మనుషులు, అద్భుతమైన మనుషులు కూడా. ఆ సంగతి వారిని సన్నిహితంగా దర్శిస్తే గానీ మనకు తెలియదు. ఈ నవల ఆ పని చేసి పెడుతుంది.
నవల పూర్తయ్యేటప్పటికి యెగార్ ధీరోదాత్తుడిగా ఆవిష్కారం అవుతాడు. నవల మొదలుపెట్టి చివరికి వచ్చే సరికి ఆ లక్షణాలను మీరు పూర్తిగా గ్రహిస్తారు. మీకు తెలుసు, అతడు ఎల్లవేళలా తన ఆత్మబలంతో జీవించే ఉన్నాడని. ప్రతి దశలో అతడి ఆత్మను మీరు విన్నారు కూడా. ప్రతి పుటలో అతడి జీవశక్తి, స్వతంత్రతా, నిర్భయత్వం తమరు దగ్గరగా గమనించే ఉన్నారు. తాను ఇదివరకు వేరే వాళ్ళు చేసినట్టు కాకుండా తనదైన పద్దతిలో ఆయన ముందుకు సాగడమే అతడి ప్రత్యేకత. అన్నటికీ మిన్న జీవితంపై రెండు విధాలా పట్టు ఉన్న మనిషి అతడు.
కానీ ఈ రెండు కోవలకు భిన్నమైన యెగార్ ఒక పూర్ణ నాణెం. జీవితం అన్నది తన కోసమూ, సమాజం కోసమూ అని తెలిసిన వివేకి అతడు.
ఇది చాలా విశిష్టమైన అంశం. మీకు తెలుసు, లోకంలో రెండు రకాల వ్యక్తులున్నారు. ఒకరు తన కోసం జీవిస్తారు. వారు భద్ర జీవులు. మిగతా ఏదీ వారికి పట్టదు. మరొక రకం, సమాజం కోసం జీవిస్తారు. వాళ్ళు యాక్టివిస్టులు. వారికి తమ జీవితం ద్వితీయం. కానీ ఈ రెండు కోవలకు భిన్నమైన యెగార్ ఒక పూర్ణ నాణెం. జీవితం అన్నది తన కోసమూ, సమాజం కోసమూ అని తెలిసిన వివేకి అతడు. తానూ సమాజమూ కలిస్తే ప్రకృతి అనీ వారికి తెలుసు. ఈ రెండిటి మధ్య సమన్వయం చెదరకుండా చూసుకోవడమే జీవితపు ఆదర్శం అని బాగా తెలుసు. ఈ వివేకంతో మనసా వాచా కర్మణా సంపూర్ణ జీవితం గడిపిన సరళ స్వభావి. మేధావి – ఈ సామాన్యుడు. తన పరిమితిలో తాను అపారంగా పనిచేసిన ప్రతిభావంతుడు కూడా. అందువల్లే పలాయనం చిత్తగించకుండా తనను తాను నమ్మి, ఉన్న చోట తన కార్యాచరణతో నల్ల చెరువును తెల్లటి హంసలతో సజీవం చేశాడు. ప్రాణాలు ఫణంగా పెట్టి ఆ హంసలను రక్షించుకునేందుకు ఆ వర్షపు రాత్రి అసాధారణంగా పోరాడాడు. చివరకు అతడు నైతిక విజయం సాధిస్తాడు. అదే అత్యంత మౌలికం.
మరో రకంగా చేబితే, అతడి జీవితం ఒక పాట. దాన్ని చివరికంటా పాడటానికి ఈ నవలా రచయిత నరకప్రాయమైన అనేక అనుభవాలను దిగమింగుతూ మూడు సార్లు స్వగతం చెప్పకుండా ఉండలేకపోతాడు. యెగార్ బలం అంతటిది.
ఈ నవల రష్యన్ సోషలిస్టు సమాజపు వ్యక్తి గాధగా కాకుండా మనిషి ఉన్నంతవరకు అతడి ప్రకృతి సదా ఇలాగే పోరాడాలని చాటే మహత్తర గ్రంధంగా ఎంచాలి. ప్రపంచ చదువరులు ఈ పుస్తకాన్ని నిశ్శబ్దంగా గుండెలకు హత్తుకోవాలి.
నవల గురించి కూడా ఒక రెండు మాటలు గట్టిగా చెప్పాలి. నిజానికి పర్యావరణ సాహిత్యానికి సంబంధించి నంతవరకు ఈ నవల ఒక మైలురాయిగా పేర్కొంటున్నారు. జీవ వైవిధ్యానికి మచ్చు తునకగా పేర్కొంటున్నారు. కానీ ఈ నవలను అలా చూస్తే పర్యావరణం అన్నది ఒక విడి అంశంగా మారుతుంది. కూర్చోపెట్టి చేసే బోధనగా ఉంటుంది. నిజ అర్థంలో ఈ నవల ఒక ఆహ్లాదకరమైన విప్లవ గాథ. తన జీవితమే తన ఆచరణగా ఎంచుకున్న లక్షలాది జన సామాన్యానికి నీరాజనం పలికే విలువైన కృతి. పర్యావరణం అంటే జంతు జాలం, జీవజాలం మాత్రమే కాదు, అందులో మనిషి కూడా పరిసరం అని నిరూపించే అపురూప సంగ్రహం ఇది. ఇందలి కథా నాయకుడు యెగార్ ఒక సమర జీవి. అన్ని కాలమాన ప్రాంతాల్లో పెద్దగా కానరాని అజ్ఞాత భాస్కరులకు అతడొక మేలిమి ఉదాహరణ. మనం విన నిరాకరించే అంతరాత్మ. గొడ్డలితో చెక్కిన కోడిపుంజు. అందుకే ‘హంసలను వేటాడొద్దు’ అన్న ఈ నవల ప్రకృతి చిత్రణలో అత్యుత్తమ రచనగా పేర్కొనాలి. రష్యన్ సోషలిస్టు సమాజపు వ్యక్తి గాధగా కాకుండా మనిషి ఉన్నంతవరకు అతడి ప్రకృతి సదా ఇలాగే పోరాడాలని చాటే మహత్తర గ్రంధంగా ఎంచాలి. ప్రపంచ చదువరులు ఈ పుస్తకాన్ని నిశ్శబ్దంగా గుండెలకు హత్తుకోవాలి.
అంతేకాదు, ఈ పుస్తకం కల్పితం కాదని గ్రహించాలి. ప్రతి వీధిలో తల వంచుకుని తన మానాన తాను పనిచేసుకునే ఒక యెగార్ ఉన్నాడనే స్పురణతో చదవాలి. కొల్కా ఇప్పుడు నల్ల చెరువుకు చేరుకుంటున్నాడనే భావనతో మనం మెలగాలి. అనేకసార్లు మనం అతడిని అన్నింట్లో పోల్చుకోవాలి. పలుసార్లు మలి ముద్రణకు వెళ్ళడమే ఈ నవల ద్వార యెగార్ కు మనం అందించే కడపటి నివాళిగా భావించాలి.
తెలుగు సమాజానికి ఈ పుస్తకం అందించిన సురేష్ గారికి సామాన్యశాస్త్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. చదివే ప్రతి వ్యక్తికీ గాఢ ఆలింగానాలు.
ఒక సామాన్యమైన మనిషి, ఒక సాధారణమైన పుస్తకం చేసే మంచి పని ఏమిటీ అంటే ఇదే అని నా అభిప్రాయం. తెలుగు సమాజానికి ఈ పుస్తకం అందించిన సురేష్ గారికి సామాన్యశాస్త్రం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. చదివే ప్రతి వ్యక్తికీ గాఢ ఆలింగానాలు.
అన్నట్టు, పుస్తకం వెల రెండు వందలు. ఐతే ప్రత్యేక ఆఫర్ గా ‘మంచి పుస్తకం’ ఈ వ్యాసం చదివి పుస్తకం కోరే వారికి నూటా యాభై రూపాయలకే అందిస్తోంది. పైన ఇచ్చిన QR కోడ్ స్కాన్ చేసి లేదా 9963862926 నంబర్ కు PhonePe/Google Pay/ Paytm ద్వారా ఆ మొత్తాన్ని పంపించండి. అదే నంబర్ కి స్క్రీన్ షాట్ ను పంపి వారికి మీ ఇంటి అడ్రసు తెలియజేయగలరు. రిజిస్టర్ పోస్టులో వెంటనే పుస్తకం అందుతుంది.
అలాగే, సామాన్యశాస్త్రం గ్యాలరీకి వచ్చేవారు కూడా అదే వెలకు నేరుగా ఈ పుస్తకం తీసుకోవచ్చు.
కాగా, ఇదే పుస్తకం గురించి ‘తెలుపు’ ప్రచురించిన “భయపడవద్దు, ఫ్యాదర్ ఇపతోవిచ్ …” అన్న మరో వ్యాసం ఇక్కడ చదవొచ్చు