ఇటీవల విడుదలైన అనిల్ బత్తుల ‘మధుశాల’ కవిత్వంలో అరుదైన సంచలనం. ఇది సెక్సు కవిత్వం కాదు, ఎదను శాంత పరుచు అత్మైక ఆలింగనం అని వక్తల అభిప్రాయం.
కందుకూరి రమేష్ బాబు
“ఒక రష్యన్ కవి తన కవితలతో మన ఎదలో తుఫాన్ రేకెత్తిస్తాడు. చిన్నప్పుడెప్పుడో చదివిన గుర్తు. అలాంటి కవిత్వమే అనిల్ బత్తుల మధుశాల “ అని ప్రముఖ విమర్శకులు డా. అంబటి సురేంద్ర రాజు అన్నారు. ఈ కవిత్వం చదవడం అవసరం అని అయన అభిప్రాయ పడ్డారు. “ఇది సెక్స్ కవిత్వం కాదని, మనసులను కల్లోల పరిచి, శాంతిని పంచే కవిత్వం” అని అన్నారాయన. మో (వేగుంట మోహన ప్రసాద్), నరేష్ నున్నాల తర్వాత వారి ఖాళీలను భర్తీ చసిన కవిత్వంగానూ అయన అభిప్రాయపడటం విశేషం.
“తెలంగాణ ఏర్పాటయ్యాక ఉన్న స్తబ్దతను బద్దలుకొట్టిన కవిత్వం ఇది” అని ‘దీపశిల’ సిద్దార్థ అభిప్రాయ పడ్డారు. ఇందులో కవి తాపత్రయం, కవిత్వం చేయకపోతే ఆ అనుభవం ఏమైపోతుందో అన్న ఆదుర్తా, ఒక ఉండబట్టని తనం ఉందని, రాజకీయాలు దాటిన ఈ కవిత్వం అధ్బుతం అని అయన విశ్లేషించారు.
నిజానికి ప్రభంధాలలోని శృంగార వర్ణాలతో పోలిస్తే ‘మధుశాల’ ఒక లేక్కలోనిదే కాదని, ఒక రకంగా అనిల్ బత్తుల నిరాశ పర్చారని సీనియర్ పాత్రికేయులు ప్రకాష్ సరదాగా వ్యాఖ్యానించారు. పుస్తకాల ప్రేమికుడి నుంచి అనిల్ బత్తుల కవిగా అరుదెంచి ఇలాంటి కవిత్వంతో రావడం ఒక విస్మయం అని మనసారా అభినందించారాయన.
రచయిత్రి ఉషా జ్యోతి బంధం ఈ కవిత్వం ఇలా రావడానికి కారణం కవి నగరాన్ని విడిచి గ్రామంలోకి వెళ్ళడం, ప్రకృతి మధ్య నివసించడం అని అభిప్రాయ పడ్డారు.
ఇక మరో విమర్శకులు ఆదిత్య కొర్రపాటి లోతుగా తడుముతూ ఈ ‘మధుశాల’ “దైహికం కాదని, అత్మైకం” అని విడమర్చి చెప్పారు. ఇందులో పదే పదే ‘రమించడం’ అన్న పదం తప్ప ఎక్కడా భౌతిక అంశాలు, లైంగికంగా పేర్కొన్న ఛాయలు లేవని విశ్లేషించారు. పుస్తకం ఎటువంటి ఆడంబరం లేకుండా తేవడాన్ని కూడా వారు కొనియాడారు.
రావలసిన మరో వక్త, కవయిత్రి విమల రాలేదు. కాగా, ‘మధుశాల’ను ప్రముఖ కవి, ‘ఒక వెళ్ళిపోతాను’ కృతికర్త ఎం ఎస్. నాయుడు ఆవిష్కరించడం విశేషం. ఆయనే కవి రాసిన రెండొందలకు పైగా ఉన్న కవితల్లోంచి ఎనభై ఏడు చక్కటి కవితలను ఎంపిక చేసినట్లు తెలిసింది.
చివరగా కవి అనిల్ బత్తుల తన కవిత్వ నేపథ్యం చదివి వినిపించారు. దాన్ని ఇటీవలే తెలుపు ప్రచురించింది. ఆ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
పుస్తకాలు నవోదయ బుక్ హవుస్, కాచిగూడ, హైదరాబాద్ లో మాత్రమే దొరుకుతాయి. వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.