Editorial

Wednesday, January 22, 2025
అభిప్రాయంCOVID-19 : అక్షర యోధులకు అండగా మీడియా అకాడమీ - మారుతీ సాగర్

COVID-19 : అక్షర యోధులకు అండగా మీడియా అకాడమీ – మారుతీ సాగర్

 ఫ్రంట్ లైన్ వారియర్స్ లో ఒకరిగా విధి నిర్వహణలో పాల్గొని వార్తా సేకరణ చేసిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో ఆ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇక్కడే మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మానవత్వంతో ఒక నిర్ణయాన్ని తీసుకొవడం అభినందనీయం. జర్నలిస్టులకు ఆర్థిక సహకారం అనివార్యం అని భావించి తక్షణ సహాయం అందించే దిశలో ఇప్పటివరకు 3909 మంది జర్నలిస్టులకు 5 కోట్ల 56 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం విశేషం. ఒక రకంగా ఈ ఆర్థిక సహాయం సమాజానికి అకాడమీ అందించిన ఆర్థిక చికిత్స అనవచ్చు.

అస్కాని మారుతి సాగర్ 

ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ అకాడమీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో మీడియా అకాడమీ గా రూపాంతరం చెందిన విషయం తెలిసిందే. నిజానికి రెండు దశాబ్దాల క్రితం ప్రింట్ మీడియాదే రాజ్యం. దానిని దృష్టిలో పెట్టుకొనే కాబోలు అప్పట్లో ప్రెస్ అకాడమీ పేరుతో ఈ సంస్థ ఏర్పడింది. అకాడమీ ఏర్పాటు అయిన దాదాపు 18 ఏళ్ల అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడంతో సహా ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా విస్తరణ ఏ స్థాయిలో పెరిగిందో తెలియనిది కాదు. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మీడియో వేగం దేశంలోనే అగ్రభాగాన ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పదుల కొద్దీ ప్రధాన పత్రికలు, డజన్ల కొద్ది శాటిలైట్,కేబుల్ ఛానల్స్, వందలకొద్ది చిన్న పత్రికలు వెరసి 29 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు మీడియా హబ్ గా మారాయి.

ఈ సందర్భంగా ఒక విషయం ఇక్కడ చెప్పుకోవాలి… దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని అక్రిడిటేషన్ లు 18,600 కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయంటే ఇక్కడ మీడియ విస్త్రుతిని అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో 16 వేల అక్రిడిటేషన్ కార్డ్ లు ఉండగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇక్కడి ప్రభుత్వం చొరవతో ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ ఉండాలనే దిశగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయనే చెప్పవచ్చు. ఎందుకంటే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో కేవలం వెయ్యి, కేరళ తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో 3వేలకు మించని అక్రిడిటేషన్లు మన రాష్ట్రంలో మాత్రం 18 వేలకు పైగా రెండేళ్ల క్రితమే ఇచ్చిన విషయాన్ని సందర్భోచితంగా గుర్తు చేస్తున్నాను.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక..

తెలంగాణ వస్తే ఏమొస్తది అని ఉద్యమ సమయంలో కొందరు సీనియర్ జర్నలిస్టులు వ్యాఖ్యానించిన దాఖలాలు లేకపోలేదు. కానీ తెలంగాణ వస్తే సమాజంలోని అన్ని వర్గాలతో పాటు తెలంగాణ జర్నలిస్టు జీవితాలు బాగుపడతాయని విశ్వసించి తెలంగాణ ఉద్యమంలో భుజం భుజం కలిపి 14 యేళ్లు ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం పనిచేసేన సంస్థ తెలంగాణ జర్నలిస్టు ఫోరం. రాష్ట్రం వచ్చిన వెంటనే ఇక్కడ జర్నలిస్టుల భవితకు భరోసా ఇవ్వగలరనే నమ్మకంతో జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులుగా ఉన్న అల్లం నారాయణకు తొలి మీడియా అకాడమీ చైర్మన్ గా ముఖ్యమంత్రి కె సి ఆర్ భాద్యతలు అప్పజెప్పారు.

ఇక్కడే వర్తమానం కొత్తరూపు సంతరించుకుంది. అప్పటి వరకు కేవలం పరిశోధన, శిక్షణకు పరిమితమైన ప్రెస్ అకాడమీ మొట్టమొదటిసారిగా జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర బిందువైంది. ప్రెస్ అకాడమీ ఏర్పాటు అయినప్పటినుండి ఏ ముఖ్యమంత్రి కూడా దాని దరిదాపులకు వచ్చి తొంగి చూసిన సందర్భం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొన్ని నెలల వ్యవధిలోనే హైదరాబాద్ నగరంలోని ఛాపెల్ రోడ్డు లో ఉన్న ప్రెస్ అకాడమీ కి 2015 ఫిబ్రవరి 21 వ తారీఖున ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వచ్చి సీనియర్ సంపాదకులతో, పాత్రికేయులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అకాడమీకి 100 కోట్ల నిధులు సమకూర్చాలనే ఆలోచనకు అంకురార్పణ చేశారు. దాని ద్వారా వచ్చే మొత్తంతో ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు చేయాలో నిర్ణయించుకోవాలని అప్పటివరకు ప్రెస్ అకాడమీగా ఉన్న పేరును కాస్తా మీడియా అకాడమీ గా మారుస్తూ చైర్మన్ కు అధికారాన్ని అప్పజెప్పారు.

జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునే గురుతర బాధ్యత

జర్నలిస్టుగా, సహాయ సంపాదకులుగా, ప్రధాన సంపాదకులుగా సుదీర్ఘకాలం పని చేసిన అల్లం నారాయణ ఎంతో మంది జర్నలిస్టుల కష్టనష్టాలను చాలా దగ్గర నుంచి చూడటం వల్ల కాబోలు వారి కుటుంబాలను ఆదుకునే దిశగా తొలి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. కుటుంబ పెద్దను కోల్పోతే ఆ కుటుంబం పడే యాతనను దృష్టిలో ఉంచుకొని మృతిచెందిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునే గురుతర బాధ్యతను మీడియా అకాడమీ తీసుకోవాలని భావించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ తరహా కార్యక్రమాన్ని చేపట్టి చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం తో పాటు మూడువేల రూపాయల నెల వారీ పెన్షన్, ఆ కుటుంబంలో పదో తరగతి లోపు చిన్నారులు విద్యను అభ్యసిస్తే ఇద్దరు పిల్లలకు చెరో వెయ్యి రూపాయల చొప్పున అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఇప్పటివరకు 353 కుటుంబాలకు లక్ష చొప్పున 3 కోట్ల 53 లక్షలు, ఇన్నేళ్లుగా ఆయా కుటుంబాలకు పెన్షన్ కింద మరో 2 కోట్ల 57 లక్షల రూపాయలను అకాడమీ ఖర్చుచేసినట్లు తెలుస్తోంది.

ఆశయం మంచిదైతే ఆశీర్వాదం కూడా ఉంటుంది అన్నట్లు 2017 ఫిబ్రవరి 17 న ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రగతి భవన్ లో నూతనంగా నిర్మించిన జనహిత ప్రారంభోత్సవం రోజే ఈ నవీన పథకానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేతుల మీదుగా దాదాపు 85 కుటుంబాలకు మొదటి విడతగా లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. అప్పుడు ప్రారంభమైన ఈ పథకం నేటికీ కొనసాగుతూ వస్తున్నది. ఇప్పటివరకు 353 కుటుంబాలకు లక్ష చొప్పున 3 కోట్ల 53 లక్షలు, ఇన్నేళ్లుగా ఆయా కుటుంబాలకు పెన్షన్ కింద మరో 2 కోట్ల 57 లక్షల రూపాయలను అకాడమీ ఖర్చుచేసినట్లు తెలుస్తోంది. దీంతో పాటు విధి నిర్వాహణలో ఉంటూ పని చేయలేక అనారోగ్యానికి గురైన దాదాపు 116 మంది జర్నలిస్ట్ లకు 58 లక్షల రూపాయలను అకాడమీ చెక్కుల రూపంలో పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ట్యూషన్ ఫీజు కింద మరో యాభై లక్షలు వెరసి మొత్తంలో 7 కోట్ల 18 లక్షల రూపాయలను జర్నలిస్టుల, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

కరోనా సమయంలో ఆపన్నహస్తం

ఇదిలా ఉంటే 2019 మార్చి నెలలో ప్రపంచాన్ని కబళించిన కరోనా మహమ్మారి మన రాష్ట్రంలో కూడా కరాళ నృత్యం చేసింది. ఫ్రంట్ లైన్ వారియర్స్ తో సమానంగా విధి నిర్వహణలో పాల్గొని వార్తా సేకరణ చేసిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలోనే ఆ మహమ్మారి బారిన పడక తప్పని పరిస్థితి. ఇక్కడే మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మానవత్వంతో ఒక నిర్ణయాన్ని తీసుకొని జర్నలిస్టులకు ఆర్థిక చికిత్స అనివార్యం అని భావించి తక్షణ సహాయం అందించే దిశగా నిర్ణయం తీసుకోవడం ముదావహం.

వచ్చేవారం కోవిడ్ తో మరణించిన దాదాపు 51 జర్నలిస్ట్ కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. అదే జరిగితే మరో కోటి కి పైగా జర్నలిస్ట్ కుటుంబాలకు అందుతాయి.

తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కోవిడ్ బారిన పడ్డ ప్రతి జర్నలిస్టు 20 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించడం మొదలు పెట్టారు. మొదటిగా హైదరాబాద్ లాంటి నగరాల్లో జర్నలిస్టులు లాక్ డౌన్ లో పడుతున్న ఇబ్బంది ని గమనించి వారికి నిత్యవసర వస్తువులు అందించే కార్యక్రమాన్ని మీడియా అకాడమీ చేసింది. తదనంతరం విధి నిర్వహణలో భాగంగా కోవిడ్ బారిన పడ్డ వారికి 20 వేల చొప్పున క్వారంటైన్ లో ఉన్న వాళ్లకు 10 వేల చొప్పున ఇవ్వాలని తీసుకున్న నిర్ణయాన్ని అప్పట్లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం గా స్వాగతించాము. అయితే కాలక్రమేనా పాజిటివ్ శాతం పెరగడం ఎక్కువ మంది జర్నలిస్టులు ఈ వైరస్ బారిన పడటంతో 20వేల రూపాయలు కాస్త పదివేలకు కుదించి నేటికీ వారివారి అకౌంట్లలో వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు 3909 మంది జర్నలిస్టులకు కోవిడ్ నిర్ధారణ కాగా వారికి 5 కోట్ల 56 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించినట్లు మీడియా అకాడమీ ప్రకటించింది.

ఈ ఆర్థిక సహాయం జర్నలిస్టులకు ఎంతో కొంత వెసులుబాటు ను ఇచ్చింది. ఇది ఒక రకంగా జర్నలిస్టు సమాజానికి అకాడమీ అందించిన ఆర్థిక చికిత్స అనవచ్చు. మీడియా అకాడమీ కి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన 42 కోట్ల రూపాయల మూల నిధితో ద్వారానే ఈ తరహా సంక్షేమ కార్యక్రమాలు మీడియా అకాడమీ చేస్తోంది. వచ్చేవారం కోవిడ్ తో మరణించిన దాదాపు 51 జర్నలిస్ట్ కుటుంబాలకు 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. అదే జరిగితే మరో కోటి కి పైగా జర్నలిస్ట్ కుటుంబాలకు అందుతాయి. అంటే ఇప్పటివరకు దాదాపు 12 కోట్ల 75 లక్షల రూపాయలను ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సంక్షేమ బాధ్యతను మీడియా అకాడమీకి అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, అమలు చేస్తున్న అల్లం నారాయణ కు టీయూడబ్ల్యూజే పక్షాన కృతజ్ఞతలు. అకాడమీ అంటే శిక్షణ మాత్రమే కాదు సంక్షేమం కూడా అని పనిచేస్తున్న సందర్భాన్ని వర్తమానం గా చెప్పుకోవచ్చు.

జర్నలిస్టులకు పెన్షన్ ఆలోచన

ఇక భవిష్యత్తు విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం 42 కోట్ల మూల నిధి ఇస్తేనే ఈ తరహా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నయంటే మిగతా 58 కోట్ల నిధులు కూడా విడుదల చేసి మీడియా అకాడమీ కి అప్పగిస్తే మరేన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసుకోవచ్చు అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ప్రధానంగా రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చే ఒక బృహత్తర పథకానికి సైతం మీడియా అకాడమీ త్వరలోనే శ్రీకారం చుట్టాలని,,భవిష్యత్తులో కాలానికి అనుగుణంగా జర్నలిస్టుల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు ప్రవేశ పెట్టి అమలు చేయాలని, మిగతా రాష్ట్రాల కంటే మెరుగ్గా జర్నలిస్ట్ లకు ప్రయోజనకారిగా తెలంగాణ ప్రభుత్వం, మీడియా అకాడమీ పని చేయాలని ఆశిద్దాం.

అస్కాని మారుతి సాగర్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు సంఘం ప్రధాన కార్యదర్శి

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article