బుద్ధ జయంతి రోజున వర్తమానంలో బౌద్ధం మనకు ఇచ్చే సందేశం ఏమిటో తరచి చూసుకోవాలసి ఉన్నది.
చరిత్ర అధ్యయనం కేవలం అకడమిక్ అంశం కాదు. ఎందుకంటే చరిత్ర మనకు కొన్ని పాఠాల్ని చెపుతుంది. వాటిని అర్థం చేసుకోగలిగితే మనం వర్తమానాన్ని సరిదిద్దుకొని భవిష్యత్తును నిర్మించుకోగలం. ఏ సమాజం కానీ దేశం కానీ చరిత్ర నేర్పే సత్యాల్ని ఒడిసిపట్టి అవపోశన చేయక పోతే, ఇప్పుడు మనం ఉన్నట్టే సామాజిక, బౌద్ధిక సంక్షోభాల్లో కొట్టుకుంటూ మిగిలిపోతాం.
బౌద్ధం మనకు నేర్పుతున్న చారిత్రక సత్యాల్లో మొదటిది, ఉత్పత్తి శక్తుల్ని (వ్యవసాయదారులు, చేతి పని వాళ్ళు, శ్రామికులతో పాటు భౌతిక వనరులు) దోపిడీకి గురి చేయని ఆర్ధిక వ్యవస్థను నిర్మించడం.
సామ్రాజ్యవాదం భూమిని కమ్మేసి మొత్తం ప్రపంచాన్ని ఒక గ్లోబల్ కుగ్రామంగా మార్చేసిన ఈ కాలంలో ఇదెలా సాధ్యం అనే ప్రశ్నకు జవాబును వెతకడం లోనే బుద్ధుడు మాట్లాడిన సమత, ఆర్థికంగా సాధ్యం అవుతుంది. ఇక్కడే మన భారతదేశంలో కుల వ్యవస్థ కూడా కలిసి పోయి అసమ సమాజపు పునాదుల్ని ఇప్పటికీ బలంగా ఉండేలా చేస్తున్నది.
ఇక రెండో సత్యం కుల రహిత సమాజాన్ని నిర్మించడం. బుద్ధుడు ఏ వర్ణ వ్యవస్థను ధిక్కరించి బుద్ధాన్ని సమతామార్గంగా చేసే ప్రయత్నం చేసాడో ఆ పని చాలా మిగిలే ఉంది. అంబేద్కర్ చెప్పిన కుల నిర్మూలన అనే అవధారణను మనం ఇంకా సరిగా అర్థం చేసుకోలేదనిపిస్తున్నది. అందుకే భౌద్ధులం అనుకుంటున్న వాళ్ళు కూడా కుల స్పృహ నుండి బయట పడలేదు. కాంక్రీట్ గా చెప్పాలంటే పెద్ద కులాలుగా భావిస్తున్న కులాల పేర్ల నుండి వచ్చిన తోకల్ని తమ పేరులోంచి కత్తిరించేయాలి.దళిత కులాల ఉప కులాల మధ్య, అణచివేయబడ్డ వెనుకబడ్డ కులాల మధ్య, ఈ కులాలకూ దళిత వర్గాలకు మధ్య ఇప్పటికీ ఉన్న విబేధాలు, బ్రాహ్మణవాద హైందవ వర్ణ వ్యవస్థ నేర్పిన అంచెలంచెల కుల వ్యవస్థ విష కౌగిలి నుండి బయట పడాలి. అప్పుడే వాళ్ళు బుద్ధిస్టులు కాగల్గుతారు.
బుద్ధుడిని దేవుడిగా కాకుండా ఈ ఉపఖండపు తొలి సామాజిక విప్లవకారుడిగా, బౌద్ధాన్ని సామాజిక విప్లవంగా చూసినప్పుడే మనం మౌడ్యం నుండీ, పర పీడన నుండి బయటపడతాం
మూడో సత్యం ఈ భూమ్మీద మనమే కాదు వేరే ప్రాణులున్నాయని వాటికి కూడా ఈ భూమిపై మనకున్నంత హక్కు ఉందన్న సత్యాన్ని ఆచరించి మనం భూమికి ఏమీ ఇవ్వక పోయినా పర్వాలేదు, దాన్ని నాశనం చేయక పోతే చాలన్న సత్యం. ఈ సత్యాన్ని మనకంటే ఎక్కువ వేరే దేశాలకు చేరి, అక్కడ ఇంకా కొనసాగుతున్న బౌద్ధం చెపుతున్నది.
నిజానికి తూర్పు ఆసియా దేశాల్లో బౌద్ధం ఎదుగుదల పర్యావరణంతో ముడి పడి ఉంది. కరోనా లాక్ డౌన్ కొన్ని మాసాల్లోనే ఎంత కాలుష్యాన్ని తగ్గించేసిందో చూస్తూనే ఉన్నాం. మనం ఎంత ఇనాక్టివ్ గా ఉంటే ప్రకృతి అంత శుభ్రంగా ఉందో చూస్తూనే ఉన్నాం.
ఇక చివరి సత్యం, మన నేల తన పొరల్లో, నేల పైన కట్టడాల రూపంలో వేల ఏళ్ళ చరిత్రను పదిలంగా దాచుకుని ఉంది. దాని భద్రంగా వెలికి తీసి పదిలంగా దాచుకునే సంస్కృతి ఇంకా మనం అలవరచు కోవాల్సే ఉంది. ఎందుకంటే ఆ నేలలోనే బౌద్ధం చెప్పే సత్యాలు దాగి ఉన్నాయి. వాటినుండి మనం పాఠాల్ని తీసుకుంటేనే మనం కొత్త సామాజిక ఆర్ధిక సమాజాన్ని నిర్మిచుకోగలుగుతాం.
బుద్ధుడిని దేవుడిగా కాకుండా ఈ ఉపఖండపు తొలి సామాజిక విప్లవకారుడిగా, బౌద్ధాన్ని సామాజిక విప్లవంగా చూసినప్పుడే మనం మౌడ్యం నుండీ, పర పీడన ( పీడకులు వ్యక్తులు కావొచ్చు, నేటి రాజకీయం కావచ్చు, ఈ భూమండలాన్ని కబళించిన సామ్రాజ్యవాదం కావొచ్చు) నుండి బయటపడతాం. ఇదే బుద్ధుడి జీవితం చెప్పిన సత్యం.
ఎంఏ. శ్రీనివాసన్, చరిత్ర, పురాతత్వ పరిశోధకులు, జనరల్ సెక్రటరీ, పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్, తెలంగాణ.
ఫోన్ నంబర్. 8106935000. email: ma.vaasu@gmail.com
శ్రీనివాసన్ గారూ, చాలా బాగా చెప్పారు.
చాటి మనిషిని అల్పంగా చూసే వారు ఎన్నటికీ ఉన్నతులు కారు. నిజానికి వారే అల్పులు.
ఇక దోపిడీ విషయానికి వస్తే…
ఈ ప్రస్తుత వ్యవస్థలో దోపిడీ అనివార్యం. అది వ్యక్తిగతం కాదు. వ్యవస్థీకృతం. ఈ వ్యవస్థను మరమ్మతు చేసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంది. అందరం కలిసి తెలుపు టీవీ వేదికగా మెరుగైన సమాజానికి పునాదులు వేద్దాం.
చాలా బాగా రాసారు. మీ నుండి చాలా నేర్చుకుంటున్నాను. కృతజ్ఞతలు.