Editorial

Wednesday, January 22, 2025
కథనాలుఓ దయామయ మానవులారా! - సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి అభ్యర్ధన

ఓ దయామయ మానవులారా! – సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి అభ్యర్ధన

ఏ కులం వాడు ఆ కులానికి, ఏ మతం వాడు ఆ మతానికీ, ఏ ప్రాంతం వాడు ఆ ప్రాంతానికి మాత్రమే సహాయం చేసుకోవటం ఎంత నేరమో, మనిషి కేవలం మనిషికి మాత్రమే సహాయం చేసికోవటం అంతే నేరం.

సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి

మకురుపట్టిన దున్నపోతులా పైకి లేచి ఆ లోయనంతా చెడదొక్కి పడేసింది చెయ్యేరు. నీటి పడగల విషపు బుసలతో, చెట్లను పెకలించే రాక్షసత్వపు దూకుడుతో, బండరాళ్ళను సైతం కోసి వేసే రంపపు పదనుతో చెయ్యేటి వెల్లువ చెలరేగిపోయింది. అసంఖ్యాకమైన వృక్షాలను విరిచేసింది. పీకి దూరంగా విసిరేసింది. ఇళ్ళను కూల్చేసింది. ఇంట్లోని వస్తువులన్నిటినీ ఎటో మోసుకు పోయింది. పైరును దున్నేసింది. పొలాల్లో నడుములెత్తున ఇసుక మేట వేసింది. పశువుల్ని నిర్ధాక్షిణ్యంగా చంపింది. మనుషుల్ని పీక పిసికి విసరికొట్టింది.

ఆ విలయాన్ని విని చూసి మనిషి గుండె విలవిల్లాడింది. మనిషి నిలువునా కరిగిపోయాడు. చేతనైన సహాయం చేతబట్టుకు పోయి వరద బాధిత జనాలకుఅందిస్తున్నాడు. ఆకలిగొన్న మనిషికి పిడికెడు అన్నాన్నీ, చలికి వణికి పోయే మనిషికి బారెడు దుప్పటినీ, అర్ధనగ్నంగా మిగిలిన మనిషికి కట్టుబట్టల్నీ, చనిపోయిన వారి తాలూకు మనిషికి ఆర్థిక సహాయాన్నీ, పైరు కోల్పోయిన మనిషికి పంటనష్టాన్నీ అందిస్తున్నాడు. బాధిత మనుజుల కన్నీళ్లు తుడుస్తున్నాడు. మనిషికి సాటి మనిషి సహాయం చేస్తున్నాడు.

మనిషి మనిషికి మాత్రమే అండగా నిలుస్తున్నాడు. మనిషికే… కేవలం మనిషి మనిషికే….

మనిషి మనిషికి మాత్రమే అండగా నిలుస్తున్నాడు. మనిషికే… కేవలం మనిషి మనిషికే….


అలాగని రాయిరప్పకు సహాయం చేయమని నేను చెప్పటం లేదు. నీటి ప్రవాహం రాక్షస బలంతో కొండ అడుగుభాగాన్ని కోసివేస్తే చెంప భాగమంతా రాళ్ళు మట్టిపై నుంచి కిందకు జారుతూ ఏర్పడిన కొండగాయాల్ని నేను మాన్పమనడం లేదు. వేర్లతో సహా లేచిపోయిన చెట్లను తెచ్చి తిరిగి వాటి పాదిలో నాటి ప్రాణం పోయమనటం లేదు. పైరునంతా దోచుకు పోయిన నీటి సందిళ్ళలోంచి పంటను దూసుకు రమ్మనటం లేదు.

మరేమయ్యా నీ బాధ అంటారేమో!
ఆ వీడియో ఇక్కడ చూడండి మహానుభావులారా !
ఆవులమంద ఎందుకు గుమిగూడి ఉందో పరిశీలించండి.

అయ్యా ! మీకు దండాలు. బాధాసర్పదష్టులకు సహాయం చేయడం వలన మీలోని మానవత్వం ప్రశంసనీయం అవుతుంది. ఆ పశువు కళేబరాన్ని ఖననం చేసి ఒక కన్నీటి బొట్టు విడువటం వలన మీ మానవత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు.

మనుషుల కంటే ఎక్కువగా పశువులే ప్రాణాలు కోల్పోయాయి. అక్కడక్కడ వాటి కళేబరాలు ఉబ్బి పడివున్నాయి. ప్రాణం మిగిలున్న తోటి పశువులు దీనంగా ఆ కళేబరాన్ని తాకి, మూచూసి దుఃఖిస్తూ వెనుదిరుగుతున్నాయి.

అయ్యా ! మీకు దండాలు. బాధాసర్పదష్టులకు సహాయం చేయడం వలన మీలోని మానవత్వం ప్రశంసనీయం అవుతుంది. మీలోని మానవ సంబంధాలు గొప్పవిగా గుర్తించబడతాయి. అంతమాత్రాన ఆ పశువు కళేబరాన్ని ఖననం చేసి ఒక కన్నీటి బొట్టు విడువటం వలన మీ మానవత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు.

మనుషులంతా మనుషుల్ని గురించే ఆలోచిస్తున్నారు.
పశువుల గురించి కూడా ఆలోచించండయ్యా!

దయామయులారా! పశువుల్ని కూడా మనం ఆకలి బాధనుంచి రక్షిద్దాం. జంతుసంబంధాలను పునరుద్దరించు కొందాం .

సంచినిండా బియ్యం బేళ్ళు తెచ్చేటప్పుడు పిడికెడు గడ్డిపోచలు కూడా పట్టుకొని వచ్చి పశువుల నోటికి అందించండి. ట్రాక్టర్ ఎండుగడ్డి తెచ్చి పశువుల ముందు వేయండి. వాటి ఆనందాన్ని చూడండి. మీరు మనుషులకు ఎంత సాయం చేసినా మీకేసి ఇంకా దీనంగా చూస్తూనే ఉంటారు. మరింత సాయం కోసం ఏడుస్తూనే ఉంటారు. ఒక్కపూటకు సరిపడేంత ఎండుగడ్డిని తెచ్చి పశువుల ముందు వేసిచూడండి. అవెంత ఆనందంగా, తృప్తిగా, కృతజ్నతగా నీకేసి చూస్తాయో గమనించండి.

దయామయులారా! ఎటు చూసినా ఇసుకతో కప్పి ఉన్న పొలాలు, మట్టిగొట్టుకు పోయిన గడ్డిపోచల వల్ల తినేందుకు పిడికెడు గడ్డి దొరక్క, ఎండిపోయిన డొక్కలతో పశువులు అరుస్తున్నాయి. ఒక్క వారం రోజులు ఓపికబడితే మట్టిలోంచి గడ్డి బయటకొస్తుంది. పశువుల కోసమైనా అది భూమిలో ప్రాణం నిలబెట్టుకుని ఉంటుంది. అప్పటిదాకా పశువుల్ని కూడా మనం ఆకలి బాధనుంచి రక్షిద్దాం. జంతుసంబంధాలను పునరుద్దరించు కొందాం .

ప్రాణాలు మనుషులవే కాదు జంతువులవి కూడా. మొక్కలవి కూడా.

ఏ కులం వాడు ఆ కులానికి, ఏ మతం వాడు ఆ మతానికీ, ఏ ప్రాంతం వాడు ఆ ప్రాంతానికి మాత్రమే సహాయం చేసుకోవటం ఎంత నేరమో, మనిషి కేవలం మనిషికి మాత్రమే సహాయం చేసికోవటం అంతే నేరం.

ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాయలసీమ రైతు బిడ్డ, వృత్తి రీత్య ఉపాధ్యాయులు. ఇటీవల వారి నవల ‘కొండపొలం’ సినిమాగా వచ్చిన విషయం తెలిసిందే. వరదల కారణంగా రాయలసీమ విలయం గురించి వారు రాసిన ఇంతకు ముందరి కథనం ఇక్కడ చదవండి. బాధితులకు అండగా ఉండేందుకు నడుం కట్టిన విధానం కూడా తెలుపు వ్యాసం ఇది. రచయిత  ఇ -మెయిల్ SANNAPUREDDY12@GMAIL.COM

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article