Editorial

Wednesday, January 22, 2025
Opinionనాస్త్యా – ఒక అపరిచిత మూర్తిమత్వం - రమాసుందరి

నాస్త్యా – ఒక అపరిచిత మూర్తిమత్వం – రమాసుందరి

ప్రవాహంలో బిందువులాగా సమూహంలో అస్తిత్వాన్ని వదిలి వేసుకోవటంలో ఎంతో ఆనందం ఉంటుంది. ఆ సహజమైన సంతోషాన్ని వదిలి ‘నేను’ ‘నా’ అనే పదాల చుట్టూ గిరికీలు కొట్టే పొరపాట్లు చేస్తుంటాము. ఈ పెడ ధోరణికి చెంప దెబ్బ వేసే నవల ‘అపరిచిత’…అందలి కథా నాయకి నాస్త్యా.

తెగువ, సాహసం, నిబద్ధత, కష్టపడేతత్వం కలిగిన  లక్షలాది మంది నాస్త్యాలు అపరిచితంగా ఉన్నారు. మన చుట్టుపక్కల కూడా అటువంటి నాస్త్యాలు అజ్ఞాతంగా తచ్చాడుతూ ఉంటారు. వారు వ్యక్తిగత గుర్తింపు కోరుకోరు. నిజానికి శ్రామిక మహిళల ప్రకృతే అది.

రమాసుందరి

ఈ అనంతమైన విశ్వంలో మనిషి ఉనికి సముద్రంలో ఇసుక రేణువులో వెయ్యోవంతు కూడా వుండదని తెలుసు. ఈ రోజు మనం నిలుచున్న స్థలానికి, కాలానికి ముందు వందల కోట్ల జనుల నడక నడిచిందనీ, జీవితం ఉన్నతీకరణ చెంది నేడు మనం అనుభవిస్తున్న సకల సౌకర్యాల వెనుక లెక్క చెప్పలేనంత మానవ శారీరక, మేధో శ్రమ నడిచిందనీ తెలిసి కూడా మన ఉనికిని మనం ప్రత్యేకంగానే భావిస్తూ ఉంటాము.

కానీ మన చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులు గుర్తింపు కోరని అనేకానేక పనులు చేస్తూ సామూహికత్వంలో ఏకమయ్యి జీవిస్తూ ఉన్నారు. వాళ్లు ఎవరి మధ్యన పని చేస్తుంటారో వారి హృదయాల్లో తప్ప సమాజ పై పొరల్లో వారిని గురించిన గుర్తింపు వుండదు. నిజానికి ప్రవాహంలో బిందువులాగా సమూహంలో అస్తిత్వాన్ని వదిలి వేసుకోవటంలో ఎంతో ఆనందం ఉంటుంది. ఆ సహజమైన సంతోషాన్ని వదిలి ‘నేను’ ‘నా’ అనే పదాల చుట్టూ గిరికీలు కొట్టే పొరపాట్లు చేస్తుంటాము. ఈ పెడ ధోరణికి చెంప దెబ్బ వేసే నవల ‘అపరిచిత’.

ఒక సిద్దాంతం ఉన్నదున్నట్లుగా కలగచేసే ప్రభావం కంటే అది ఒక నవలలోనో, కధలోనో కాల్పనిక పాత్రలోనికి చేరి -తన చేష్టలు ద్వారా, మాటలు ద్వారా చూపించే ప్రభావం గొప్పదిగా ఉంటుంది. సాధారణ పాఠకులు సిద్ధాంతాన్నిఆ పాత్ర ద్వారా తెలుసుకొంటారు. సిద్ధాంతం తెలిసిన పాఠకులు ఆ పాత్రలోని సారాన్ని సిద్దాంతానికి అన్వయించి అర్ధం చేసుకొంటారు. తమ వ్యక్తిత్వాన్ని మెరుగు పరుచుకొంటారు. అలాంటి పాత్రే ఈ ‘అపరిచిత’.

కొత్తగా వచ్చిన నాస్త్యా ముందు ఎక్కువగా మాట్లాడేది కాదు. కళ్లతోనే వింటున్నట్లు ఉండేది. కొద్ది కాలం అలా విన్న తరువాత ఆమె మాట్లాడటం మొదలు పెడుతుంది. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయటానికి ఆమె చేసే సూచనలు మిగతా వారికి నవ్వూ, కోపం, చికాకు తెప్పించేవి.

రచయిత్రి గలీనా నికోలయెవా

నిరాడంబరతనూ, నిస్వార్ధాన్నీ, నిర్మలతనూ, నిర్భయత్వాన్ని మూస పోసిన పాత్ర. ఈ పాత్ర ఈ భూమి మీద జీవించిందో, లేక ఇది ఒక కాల్పనిక పాత్రో తెలియదు. కానీ గడిచిన, గడుస్తున్న కాలాల్లో ఇలాంటి వ్యక్తులు లక్షాలాది మంది సంచరించే ఉంటారు. సొంత ఆశలనూ, సొంత అభిరుచులనూ ప్రజా విముక్తితో ముడివేసే వుంటారు. నీటిలో చేపల్లాగా వారితో మమేకమై ఉంటారు. తమ సొంత అస్తిత్వాన్ని ఇష్టంగానే పోగొట్టుకొని ఉంటారు. వారి కోసం చివరికి ప్రాణాలను కూడా తృణప్రాయంగా త్యజించి ఉంటారు. బహుశా అలాంటి ఉన్నత వ్యక్తుల వ్యక్తిత్వాలను పోత పోసి రచయిత్రి గలీనా నికోలయెవా ‘అపరిచిత’ను సృష్టించి ఉంటుందని అనిపిస్తుంది.

అది చాలా మంచి కాలం. రైతులు కూలీలుగా మారి వలసలు వెళ్లే పాడు కాలం కాదది. వ్యవసాయం చేయలేక ఆత్మహత్యలు చేసుకొనే పాపిష్టి కాలం కాదది. రష్యా విప్లవ తదనంతర కాలం అది. రష్యాలో రైతులందరూ ఉమ్మడిగా వ్యవసాయం చేసుకొనే రోజులు. సమిష్టి వ్యవసాయ క్షేత్రాలను అభివృద్ధి చేసి ఆహారపు నిల్వలను సమృద్ధి చేసుకొన్న యుద్ధానంతర కాలం అది. వచ్చిన వ్యవసాయ ఫలాన్ని రైతులందరూ పంచుకొనే మంచి కాలం అది. అప్పుడున్న కమ్యూనిష్టు ప్రభుత్వం వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్లు, అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఒక పటిష్టమైన వ్యవస్థను ఏర్పరిచింది. ఆ రోజుల్లో కళాశాలల్లో చదువులు కూడా దేశీయ అభివృద్ధి కోసమే ఉండేవి. విద్యార్ధులు కాలేజీల నుండి నేరుగా ఉత్పత్తి రంగాల్లోకి దూకేవారు.

అపరిచిత పేరుతో అనువాదం చేసిన ఆంగ్ల పుస్తకం

అలా దూకిన అమ్మాయే మన కధా నాయిక ‘నాస్తస్యా వాహిల్యెవ్యా కోష్ షోవా’. నాస్త్యాగా అందరూ పిలిచే ఈమె అప్పుడే పట్టా పొందిన పదేహేడేళ్ల పిల్ల. పాలు కారే బుగ్గలతో, జుట్టును జడలల్లి -‘ఈ జడంటూ ఆ జడంటూ నెత్తి వెనుకే మార్చి కణతల దగ్గరికి తోసుకొచ్చి కట్టేసిన నల్లరిబ్బను’తో, బిగుతు లాగుతో, బూడిద రంగు కోటు ధరించి -రైలు దిగుతుంది. రష్యాలోని ఒక సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి ముఖ్య గ్రామీణ ఆర్ధికవేత్తగా వస్తుంది. అప్పటికే ఆ క్షేత్రంలో మెషీన్-ట్రాక్టర్ మేనేజర్ చాలికోవ్, చీఫ్ యింజనీర్ పర్జనోవ్, పార్టీ నాయకుడు పెధ్యా పనిచేస్తుంటారు.

కొత్తగా వచ్చిన నాస్త్యా ముందు ఎక్కువగా మాట్లాడేది కాదు. కళ్లతోనే వింటున్నట్లు ఉండేది. కొద్ది కాలం అలా విన్న తరువాత ఆమె మాట్లాడటం మొదలు పెడుతుంది. ఆ వ్యవస్థను ప్రక్షాళన చేయటానికి ఆమె చేసే సూచనలు మిగతా వారికి నవ్వూ, కోపం, చికాకు తెప్పించేవి. మొదట ట్రాక్టర్లు బాగు చేసే కార్ఖానా సవ్యంగా లేదని చెబుతుంది. ‘మిగతా క్షేత్రాలతో పోటీ పడి పనిచేస్తున్నాం’ అని వీళ్లు బడాయి పోతే ‘అసలీ పోటీల గొడవేంటీ?’ అని అమాయకంగా అడుగుతుంది. ‘నేను చదివిన బళ్లలో ఈ పోటీల గురించి ఎక్కడా చెప్పలేదే?’ అనంటుంది.

చెప్పులో రాయి, చెవిలో జోరీగలాగా నస పెడుతుంది. వేసే పంటలు ఆ నేలకు అనువైనవి కావని ప్రాంతీయ కమిటీ ప్రధాన కార్యదర్శితో వాదిస్తుంది. కుందేలు పిల్లలాగా గెంతుతూ వ్యవసాయక్షేత్రం అంతా తిరుగుతుంటుంది.

ముమ్మరంగా పనులు సాగుతున్నప్పుడు ‘మళ్ల వ్యవసాయ పద్దతి’ నేర్చుకొని రావటానికి మనుషులను పంపాలని పట్టు పడుతుంది. కీలకమైన ఇద్దరు వ్యక్తులను ఆమే ఒప్పించి పంపిస్తుంది. విత్తులు చల్లి, ఆకుల మళ్లు పోసే కాలంలో క్లోనర్ గడ్డికి బదులు జొన్న, పొద్దు తిరుగుడు పూల చెట్లు వేయాలని చెప్పుకొస్తుంది. మాటి మాటికి జిల్లా కమిటీకి ఫిర్యాదు చేస్తుంది. చెప్పులో రాయి, చెవిలో జోరీగలాగా నస పెడుతుంది. వేసే పంటలు ఆ నేలకు అనువైనవి కావని ప్రాంతీయ కమిటీ ప్రధాన కార్యదర్శితో వాదిస్తుంది. కుందేలు పిల్లలాగా గెంతుతూ వ్యవసాయక్షేత్రం అంతా తిరుగుతుంటుంది.

పిట్టంత పిల్ల, ఆజానుబాహువైన చీఫ్ యింజనీర్ కు ఎదురుగా నిలబడి యంత్రాల్ని పొలాల్లోకి వెళ్లే ముందే ఒక సారి తనిఖీ చేయాలని జంకు గొంకు లేకుండా గొడవ పడుతుంది. ‘పార్టీ నాయకులు, మీరు అబద్దాలు ఎందుకు ఆడారు?’ అని బాధ పడుతుంది.

అతివృష్టికీ, అనావృష్టికీ తట్టుకొనే స్థానిక విత్తనాలే వేయాలని పట్టు పడుతుంది. ఆదేశాలను అతిక్రమించి మూడు ప్రాంతాలలో అక్కడి విత్తనాలే వెయ్యటానికి ప్రజలను సన్నద్ధం చేస్తుంది. సొంత గౌరవాల సంగతి పట్టించుకోకుండా విత్తనాల సంచిని భుజం మీద వేసుకొని ప్రజలతో కలిసి పనిచేస్తుంది.

మామూలుగా మృదువుగా, మెత్తగా ఉండే ఆ పిల్ల ప్రజల విషయంలో వాదించేటపుడు గయ్యాళిగా మారుతుంది. తోటి కామ్రేడ్లతో వాదించేటపుడు పెదాల స్థానంలో ఒక చిన్న గీత మాత్రమే కనబడుతుంది. గడ్డం, దాని చివర ఉండే సొట్టతో సహా పారలాగా ముందుకు తోసుకొని వస్తుంది. రచయిత్రి మాటల్లో చెప్పాలంటే ‘ప్రతి వ్యక్తిలోనూ ఏదో మహత్తున్నట్లూ, ఆ మహాత్తేమీటో తెలుసుకోవాలని తహతహలాడుతున్నట్టూ వుంటుంది. …ఆలోచన జరుగుతున్నంత సేపూ ఎంతో తాపీగా నిర్మలంగా వుంటుంది. ఆ ఆలోచనలన్నీ పూర్తయి, ఏదో వొక నిర్ణయానికి వచ్చిందీ అంటే, అంతే. ఇక కాచుకోవలసిందే.’

నాస్త్యా పంటల అభివృద్ధిని శాతాలుగా, పథకాలుగా లెక్కలు వేయదు. వాటితో ముడిపడి వున్న మనుషుల జీవితాలలోకి తొంగి చూసి వాటితో లంకె వేసి నిర్ణయాలు తీసుకొంటుంది. తనతో పని చేసే ఇతర ఆఫీసర్లను ఒప్పించే ప్రయత్నమే చేస్తుంది. తన వాదన సరి అయినదని నమ్మితే ఎదుటి వాళ్లు ఎంతటి వాళ్లైనా సందేహించదు. చెప్పదలుచుకొన్న విషయాన్ని ఎవరో ఏదైనా అంటారని ఆపదు. బిగ్గరగానే చెబుతుంది. అయితే ఆ అరుపుల్లో కోపం, ద్వేషం ఉండవు. ఒప్పించాలనే తపన ఉంటుంది. వినటం లేదనే విచారం వుంటుంది.

ఆమెతో పని చేసేవారు ఆమె పోరు పడలేక ఆమెను చాలా సార్లు అవమానం చేయ ప్రయత్నిస్తారు. ఆమె మాటలను నిర్లక్ష్యం చేస్తారు. ఆమెను వెలి వేస్తారు. కొత్తగా ఆ ప్రాంతానికి వచ్చిన చిన్న పిల్ల. ఆమెతో కక్ష కట్టినట్లు వ్యవహరిస్తారు. నాస్త్యా అసలు ఆ సంగతులే పట్టించుకొన్నట్లు కనబడదు.

అందం గురించి శ్రద్ధ వహించే వయసులో అవేమీ పట్టకుండా పని చేస్తున్న అమ్మాయిలో నిబద్దతను గుర్తించకుండా భౌతిక రూపాన్ని ఎగతాళి పరచాలనుకోవటం ఒక కమ్యూనిస్టుకి తగని సంగతి. ఆ సంగతిని ఆమె ప్రవర్తన ద్వారానే ఆయనకు తెలియచేస్తుంది నాస్త్యా.

ఒక రోజు చాలికోవ్ (ఈ కధ మనకు చెప్పే పాత్ర) అక్కసు పట్టలేక ఆమె జడలను ఎక్కిరిస్తాడు. ‘భలే ముఖ్య గ్రామీణార్ధిక వేత్తవులే నువ్వు. చిన్నప్పుడేసుకున్న జడలింకా అట్లాగే వున్నాయ్ దుమ్ముకొట్టుకొని’ అంటాడు ఎద్దేవాగా. ఆమె కొద్దిగా సిగ్గుపడి కోపం తెచ్చుకోకుండా ‘నిజమే. మీరనేది నిజమే. చిన్నప్పుడెప్పుడో స్కూలుకు పంపేటప్పుడు అల్లిందీజడలు మా అమ్మమ్మ. అప్పట్నుంచి యింతే’ అంటూ వేరే పనిలోకి పరిగెడుతుంది. ఆమెను సిగ్గుపరచాలనుకొన్న చాలికోవ్ తనే సిగ్గు పడాల్సి వస్తుంది. అందం గురించి శ్రద్ధ వహించే వయసులో అవేమీ పట్టకుండా పని చేస్తున్న అమ్మాయిలో నిబద్దతను గుర్తించకుండా భౌతిక రూపాన్ని ఎగతాళి పరచాలనుకోవటం ఒక కమ్యూనిస్టుకి తగని సంగతి. ఆ సంగతిని ఆమె ప్రవర్తన ద్వారానే ఆయనకు తెలియచేస్తుంది నాస్త్యా.

ఇంకో సందర్భంలో ప్రాంతీయ కార్యదర్శి నాస్త్యా మొండి పట్టుదలకు, క్రమశిక్షణారాహిత్యానికి ఆమెను అందరి ముందు తీవ్రంగా మందలిస్తాడు. నాస్త్యా తనను తాను సమర్ధించుకొనే ప్రయత్నమే చేయదు. వాళ్లు చేసిన నేరారోపణలను ఖండించదు. తనను విమర్శిస్తున్న వారిని తిరిగి విమర్శించదు. సన్నగా సంజాయిషీ యిచ్చుకొంటుంది. యితరుల కోసం ఆడపులిలా పోట్లాడే నాస్త్యా తన మీద చేసిన విమర్శలు అసలు పట్టించుకోదు. ఆమెను ఒంటరిని చేసి నిందించినందుకు ఆమె వాళ్లను తప్పు పట్టదు. ఆమె మనసులో ఆ విషయాలకు అసలు ప్రాముఖ్యతే ఉండదు.

నాస్త్యా, గోషా ఎక్కువగా మాట్లాడుకొంటున్నారనే వదంతులు వస్తాయి. అనుకోకుండా ఒక రోజు చాలికోవ్ వారి సంభాషణ వింటాడు. ఆరుబయట గేటు దగ్గర కూర్చొని మాట్లాడుకొంటున్నారు. ఇంతకీ వాళ్లు మాట్లాడేది చెడిపోయిన ట్రాక్టర్ల గురించి. ‘బాగానే ఉంది వీళ్ల ప్రేమ.’ అనుకొంటాడు చాలికోవ్.

పంటలు అద్భుతంగా పండుతాయి. నాస్త్యా ప్రతిపాదించిన స్థానిక విత్తనాలు గొప్ప దిగుబడిని యిస్తాయి. ఆమె పట్టుబట్టి శిక్షణ యిప్పించిన ‘మళ్ల వ్యవసాయ పద్దతి’ ఆ ప్రాంతంలో రికార్డు స్థాయిలో పంటనిస్తుంది. ఆ వ్యవసాయ క్షేత్రం గురించి మాస్కో రేడియోలో పొగుడుతారు. రష్యా ప్రజలందరికీ ఆ విషయం తెలుస్తుంది. శిక్షణ పొంది వచ్చిన గోషాకు గుర్తింపు వస్తుంది. దేశమంతటి నుండి ఆ ప్రాంతానికి పర్యాటకులు వచ్చి పోతుంటారు. చీఫ్ యింజనీర్ ఫర్జవేవ్ ఆ గొప్పతనాన్ని తనదిగా ప్రకటించుకొంటాడు.

వారి విజయం వెనకాల ఉన్న అపరిచిత కీలక వ్యక్తి గురించి అక్కడ వివరించి చెప్పలేక పోతాడు.

ఇవేమీ పట్టకుండా నూలు గుడ్డలు వేసుకొని, కుంటుకుంటూ నాస్త్యా పనిలో మునిగి ఉంటుంది. ఆమె ఎవరు అని ఎవరూ అడగరు. ఈ సంగతి గ్రహించి పార్టీ కార్యదర్శి ఫెద్యా కూడా బాధపడతాడు. మాస్కోలోని క్రెమ్లిన్ భవనంలో జరిగిన వ్యవసాయ కార్యకర్తల సమావేశానికి ఈ క్షేత్రం వారికి పిలుపు వస్తుంది. చాలికోవ్ ఆ సమావేశానికి హాజరు అవుతాడు. వారి విజయం వెనకాల ఉన్న అపరిచిత కీలక వ్యక్తి గురించి అక్కడ వివరించి చెప్పలేక పోతాడు.

‘యాదృచ్ఛికంగా మీకన్నీ జరిగాయని’ పక్క క్షేత్రాలవారు అంటుంటే చాలికోవ్, ఫెద్యా నవ్వుకొంటారు. అన్నీ యాదృచ్ఛికంగా, కాకతాళీయంగానే జరుగుతాయా? ఆ విజయం వెనుక జరిగిన మధనం, శ్రమ, ఆలోచనలను ఎవరూ పట్టించుకోరా?

అయితే నాస్త్యా వ్యక్తిగత దుఃఖాన్ని చాలికోవ్ రహస్యంగా చూస్తాడు. ఆమె కాలికి దెబ్బ తగిలి చాలా రోజులుగా కుంటుతూ నడుస్తుంటుంది. చాలికోవ్ ఆమెను కలవటానికి వచ్చి కిటికీలోనుండి చూస్తాడు. అప్పటికి ఆమెను అక్కడ నుండి పంపించి వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నాస్త్యా కాలికి కాపడం పెట్టుకుంటూ, కళ్ల నుండి పెద్ద పెద్ద కన్నీటి బిందువులు రాలుతుండగా ఏడుస్తుంటుంది. ఆమె స్వభావాన్ని అప్పటికి అర్ధం చేసుకొన్న చాలికోవ్ ఆమెను ఓదార్చాలనుకొంటాడు. ఆమె అలా బాలికలాగా ఉండటమే సహజమని చెప్పాలనుకొంటాడు. ఆ అవకాశం అతనికి యివ్వదు నాస్త్యా.

పూల దండలో దారంలాగా ప్రజలలో కలిసి పోయే నాస్త్యా చాలికోవ్ తదితరులతో ఉదాసీనంగానే, ప్రొఫెషనల్ గానే ఉంటుంది. చాలికోవ్ ఆమెతో ప్రేమలో పడతాడు. కధ ఇక్కడకు వచ్చాక నాస్త్యా ప్రేమలో పడకుండా ఎవరూ ఉండలేరు కదా. అలా అని ఆమెతో వాదనలు, తగాదాలు, పేచీలు ఆగవు. అయితే ఈ సారి అవి శత్రు పూరితంగా కాకుండా పరిష్కరించుకునే విధంగా జరుగుతాయి. ఆమెను ఒక స్నేహితురాలిలాగా కౌగలించుకోవాలని అనిపిస్తుందని చెబుతాడు చాలికోవ్. ఆమె అందంగా ఉంటుందని చెబుతూనే ఆమెలో ఏ భాగం అందంగా ఉంటుందో చెప్పలేకపోతాడు. అంటే చాలికోవ్ ప్రేమించేది ఆమె అందాన్ని కాదు, ఆమె వ్యక్తిత్వాన్ని అని మనకు అర్ధం అవుతుంది.

విప్లవ తదనంతరం రష్యా విజ్ఞానంలో, సాంకేతికతలో, వ్యవసాయంలో సాధించిన అభివృద్ధి వెనకాల లక్షలాది మంది నాస్త్యాలు అపరిచితంగా ఉన్నారు. అలాంటి వారు మన చుట్టుపక్కల కూడా అజ్ఞాతంగా తచ్చాడుతూ ఉంటారు. నిజానికి శ్రామిక మహిళల ప్రకృతే అది.

అయితే ఇంత గొప్ప వ్యక్తిత్వానికి ఒక మచ్చని పెట్టారు రచయిత్రి. ఒక సందర్భంలో బాగా పని చేయటం లేదని చాలికోవ్ మీద గౌను విసురుతుంది నాస్త్యా. చేతకాని వారిని స్త్రీలతో పోల్చటం రష్యాలో విప్లవానంతర కాలంలో కూడా ఉందనీ, నాస్త్యాలాంటి గొప్ప పాత్రను సృష్టించిన గలీనా నికోలయెవాకు కూడా అలాంటి దృష్టి ఉందని అర్ధం అయిన తరువాత విచారం కలుగుతుంది.

విప్లవ తదనంతరం రష్యా విజ్ఞానంలో, సాంకేతికతలో, వ్యవసాయంలో సాధించిన అభివృద్ధి వెనకాల లక్షలాది మంది నాస్త్యాలు అపరిచితంగా ఉన్నారు. ఆ మాటకొస్తే తెగువ, సాహసం, నిబద్ధత, కష్టపడేతత్వం కలిగిన కోట్లాది నాస్త్యాలు ప్రపంచం నిండా ఉన్నారు. అలాంటి వారు మన చుట్టుపక్కల కూడా అజ్ఞాతంగా తచ్చాడుతూ ఉంటారు. వారికి ఈ నాటి మార్కెట్ మాయాజాలం ఆపాదించే కృతిమ విలువలు ఉండవు. వ్యక్తిగత గుర్తింపు కోరుకోరు. నిజానికి శ్రామిక మహిళల ప్రకృతే అది. ఈ నవల చదివితే ‘అపరిచిత’ మూర్తిమత్వంలో ఆనందాన్ని ఆస్వాదించి ఆ ప్రవృత్తికి అలవాటు పడాలని బలంగా అనిపిస్తుంది.

చివరగా, ఈ నవల తెలుగు అనువాదం గురించి చెప్పకుండా ముగించటం అసంపూర్ణం అవుతుంది. నాస్త్యా పాత్రను ఆవిష్కరించటంలో అనువాదకులు అట్లూరి పిచ్చేశ్వరరావుగారి అద్వితీయ ప్రతిభ కనిపిస్తుంది. దేశీయ పదాలు ఈ నవలంతా వాడటం వలన ఇది అనువాద నవల అనిపించదు. ఈ కధ నడిచిన స్థల కాలాలు మన దేశానికి అన్వయిస్తే చక్కటి భారతీయ కధలాగానే ఉంటుంది. కథకూ, నాస్త్యా పాత్రకు ఆ సార్వజనీనతను సాధించి పెట్టటంలో పిచ్చేశ్వరరావుగారు సఫలం అయ్యారు. మొదట విశాలాంధ్ర వాళ్లు, తరువాత మహిళా మార్గం వాళ్లు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ప్రస్తుతం మహిళా మార్గం ప్రచురణ దొరుకుతుంది.

రమాసుందరి ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల మహిళాసంఘం ఉపాధ్యక్షురాలు. ‘మాతృక’ సంపాదకవర్గ సభ్యురాలు. ఈ పుస్తక పరిచయం డిశంబర్ 2015 మాతృకలో ‘వెలుతురు పిట్టలు’ శీర్షికన ప్రచురితమైంది. 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article