Editorial

Thursday, December 26, 2024
Opinionయాసీన్ మాలిక్ : గాయపడ్డ కశ్మీర్ కు అత్యవసర ఆక్సిజన్ - రమాసుందరి తెలుపు

యాసీన్ మాలిక్ : గాయపడ్డ కశ్మీర్ కు అత్యవసర ఆక్సిజన్ – రమాసుందరి తెలుపు

గాయపడ్డ కశ్మీర్ కు అత్యవసరమైన ఆక్సిజన్ యాసీన్ మాలిక్

రమాసుందరి

‘నా శరీరాన్ని పరిశీలిస్తే -హింస తాలూకూ గాయం లేని చోటు అందులో లేదు’ అన్నాడు నిన్న శిక్ష పడిన JKLF ఛైర్మన్ యాసీన్ మాలిక్. ఈ మాట ఆయన అరెస్టుకు ముందు అన్నాడు. అతనికి మే 25న NIA కోర్టు జీవిత ఖైదు శిక్షను వేసింది. జీవిత ఖైదు అంటే నిజంగా జీవితమంతా (చనిపోయేదాకా) అని కొత్త నిర్వచనం ఇస్తున్నారు. పెరోల్ ఉండదని కూడా అంటున్నారు. నిర్వచనాలు మనిషి మనిషికీ, ప్రాంత ప్రాంతానికీ మారుతూ ఉంటాయి.

ఈ శిక్ష ద్వారా భారత ప్రభుత్వం కశ్మీర్ లోయలోని ప్రతిఘటనా గొంతుకలను అన్నిటిని నులిపి వేసినట్లే భావిస్తోంది. బలం ద్వారా, హింస ద్వారా, ఆధిపత్యం ద్వారా, తమ మోచేతి నీళ్లు తాగే బానిస మీడియా అబద్దపు ప్రచారం ద్వారా కశ్మీర్ ను గెలుస్తున్నామని కళ్లు మూసుకొని విర్ర వీగుతున్న భారత పాలకులకు కావాల్సింది అక్కడ శాంతి స్థాపన ఏ మాత్రం కాదన్న సత్యం ఈ శిక్ష ద్వారా బయట పడింది. ఈ శిక్ష వేసిన NIA కోర్టును ఇటీవల భారత పాలక వర్గాలు సృష్టించాయని మర్చిపోకూడదు.

కశ్మీర్ విముక్తి పోరాటం అంటే గుర్తుకు వచ్చే వారిలో గత సెప్టెంబర్ లో చనిపోయిన సయ్యద్ ఆలీ షా గిలానీ సాబ్, అంతకు ముందు నుండే గృహ నిర్బంధంలో ఉన్న మిర్వైజ్ ఉమర్ ఫరూక్, జే‌కే‌ఎల్‌ఎఫ్ నాయకుడు యాసీన్ మాలిక్ ప్రధానంగా ఉంటారు. యాసీన్ మాలిక్ ను ఇక మీదట బయటకు కనిపించనీయకుండా చేసిన ఈ జుడీషియల్ తతంగాన్ని ప్రపంచమంతా మౌనంగా చూసింది.

భారతదేశంలో కొన్ని వర్గాలు ఈ తీర్పును పండగ చేసుకొన్నాయి కూడా. ఒక్క యూకే పార్లమెంటు మాత్రం యాసీన్ మాలిక్ విడుదలకు ప్రయత్నం మొదలు పెట్టింది. ఈ ప్రయత్నాలు ప్రపంచం అంతా పాకకుండా హడావుడిగా అతన్ని దోషిగా నిర్ణయించి శిక్షను ఖరారు చేశారు.

పసి కూతురికీ, సహచరికీ, తాను ఎంతగానో ప్రేమించిన మాతృభూమి కశ్మీర్ కీ అందనంత దూరంలో -జైల్లో ఉండేంత తప్పు యాసీన్ మాలిక్ ఏమి చేశాడు?

2019 సంవత్సరం మార్చి 1న, అతని 10వ వివాహ వార్షిక దినాన -చివరిసారిగా ‘ఉగ్రవాద నిధుల సేకరణ చేశాడంటూ’ యాసిన్ మాలిక్ అరెస్టు చేశారు. ‘ఎక్కడకు వెళుతున్నావు నాన్న’ అని అడిగిన ఐదేళ్ల కూతురికి ‘చాలా దూరం వెళుతున్నానని’ సమాధానం చెప్పాడు యాసీన్ మాలిక్. అన్నట్లే అది చాలా దూరం అయింది. బహుశా ఒక జీవితకాల దూరమేమో. పసి కూతురికీ, సహచరికీ, తాను ఎంతగానో ప్రేమించిన మాతృభూమి కశ్మీర్ కీ అందనంత దూరంలో -జైల్లో ఉండేంత తప్పు యాసీన్ మాలిక్ ఏమి చేశాడు? రెండు శత్రు దేశాలు పంచుకొన్న తన మాతృభూమికి సంయుక్తంగా విముక్తి కలగాలని కోరుకోవటమే అతని తప్పేమో! ఎన్నికల పేరిట ప్రచారంలో ఉన్న భారత ప్రజాస్వామ్యపు బండారాన్ని బయట పెట్టటమే అతని నేరమేమో!

యాసీన్ మాలిక్ కశ్మీరీ ప్రతిఘటనా పోరాట నాయకుడు. 1966లో శ్రీనగర్ నడిబొడ్డున పుట్టిన యాసీన్ మాలిక్ కశ్మీర్ అత్యంత సంక్షోభ కాలంలో పెరిగాడు అక్కడ. ఆ కాలంలో పుట్టి పెరిగిన పిల్లల జీవన ప్రయాణాన్ని నిర్దేశించినది తల్లిదండ్రులు కాదు. ఆ ప్రాంత అల్లకల్లోల రాజకీయ పరిస్థితులు. వాళ్లను ఉగ్రవాదులు అన్నా, ఫండమంటలిస్టులు అన్నా-ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరు ఎలా పిలుచుకొన్నా -ఆనాటి రాజకీయ భౌతిక పరిస్థితులే వాళ్ల రాజకీయ కార్యాచరణను శాసించాయి అనటం వాస్తవం.

యాసీన్ మాలిక్ ప్రయాణం కూడా అలాగే మొదలయ్యింది. అతని జీవిత చరిత్ర అంటే కొంతవరకు జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చరిత్రే. చిన్నతనం నుండే తన దేశంలో పెత్తనం సాగిస్తున్న సైన్యపు ఉనికిని అసహ్యించుకోవటం మొదలు పెట్టాడు. ఇంటర్ మీడియట్ లోనే స్వతంత్ర కశ్మీర్ కోసం స్టిక్కర్లు ముద్రిస్తూ అరెస్టు అయ్యి, 1986లో రెడ్ సిక్స్టీన్ అనే విచారణ కేంద్రంలో 15 రోజులు, పోలీస్ లాకప్ లో 3నెలలు ఉన్నాడు. టాక్సీ డ్రైవర్ల మీద ఆర్మీ చేసిన దాష్టీకాన్ని విద్యార్థిగానే ఎదిరించాడు యాసీన్ మాలిక్. తాల్ అనే పార్టీని పెట్టి, కొన్ని కార్యకలాపాలను కొనసాగించాడు. ఆ సంస్థ కశ్మీర్ లో చాలా పాపులర్ అయ్యింది. తరువాత ఇస్లామిక్ స్టూడెంట్స్ లీగ్ (ISL) గా తన పార్టీ పేరును మార్చాడు.

1987లో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (MUF) లో తన పార్టీని భాగం చేశాడు. MUF అనేక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. మాలిక్ కి ఎన్నికల మీద నమ్మకం లేకపోయినా మహమ్మద్ యూసుఫ్ షా అనే అభ్యర్ధి కోసం పని చేశాడు. అతను అత్యంత మెజారిటీ గెలుస్తాడని ఓటింగ్ చెబుతూ ఉండగా, ఆనాటి భారత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి (ఇది షేక్ అబ్ధుల్లా పార్టీ) గులాం మొహిద్దీన్ గెలిచినట్లు ప్రకటించారు. ఫలితాలు బయటకు రాగానే యూసుఫ్ షా తో పాటు యాసీన్ మాలిక్ ను కూడా కౌంటింగ్ హాల్ లోనే అరెస్టు చేసి జైల్లో పెట్టారు. విపరీతమైన హింసా పద్దతులు ఉపయోగించటం వలన, అతని రక్తం కలుషితం అయ్యింది. శ్రీనగర్ పోలీస్ హాస్పిటల్ లో చేర్చాల్సి వచ్చింది. అక్కడే అతని హార్ట్ వాల్వ్ డామేజ్ అయ్యిందని చెప్పారు. అతన్ని PSA కింద అదుపులో ఉంచుకొన్నారు.

కశ్మీర్ లో అహింసాయుత రాజకీయ కార్యకర్తలకు ఎలాంటి స్థానం లేదని అర్థం అయ్యింది. మేము JKLF పేరుతో తప్పని సరిగా ఆయుధాలు పట్టుకోవాల్సి వచ్చింది’ అని తను ఇటీవల జైలు నుండి రాసిన ఒక బహిరంగ లేఖలో పేర్కొన్నాడు.

1987లో కశ్మీర్ లో జరిగిన ఈ ఎన్నికల ప్రహసనం కశ్మీర్ లో అనేకమంది యువకుల జీవితాలను మార్చివేసింది. ప్రజాస్వామ్యం మీద పూర్తి విశ్వాసాన్ని వారు కోల్పోయి, కశ్మీర్ ను రెండుగా చీల్చిన విభజన రేఖ వైపు ఆయుధాలు పట్టుకోవటానికి తరలి వెళ్లారు. జైలు నుండి బయటకు వచ్చిన యాసీన్ మాలిక్ కూడా అలాగే వెళ్లాడు. ‘గాంధీని, మార్టిన్ లూథర్ కింగ్ నీ, నెల్సన్ మండేలా ను మార్గదర్శకులగా తీసుకొనే ఈ దేశం ఆ పద్దతులకు గౌరవం ఇవ్వటం లేదని అర్థం చేసుకొన్నాము. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, అశ్ఫక్ ఉల్లా, రామ్ ప్రకాష్ బిస్మిల్, రాజ్ గురు మొదలైన వాళ్లు ఒక వర్గాన్ని నడుపుతుంటే -గాంధీ ఇంకో మార్గానికి నాయకత్వం వహించాడు. మొదటి వర్గాన్ని అణచివేసిన బ్రిటిష్ ప్రభుత్వం, గాంధీని అరెస్టు చేసినా హింసా కేంద్రాలకు పంపలేదు. గాంధీ శాంతియుత ఉద్యమానికి న్యాయమైన స్థానాన్ని ఇచ్చారు బ్రిటిష్ వాళ్లు. కాంగ్రెస్ పార్టీ ప్రెషర్ కుకర్ లో గాలి బయటకు పోయే మార్గాన్ని ఇచ్చిందని పొగిడారు. కానీ ఇక్కడ కశ్మీర్ లో, అహింసాయుత రాజకీయ కార్యకర్తలకు ఎలాంటి స్థానం లేదని అర్థం అయ్యింది. మేము JKLF పేరుతో తప్పని సరిగా ఆయుధాలు పట్టుకోవాల్సి వచ్చింది’ అని తను ఇటీవల జైలు నుండి రాసిన ఒక బహిరంగ లేఖలో పేర్కొన్నాడు.

యాసీన్ మాలిక్ ఆయుధాలు వదిలి గాంధేయ పద్దతుల వైపు రావటానికి ఎంత బలమైన కారణాలు ఉన్నా -అలా రావటం ఆయనకూ, ఆయన సంస్థకూ తీవ్రమైన నష్టాన్ని తెచ్చింది.

యాసీన్ మాలిక్ పాకిస్తాన్ వైపు వెళ్లక ముందు హిజ్బ్ -ఉల్ -ముజాహిద్దీన్ అనే సాయుధ సంస్థకు నాయకత్వం వహించాడు. వచ్చాక JKLF (జమ్మూ కశ్మీర్ లిబెరేషన్ ఫ్రంట్)లో ముఖ్య సభ్యుడు అయ్యాడు. HAJY గ్రూపుగా పిలవబడే ప్రధాన JKLF విభాగంలో హమీద్ షేక్, అశ్ఫక్ వాని, జవీద్ అహమ్మద్ మిర్, యాసీన్ మాలిక్ లు కీలక పాత్ర వహించారు. జమ్ము కశ్మీర్ కు సర్వ స్వతంత్ర్యం కావాలనేది ఈ సంస్థ డిమాండ్. గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించిన ఈ సంస్థ, ముఫ్తి మహమ్మద్ సయీద్ (అప్పటి భారతీయ హోమ్ మినిస్టర్) కూతురు రుబియా సయీద్ ను కిడ్నాప్ చేసింది. తమ డిమాండ్స్ నెరవేరాక ఆమెను వెంటనే విడిచి పెట్టారు. ఆమె వదలటానికి వాళ్లు అడిగింది నలుగురు JKLF నాయకులను విడుదల చేయమనే. అప్పటికి ఆఫ్ఘనిస్తాన్ నుండి సోవియట్ సైన్యం వెనుతిరగటం, ఇరానియన్ విప్లవం మొదలవటం -JKLF మీద ప్రభావం చూపాయి.

అయితే యాసీన్ మాలిక్ ఆయుధాలు వదిలి గాంధేయ పద్దతుల వైపు రావటానికి ఎంత బలమైన కారణాలు ఉన్నా -అలా రావటం ఆయనకూ, ఆయన సంస్థకూ తీవ్రమైన నష్టాన్ని తెచ్చింది. మార్చ్ 1990 నాటికి JKLF సభ్యులు వందలాది మంది హతులు అయ్యారు. లొంగిపోవటానికి వెళ్లిన వారిని కూడా ఆర్మీ చంపేసింది. భారత్, పాకిస్తాన్ లతో సంబంధం లేకుండా సర్వస్వతంత్ర్య కశ్మీర్ కోసం నిలబడటంతో -JKLF కు పాకిస్తాన్ నిధులు ఆపేసింది. అశ్ఫక్ వాని ఈ యుద్ధంలో 1990లోనే అమరుడు అయ్యాడు. గాయపడిన పరిస్థితుల్లో యాసీన్ మాలిక్ పట్టుపడ్డాడు. అలా మొదటి సారి యాసీన్ మాలిక్ ను ఫైల్ చేసింది భారత ప్రభుత్వం.

జైల్లో ఆయనతో అనేక మంది ఆఫీసర్లు, రాజకీయ నాయకులు మాట్లాడారు. అప్పటి ప్రధాన మంత్రి చంద్రశేఖర్ తో డిన్నర్ కు రమ్మని బలవంతం చేశారు. యాసీన్ మాలిక్ ఒప్పుకోలేదు. అతని ఆరోగ్యం దెబ్బతినటంతో AIIMS కు పంపారు. అక్కడే మళ్లీ హార్ట్ సర్జరీ జరిగింది. అక్కడ కుల్ దీప్ నయ్యర్, రాజ్ మోహన్ గాంధీ యాసీన్ మాలిక్ ను చూడటానికి వచ్చారు. అనేక రాష్ట్రాల గవర్నర్లు వచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా వచ్చారు. ఒక మీటింగ్ లో అప్పటి హోమ్ మంత్రి రాజేష్ పైలెట్ కూడా యాసీన్ మాలిక్ తో మాట్లాడి కశ్మీర్ గురించి తెలుసుకొన్నారు. వారంతా కశ్మీర్ లో శాంతి స్థాపనకు ఇంకో అవకాశం ఇవ్వమని యాసీన్ మాలిక్ ను కోరారు. కశ్మీర్ లో శాంతియుత రాజకీయ పోరాటం మీద ప్రభుత్వం ప్రయోగించిన హింస వలన ఇదంతా జరిగిందన్న యాసీన్ మాలిక్ వాదనను అంగీకరించినట్లే కనిపించారు. విషయాలు తమకు సరిగ్గా తెలియలేదని పశ్చాత్తాపాన్ని ప్రకటించారు.

బయటకు వచ్చిన యాసీన్ మాలిక్ ఆయుధాలను వదిలివేస్తున్నామని ప్రకటించాడు. అప్పటి నుండి గాంధేనియన్ పద్దతుల్లో కార్యకలాపాలను చేస్తున్నా -JKLF కశ్మీర్ కు విముక్తి కావాలనే తమ లక్ష్యాన్ని మాత్రం విడువలేదు. ఆయుధాలు వదిలి వేయాలన్న నిర్ణయం అతనికి చాలా చెడ్డ పేరు తెచ్చింది. ప్రమాదకరం కూడా అయ్యింది. అతన్ని విద్రోహి అన్నారు. కొంతమంది మిలిటెంట్లు అతన్ని కిడ్నాప్ కూడా చేసారు. అనేకమంది అతని సహచరులు ప్రాణాలు కోల్పోయారు. అయినా అదే నిర్ణయం మీద యాసీన్ వర్గం గట్టిగా నిలబడింది. ఆయన ఆయుధాలు వదిలే సమయానికి 20000 మంది సభ్యులు కశ్మీర్ లో ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. JKLF లో చీలిక వచ్చి 2004 వరకూ ఒక వర్గం ఆయుధ పోరాటాన్ని కొనసాగించింది.

నరేంద్ర మోడి మొదటి ఐదు సంవత్సరాల పాలనలో కూడా మా మీద ఎలాంటి నిర్బంధం లేదు. కానీ హటాత్తుగా 2019లో నా మీద 30 ఏళ్ల క్రితం కేసును తిరగదోడారు.

అటల్ బీహార్ వాజ్ పాయ్ 2000లో జరిపిన ఇంకో రంజాన్ ఆయుధ విరమణ చర్చల్లో కూడా యాసీన్ మాలిక్ వర్గం పాల్గొన్నది. ఇప్పటి NSA చీఫ్ అజిత్ కుమార్ దోవల్ కూడా అప్పుడు యాసీన్ మాలిక్ ను కలిసిన వాళ్లలో ఉన్నాడు. వాళ్ల ప్రతిపాదనకు మనస్ఫూర్తిగా అంగీకరించి, 2002లో శాంతియుత పోరాటం కోసం కశ్మీర్ లో సంతకాల సేకరణ మొదలుపెట్టారు. రెండున్నర సంవత్సరాలు కశ్మీర్ లోని ప్రతి గ్రామానికి, బడులకు, యూనివర్శిటీలకు తిరిగి 15 లక్షల సంతకాలు సేకరించారు. 2006లో ప్రధాన మంత్రిగా ఉన్న మన్ మోహన్ సింగ్ కు ఈ సంతకాలను సమర్పించి, చర్చలు చేయమని అభ్యర్ధించారు. 2009లో చిదంబరం మళ్లీ కొన్ని ప్రయత్నాలు చేశాడు. 2010లో అన్ని పార్టీల పార్లమెంటరీ డెలిగేషన్ కశ్మీర్ కు వచ్చింది. కశ్మీర్ లో శాంతి నెల్కొల్పటానికి యాసీన్ మాలిక్ బృందం చేసిన ఆ ప్రయత్నాలనన్నిటికి భారత ప్రభుత్వం విఫలం చేసింది.

ఆయుధాలు వదిలిన తరువాత కూడా యాసీన్ మాలిక్ అనేక సార్లు అరెస్టు అవుతూ వచ్చాడు. కశ్మీర్ విషయంగా ఇండియా, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్లతో అనేక సార్లు చర్చలు జరిపాడు. సఫర్-ఇ- ఆజాదీ (విముక్తి కోసం ప్రయాణం) అనే ప్రచారాన్ని చేపట్టాడు. కశ్మీర్ ప్రజలను మోసం చేసిన ప్రధాన స్రవంతి పార్టీలకు భిన్నంగా యాసీన్ మాలిక్ పూర్తిగా కశ్మీర్ మనోభావాల పక్షానే ఉన్నాడు. ఆర్టికల్ 370 రద్దుకు ముందే మళ్లీ 30 పాత కేసులు తిరగదోడి ఆయనను అరెస్టు చేసింది బీజేపీ ప్రభుత్వం. అందులో రుబియా సయీద్ కిడ్నాపింగ్ కేసు కూడా ఉంది. ఆయన మీద కొత్తగా మార్చి నెలలో టాడా, ఇతర టెర్రరిస్టు కేసులను పెట్టారు.

టార్చర్ తో వినికిడి శక్తి కోల్పోయిన ఒక చెవితో, ముఖానికి పక్షవాతంతో, చిల్లులు పడ్డ గుండెతో పర్వతంలాగా యాసీన్ మాలిక్ కశ్మీర్ కోసం జైల్లో నిలబడే ఉంటాడు.

తీహార్ జైల్లో ఉన్న యాసీన్ మాలిక్ 2020, ఏప్రిల్ 1నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించాడు. తన మరణం తరువాత తన శరీర అవయవాలను దానం ఇవ్వమని కోరాడు. తీహారు జైలు నుండి ఆయన రాసిన లేఖను ఆయన సోదరి అప్పుడు విడుదల చేసింది. ఆ లేఖలో ఆయన ‘1994 నుండి ఇప్పటి వరకూ మేము JKLF గా కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఎంతో కృషి చేశాము. గత 30 సంవత్సరాలుగా మా JKLF లో ఎవరూ ఎలాంటి సాయుధ గ్రూపు చర్యలను సపోర్ట్ చేయలేదు. ఈ కాలంలో మా మీద ఎలాంటి కేసులు కూడా లేవు. పీవీ నరసింహారావు, హెచ్ డి గౌడ, ఐ కె గుజ్రాల్, అటల్ బీహార్ వాజ్ పేయి ప్రధాన మంత్రులుగా ఉన్నపుడు, 1994లో ఇచ్చిన ప్రమాణాన్ని వారు గౌరవించారు. నరేంద్ర మోడి మొదటి ఐదు సంవత్సరాల పాలనలో కూడా మా మీద ఎలాంటి నిర్బంధం లేదు. కానీ హటాత్తుగా 2019లో నా మీద 30 ఏళ్ల క్రితం కేసును తిరగదోడారు. నా సహచరులతో పాటు నా మీద టాడా కేసు పెట్టారు. టాడా కోర్టు ముందు హాజరు పర్చకుండా నన్ను సిబిఐ ఆపుతోంది. వీడియో లింక్ కాన్ఫరెన్స్ జర్పుతున్నారు. దాని ద్వారా నేను నా తరఫు వాదనలను వినలేకపోతున్నాను. నేను మాట్లాడాలి అనుకొన్నపుడు వాల్యూమ్ ను మ్యూట్ చేస్తున్నారు. లేక ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోతున్నారు. జడ్జి కూడా పోలీస్ ఆఫీసర్ లాగానే వ్యవహరిస్తున్నాడు. రాజకీయ ఉద్దేశాలు ఉన్న ఈ కేసును జడ్జీలు ఇంకా అధ్వానంగా కఠినతరం చేస్తున్నారు’ అని రాశాడు.

‘అందుకే నేను ఏప్రిల్ 1 నుండి ఆమరణ నిరాహారదీక్షకు వెళుతున్నాను. 1994లో నాకు భారత ప్రభుత్వం చేసిన ప్రమాణాన్ని గౌరవించనందుకు ఈ నేను ఈ నిర్ణయం తీసుకొన్నాను. ఈ అగౌరవ జీవితం కంటే గౌరవప్రద మరణం మేలనుకొంటున్నాను. నా కీలక అవయవాలను నా మరణం తరువాత అవసరం అయినవారికి దానం చేయమని ఇంతకు ముందే రాశాను. నా చివరి కోర్కెను అందరూ గౌరవిస్తారని భావిస్తున్నాను. నా నిరాహారదీక్షలోనే నా ఆఖరు శ్వాస ఆగాలని నేను కోరుకొంటున్నాను. ప్రతిఘటనా పోరాటం వర్ధిల్లాలి. విముక్తి పోరాటం వర్ధిల్లాలి’ అని ముగిస్తూ -తీహార్ జైలు నంబర్ 7 నుండి తన లేఖను బయటకు పంపించారు. అయితే జైలు అధికారులు అతని నిరాహారదీక్షను బలవంతంగా విరమింప చేశారు.

43 ఏళ్ల వయసులో ఆలస్యంగా పాకిస్తాన్ పాలిత కశ్మీర్ లో నివసించే గాయని మషాల్ హుస్సైన్ ను యాసీన్ మాలిక్ పెళ్లి చేసుకొన్నాడు. వారికో పాప. మషాల్ హుస్సైన్ యాసీన్ మాలిక్ విడుదలకు సర్వ విధాలా ప్రయత్నం చేస్తోంది.

ఆయన తన తప్పును ఒప్పుకొని వదిలివేయమని కోర్టును అభ్యర్ధించాడని భారత మీడియా ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తోంది. నిజానికి ఆయన తన మీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ వాదించుకోవటానికి ఇష్టపడలేదు. శ్రీనగర్ లాయర్స్ అసోసియేషన్ ముందుకు వచ్చినా ఎందుకో అంగీకరించలేదు. ఆయనకు కలిగిన విరక్తికి కారణాలు స్పష్టంగానే ఉన్నాయి. యాసీన్ మాలిక్ ను అన్ని విధాలుగా ఫైల్ చేశాయి భారత పాలక వర్గాలు. కశ్మీర్ సంఘర్షణకు అంతిమ గీతం పాడాలంటే అర్థవంతమైన చర్చలు జరగాలని ప్రతిపాదించిన వాడు యాసీన్ మాలిక్. కశ్మీర్ ను చూపించి ఓట్లు దండుకొనే ప్రభుత్వాలకు ఈ ప్రతిపాదనలు మింగుడు పడవు. ఇప్పటి అతిశయ హిందుత్వ బీజేపీ ప్రభుత్వానికి అసలు నచ్చదు. పది లక్షల సైన్యం కశ్మీర్ లో జరిపించే నిత్యం రక్తపాతం చూడకుండా అది నిద్ర పోదు. టార్చర్ తో వినికిడి శక్తి కోల్పోయిన ఒక చెవితో, ముఖానికి పక్షవాతంతో, చిల్లులు పడ్డ గుండెతో పర్వతంలాగా యాసీన్ మాలిక్ కశ్మీర్ కోసం జైల్లో నిలబడే ఉంటాడు.

43 ఏళ్ల వయసులో ఆలస్యంగా పాకిస్తాన్ పాలిత కశ్మీర్ లో నివసించే గాయని మషాల్ హుస్సైన్ ను యాసీన్ మాలిక్ పెళ్లి చేసుకొన్నాడు. వారికో పాప. మషాల్ హుస్సైన్ యాసీన్ మాలిక్ విడుదలకు సర్వ విధాలా ప్రయత్నం చేస్తోంది. ‘మోడి, నువ్వు యాసీన్ మాలిక్ ను జయించలేవు. అతని పేరు ఆజాదీ. ఈ అన్యాయమైన తీర్పుకు భారత్ తప్పక పశ్చాత్తాప పడుతుంది’ అంటున్నారామె. యాసీన్ మాలిక్ విడుదల కోసం ఇరు కశ్మీర్ లలో పెద్ద ఎత్తున ప్రదర్శనలు జరిగాయి.

యాసీన్ మాలిక్ ఒక ప్రసంగంలో ప్రముఖ గాంధేయవాది జయప్రకాష్ మాటలను కోట్ చేశారు. ‘నా దేశభక్తిని నా ప్రజలు అనుమానించినా సరే. నేను నిజాలు చెబుతాను. కశ్మీర్ లో జరుగుతున్న ఎన్నికలు నకిలివి. కశ్మీర్ ప్రజలకు మనం వాగ్దానం చేసిన న్యాయమైన ఎన్నికలను ఎప్పుడు జరిపిస్తాము?’ అని జయప్రకాష్ 1962లో రాసిన ఒక వ్యాసంలో అడిగారు.

నిత్య రక్తపాతంలో మునిగి తేలుతున్న కశ్మీర్ కు ఊపిరి ఆడాలంటే మొదట అక్కడ ప్రజాస్వామిక వాతావరణం ఉండాలని ఒకప్పటి ‘రా’ అధికారి ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఆ వాతావరణం రావటానికి మొదటి అడుగు యాసీన్ మాలిక్ విడుదల.

అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ ఈ ప్రశ్నకు సార్వజనీయత ఉంది. కశ్మీర్ సమస్య పరిష్కారానికి నిజాయితీగా ప్రయత్నించేవారికి యాసీన్ మాలిక్ బయటకు రావాలని తప్పక తెలిసి ఉండాలి. నిత్య రక్తపాతంలో మునిగి తేలుతున్న కశ్మీర్ కు ఊపిరి ఆడాలంటే మొదట అక్కడ ప్రజాస్వామిక వాతావరణం ఉండాలని ఒకప్పటి ‘రా’ అధికారి ఏ ఎస్ దౌలత్ నిన్న మొన్న ‘ద వైర్’ కిచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఆ వాతావరణం రావటానికి మొదటి అడుగు యాసీన్ మాలిక్ విడుదల. అతని విడుదలకు ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి. డిప్లమేటిక్ చానల్స్ తెరిచే ఉన్నాయి. చర్చలు అసంపూర్ణంగా ఉన్నాయి. ఇంకా పై కోర్టులు ఉన్నాయి. కావాల్సింది చిత్తసుద్దే. అదే కనబడటం లేదు.

రమాసుందరి ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల మహిళాసంఘం ఉపాధ్యక్షురాలు. ‘మాతృక’ సంపాదకవర్గ సభ్యురాలు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article