Editorial

Wednesday, January 22, 2025
Serialనేటి నుంచి తెలుపు డైలీ సీరియల్ - రక్ష : డా.వి.ఆర్.శర్మ నవల

నేటి నుంచి తెలుపు డైలీ సీరియల్ – రక్ష : డా.వి.ఆర్.శర్మ నవల

రక్ష : మొదటి భాగం

“ఈ ప్రపంచంలో
మనకు కనబడనిది, మనకు వినబడనిది, మన స్పర్శకు అందనిది మన చుట్టూ చాలా ఉంది.”
నమ్మలేని విషయాలను నమ్మిస్తూ నడుస్తున్న కాలం ఇది.

డా.వి.ఆర్.శర్మ

Rakshaతెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ఒక జిల్లా కేంద్రానికి సుమారు ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న ఊరు అది. ఊరు చిన్నదే కానీ, దానికి ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని పాలించిన ఒక సంస్థానాధీశుడు నిర్మించిన ఊరు అది. ఆయన తన పిల్లల పేర్లతో, కుటుంబ సభ్యుల పేర్లతో ఇలాంటి ఊర్లు తన సంస్థానంలో పదిహేను వరకు కట్టించాడు. ఆ ఊరి చుట్టూ పచ్చటి అడవి, చిన్నచిన్న గుట్టలు, అక్కడక్కడా కనిపించే సెలయేళ్లు, ఎక్కడి నుంచో పారుతూ ఆ ఊరి పొలిమేరల్లోంచి సాగిపోతున్న ఒక పెద్ద వాగు. అందమైన ప్రకృతి విడిదిలాగా ఉంటుంది ఆ చోటు. అందుకేనేమో, ఆ సంస్థానాధీశుడు అక్కడ తన కోసం ఒక విడిదిని కూడా కట్టుకున్నాడు.

నిజాముల పాలనలో కొంత కాలం ఆ భవంతి పన్నులు వసూలు చేసే కార్యాలయంగా పని చేసిందట. తరవాత కాలంలో పంతొమ్మిది వందల తొంబై వరకు దానిలో పాఠశాల కూడా నడిచిందట. దానికి వారసులైన వాళ్లు దానిని పాఠశాల కోసం దానం చేసి, హైదరాబాద్కు వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం అది సగం కూలిన గోడలతో, విరిగిపోయిన తలుపులతో, శూన్యమైన గదులతో శిథిలమై మరణానికి దగ్గర అవుతున్న ఒక ముసలి రోగిష్టిలా కనిపిస్తోంది. దానికి చుట్టూ అరాచకంగా పెరిగిన ముళ్లపొదలు, అక్కడక్కడా కానుగ, మద్ది, గుల్మొహర్, నీలగిరి చెట్లు కనిపిస్తున్నాయి. దానికి కొంచం పక్కన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. అది ఊరికి చివరలో పడమటి వైపున ఉంది. దాని చుట్టూ చేలూ, తోటలూ ఉన్నాయి. కొంత దూరంలో చెరువూ, దానిలోంచి వస్తున్న రెండు కాలవలు, చెరువుకు పై భాగంలో సన్నగా ప్రారంభమౌతున్న అడవి కనిపిస్తున్నాయి. అడవి అంచున ఉన్న పాఠశాల అది.

రక్ష : ఇది పిల్లల సైన్స్ ఫిక్షన్ నవల. తానా – మంచి పుస్తకం సౌజన్యంతో ప్రచురణ. రచయిత డా.వి.ఆర్.శర్మ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కామారెడ్డి వాస్తవ్యులు. తెలుగు భాష బోధనతో తన ఉద్యోగ జీవితాన్ని సార్థకం చేసుకున్న శర్మ గారు బాల సాహిత్యానికి చేసిన సేవ అమూల్యమైనది. వారు అనేక సాహిత్య సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ స్వయానా తానే ఒక సంస్థ అనడం సముచిత గౌరవం. ‘సాహు జీవితం – రచనలు’ వారు ఎం.ఫిల్ పరిశోధనాంశం కాగా ‘ఆధునిక కవిత్వంలో బాల్య చిత్రణ’పై వారు పి.హెచ్ డి చేయడం మరో విశేషం. మీరు చదివే ‘రక్ష’ పిల్లక కోసం వారు రాసిన సైన్స్ ఫిక్షన్ నవల. ఇప్పటివరకు శర్మ గారు 8 కవిత సంపుటులు,  4 పాటల పుస్తకాలు, రక్ష నవలతో కలిపి 4 నవలలు వెలువరించారు. వారి పూర్తి పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రచయిత ఇ – మెయిల్ : dr.v.r.sharma@gmail.com 

గతకాలపు ఆ శిథిల భవనాన్నీ, చెట్లనూ లోపలికి కలుపుకుంటూ, చుట్టూ పాఠశాల ప్రహరీగోడ కట్టారు. ఇటీవలే నిర్మించిన ఆ గోడకు ఇంకా సున్నం వేయలేదు. ఆ గోడకు తూర్పు చివర పాఠశాలకు చెందిన ఆరు గదులు ఉన్నాయి. వాటికి కొంత ఎడమగా మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా కట్టిన చిన్న వంటగది ఉంది. పడమటి వైపున తాళం వేయకుండా, సగం తెరిచి ఉంచిన ఇనుప గేటు కనిపిస్తోంది. ఆ గేటు దాటితే, లోపలి దిక్కు ఎడమ వైపున మూడు గదులు ఉన్నాయి. అవి ప్రాథమిక పాఠశాలకు చెందిన తరగతి గదులు. వాటికి కొంత దూరంలో మరో చిన్న వంటగది ఉంది. మూడు ఎకరాల వైశాల్యంతో ఉన్న ఆ పాఠశాల ఆవరణలో అంతటా రాలిపడిన చెట్ల ఆకులు, మట్టి, చెత్తా చెదారం చూస్తే, చాలా రోజులుగా ఆ బడిని తెరవలేదనే విషయాన్ని తెలియచేస్తున్నట్టు ఉన్నాయి.

“రక్షా! లోపలికి పోదామా?” అంది లంగా ఓణీ వేసుకున్న అమ్మాయి, ఆమె పేరు చామంతి. సరే అన్నట్టు తల ఊపుతూ, ముందుకు కదిలింది రక్ష.

అది జనవరి నెల. పుష్యమాసం మొదలై, తెల్లవారితే సంక్రాంతి పండుగ. ‘సంక్రాంతికి చంకలు లేవనీయకుండా చలి ఉంటుందని, శివరాత్రికి శివ శివా అనుకుంటూ వెళ్లిపోతుందని’ పల్లెల్లో చెప్పుకుంటారు. కానీ ఈ సంవత్సరం జనవరి మొదటి వారానికే చలి దాదాపు తగ్గిపోయింది. ఉదయం తొమ్మిది గంటలు కావస్తోంది. ఎవరో ఇద్దరు నడివయసు ఆడవాళ్లు, ఒక మగమనిషి మాట్లాడుకుంటూ వ్యవసాయ పనులకు సంబంధించిన సామాన్లతో ఆ పాఠశాల గేటులోంచి లోపలికి నడుస్తూ వచ్చి, వెనక వైపున్న గోడపైన సామాను ఉంచి, ప్రతి రోజు లాగే ఆ గోడ పైకి ఎక్కి, అటువైపు దిగి, తమ పొలాలకు వెళుతున్నారు. వాళ్లకు కొంత దూరంలో, వెనక నుంచి నలుగురు పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు.
వాళ్లు గేటు దగ్గర కొద్దిసేపు నిలబడ్డారు. తాము వేసుకున్న మాస్కులను తీసి చేతుల్లో పట్టుకున్నారు. వాళ్లంతా పద్నాలుగు, పదిహేనేళ్ల పిల్లలు. వాళ్లలో చుడీదార్ వేసుకున్న అమ్మాయి తల ఎత్తి పాఠశాల బోర్డులను చూసింది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అని ఒకదాని మీద, ప్రభుత్వ ఉన్నత పాఠశాల అని రెండవ బోర్డు మీద రాసి ఉన్నాయి. అలా కొంతసేపు ఆ బోర్డులను చూసి, తరవాత గేటును తన చేతులతో ముట్టుకుంది. అక్కడే ఆగి, పాఠశాల పరిసరాలనూ, చెట్లనూ, గదులనూ చూస్తూ నిలబడింది. ఆ చూపులో ఎంతో ఆత్మీయత, ఆప్యాయత నిండి ఉన్నాయ్. ఆ పిల్ల కళ్లల్లో సంతోషం పొంగిపోతోంది. ఐదవ తరగతి వరకు ఆమె చదువుకున్న పాఠశాల అది. అప్పటి జ్ఞాపకాలు ఎన్నో ఆమెను పరిమళాల్లా చుట్టుముడుతున్నాయ్. “రక్షా! లోపలికి పోదామా?” అంది లంగా ఓణీ వేసుకున్న అమ్మాయి, ఆమె పేరు చామంతి. సరే అన్నట్టు తల ఊపుతూ, ముందుకు కదిలింది రక్ష.

ఆ పిల్లలు గేటు దాటి లోపలికి ప్రవేశించారు. లోపలికి వెళ్లగానే ఎడమకు తిరిగి, తాను చదువుకున్న ప్రాథమిక పాఠశాల వైపు దారి తీసింది రక్ష. మిగతా ముగ్గురు ఆమెను అనుసరించారు. అన్ని గదులకూ తాళాలు వేసి ఉన్నాయి. వాటి కిటికీలు మాత్రం తెరిచే ఉన్నాయి. “మనం చదువుకున్నప్పుడు ఐదో తరగతికి మాత్రమే బెంచీలు ఉండేవి కదా. ఇప్పుడు మూడు, నాలుగవ తరగతికి కూడా వచ్చాయి,” ఆ తరగతి కిటికీలోంచి లోపలికి చూపిస్తూ చెప్పాడు రవి. మూడూ, నాలుగవ తరగతులు కలిపి ఒక గదిలో, ఒకటీ, రెండవ తరగతులు కలిపి ఒక గదిలో ఉన్నాయి. మధ్యలో ఉన్న గదిలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఐదవ తరగతి పిల్లలూ ఉంటారు. “అదే ఐదవ తరగతి గది, అదే ఆఫీసు గది. అప్పుడు కూడా అలాగే ఉండేది,” రక్ష కిటికీల్లోంచి లోపలికి చూస్తూ, తన చిన్ననాటి విషయాలన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ వాళ్లతో చెపుతోంది. వాళ్లు కూడా అప్పటి విషయాలు గుర్తు చేసుకుంటూ ఆ కాలంలోకి వెళ్లిపోయారు. “మనం ఆ బిల్డింగ్ లోపల దాగుడు మూతలు ఆడుకునే వాళ్లం కదా,” అటు చివర కనబడుతున్న పాతకాలపు భవనాన్ని చూపిస్తూ అంది రక్ష.

“ఔను కదా! వెళ్లి చూద్దామా?” అడిగింది చామంతి. “అక్కడ అంతా గబ్బు వాసన, పాములు ఉంటాయి,” అన్నాడు రవి. “ఏం కాదు. వెళ్లి చూద్దాం,” అంటూ రక్ష అభిప్రాయం కోసం చూసింది ఫాతిమా. “పోదాం పదండి,” అంటూ అటువైపు కదిలింది రక్ష.

అక్కడి నుంచి తిరిగి వెళ్లడానికి వెనక్కి తిరుగుతుండగా కుడివైపు గోడకు దగ్గరలో నేలమీద ఒక నీలి కాంతి వలయం రక్షకు కనబడింది.  గుండ్రగా నీలి రంగు వెలుతురు… వెలుగుతూ, ఆరుతూ గిరగిరా చక్రంలా నేలమీద దుమ్ములో తిరుగుతోంది.

అందరూ ఆ శిథిల భవనం వైపు నడిచారు. ముళ్ల పొదల మధ్యలోంచి జాగ్రత్తగా నడుస్తూ వాళ్లు అక్కడికి చేరుకున్నారు. పై అంతస్తు దాదాపు పూర్తిగా కూలిపోయింది. గదులన్నీ కూలిన మొండిగోడలతో కనిపిస్తున్నాయి. ఏదో గబ్బు వాసన వేస్తోంది. ఆ పిల్లలు రెండవ గదిలోనే ఆగి నిలబడ్డారు. రక్ష మాత్రం అన్ని గదులనూ తిరిగి చూస్తోంది. సగం కూలిన గోడలు, వాటి పక్కన మట్టి, పెద్ద పెద్ద రాళ్లు, వాటి నడుమ అక్కడక్కడా పెరుగుతున్న తుప్పలు… చివరలో ఉన్న ఒక గది మాత్రం అంత ఎక్కువగా కూలిపోలేదు. పైన కప్పు కూడా ఉంది. దాని లోపలికి నడిచింది రక్ష. అది చాలా పెద్ద గది. లోపల ఎక్కువ వెలుతురు లేదు. మసక చీకటిగా ఉంది. గోడల మీద చాలా చోట్ల పెచ్చులు ఊడిపోయి, నల్లగా ఆకుపచ్చగా నాచు పట్టినట్టుంది. మూలల్లో ఎటు కదిలినా బూజు తగులుతోంది. చాలా ఎత్తులో ఉన్న పైకప్పుకు జీకులు కొన్ని తలకిందులుగా వేలాడుతున్నాయి. గదిలో నేల మీద అంతటా మట్టి పేరుకుని అడుగు వేసినప్పుడల్లా కాళ్లకు అంటుతూ, దుమ్ము పైకి లేస్తోంది. గుమ్మం దాటి నాలుగు అడుగులు వేసి గదంతా కలియచూసింది రక్ష. తాను చదువుకుంటున్న కాలంలో ఇంత అధ్వాన్నంగా లేదు. ఈ ఐదేళ్లలో చాలా పాడుబడి పోయింది.
అక్కడి నుంచి తిరిగి వెళ్లడానికి వెనక్కి తిరుగుతుండగా కుడివైపు గోడకు దగ్గరలో నేలమీద ఒక నీలి కాంతి వలయం రక్షకు కనబడింది. చిన్నపిల్లల చేతి గాజులా ఉంది అది. గుండ్రగా నీలి రంగు వెలుతురు… వెలుగుతూ, ఆరుతూ గిరగిరా చక్రంలా నేలమీద దుమ్ములో తిరుగుతోంది.

దానికి చాలా దగ్గరకు వెళ్లి నిలబడింది. వృత్తంలాంటి దట్టమైన నీలి రంగు కాంతి వలయం. దాని మధ్య భాగంలో మాత్రం నీళ్ల మీద ప్రతిఫలిస్తున్న సూర్యకాంతిలా తెల్లటి కాంతి సుడిగుండంలా తిరుగుతోంది. అదేమిటో చూడాలని దానికి మరింత దగ్గరకు వెళ్లి నిలబడింది రక్ష.

రక్షకు ఎంతో ఆశ్చర్యంతో బాటు దానిని చూడాలనే కుతూహలం కూడా కలిగింది. మెల్లగా అటువైపు నడిచింది. అదేమిటో తెలియడం లేదు. దానికి చాలా దగ్గరకు వెళ్లి నిలబడింది. అది అక్కడే అలాగే తిరుగుతోంది. అక్కడ వేరే వస్తువు ఏదీ కనిపించడం లేదు. ఆ కాంతి తన చుట్టూ తానే చక్రంలా తిరుగుతోంది. వృత్తంలాంటి దట్టమైన నీలి రంగు కాంతి వలయం. దాని మధ్య భాగంలో మాత్రం నీళ్ల మీద ప్రతిఫలిస్తున్న సూర్యకాంతిలా తెల్లటి కాంతి సుడిగుండంలా తిరుగుతోంది. అదేమిటో చూడాలని దానికి మరింత దగ్గరకు వెళ్లి నిలబడింది రక్ష. దానివైపు ముందుకు వంగి చూసింది. అంతే… హఠాత్తుగా బలమైన శక్తి ఏదో తనను దాని లోపలికి లాగేస్తున్నట్టు… తాను రబ్బర్లా సాగిపోతున్నట్టు, నీళ్లలా జారిపోతున్ననట్టు, గాలిలా తేలిపోతున్నట్టు… అలా దాని లోపలికి వెళ్లిపోతున్నట్టు అనిపించింది…

(Part -2 రేపు)

 

More articles

2 COMMENTS

  1. చాలా బాగుంది. సశేషమ్. దగ్గర సస్పెన్స్ బాగుంది.
    నేనుకూడా 55 ఏళ్ల తర్వాత మా ప్రాధమిక పాఠశాల కు 600km మానసికంగా వెళ్ళొచ్చా. ధన్యవాదాలు

  2. చక్కగా తెలిపారు. కృతజ్ఞతలు. ఈ నవల ఇలా మీ చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపడమే కాక రవంత కుతూహలం కలిగిస్తుందని కూడా ఆశిస్తున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article