Editorial

Saturday, September 21, 2024
Serialరక్ష - 9th Chapter : తెలుపు డైలీ సీరియల్

రక్ష – 9th Chapter : తెలుపు డైలీ సీరియల్

నిన్నటి కథ

“మనకు అందనంత దూరాల్లో, అంటే వేల వేల కాంతి సంవత్సరాల దూరాల్లో, మన అత్యాధునిక టెలిస్కోపులకు కూడా ఇంకా అందని దూరాల్లో మరిన్ని ప్రపంచాలు ఉంటే ఉండొచ్చునేమో! కానీ, మన చుట్టే ఉంటూ, మనకు తెలియని లోకాలు ఉన్నట్టు రాశావు కదా? ఎంత కథైనా అది నమ్మేలా ఉండాలి కదా?” అడిగింది రక్ష ‘శరత్ జవాబు ఏమీ ఇవ్వకుండా లేచి, లోపలి గదిలోకి వెళ్లాడు. తర్వాత ఏమైంది?

తొమ్మిదో అధ్యాయం

డా.వి.ఆర్.శర్మ

మంచి నీళ్లు తాగి, నీళ్ల బాటిల్, గ్లాసు తీసుకుని వచ్చి వాళ్ల ఎదురుగా టేబుల్ మీద పెట్టి, రక్ష అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పసాగాడు శరత్.

“తప్పకుండా అలాంటివి ఉండొచ్చు. మన సాధారణ దృష్టికి కనిపించనివి ఎన్నో మన చుట్టూ ఉన్నాయనే విషయం మీకు కూడా కొంత అనుభవంలో ఉంది. మన చుట్టూ ఇప్పుడు తిరుగుతూ భయపెడుతున్న కరోనా వైరస్

 

మనం సాధారణ నేత్రాలతో చూడలేం కదా. బాక్టీరియా, వైరస్ల వంటి వాటి గురించి మనకు సూక్ష్మదర్శినులు కనిపెట్టే వరకు తెలియదు. అంతేకాదు, మన చుట్టూ ఉండేవీ, మన శరీరం మీద ఉండే చర్మ రంధ్రాలూ, మన శరీరం మీద ఉంటూ మనతో సహజీవనం చేస్తున్న సూక్ష్మజీవులూ ఇలాంటివెన్నో మామూలుగా మనకు కనిపించనివి లక్షల సంఖ్యలో ఉన్నాయి. అలాగే మనం వాడుతున్న టీవీ తెరల వంటి వాటిని మ్యాగ్నిఫై చేసి చూస్తే వాటి అసలు స్వరూపం మనకు తెలుస్తుంది. మామూలు కళ్లకు కనబడుతున్నట్టుగా కూడా ఈ లోకంలోని పదార్థాలు లేవు.

రక్ష : ఇది పిల్లల సైన్స్ ఫిక్షన్ నవల. ‘తానా’ – ‘మంచి పుస్తకం’ సౌజన్యంతో ప్రచురణ. రచయిత డా.వి.ఆర్.శర్మ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కామారెడ్డి వాస్తవ్యులు. తెలుగు భాష బోధనతో తన ఉద్యోగ జీవితాన్ని సార్థకం చేసుకున్న శర్మ గారు బాల సాహిత్యానికి చేసిన సేవ అమూల్యమైనది. వారు అనేక సాహిత్య సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ స్వయానా తానే ఒక సంస్థ అనడం సముచిత గౌరవం. ‘సాహు జీవితం – రచనలు’ వారు ఎం.ఫిల్ పరిశోధనాంశం కాగా ‘ఆధునిక కవిత్వంలో బాల్య చిత్రణ’పై వారు పి.హెచ్ డి చేయడం మరో విశేషం. మీరు చదివే ‘రక్ష’ పిల్లక కోసం వారు రాసిన సైన్స్ ఫిక్షన్ నవల. ఇప్పటివరకు శర్మ గారు 8 కవిత సంపుటులు,  4 పాటల పుస్తకాలు, రక్ష నవలతో కలిపి 4 నవలలు వెలువరించారు. వారి పూర్తి పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రచయిత ఇ – మెయిల్ : dr.v.r.sharma@gmail.com 

“అలాగే అంతరిక్షం, అంతరిక్షంలో మనకు కనబడుతున్న సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్రాలూ, గ్రహాలూ ఇవేవీ మనం చూస్తున్నట్టుగా, మనకు కనబడుతున్నట్టుగా లేవు. వేగం, దూరం, పరిమాణం, మన కంటి నిర్మాణం, మన జ్ఞానేంద్రియాల నిర్మాణం వంటి అనేక విషయాలు మన జ్ఞానానికి పరిధులు విధిస్తున్నాయి. మనం నిత్యం వాడుతున్న సెల్ఫోన్ల లోంచి, టీవీ రిమోట్లలోంచి వెలువడుతున్న తరంగాలేవీ మనం చూడలేం కదా. మన కళ్లు చూడగలిగేది కొంత వరకే. మన ‘విజిబుల్ స్ప్రెక్ట్రమ్’ అంగీకరించిన మేరకు, కళ్లు మనకు చూపించిన విధంగా మాత్రమే మనం చూడగలుగుతున్నాం. మన చుట్టూ ఉన్న జంతువులకూ, పక్షులకూ, కీటకాలకూ ఈ ప్రపంచం మనం చూస్తున్నట్టుగా కనిపించదు. వాటికి ఈ ప్రపంచం మరో రకంగా కనిపిస్తుంది. కొన్ని జంతువులూ, పక్షులూ, కీటకాలూ మనం చూడలేనివి, వినలేనివి చూడగలవు, వినగలవు. అంతేకాదు, ఇప్పుడు మనకు కనబడుతున్నవి, వినబడుతున్నవి కొన్ని ఏనాటివో కావచ్చు, ఇప్పుడవి లేకపోవచ్చు… సరే, మళ్లీ ఇదంతా గందరగోళంగానే నీకు అనిపిస్తుందేమో!” శరత్ చెప్పడం ఆపి, రక్షవైపు చూశాడు.

“నిజమే! కానీ, ఈనాటి సైన్స్ పరికరాల సహాయంతో వాటన్నిటినీ చూస్తూనే ఉన్నాం కదా? వాటి గురించి అనేక విషయాలు పరిశోధిస్తూనే ఉన్నాం కదా?”

“కరెక్ట్! ఈ ఆధునిక శాస్త్రీయ విజ్ఞానం, శాస్త్ర పరికరాలూ లేనంత కాలం మనకు వాటి గురించి తెలియదు. సైన్స్ పెరుగుతున్నకొద్దీ, శాస్త్రీయ పరికరాల ఆవిష్కరణ జరుగుతున్న కొద్దీ కొత్త కొత్తవి చూడగలుగుతున్నాం. కంటికి కనిపించకుండా మన శరీరాల్లోంచి దూసుకుపోతున్న అనేక తరంగాలను, ఎక్స్ రే తరంగాల వంటి ఇతర కిరణాలను కూడా గుర్తించ గలుగుతున్నాం. కానీ వాటి గురించి గతంలో మనకు తెలియదు. నేడు గుర్తించగలుగుతున్నాం. ఇదే నేను చెప్పేది కూడా. మన చుట్టూ ఉన్న కొన్ని ప్రపంచాలను గుర్తించే స్థితికి మన సైన్స్ ఇంకా చేరలేదు. కానీ, భవిష్యత్తులో తప్పకుండా చేరుతుంది. ఆ రోజులు వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న మరికొన్ని ప్రపంచాల్లోకి తొంగి చూడగలం, వెళ్లిరాగలం. నేను కాల్పనికత కలిపి అదే ఆ కథలో చెప్పాను,” శరత్ తన మాటలు అర్థం అవుతున్నాయా అన్నట్టు వాళ్లను చూశాడు.

“అన్నా! మాకైతే కొంచెం అర్థమై, అర్థం కానట్టుగా ఉంది. నిజంగా అలాంటి ప్రపంచాలు ఉండే అవకాశం ఉందా?” అడిగాడు కార్తీక్.

ఈ అనంతమైన విశ్వంలో ఎన్ని పరిమితులు ఉన్నాయో ఇప్పటి వరకు తెలియదు. కొన్ని పరిమితుల ప్రపంచంలో ఉన్న జీవులు మరో పరిమితుల ప్రపంచంలో ఉన్న వాటిని మామూలు శరీరాంగాలతో చూడలేరు, తాకలేరు, గుర్తించలేరు.

శరత్చంద్ర ఔననట్టు తల ఊపుతూ, “తార్కికంగా ఐతే, ఉండొచ్చనే నేను చెపుతాను. మనకు మూడు పరిమితుల ప్రపంచమే తెలుసు. అంటే త్రీడైమన్షన్ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. ఫోర్త్ డైమన్ష్లో వస్తున్న సినీమాలు కూడా ఈ తరం పిల్లలకు తెలుసు. సిద్ధాంత రీత్యా టెన్త్ డైమన్షన్ వరకు మనుషులకు అందింది. కానీ అవి ఇంకా పరికల్పనలుగానే ఉన్నాయి. ఈ అనంతమైన విశ్వంలో ఎన్ని పరిమితులు ఉన్నాయో ఇప్పటి వరకు తెలియదు. కొన్ని పరిమితుల ప్రపంచంలో ఉన్న జీవులు మరో పరిమితుల ప్రపంచంలో ఉన్న వాటిని మామూలు శరీరాంగాలతో చూడలేరు, తాకలేరు, గుర్తించలేరు. వాటిని చూసే, గుర్తించే సైన్స్ ఇంకా ఇంకా పెరగాలి. మనకు మామూలుగా కనబడని, తెలియని విద్యుదయస్కాంత తరంగాలనూ, శక్తులనూ, కిరణాలనూ చూడగలిగే, గుర్తించగలిగే అత్యాధునిక శాస్త్రీయ పరికరాలను కనిపెట్టిన మానవులు, మనకు ఇంకా కనిపించని ప్రపంచాలను దర్శించగల స్థాయికి చేరుకునే రోజులు వస్తాయనే నా ఆశ. నేను రాసిన కథా వస్తువు సారాంశం, అదే” శరత్ చెప్పడం ఆపి, రక్ష వైపు చూశాడు. ఆమె తన మాటలు వింటూనే తీవ్రంగా ఏదో ఆలోచిస్తున్నట్టు అతనికి అనిపించింది.

“అన్నయ్యా! మనం అలాంటి ప్రపంచాలలోకి వెళ్లి రావడానికి అవకాశాలు ఏమీ లేవా? హాలివుడ్ సినిమాల్లో అలా వెళ్లి రావడాన్ని చూస్తున్నాం కదా?” కుతూహలంగా అడిగింది సాధన.

బహుశా నువ్వు నా కథ చదవలేదనుకుంటాను. నా కథలో అలా వెళ్లి రావడం ఉంటుంది. కానీ అది మంత్రాల కథ కాదు. ఈనాటి ఆధునిక కాల్పనికత అది

శరత్ చిన్నగా నవ్వి చెప్పాడు, “అలాంటి ఊహలూ, కల్పనలూ ఉన్నాయి. అది సాధ్యమని కొందరు, అసాధ్యమని కొందరు సైంటిస్టులు కొన్ని సిద్ధాంతాలు చెపుతున్నారు. ఆ దిశగా కొన్ని ప్రయోగాలు కూడా ప్రాథమిక స్థాయిలో జరుగుతున్నాయి. బహుశా నువ్వు నా కథ చదవలేదనుకుంటాను. నా కథలో అలా వెళ్లి రావడం ఉంటుంది. కానీ అది మంత్రాల కథ కాదు. ఈనాటి ఆధునిక కాల్పనికత అది,” చెప్పాడు శరత్.

“అది సాధ్యమయ్యే పరిస్థితి ఇప్పుడు ఏమాత్రం లేదా?” చటుక్కున రక్ష అడిగింది.

“ప్రస్తుతానికి సాధ్యం కాదు. ఒకనాటి రచయితల కల్పనలను ఎన్నింటినో ఆధునిక కాలంలో సైన్స్ నిజం చేసింది. భవిష్యత్తులో మనుషులు అలాంటి ద్వారాలు, అంటే ‘మరో లోక ద్వారాలు’ తెరుస్తారని నా కథలో రాశాను. తప్పకుండా రాబోయే కాలంలో మానవ జాతి విజ్ఞానం ఆ విజయాన్ని సాధిస్తుందనే నేను కూడా నమ్ముతున్నాను. మీరు కూడా వీలయితే స్టీఫెన్ హాకింగ్ చెప్పిన నల్ల బిలాల ప్రయాణాల గురించి, శ్వేత బిలాల విషయాల గురించి చదవండి. ఆధునిక సైన్స్ ఫిక్షన్ కథల్లో ఎంత దూరాలనైనా క్షణాల్లో చేరడానికి శూన్య రవాణా, పరాకాశం, ఉపాకాశం, ఉన్నతాకాశం అనేవి ఉపయోగిస్తున్నట్టు చూపుతున్నారు. వీటినే జీరో ట్రాన్స్పోర్టేషన్, హైపర్ స్పేస్, సబ్ స్పేస్, సుప్రా స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. వాటిని గురించి సైన్స్ చెపుతున్న విషయాలు చదవండి. ఆ దిశగా జరుగుతున్న పరిశోధనల గురించి చదవండి. ఈనాటి శాస్త్రీయ పరిశోధనల గురించి చదవండి. సైన్స్ రచనలు కొన్ని చదువుతుంటే అవి గొప్ప ఫిక్షన్లా, ఒక కాల్పనిక ప్రపంచంలో విహరిస్తున్నంత అద్భుతంగా ఉంటుంది. శాస్త్రీయ పరిశోధనలు మొదట కల్పనలు గానే రూపుదిద్దుకుంటాయని అంటారు. పుస్తకాలు చదవడం అనే అలవాటు చేసుకుంటే మీ ప్రపంచం ఎంతో విస్తరిస్తుంది,” శరత్ ఆ మాటలు చెపుతున్నంతసేపు రక్ష మొహం లోకే సూటిగా ఏదో వెతుకుతున్నట్టు చూశాడు.

అప్పుడే అలా క్షణాల్లో గ్రహాంతర ప్రయాణాలు చేయడం అందుబాటులోకి వచ్చేసినట్టు, తాము అక్కడికి వెళ్లి, సరదాగా చూసి వస్తామన్నట్టు కార్తీక్, సాధనల మొహాలు ఆనందంతో వెలిగిపోయాయి. స్టార్ వార్స్, ఇంటర్సెల్లార్, అవెంజర్స్, ట్రాన్స్ఫార్మర్స్ వంటి ఈనాటి అనేక హాలివుడ్ సినీమాలు చూస్తున్న పిల్లలు వాళ్లు.

రక్ష ఏదో దీర్ఘాలోచనలో పడ్డట్టు కనిపించింది. “నాకు కాస్త బయటకు వెళ్లవలసిన పని ఉంది. మనం మళ్లీ కలుద్దామా?” అంటూ ఆ సంభాషణను ముగించాడు శరత్. ‘సరే,’ అంటూ వాళ్లు లేచి నిలబడ్డారు. రక్ష కూడా వాళ్లతో కలిసి బయలుదేరింది.

వాళ్లు వెళ్లిన తరవాత, కాసేపు అటు వైపే చూస్తూ నిలబడ్డాడు శరత్. ‘నాకు కొన్నేళ్ల కిందట జరిగిన అనుభవం లాంటిది రక్షకు ఏదైనా జరిగి ఉంటుందా? ఎందుకో ఈ రోజు రక్ష ఎప్పటిలా సహజంగా లేదు. ఏదో జరిగిందని నా సిక్త్ సెన్స్ చెపుతోంది… ఏమై ఉంటుంది?’ అని శరత్ అనుకున్నాడు.

గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి

ఎనిమిదో అధ్యాయంఏడో అధ్యాయం | ఆరో అధ్యాయం | ఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం  మూడో అధ్యాయం రెండో అధ్యాయం |  తొలి అధ్యాయం  

మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article