Editorial

Monday, December 23, 2024
Serial'రక్ష' తిరిగి వచ్చింది – డా.విఆర్.శర్మ డైలీ సీరియల్ : 7th chapter

‘రక్ష’ తిరిగి వచ్చింది – డా.విఆర్.శర్మ డైలీ సీరియల్ : 7th chapter

నిన్నటి కథ

వాళ్లు ఆ విద్యాలయ ప్రాంగణం లోంచి వెనుదిరిగారు. ప్రధాన ద్వారానికి లోపల, కొంత దూరంలో రకరకాల పూలపొదలతో అందంగా కనిపిస్తున్న ఒక చోటు ఉంది. అక్కడ చుట్టూ వెదురు పొదలు, వాటి మధ్య ఒక పూల పందిరి, దాని కింద గుండ్రటి గద్దె కనిపించాయి. “మనం కాసేపు అక్కడ కూర్చుందాం. నీకు మరికొన్ని విషయాలు చెప్పాలి. ఆ తరవాత నువ్వు ఇటు నుంచే మీ లోకానికి వెళ్లి, నీ పని ప్రారంభించవచ్చు,” చెప్పింది అరణ్య.

రక్ష అలాగే అన్నట్టు తల ఊపి వాళ్లతో అటువైపు నడిచింది. ఆ తర్వాత?

ఏడో అధ్యాయం

డా.వి.ఆర్.శర్మ

అప్పుడే, పడమటి దిక్కున అడవిలో దూరాన ఉన్న కొండల వెనక సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ వైపున ఆకాశం జాజు రంగు నుంచి మెల్లగా పల్చటి నలుపు రంగులోకి మారుతోంది. ఆకాశంలో పక్షులు గుంపులు గుంపులుగా తమ గూళ్లకు తిరిగి వెళుతున్నాయి. పొలాల నుంచి తిరిగి తమ ఇళ్లకు వెళుతున్నముగ్గురు రైతులు పాఠశాల గేటులోంచి బయటకు వస్తున్న రక్షను చూసి ఆశ్చర్యపోయారు. గబగబా ఆమె దగ్గరకు వచ్చారు. రక్ష కూడా వాళ్లను చూసి ఆగింది. “ఎక్కడికి పోయావమ్మా, తల్లీ! నీ కోసం మీ ఇంటి వాళ్లతో బాటు ఊరంతా ఆగమైపోతున్నారు!” అని గబగబా అడిగింది వాళ్లలో ఉన్న ఒక ఆడ మనిషి. “ఔను, నీ కోసం వెతకడానికి పోలీసులు కూడా వచ్చారు!” అన్నాడు వాళ్లతో ఉన్న మగ మనిషి.

వాళ్లకు ఏం చెప్పాలో రక్షకు వెంటనే ఏమీ తోచలేదు. అలాగే వాళ్ల ముఖాలు చూస్తూ, ఏమీ మాట్లాడకుండా నిలబడింది. ఇంతలో మరికొందరు వీళ్లను చూసి అక్కడికి వచ్చారు. ‘రక్ష వచ్చింది, రక్ష దొరికింది,’ అనే విషయం క్షణాల్లో ఊళ్లో వ్యాపించింది. “పదండి, ముందు వాళ్ల ఇంటికి తీసుకుపోదాం,” అని వాళ్లను ఎవరో కదిలించారు. వాళ్లందరూ రక్షతో కలిసి వాళ్ల ఇంటివైపు కదిలారు. తోవలో వీళ్లను చూసి మరి కొందరు కుతూహలంగా ప్రశ్నలు వేస్తూ వాళ్లతో కలిసి వచ్చారు. తమ ఇంటివైపు వస్తున్న ఆ గుంపునూ, వాళ్లతోబాటు వస్తున్న రక్షనూ కొంత దూరం నుంచే చూశాడు రక్ష తాతయ్య. గబగబా వాళ్ల వైపు వచ్చాడు. దగ్గరికి రాగానే, “అమ్మా, రక్షా!” అంటూ చేతులు జాపాడు. రక్ష కూడా, “తాతయ్యా!” అంటూ వేగంగా వచ్చి ఆయనను గట్టిగా పట్టుకుంది.

ఈ కోలాహలం వినిపించి, వాళ్ల ఇంట్లోంచి అందరూ బయటకు వచ్చారు. రక్ష, “అమ్మా!” అంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి తల్లిని వాటేసుకుంది. ఆ ఇంటి ముందు అంతా ఎంతో సందడిగా మారింది. చూస్తుండగానే ఊరంతా అక్కడ చేరింది.

రక్ష : ఇది పిల్లల సైన్స్ ఫిక్షన్ నవల. ‘తానా’ – ‘మంచి పుస్తకం’ సౌజన్యంతో ప్రచురణ. రచయిత డా.వి.ఆర్.శర్మ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కామారెడ్డి వాస్తవ్యులు. తెలుగు భాష బోధనతో తన ఉద్యోగ జీవితాన్ని సార్థకం చేసుకున్న శర్మ గారు బాల సాహిత్యానికి చేసిన సేవ అమూల్యమైనది. వారు అనేక సాహిత్య సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ స్వయానా తానే ఒక సంస్థ అనడం సముచిత గౌరవం. ‘సాహు జీవితం – రచనలు’ వారు ఎం.ఫిల్ పరిశోధనాంశం కాగా ‘ఆధునిక కవిత్వంలో బాల్య చిత్రణ’పై వారు పి.హెచ్ డి చేయడం మరో విశేషం. మీరు చదివే ‘రక్ష’ పిల్లక కోసం వారు రాసిన సైన్స్ ఫిక్షన్ నవల. ఇప్పటివరకు శర్మ గారు 8 కవిత సంపుటులు,  4 పాటల పుస్తకాలు, రక్ష నవలతో కలిపి 4 నవలలు వెలువరించారు. వారి పూర్తి పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రచయిత ఇ – మెయిల్ : dr.v.r.sharma@gmail.com 

‘తనకు జరిగిన విషయాలేవీ గుర్తు లేవని, ఏం జరిగిందో తనకు తెలియదని, తనకు ఆ భవనంలోకి వెళ్లడం మాత్రమే గుర్తుందని, తరవాత మళ్లీ కళ్లు తెరిచే సరికి తాను అడవి చివర, పాఠశాల వైపు వెళ్లే తోవలో, ఒక చెట్టుకింద పడుకుని ఉన్నానని, లేచి తన మిత్రుల కోసం పాఠశాల వైపు వెళ్లి చూశానని, అక్కడ ఎవరూ కనిపించక బయటకు వస్తుంటే ఈ ఊరివాళ్లు కనిపించారని,’ రక్ష చెప్పింది. తనకు అనుభవంలోకి వచ్చిన విషయాలు ఏవీ ఎవరికీ చెప్పకూడదు కాబట్టి, తాను ఒక కథను అల్లింది. అందరికీ అలాగే చెప్పింది రక్ష.

క్రమంగా చీకటిపడింది. ఊళ్లో దీపాలు వెలిగించారు. జనం ఒకరొకరుగా అందరూ ఇళ్లకు వెళ్లిపోయారు. ఆ ఇంటి వాళ్లు మాత్రమే అక్కడ మిగిలారు. మాణిక్యం తన తమ్ముడితో కలిసి పోలీసులకు ఫోన్ చేశాడు. తమ కూతురు రక్ష క్షేమంగా తిరిగి వచ్చిన విషయం చెప్పాడు.

ఏం జరిగిందో తెలియక పోయినా, రక్ష క్షేమంగా తిరిగి వచ్చినందుకు వాళ్లందరికీ కలిగిన ఆనందానికి మేరలేక పోయింది. రక్షకు ఏమైనా దెబ్బలు తగిలాయేమోనని ఆమె తల్లీ, నాయనమ్మా ఒళ్లంతా జాగ్రత్తగా పట్టిపట్టి చూశారు. ఎక్కడా చిన్న గాయం కూడా కనిపించలేదు. ఎంత ఆలోచించినా ఏం జరిగి ఉంటుందో వాళ్లకు అర్థం కాలేదు. ‘అడవి లింగేశుని దయవల్లనే తమకు రక్ష దక్కిందని, రేపు పొద్దునే గుడికి వెళ్లి అర్చన చేయించుకుందామని,’ తాతయ్య వాళ్లతో చెప్పాడు. ఆ రాత్రి తల్లీ, నానమ్మల మధ్య పడుకుంది రక్ష. వాళ్లు హాయిగా నిద్రపోయారు. రక్ష తనకు జరిగిన దానిని గురించీ, తాను చేయవలసిన పని గురించీ ఆలోచిస్తూ ఆ రాత్రి గడిపింది.

‘తనకు జరిగిన అనుభవం నిజం. కానీ అది తనకు మాత్రమే తెలిసిన నిజం. ఎవరితో చెప్పకూడని నిజం. చెప్పినా ఎవరూ నమ్మలేని నిజం. అంతే కాదు, ఒక అపూర్వమైన జాతి రక్షణకు సంబంధించిన నిజం. తనకు కూడా ఆ జాతితో రక్త సంబంధం ఉందట!

‘తనకు జరిగిన అనుభవం నిజం. కానీ అది తనకు మాత్రమే తెలిసిన నిజం. ఎవరితో చెప్పకూడని నిజం. చెప్పినా ఎవరూ నమ్మలేని నిజం. అంతే కాదు, ఒక అపూర్వమైన జాతి రక్షణకు సంబంధించిన నిజం. తనకు కూడా ఆ జాతితో రక్త సంబంధం ఉందట! తనకు పుట్టుకతో తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన శక్తులు కొన్ని ఉన్నాయని, అవి నిన్న సంక్రాంతి రోజు నుంచి, అంటే తన పద్నాలుగేళ్లు నిండిన రోజు నుంచి తన అధీనంలోకి వచ్చాయని తెలిసింది. తనకు తెలిసిన వాటిలో అన్నిటికన్నా ముఖ్యమైంది ఎవరికీ కనిపించని ఒక లోకం ఈ భూమి మీదే ఉన్న విషయం. ఆ నీలి బిలం గురించిన విషయం.

అది రహస్యంగా ప్రకృతి తనలో దాచుకున్న మార్గం. ప్రకృతి అంగీకారంతో, దాని నియమాలను పాటిస్తూ, ప్రకృతికి అనుకూలంగా ఆ లోకానికి చెందిన కొందరు మాత్రమే లోక కల్యాణం కోసం వేల సంవత్సరాలుగా చాలా అరుదుగా ఉపయోగించిన తోవ. కానీ, ప్రకృతి నియమాలను ధిక్కరించి, ఆ లోకానికి చెందిన తన తండ్రి, తన వ్యక్తిగత ప్రయోజనం కోసం దానిని ఉపయోగించుకున్నాడట. ఆ నీలి ద్వారం లోంచే తాను ఆ అదృశ్య లోకానికి వెళ్లి రాగలిగింది. తనకు కూడా అంత సులభంగా ఆ లోకంలోకి వెళ్లే అనుమతి ప్రకృతి ఇవ్వలేదు. అందుకే ఒక రోజంతా అలా రెండు లోకాల మధ్య అటూ ఇటూ కాకుండా వేలాడింది.

వీటన్నిటికన్నా తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్న మరొక సంగతి ఉంది. అది అమ్మా,నాన్నా అని తాను ఇంత కాలం అనుకుంటున్న వాళ్లు తన నిజమైన తల్లిదండ్రులు కారు. కానీ అలా ఒప్పుకోవడానికి మనసు అంగీకరించడం లేదు…

ఆ పద్నాలుగేళ్ల బాలిక మనసంతా ఒక కలలా అయోమయంగా, నమ్మలేని విషయాలతో గందరగోళ పడుతోంది.

‘అసలు తనకు కలిగినట్టు అనిపిస్తున్న ఆ అనుభవాలు నిజమేనా? లేక, అంతకు ముందు రోజు తాను చదివిన కథ వల్ల అలాంటి భ్రమలకు గురైందా?

‘అసలు తనకు కలిగినట్టు అనిపిస్తున్న ఆ అనుభవాలు నిజమేనా? లేక, అంతకు ముందు రోజు తాను చదివిన కథ వల్ల అలాంటి భ్రమలకు గురైందా? తాను ఏ కారణం వల్లో స్పృహ లేకుండా పడిపోతే, అప్పుడు తన మెదడు ఆ కథ ప్రభావంతో అలాంటివి కల్పించుకుందా? ఏది నిజమో, ఏది అబద్ధమో నిర్ధారించుకోవడం ఎలా?’ ఆలోచనల సుడిగుండాల్లోంచి ఎప్పుడో తెల్లవారు జామున తనకు తెలియకుండానే మెల్లగా నిద్రలోకి జారిపోయింది రక్ష.

మరునాడు ఉదయమే లేచి, అందరూ గుడికి వెళ్లి రక్ష పేరున అర్చన చేయించారు. పదకొండు గంటలకు తిరిగి ఇంటికి చేరుకున్నారు. పన్నెండు గంటల ప్రాంతంలో ఒక పోలీసు ఉద్యోగి వచ్చి, రక్ష చెప్పిన విషయాలు రాసుకున్నాడు. పెద్ద వాళ్లతో కొన్ని సంతకాలు తీసుకుని వెళ్లిపోయాడు. కొందరు ఊరివాళ్లు కూడా వచ్చి, కాసేపు మాట్లాడిపోయారు. ఆ రోజు సాయంత్రమే రక్ష వాళ్లు హైదరాబాద్ వెళ్లిపోయారు.

గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి

ఆరో అధ్యాయంఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం  మూడో అధ్యాయం

|  రెండో అధ్యాయం |  తొలి అధ్యాయం  

మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article