Editorial

Wednesday, January 22, 2025
Serialరక్ష – 5th chapter – డా.విఆర్.శర్మ డైలీ సీరియల్

రక్ష – 5th chapter – డా.విఆర్.శర్మ డైలీ సీరియల్

నిన్నటి కథ

“ఇప్పటివరకైతే మా గురించి మనుషులకు తెలియదు. అలా ప్రకృతి మాకు రక్షణ కల్పించింది. అందుకు తగినట్టే మేం కూడా తగిన జాగ్రత్తలతో, కట్టుబాట్లతో జీవిస్తున్నాం. ప్రకృతి మాకు నిర్దేశించిన ప్రదేశాలలోనే ఉంటాం. మా ప్రాంతాలను మనుషులు చూడలేరు. మా చోటుకి రాలేరు. దేన్నీ ముట్టుకోలేరు. మేం ఇక్కడ ఉన్నట్టు ఏ పరికరాలతో కూడా గ్రహించలేరు. ఇలా మా పరిధుల్లో, మా ప్రాంతాల్లో మేం ఉన్నంత వరకు మా గురించి మనుషులకు తెలిసే అవకాశం లేదు. కానీ నీకు తెలిసేలా మేమే చేశాం. ఎందుకంటే ఆ  పరిస్థితి అనివార్యంగా ఏర్పడింది” అంటుంది అరణ్య. ఆ తర్వాత అరణ్య తల్లి “తిన్న తరవాత మాట్లాడుకోండి,” అంటూ రక్షను తినడానికి పిలిచింది. ఆ తర్వత ఏమైందో చదవండి…

ఐదో అధ్యాయం

డా.వి.ఆర్.శర్మ

వాళ్లు భోజనాలు పూర్తి చేసి కూర్చున్నక సంభాషణ మళ్ళీ మొదలైంది.

“ఇలా ప్రశాంతంగా సాగిపోతున్న మా ప్రపంచంలోకి ఒక వినాశకర ప్రళయాన్ని తెచ్చే పరిస్థితి కొంత కాలంగా ఏర్పడుతోంది,” మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది అరణ్య. కిటికీలోంచి బయటి ప్రకృతి ఒక హరిత స్వర్గంలా, మనోహరంగా ఆకర్షిస్తోంది. అరణ్య చెప్పడం ప్రారంభించగానే రక్ష తన మనసునూ, దృష్టినీ మళ్లీ వినడం మీద కేంద్రీకరించింది.

“మాలో కొందరు తరతరాలుగా చేసిన ప్రయత్నాలు, అన్వేషణల మూలంగా ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతమైన శక్తిని సాధించగలిగారు. అదే ఇప్పుడు మా లోకాన్ని కబళించే పెను ముప్పులా మారబోతోంది.”

“ఇంత ప్రశాంతమైన లోకానికి ప్రమాదమా? ఏమిటది?” రక్ష ప్రశ్నలో ఆశ్చర్యం, నమ్మలేనితనం.

రక్ష : ఇది పిల్లల సైన్స్ ఫిక్షన్ నవల. ‘తానా’ – ‘మంచి పుస్తకం’ సౌజన్యంతో ప్రచురణ. రచయిత డా.వి.ఆర్.శర్మ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కామారెడ్డి వాస్తవ్యులు. తెలుగు భాష బోధనతో తన ఉద్యోగ జీవితాన్ని సార్థకం చేసుకున్న శర్మ గారు బాల సాహిత్యానికి చేసిన సేవ అమూల్యమైనది. వారు అనేక సాహిత్య సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ స్వయానా తానే ఒక సంస్థ అనడం సముచిత గౌరవం. ‘సాహు జీవితం – రచనలు’ వారు ఎం.ఫిల్ పరిశోధనాంశం కాగా ‘ఆధునిక కవిత్వంలో బాల్య చిత్రణ’పై వారు పి.హెచ్ డి చేయడం మరో విశేషం. మీరు చదివే ‘రక్ష’ పిల్లక కోసం వారు రాసిన సైన్స్ ఫిక్షన్ నవల. ఇప్పటివరకు శర్మ గారు 8 కవిత సంపుటులు,  4 పాటల పుస్తకాలు, రక్ష నవలతో కలిపి 4 నవలలు వెలువరించారు. వారి పూర్తి పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రచయిత ఇ – మెయిల్ : dr.v.r.sharma@gmail.com 

“ఔను! మా వాళ్లు ప్రకృతి నియమాలను దాటి, ప్రకృతి నుంచి స్వాధీనం చేసుకున్న శక్తి అది. అదే మా పాలిటి దురదృష్టంగా మారబోతోంది,” అవని కల్పించుకుని మాట్లాడింది.

“ఏమిటది?” కుతూహలంగా అవని వైపు చూస్తూ అడిగింది రక్ష.“

“అది ఒక ద్వారం- నీలి బిలం. ప్రకృతిలో ఎంతో రహస్యంగా, అందకుండా ఉన్న దానిని మా వాళ్లు తెలుసుకుని, దానిని తెరిచే విద్యను నేర్చుకున్నారు.”

ఆ మాటలు పూర్తిగా అర్థం కానట్టు చూసింది రక్ష.

అది ప్రకృతి విరుద్ధమైన పని. ప్రకృతి మాకు నిర్దేశించిన పరిధులను అతిక్రమించే పని. మా కట్టుబాట్లకు వ్యతిరేకమైన కార్యక్రమం…” విచారంగా చెప్పింది అరణ్య. “నువ్వు ఇక్కడికి వచ్చింది ఆ ద్వారం లోంచే,” ఆ మాటలను పూర్తి చేసింది అవని.

“సరే, వివరంగా చెపుతాను!” అంటూ అరణ్య చెప్పడం మొదలు పెట్టింది. “మా లోకం లోంచి మీ లోకంలోకి వెళ్లి వచ్చే ద్వారమే నీలి బిలం. దానిని స్వాధీనం చేసుకుని, తెరవడం నేర్చుకుంటే మా లోకం లోంచి మీ లోకంలోకి వెళ్లవచ్చు, రావచ్చునని తెలుసుకున్నారు. అంతేకాదు ఆ ద్వారంలోంచి ప్రయాణిస్తే వాళ్లు వెళ్లిన చోట ఉంటున్న వాళ్లకు తాము అనుకున్నప్పుడు కనిపించవచ్చు. అక్కడ అన్నిటినీ ఉపయోగించుకోవచ్చు. అలాంటి నీలి ద్వారాన్ని కనిపెట్టిన విషయం తెలిసిన వెంటనే మా లోకం పెద్దలు దానిని ఉపయోగించకుండా నిషేధం విధించారు. అలా కొన్ని తరాల కాలం గడిచింది. కానీ, దాదాపు ముప్పై ఏళ్ల కిందట మా లోకంలోని ఒకరు దానిని రహస్యంగా ఉపయోగించి మీ లోకానికి రాకపోకలు కొనసాగించారు. అది ప్రకృతి విరుద్ధమైన పని. ప్రకృతి మాకు నిర్దేశించిన పరిధులను అతిక్రమించే పని. మా కట్టుబాట్లకు వ్యతిరేకమైన కార్యక్రమం…” విచారంగా చెప్పింది అరణ్య. “నువ్వు ఇక్కడికి వచ్చింది ఆ ద్వారం లోంచే,” ఆ మాటలను పూర్తి చేసింది అవని.

“దానిని ఉపయోగించడం మీకు ఎలా తెలుసు? తప్పు అయినప్పుడు మీరు ఎందుకు ఆ పని చేశారు? నన్ను ఎందుకు ఇక్కడికి రప్పించారు?” చకచకా ప్రశ్నలు కురిపించింది రక్ష.

“మాకు ఎలా తెలుసో సమయం వచ్చినప్పుడు చెపుతాం. కానీ, మా లోకాన్ని రక్షించుకోవడానికి అనివార్యంగా మరో దారి లేక నిన్ను ఇక్కడికి రప్పించాం… ఈ ప్రయత్నంలో మాకు నీ సహాయం కావాలి రక్షా!” అరణ్య ఆ మాటలు అంటూ రక్ష చేతులను తన చేతుల్లోకి తీసుకుంది. ఆమె గొంతులో పలికిన ఆర్తికి, దగ్గరితనానికీ రక్ష మంచులా కరిగిపోయింది. అనిర్వచనీయమైన ఏదో భావన.

“సరే… అరణ్యా! నేను ఏం చేయాలో చెప్పు. అది ఎంత కష్టమైన పనైనా, ఎంత ప్రమాదకరమైనదైనా చేస్తాను. నా వల్ల మీ జాతిని రక్షించగలిగే అవకాశం ఉందంటే తప్పకుండా చేస్తాను,” ఎంతో నిశ్చయంగా పలికింది రక్ష.

“కృతజ్ఞతలు రక్షా! ఆ సహాయం నువ్వు చేస్తే, మా జాతి మొత్తం నీకు రుణపడి ఉంటుంది,” రక్ష భుజాల మీద అవని తన రెండు చేతులు వేసింది. ఆ స్పర్శలో ఎంతో ఆత్మీయత, దగ్గరితనం ఉన్న భావన కలిగింది రక్షకు. కొద్ది క్షణాలు అలా వాళ్లు నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ మౌనమే వాళ్లకు అనేక విషయాలు చెప్పింది…

“ఈ పనికి నన్నే ఎందుకు ఎన్నుకున్నారు? అలాగే, నేను మీ లోకంలో మీ లాగే మామూలుగా ఎలా ఉండగలుగుతున్నాను? మీ లోకానికి వచ్చిన ఆపద ఏమిటి?

“సరే మిత్రులారా! నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. అవి తీర్చుకోవాలనుకుంటున్నాను,” అని వాళ్ల వైపు సమాధానం కోసం చూసింది రక్ష.

“మాకు తెలిసినవి తప్పకుండా చెపుతాం. అడుగు.”

“ఈ పనికి నన్నే ఎందుకు ఎన్నుకున్నారు? అలాగే, నేను మీ లోకంలో మీ లాగే మామూలుగా ఎలా ఉండగలుగుతున్నాను? మీ లోకానికి వచ్చిన ఆపద ఏమిటి? అన్నిటికన్నా ముఖ్యంగా నేను చేయవలసింది ఏమిటి? అది నా వల్ల సాధ్యమౌతుందా? ఇంకో విషయం ఏమిటంటే, జరుగుతున్న ఈ విషయాలు మీ ఇద్దరికి మాత్రమే తెలుసా? ఇదంతా మీ నిర్ణయమేనా? ఇంత ప్రమాదం మీ లోకానికి వస్తున్నప్పుడు మీ పెద్ద వాళ్లు ఎందుకు ఊరుకున్నారు?” రక్ష తన సందేహాలన్నీ ఒకేసారి గుక్క తిప్పుకోకుండా అడిగింది.

అరణ్య, అవని కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయి కళ్లతోనే ఏదో మాట్లాడుకున్నారు. తరవాత వాళ్లు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా అనిపించింది. “సరే రక్షా, నీకు వచ్చిన సందేహాలన్నిటికీ క్లుప్తంగా జవాబులు చెపుతాం. కొన్ని ప్రశ్నలకు జవాబులు నీకు క్రమంగా తెలుస్తాయి,” అంటూ ప్రారంభించింది అరణ్య.

“మొదట నిన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నామనే దానికి సమాధానం నీ పుట్టుకతో ముడిపడి ఉంది. నీ జననాన్ని గురించి త్వరలోనే కొన్ని రహస్యాలు నీకు తెలుస్తాయి. వాటితో ఈ లోకానికి విడదీయరాని సంబంధం ఉంది. కాబట్టి నీ అన్వేషణ అక్కడి నుంచే మొదలౌతుంది. ఆ జవాబుకూ, నిన్ను ఈ లోకానికి రప్పించడానికీ, నిన్నే ఈ పనికి ఎన్నుకోడానికీ విడదీయరాని సంబంధం ఉంది,” అరణ్య చెప్పడం ఆపి, చెప్పమన్నట్టుగా అవని వైపు చూసింది.

“ఇది మా నిర్ణయం కాదు. మా లోకాన్ని కాపాడే పెద్దలు చేసిన నిర్ణయం. నీ కోసం నీలి బిలాన్ని తెరిచింది కూడా వాళ్లే. నిన్ను వాళ్ల దగ్గరికి చేర్చే బాధ్యతను మాకు అప్పగించారు. అలాగే నువ్వు చేయవలసిన పని నీకు త్వరలోనే తెలుస్తుంది.

తరవాత అవని కొనసాగించింది. “ఇది మా నిర్ణయం కాదు. మా లోకాన్ని కాపాడే పెద్దలు చేసిన నిర్ణయం. నీ కోసం నీలి బిలాన్ని తెరిచింది కూడా వాళ్లే. నిన్ను వాళ్ల దగ్గరికి చేర్చే బాధ్యతను మాకు అప్పగించారు. అలాగే నువ్వు చేయవలసిన పని నీకు త్వరలోనే తెలుస్తుంది. ఆ పని నువ్వు చేయగలవు. నువ్వు మాత్రమే చేయగలవని మా పెద్దలు నమ్ముతున్నారు. వాళ్ల విశ్వాసం, నమ్మకం ఎప్పుడూ తప్పు కాలేదు. ఈ విషయం మా ఇద్దరికి మాత్రమే తెలుసా అని అడిగావు. మా ఇద్దరితోపాటు ఈ లోకానికి సంబంధించి రక్షణ బాధ్యతలు ఉన్న అరణ్య అమ్మా నాన్నలకూ, అలాంటి కొద్దిమంది పెద్దలకు మాత్రమే తెలిసిన రహస్య విషయం ఇది,” అవని చెప్పడం ఆపింది.

రక్షకు వాళ్ల మాటలు అర్థం అయినట్టున్నా, మరింత అయోమయానికి గురిచేసినట్టు అనిపించింది. అదే విషయం వాళ్లతో అంది రక్ష, “మీ సమాధానాలు నాకు ఒక చిక్కుముడిలా అనిపిస్తున్నాయి. అంతకన్నా ప్రస్తుతం ఎక్కువ విషయాలు చెప్పలేరనుకుంటే అలాగే కానివ్వండి. అయినా నేను మీ లోకాన్ని కాపాడే ప్రయత్నం తప్పకుండా చేస్తానని మాటిస్తున్నాను.” ఆ మాట చెప్పిన తరవాత వాళ్ల మొహాలు సంతోషంతో వెలిగిపోవడం చూసింది రక్ష.

“నువ్వు చాలా మంచి దానివి రక్షా!” అన్నారు వాళ్లు. “సరే, ఇప్పుడు మనం ఒక చోటికి వెళ్లాలి,” అంటూ లేచి నిలబడ్డారు. “సరే,” అని రక్ష కూడా లేచి నిలబడింది. వాళ్లు ఆ ఇంట్లోంచి బయలుదేరారు.

గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి

నాలుగో అధ్యాయం  | మూడో అధ్యాయం |  రెండో అధ్యాయం |  తొలి అధ్యాయం

మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article