నిన్నటి కథ :
నిన్నటి కథ : దగ్గరికి వెళితే ‘ఏమైనా కానీ,’ అనుకుంది రక్ష. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా దాని దగ్గరికి వెళ్లింది. దాని మధ్యలో తెల్లటి కాంతితో అది అచ్చం తనకు గతంలో కనిపించినట్టే ఉంది. ఆ నీలి వలయం గుండ్రంగా, వేగంగా ఒక సుడిగుండంలా తిరుగుతోంది. రక్ష తెగించినట్టుగా చటుక్కున ఆ వలయం మీదికి ముందుకు వంగింది. రక్షకు మళ్లీ అదే అనుభవం… సాగిపోతున్నట్టు, కరిగిపోతున్నట్టు, గాలిలా మారిపోతూ ఆ వలయం లోపలికి వేగంగా వెళ్లిపోతున్నట్టు…
ఇక నేటి అధ్యాయం చదవండి.
డా.వి.ఆర్.శర్మ
అంతటా బంగారం ప్రసరిస్తున్నట్టుగా ఉన్న వెలుతురు. ఆ వెలుతురు అలా ఆకాశం వైపు సుమారు వెయ్యి అడుగుల ఎత్తు వరకు కనిపిస్తోంది. అక్కడి నుంచి ఏమీ కనిపించడం లేదు. అంతా గడ్డకట్టిన చిమ్మచీకటి. అమావాస్య రోజయినా ఆకాశంలో చుక్కలు కనబడతాయి. కానీ ఇప్పుడు అక్కడ కారు నలుపు తప్ప మరేమీ కనిపించడం లేదు. రాత్రయితే చంద్రుడో, చుక్కలో కనిపించాలి. కానీ నల్లటి కారు చీకటి మాత్రమే ఆకాశం నిండా వ్యాపించి ఉన్నట్టుంది. మరి ఈ వెలుతురు ఏమిటి? ఇది ఎక్కడి నుంచి వస్తోంది?
కింద నేలంతా తెల్లటి తెలుపు. కనుచూపు మేరలో అంతటా అదే తెల్లటి నేల. మంచులా ఉంది అనుకుని చేత్తో పట్టుకుని చూసింది. అది మట్టే, మంచుకాదు. చుట్టూ తిరిగి చూసింది. అటువైపు ఒక లోయ లాగా కనిపిస్తోంది. తాను ఒక చిన్న గుట్ట మీద ఉన్నట్టుంది. అది లోయ కాదు. కొండవాలు. ఆ వాలు వెంట దిగితే దూరంగా ఆకుపచ్చగా ఒక పెద్ద మైదాన ప్రాంతం ఉంది. అక్కడ ఏదో ఊరు ఉన్నట్టుంది. అక్కడి నుంచి రకరాకాల కాంతులు ప్రసరిస్తున్నాయి. బహుశా విద్యుత్తు కాంతులు కావొచ్చు. అక్కడ ఏవో ఇళ్ల లాంటివి కనిపిస్తున్నాయి. గాలిలోంచి సన్నగా చప్పుళ్లు వినిపిస్తున్నాయి. తాను అటువైపు వెళ్లాలా? తాను ఎక్కడ ఉందో తెలియడం లేదు. అక్కడికి వెళితే ఏమైనా తెలుస్తుందేమో, చూద్దాం అనుకుంది.
నెమ్మదిగా ఆ గుట్ట దిగడం మొదలుపెట్టింది. తాను ఎన్నడూ చూడని పొదలూ, వాటికి అనేక రంగుల్లో రకరకాల పూలు, అక్కడక్కడా కొన్ని ఎత్తుగా పెరిగిన చెట్లూ కనిపిస్తున్నాయి. ఆ చెట్ల ఆకుల్లోంచి రంగు రంగుల్లో సన్నటి కాంతులు ప్రసరిస్తున్నాయి. ‘వాటికి ఏవైనా రంగుల విద్యుద్దీపాలు అమర్చారేమో,’ అని ఆ చెట్ల పక్కనుంచి వెళుతున్నప్పుడు చూసింది. కానీ అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. ఆ చెట్లే తమ ఆకుల్లోంచి సహజ కాంతులను ప్రసరిస్తున్నాయి. ‘ఇలాంటి చెట్లు కూడా ఉంటాయా!? అసలు, తాను ఎక్కడ ఉందో? తనకు ఏం జరుగుతుందో…’ అనుకుంటూ గుట్ట దిగి, కనబడుతున్న ఆ ఊరి వైపు నడవడం ప్రారంభించింది.
ఆమె ద్వారం వైపు నడిచింది. ద్వారం దగ్గర నిలబడ్డ ఇద్దరు పిల్లలు తనను చూసి, పలకరింపుగా నవ్వినట్టు అనిపించింది. మరో ముగ్గురు పిల్లలు కళ్లు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంతో చూస్తున్నారు.
రక్ష పది నిమిషాల్లో ఆ ఊరి దగ్గరకు చేరుకుంది. చుట్టూ మట్టితో కట్టిన ప్రహరీ గోడ ఉంది. దానికి ఒక చోట ప్రవేశ ద్వారం కనిపిస్తోంది. కొందరు నడుచుకుంటూ లోపలికి వెళుతున్నారు. ద్వారం ఎడమ దిక్కున కొన్ని జంతువులు పచ్చిక మైదానంలో గడ్డి మేస్తున్నాయి. ఆమె ద్వారం వైపు నడిచింది. ద్వారం దగ్గర నిలబడ్డ ఇద్దరు పిల్లలు తనను చూసి, పలకరింపుగా నవ్వినట్టు అనిపించింది. మరో ముగ్గురు పిల్లలు కళ్లు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంతో చూస్తున్నారు.
రక్ష : ఇది పిల్లల సైన్స్ ఫిక్షన్ నవల. ‘తానా’ – ‘మంచి పుస్తకం’ సౌజన్యంతో ప్రచురణ. రచయిత డా.వి.ఆర్.శర్మ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కామారెడ్డి వాస్తవ్యులు. తెలుగు భాష బోధనతో తన ఉద్యోగ జీవితాన్ని సార్థకం చేసుకున్న శర్మ గారు బాల సాహిత్యానికి చేసిన సేవ అమూల్యమైనది. వారు అనేక సాహిత్య సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ స్వయానా తానే ఒక సంస్థ అనడం సముచిత గౌరవం. ‘సాహు జీవితం – రచనలు’ వారు ఎం.ఫిల్ పరిశోధనాంశం కాగా ‘ఆధునిక కవిత్వంలో బాల్య చిత్రణ’పై వారు పి.హెచ్ డి చేయడం మరో విశేషం. మీరు చదివే ‘రక్ష’ పిల్లక కోసం వారు రాసిన సైన్స్ ఫిక్షన్ నవల. ఇప్పటివరకు శర్మ గారు 8 కవిత సంపుటులు, 4 పాటల పుస్తకాలు, రక్ష నవలతో కలిపి 4 నవలలు వెలువరించారు. వారి పూర్తి పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రచయిత ఇ – మెయిల్ : dr.v.r.sharma@gmail.com
తాను వాళ్లకు కనబడుతోందా? అప్పుడు గమనించింది రక్ష, తను మామూలుగానే నేల మీద నడుస్తోంది. తన కాళ్లు నేలకు తగులుతూనే ఉన్నాయ్! అంటే… తాను మామూలు స్థితికి వచ్చేసింది. సంతోషంతో రక్షకు గట్టిగా అరవాలనిపించింది. ద్వారం దాటి ఒక పక్కన నిలబడి, పరికించి చూసింది. అది ఊరు కాదు. ఒక జాతర లాంటిది ఏదో జరుగుతున్నట్టు ఉంది. హైదరాబాదులో ఉన్న శిల్పారామం లాంటిదేమో ఇది అనుకుంది. చాలా విశాలంగా కొన్ని ఎకరాల్లో ఉన్నట్టుంది ఆ ప్రాంతం.
తనకు ఎదురుగా కనబడుతున్న ఒక గుడారంలోకి వెళ్లింది. అక్కడ అరల్లో, పెద్దగా పొడవుగా ఉన్న బల్లల వంటి వాటి మీద రకరకాల బొమ్మలు, ఆట వస్తువులు వంటివి కనిపిస్తున్నాయి. ‘అవి అమ్మకానికి పెట్టారా?’ అని ఆలోచిస్తూ ఒక బొమ్మను చేతిలోకి తీసుకుంది రక్ష. తాను ఆ బొమ్మను పట్టుకుంది కాబట్టి నిశ్చయంగా తాను మామూలుగా మారిపోయినట్టే అనుకుంది. ఇంతలో ఎవరో వెనక నుంచి తనను భుజం మీద తట్టినట్టు అనిపించి వెనుదిరిగి చూసింది. వెనక ఇద్దరు ఆడపిల్లలు కనిపించారు. వాళ్లు దాదాపు తన ఈడు వాళ్ల లాగానే ఉన్నారు. వాళ్లు తెల్లటి కాటన్ చుడీదార్లు వేసుకున్నారు.
తాను వెనుదిరిగి చూడగానే, “రక్షా! మాతో వస్తావా, కాస్త మాట్లాడాలి,” అంది వారిలో కొప్పును పైకి ముడివేసుకున్న అమ్మాయి. చిరునవ్వుతో, బాగా తెలిసిన స్నేహితురాలిని పిలుస్తున్నట్టు ఉన్నాయి ఆ మాటలు. రక్ష మంత్రముగ్ధురాలిలా వాళ్లను అలా చూస్తూ నిలబడిపోయింది.
తాను వెనుదిరిగి చూడగానే, “రక్షా! మాతో వస్తావా, కాస్త మాట్లాడాలి,” అంది వారిలో కొప్పును పైకి ముడివేసుకున్న అమ్మాయి. చిరునవ్వుతో, బాగా తెలిసిన స్నేహితురాలిని పిలుస్తున్నట్టు ఉన్నాయి ఆ మాటలు. రక్ష మంత్రముగ్ధురాలిలా వాళ్లను అలా చూస్తూ నిలబడిపోయింది. వాళ్లలో ఏదో ఆకర్షణ ఉన్నట్టుంది. తాను వాళ్లను కాదనలేక పోతోంది. “వెళదామా!” అంటూ మరో అమ్మాయి తన కుడి చేతిని షేక్హ్యండ్ ఇస్తున్నట్టుగా ముందుకు చాచింది. రక్ష కూడా తన చేతిని ముందుకు జాపి, ఆమెతో చేయి కలిపింది. ఆ అమ్మాయి అరిచేతి స్పర్శ మెత్తగా, సుకుమారంగా ఉన్నట్టు అనిపించింది. ఏమీ ఆలోచించకుండానే, తన ప్రమేయం ఏమీ లేకుండానే సరే అన్నట్టు తల ఊపింది.
వాళ్లు ముందు నడుస్తుంటే తాను వాళ్లను అనుసరించింది. వాళ్లు ఎవరో తనకు తెలియదు. తనను ఎక్కడికి తీసుకుని వెళుతున్నారో తెలియదు. కానీ తనను పేరుపెట్టి పిలిచారు. చాలా స్నేహం, పరిచయం ఉన్నట్టు మాట్లాడారు. తాను ఎక్కడ ఉందో కూడా తనకు తెలియదు. ఇక్కడే ఉండి చేసేది ఏమీ లేదు. ‘సరే, ఏమైతే అది అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం,’ ఇలా రక్ష పరిపరి విధాలుగా ఆలోచిస్తూనే వాళ్ల వెంట నడుస్తోంది.
రక్ష ఆ నిర్మాణాల మధ్యలోంచి వెళుతుంటే అక్కడ కనిపిస్తున్న వాళ్లందరూ పిల్లలే అని, పెద్దవాళ్లు ఎవరూ అక్కడ లేరని గమనించింది. ఆ విషయం తన పక్కన నడుస్తున్న అమ్మాయిని అడిగింది. “నిజమే ఇది పిల్లల జాతర. ఇక్కడ సంవత్సరానికి ఒకసారి మూడు రోజులు పిల్లల పండగ జరుగుతుంది. ఈ జాతరలో అంతా పిల్లలమే పాల్గొంటాం. పిల్లలమే నిర్వహించుకుంటాం. మేము తయారు చేసిన వస్తువులను ఇక్కడ ప్రదర్శనకు పెడతాం. వాటిలో బొమ్మలూ, ఆట వస్తువుల నుంచి మొదలుకుని, మేము కనిపెట్టిన కొత్త వస్తువులు, తయారు చేసిన చిత్ర విచిత్రమైన పరికరాలు ఎన్నో ఉంటాయి. వాటిని కొనే వాళ్లు కొంటారు,” అని పక్కన నడుస్తున్న అమ్మాయి చెప్పింది.
వాళ్లు ఆ ప్రదేశాన్ని దాటగానే కొద్ది దూరం నుంచే అడవి ప్రారంభమైంది. అనేక వరసలుగా ఎన్నో కొండలు కనిపిస్తున్నాయి. వాటిని నిండుగా కప్పివేస్తూ దట్టంగా పెరిగిన వృక్షాలతో కూడిన అడవి అనేక రకాల ఆకుపచ్చటి అందాలతో కనిపిస్తోంది.
వాళ్లు ఆ అడవి మార్గంలో చకచకా ముందుకు కదులుతున్నారు. రక్ష కూడా వాళ్లతో కలిసి నడవడానికి ప్రయత్నిస్తోంది. వాళ్లు అలా కొంత దూరం నడిచిన తరవాత, “మా నివాసానికి వచ్చేశాం. ఇదే మా ఊరు,” అని చెప్పింది ముందు నడుస్తున్న అమ్మాయి.
“లేదు. ఆ వైరస్ మాత్రమే కాదు, ఇక్కడ అలాంటి వైరస్లు ఏవీ ప్రవేశించి మనుగడ సాగించలేవు. అది మీలోకానికి మాత్రమే పరిమితమైన విషయం,” చెప్పింది పక్కన నడుస్తున్న అమ్మాయి. తన పేరు అరణ్య అనీ, మరో అమ్మాయి పేరు అవని అనీ చెప్పింది.
అక్కడ ముఖాలకు ఎవరూ మాస్కులు ధరించడం లేదనే విషయం రక్ష గమనించింది. ఇంతకు ముందు చూసిన ఆ పిల్లల జాతరలో కూడా ఎవరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు ఏవీ పాటించలేదని గుర్తొచ్చింది. ‘ఇక్కడ కరోనా ప్రభావం ఏమీ లేదా? లేక అది పూర్తిగా తగ్గిపోయిందా?’ఆమెకు అర్థం కాలేదు. వాళ్లను ఆ విషయం అడిగింది.
“లేదు. ఆ వైరస్ మాత్రమే కాదు, ఇక్కడ అలాంటి వైరస్లు ఏవీ ప్రవేశించి మనుగడ సాగించలేవు. అది మీలోకానికి మాత్రమే పరిమితమైన విషయం,” చెప్పింది పక్కన నడుస్తున్న అమ్మాయి. తన పేరు అరణ్య అనీ, మరో అమ్మాయి పేరు అవని అనీ చెప్పింది. “ఇదే మా ఆవాసం. మా లోకానికి స్వాగతం,” అని రక్షకు చెపుతూ, వేలితో చూపించింది.
ఒక అందమైన స్వప్నాన్ని చూస్తున్నట్టు ఉంది ఆ దృశ్యం. దూరంగా ఒక పెద్ద కొండ పైనుంచి కిందకు దూకుతున్న జలపాతపు హోరు పై లోకాల్లోంచి వస్తున్న సంగీతంలా వినబడుతోంది. “ఆహా! అద్భుతం! ఎంత అందంగా ఉంది మీ ఊరు!” సంతోషం దాచుకోలేనట్టుగా చప్పట్లు కొట్టింది రక్ష.
చుట్టూ కనుచూపు మేర అనేక వరసల్లో కనబడుతున్న కొండలు. వాటి నిండా దట్టంగా వ్యాపించి ఉన్న వృక్షాలు. కొండల నడుమ అక్కడక్కడా లోయలు, మైదానాలు. అది అనేక అరణ్యాల సమూహంలా అనిపిస్తోంది. తాము నడుస్తున్న వైపు మట్టితోనూ, రాళ్లతోనూ, కట్టెలతోనూ కట్టిన చిన్నా పెద్దా ఇళ్లు. కుటీరాల్లా కొన్ని, యురోపియన్ గ్రామాల్లో కనిపించే ఇళ్లలా కొన్ని. వాలుగానో, అర్ధ గోళాకారంలోనో ఉన్న పైకప్పులు, చాలా వాటి మీద లానులా పెరిగిన పచ్చగడ్డి, పూలతో నిండిన తీగలు ఉన్నాయి. ఎటు చూసినా ప్రకృతి గీసిన రంగుల చిత్రంలా ఉంది. కుటీరాలు, ఫాంహౌజులు, ఆశ్రమాల లాగా ఉన్న ఆ నివాసాలు దగ్గర దగ్గరగా లేకుండా వాటి మధ్య విశాలమైన ప్రదేశాలు ఉన్నాయి. గడ్డి మైదానాలు ఉన్నాయి. వాటిలో అక్కడక్కడా తిరుగుతూ, మేస్తూ గుర్రాల్లాగా, పశువుల్లాగా ఉన్న కొన్ని జంతువులు కనబడుతున్నాయి. ఆ ఇళ్ల చుట్టూ, మైదానాల చుట్టూ చెక్కలతో నిర్మించినట్టున్న ప్రహరీలు, వాటిలోంచి కనబడుతున్న రకరకాల పూల మొక్కలు, చెట్లు నవ్వుతూ పలకరిస్తున్నట్టు ఉన్నాయి. ఆ ఇళ్ల పక్కల నుంచి ఊరంతా కలుపుతూ పరిశుభ్రంగా అందంగా కనబడుతున్న సన్నటి తోవలు. ఒక అందమైన స్వప్నాన్ని చూస్తున్నట్టు ఉంది ఆ దృశ్యం. దూరంగా ఒక పెద్ద కొండ పైనుంచి కిందకు దూకుతున్న జలపాతపు హోరు పై లోకాల్లోంచి వస్తున్న సంగీతంలా వినబడుతోంది. “ఆహా! అద్భుతం! ఎంత అందంగా ఉంది మీ ఊరు!” సంతోషం దాచుకోలేనట్టుగా చప్పట్లు కొట్టింది రక్ష.
వాళ్లు ఆ ఊళ్లో అలా కొంత సేపు నడిచి ఒక ఇంట్లోకి ప్రవేశించారు.
మూడో అధ్యాయం సమాప్తం. నిన్నటి భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. తొలి చాప్టర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. మీ స్పందనలు కాస్త కిందకు వెళ్లి చూడగలరు. LEAVE A REPLY అని ఇలా ఉంటుంది. అక్కడ తెలుపవచ్చు.కృతజ్ఞతలు – ఎడిటర్