Editorial

Monday, December 23, 2024
Serialరక్ష – సమ్మోహన సౌందర్యం : 20th Chapter

రక్ష – సమ్మోహన సౌందర్యం : 20th Chapter

నిన్నటి కథ

“ఆ నీలి బిలం రహస్యం కోసమే వాళ్లు రక్ష తల్లిదండ్రులను అపహరించారు కదా?” అడిగాడు శరత్.

“ఔను. కానీ ఆ నీలి బిలం తెరిచే మార్గం రక్షకు కూడా తెలియదు. అంటే ఈ లోకం వాళ్లకు ఎవరికీ తెలియదు” అని మోక్ష చెపుతుండగానే అక్కడ రక్ష ప్రత్యక్షమైంది.

ఆమె ముఖం పున్నమి చందమామలా, ఎన్నడూ లేనంత ప్రశాంతంగా కనిపిస్తోంది. ఆమె తన పనిని నిరాటంకంగా పూర్తి చేసుకుని వచ్చిందని ఆమెను చూస్తుంటేనే తెలిసిపోతోంది. “ఇక ఇక్కడి నుంచి బయలు దేరదాం,” అంది మోక్ష. వాళ్లు అక్కడి నుంచి కదిలారు. తర్వాత ఏమైందో చదవండి…

ఇరవయ్యో అధ్యాయం

డా.వి.ఆర్.శర్మ

వాళ్లు తిరగి వచ్చే సరికి సూర్యాస్తమయం కావస్తోంది. జలాశయానికి పడమటి వైపున కొండల మధ్య సూర్యుడు దిగిపోతున్న దృశ్యం శ్రీశైలంలో ఎంతో సుందరంగా ఉంటుంది. కానీ వాళ్లు ఆ సౌందర్యాన్ని ఆస్వాదించే స్థితిలో లేరు. ఆ అడవిలోని గుహ లోంచి నేరుగా తమ గదికి చేరుకున్నారు. బయటి నుంచి మోక్ష తలుపులు తీసింది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ల్యాండ్ ఫోన్ మోగింది. అది కిడ్నాపర్లు చేస్తున్న ఫోన్ అనుకున్నారు వాళ్లు. శరత్ ఇంకా తన వసతికి వెళ్ల లేదు. మోక్ష తన సాధారణ రూపంలోకి వెళ్లిపోయింది. ఈ రోజు ఫోన్ చేసి, తరవాత ఏం చేయాలో కిడ్నాపర్లు చెపుతామన్నారు. ఆ ఫోన్ కోసమే ఎదురు చూస్తూ మాట్లాడుకుంటున్నారు.

రక్ష ఫోన్ ఎత్తి, “హలో!” అంది.

“హలో, నేను మాణిక్యం ఫ్రెండుని మాట్లాడుతున్నాను. అతను ఈ రోజు ఎందుకో ఆఫీసుకి రాలేదు. సెలవు కూడా పెట్టలేదని ఆఫీసులో చెప్పారు. అతని కోసం నేనూ, ఆఫీసు వాళ్లూ చాలాసార్లు ఫోన్ చేశాం. కానీ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇంట్లో ఉంటే సంపత్ ఫోన్ చేశాడని చెప్పండి. ఒకసారి అతనిని మాట్లాడమని చెప్పండి,” అన్న మాటలు అటు నుంచి వినిపించాయి.

‘ఎవరు? వాళ్లేనా?’ అన్నట్టు శరత్ సైగ చేశాడు. కాదన్నట్టు తల ఊపుతూ, ఫోన్లో జవాబు చెప్పింది రక్ష,

“నాన్న లేరు అంకుల్, అనుకోకుండా హైదరాబాద్ వెళ్లారు. నాన్న ఫోన్ కింద పడి పాడయింది. వచ్చిన తరవాత మాట్లాడిస్తాను.”

ఆ తరవాత అర గంటకు రక్ష సెల్ఫోన్ మోగింది. ఏదో తెలియని నంబర్ అది.

“బేబీ, మేం చెప్పే మాటలు జాగ్రత్తగా విను. మాకు కావలసిన వస్తువును తీసుకుని రాత్రి పదకొండు గంటలకు ఇంట్లోంచి రోడ్డు మీదకు ఒంటరిగా రా. అక్కడికి ఒక నల్లటి కారు వస్తుంది. అది నిన్ను పికప్ చేసుకుంటుంది. ఏ ప్రశ్నలు వేయకుండా కూర్చో.

శరత్ నిశ్శబ్దంగా కూర్చుని వింటున్నాడు. స్పీకర్ ఆన్ చేసింది రక్ష. “బేబీ, మేం చెప్పే మాటలు జాగ్రత్తగా విను. మాకు కావలసిన వస్తువును తీసుకుని రాత్రి పదకొండు గంటలకు ఇంట్లోంచి రోడ్డు మీదకు ఒంటరిగా రా. అక్కడికి ఒక నల్లటి కారు వస్తుంది. అది నిన్ను పికప్ చేసుకుంటుంది. ఏ ప్రశ్నలు వేయకుండా కూర్చో. సెల్ఫోన్లు వంటివి ఏవీ వెంట తీసుకుని రావద్దు. కారు ఆగినచోట దిగి నిలబడు. అక్కడ నిన్ను మా మనుషులు కలుస్తారు. వాళ్లు చెప్పినట్టు చేయి. మరోసారి హెచ్చరిస్తున్నాను. ఎలాంటి తెలివితేటలు ప్రదర్శించినా మీ అమ్మానాన్నలు దిక్కులేని చావు చస్తారు,” ఆ గొంతు కఠినంగా వినిపించింది.

“లేదు. మీరు చెప్పినట్టే చేస్తాను. దయచేసి వాళ్లను ఏమీ చేయొద్దు,” ప్రాధేయపడింది రక్ష. అటు వైపు నుంచి ఫోన్ కట్ అయింది.

“నేనూ నీతో వస్తాను,” అన్నాడు శరత్.

“వద్దు. వాళ్లు చెప్పింది విన్నారు కదా. నేను ఒంటరిగానే వెళతాను,” అతడిని వారిస్తున్నట్టు చేయి ఊపుతూ అంది రక్ష.

“ఆడపిల్లవు, రాత్రి వేళ ఒంటరిగా ఎలా వెళతావు?” అన్నాడు శరత్ ఆందోళనగా.

“ఫరవాలేదు. మోక్ష నా తోనే ఉంటుందిగా. ఆమె ఉన్నంత వరకూ నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. కంగారు పడకండి. మీరు ఇక్కడే ఉంటారా? మీ గదికి వెళతారా?” అంది రక్ష ఇక ఆ విషయాన్ని అంతటితో ఆపేయమని సూచిస్తున్నట్టు.

“సరే. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు క్షేమంగా వెళ్లిరా,” చెప్పాడు శరత్. తరవాత, “నా బ్యాగ్లో బన్ను, బిస్కట్స్ ఉన్నాయి. తిందామా? మనం ఇవాళ ఏమీ తినలేదు!” అన్నాడు.

“నిజమే. మా ఇంట్లో కొన్ని అరటి పళ్లు ఉండాలి,” అని లేచి, అరటి పళ్లు, మంచినీళ్ల బాటిల్ తెచ్చింది.

ఆకాశం అంతా పున్నమి వెన్నెలతో స్వచ్ఛంగా కనిపించింది. ఆశ్చర్యంతో చంద్రునివైపు చూసింది రక్ష. పైన చంద్రుడు గుండ్రంగా, నిండుగా విచ్చుకున్నాడు. నమ్మలేక కళ్లు ఇంత చేసుకుని చుట్టూ చూసింది. అక్కడి ప్రకృతి అంతా వెన్నెల్లో స్నానమాడుతూ తళతళా మెరిసిపోతోంది. అది అనిర్వచనీయమైన ప్రకృతి సమ్మోహన సౌందర్యం. అడవిలో పూచిన వెన్నెల ఇంత అద్భుతంగా, రమణీయంగా ఉంటుందా!

రాత్రి పదకొండు గంటలు అవుతుండగా ఇంట్లోంచి బయటకు వచ్చి, గేటు దాటి రోడ్డు పక్కన నిలబడింది. ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్టు వెంటనే అక్కడికి ఒక నల్లటి కారు వచ్చి ఆమె పక్కన ఆగింది. వెంటనే వెనక డోర్ తెరుచుకుంది. “ఎక్కు,” అనే మాట వినిపించింది. రక్ష లోపలికి ఎక్కి కూర్చుంది. కారు నడుపుతున్న వ్యక్తి, అతని పక్కన ఇంకొకరు కనిపించారు. కారు కదిలింది. వాళ్లు ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చున్నారు. రక్ష కూడా ఇక ఏమీ ప్రశ్నలు వేయకుండా అలా చూస్తూ కూర్చుంది. రెండు వైపులా కారు విండోస్ కు నల్లని అద్దాలు ఉన్నాయి. బయట ఏమీ కనిపించడం లేదు. ముందు వైపు చూస్తూ కూర్చుంది. అలా కొంతసేపు ప్రయాణించిన తరవాత కారు ఆగింది. వాళ్లు కిందికి దిగుతూ రక్షనూ దిగమన్నారు. దిగి చుట్టూ చూసింది. ఎదురుగా కొంత దూరంలో కృష్ణా నది. ఒడ్డుకు దగ్గర ఒక బోటు కనిపించింది. బహుశా లింగాల గట్టు దగ్గరి ప్రాంతం కావొచ్చు అనుకుంది. “ఛలో!” అంటూ వాళ్లు ఆ పడవ దిక్కు అడుగులు వేశారు. రక్ష వాళ్లతో బాటు ఆ పడవ ఎక్కింది. పడవ బయలుదేరింది.

ఎవరూ ఏమీ మాట్లాడడం లేదు. రక్ష బయటకు చూస్తూ కూర్చుంది. ఆకాశంలో పడమటి దిక్కున శుక్లపక్ష షష్టి చంద్రుడు సన్నటి నెలవంకలా కనబడుతున్నాడు. ఆకాశంలో ఆ మసక వెన్నెల్లో పరిసరరాలు అస్పష్టంగా కనబడుతున్నాయి. రెండు వైపులా కొండలు. నడుమ కృష్ణా నది. పడవ వెళుతున్న దిక్కు చూస్తుంటే అది నాగార్జునసాగర్ జలాశయం వైపు వెళుతున్నట్టు ఉంది. తన తండ్రి నాగార్జునసాగర్లో పని చేస్తున్న కాలంలో తల్లిదండ్రులతో ఈ మార్గంలో మూడు ఏళ్ల కిందట తాను ప్రయాణం చేసింది.

నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి అప్పుడప్పుడే తెలంగాణ పర్యాటక శాఖవారు లాంచీలో వెళ్లే ఏర్పాట్లు చేశారు. కానీ లాక్డౌన్ వల్ల గత మార్చ్ నుంచి దానిని నడపడటం లేదు.

తన వాళ్లతో నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి తాను లాంచ్లో వచ్చి వెళ్లింది. సుమారు నూట ఇరవై కిలోమీటర్ల ప్రయాణం. దాదాపు వంద మంది వరకు హాయిగా కూర్చుని ప్రయాణం చేయగల పెద్ద లాంచి అది. ఆ రోజు తాము మధ్యాహ్నం పన్నెండు గంటలకు నాగార్జునసాగర్లో బయలుదేరి, సాయంత్రం ఆరు గంటల సమయంలో శ్రీశైలం చేరిన జ్ఞాపకం ఉంది. రెండు జలాశయాల మధ్య కృష్ణా నదిలో ఆ ప్రయాణం ఒక మరచిపోలేని అనుభవం. కృష్ణవర్ణంలో నేల మీద కదులుతున్న ఆకాశం లాంటి ఆ నీటిలో వెళుతుంటే, రెండు వైపులా రకరకాల ఆకారాల్లో కొండలు, గుట్టలు ఉన్నాయి. వాటిని ఆవరించుకుని పచ్చటి వృక్షాలతో కూడిన నల్లమల అడవులు. అక్కడక్కడా ఆ కొండల మీది నుంచి ఆడుతున్న పిల్లల్లా నదిలోకి దూకుతున్న జలపాతాలు. ఆ కొండల ఒడిలో కొన్ని చోట్ల గిరిజన ఆవాసాలు, పశువులు, జంతువులు, ఎగురుతున్న పక్షులు కనిపిస్తున్నాయి. చుట్టూ ఆవరించిన ప్రగాఢ నిశ్శబ్దంలో నీటి అలల సంగీతం వినిపిస్తోంది. దూరంగా కొండల మీద అప్పుడప్పుడూ కనిపిస్తూ, అలా నిలిచి ఆ ప్రకృతి పారవశ్యంలో ధ్యానం చేసుకుంటున్నట్టు ఉన్న ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. అది ఒక అద్భుతమైన ప్రాకృతిక స్వప్న జగత్తులా ఉందనిపించింది. ఇలా షష్ఠి చంద్రవంక మసక వెలుతురులో కాకుండా నిండు పున్నమి వెన్నెలలో చూస్తే మరెంత అద్భుతంగా ఉంటుందో కదా!

రక్షకు ఆ ఆలోచన రాగానే ఆకాశం అంతా పున్నమి వెన్నెలతో స్వచ్ఛంగా కనిపించింది. ఆశ్చర్యంతో చంద్రునివైపు చూసింది రక్ష. పైన చంద్రుడు గుండ్రంగా, నిండుగా విచ్చుకున్నాడు. నమ్మలేక కళ్లు ఇంత చేసుకుని చుట్టూ చూసింది. అక్కడి ప్రకృతి అంతా వెన్నెల్లో స్నానమాడుతూ తళతళా మెరిసిపోతోంది. అది అనిర్వచనీయమైన ప్రకృతి సమ్మోహన సౌందర్యం. అడవిలో పూచిన వెన్నెల ఇంత అద్భుతంగా, రమణీయంగా ఉంటుందా!

“చాలా బాగుంది కదా!” అన్న మోక్ష మాటలు వినిపించి తన కంఠం వైపు చూసుకుంది. ఆ లాకెట్ లోంచి వినిపిస్తున్నాయి ఆ మాటలు. నువ్వు ఇలా చూడాలని అనుకున్నావు కదా! నీ కోసం నేనే చూపిస్తున్నాను. ఇది సృష్టిలో మార్పు కాదు. కేవలం నీకు ఇలా కనిపించేలా నీ దృష్టిని మార్చాను.”

“థాంక్స్, మోక్షా!” అంది ఆనందంగా. కానీ ఆ మాటలు గట్టిగా అనేసింది.

ఆ బోటులో ఆమెను తీసుకుని పోతున్న వాళ్లు ఆమె వైపు విచిత్రంగా చూశారు. రక్ష తలవంచుకుని తనలో తాను మాట్లాడుకుంటున్నట్టు కనిపించింది. పడవ వెళుతున్న వైపు వాళ్లు మళ్లీ దృష్టి సారించారు.

ఈ లోకం సాటిలేని, అమూల్యమైన సౌందర్య సీమ. ప్రకృతి సృష్టించిన ఈ సౌందర్యాన్నీ, సంపదనూ మానవులే కదా ధ్వంసం చేస్తున్నారు. కేవలం తమ స్వార్థం కోసం దురాశతో, ఆధిపత్యం, వ్యాపారం, అంతులేని సంపాదనా కాంక్షలతో ఈ లోకాన్ని నివాసయోగ్యం కాకుండా మనుషులే మారుస్తున్నారు.

“నిజమే. ఈ లోకం సాటిలేని, అమూల్యమైన సౌందర్య సీమ. ప్రకృతి సృష్టించిన ఈ సౌందర్యాన్నీ, సంపదనూ మానవులే కదా ధ్వంసం చేస్తున్నారు. కేవలం తమ స్వార్థం కోసం దురాశతో, ఆధిపత్యం, వ్యాపారం, అంతులేని సంపాదనా కాంక్షలతో ఈ లోకాన్ని నివాసయోగ్యం కాకుండా మనుషులే మారుస్తున్నారు. ఏదో ఒకనాడు, బహుశా ఈ శతాబ్దంలోనే ఆ పరిస్థితి ఏర్పడవచ్చు. మనుషులకు ఈ భూమి మీద నివసించడం సాధ్యం కాని పరిస్థితి తప్పకుండా రాబోతోంది. మనుషులకు కూడా ఆ విషయం తెలుసు కాబట్టే ఇతర గ్రహాల్లో తమ కాలనీల ఏర్పాట్ల కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కోవడం అంటే ఇదే.” మోక్ష మాటలు విని నిజమే అన్నట్టు తల ఊపింది రక్ష.

అలా సుమారు రెండు గంటల ప్రయాణం తరవాత ఒక కొండ దగ్గరగా వెళ్లి బోటు ఆగింది. వాళ్ల మనుషులు ఇద్దరు అక్కడ బోటులోకి ఎక్కారు. ఆడ మనిషికి ఇరవై అయిదేళ్లు ఉండొచ్చు. కుర్తా, పైజామా వేసుకుంది. అతడు జీన్స్ ప్యాంట్ మీద టైట్ టీషర్టు, దానిపైన రెక్సిన్ జాకెట్ వేసుకున్నాడు. అతడు ముప్పై ఏళ్ల వాడిలా కనబడుతున్నాడు. అతని కండలు తిరిగిన శరీరం ఆ డ్రెస్ లోంచి కూడా తెలిసిపోతోంది. వాళ్లు ఎక్కిన తరవాత మళ్లీ పడవ కదిలింది. పడవ కదలగానే వాళ్లు రక్ష దగ్గరికి వచ్చి నిలబడ్డారు. “ఆ వస్తువు తెచ్చావా?” అడిగింది ఆ ఆడమనిషి. రక్ష, ‘తెచ్చాను,’ అన్నట్టుగా తల ఊపింది. “ఏది? ఇలా ఇవ్వు,” చేయి ముందుకు జాపి అడిగాడు అతడు. “ముందు మా అమ్మా, నాన్నల్ని చూపించండి,” స్థిరంగా తన నిర్ణయాన్ని చెప్పింది రక్ష.

ఆ ఆడ మనిషి అతడిని వారిస్తూ అంది, “కేవలం ఈ అమ్మాయి ఆ వస్తువు తెచ్చిందా, లేదా అని కనుక్కోవడం వరకే మన పని. ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని మనం ముట్టుకోవద్దని, చూడొద్దని మన భాయ్ చెప్పాడు కదా. మనం తన మాట వినకపోతే మన గతి ఏమవుతుందో నీకు తెలియదా?” ఆమె గొంతులో కోపం ధ్వనించింది. అతడు కోపంగా చూస్తూ అలాగే నిలబడ్డాడు. చేయి పట్టుకుని అతడిని ఆమె అక్కడి నుంచి పక్కకు తీసుకుని పోయింది. కాసేపు వాళ్లు మెల్లగా ఏదో మాట్లాడుకున్నారు. తరవాత మళ్లీ రక్ష దగ్గరికి వచ్చారు.

ఆ ఆడ మనిషి తన బ్యాగ్లోంచి ఒక ఇంజక్షన్ తీసి, ఏదో మందు దానిలోకి ఎక్కిస్తూ రక్షతో చెప్పింది, “నీకు ఈ ఇంజక్షన్ చేయాలి. భయపడకు, ఇది కేవలం నిద్రపోవడానికే. నువ్వు లేచే సరికి మీ తల్లిదండ్రుల దగ్గర ఉంటావ్,” అంది రక్షను సమీపిస్తూ. ఏం చేయాలా అని ఆలోచిస్తూ, రక్ష తలవంచి లాకెట్ను చూసింది. “ఫరవాలేదు. నీకు హానీ కలిగించే మందులూ, ఆయుధాలూ ఏవీ నీపై పని చేయవు. కానీ మానసికంగా అలసటతో ఉన్న నీకు కొంత విశ్రాంతి కావాలి. హాయిగా నిద్రపో. ఏం జరిగినా నేను చూసుకుంటాను,” భరోసా ఇచ్చింది మోక్ష.

ఇంజక్షన్ చేయడానికి వీలుగా రక్ష మౌనంగా తన జబ్బను ఉంచింది. ఎంతో అనుభవం ఉన్న దానిలా ఆ ఆడ మనిషి ఇంజక్షన్ ఇచ్చింది. తరవాత వాళ్లిద్దరూ క్యాబిన్ వైపు వెళ్లిపోయారు.

“వీళ్లు ఇక్కడి నుంచి నిన్ను నాగార్జునసాగర్ తీసుకుని వెళతారు. అక్కడి నుంచి హైద్రాబాద్లో ఉన్న వాళ్ల స్థావరానికి తీసుకుని వెళతారు. అక్కడే మీ అమ్మా, నాన్నా, వీళ్ల నాయకుడూ ఉన్నారు. ఇందాక వాళ్లు అటువెళ్లి మాట్లాడుకున్న మాటలు విన్నాను. ఇక నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో,” చెప్పింది మోక్ష.

రక్ష కళ్లు నిదానంగా బరువెక్కుతున్నాయి. నిద్ర ముంచుకుని వస్తోంది…

గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి

పందొమ్మిదో అధ్యాయంపద్దెనిమిదో అధ్యాయం | పదిహేడో అధ్యాయం | పదహారో అధ్యాయం | పదిహేనో అధ్యాయం | పద్నాలుగో అధ్యాయం | పదమూడో అధ్యాయం | పన్నెండో అధ్యాయం | పదకొండో అధ్యాయం | పదో అధ్యాయం | తొమ్మిదో అధ్యాయం | ఎనిమిదో అధ్యాయం | ఏడో అధ్యాయం | ఆరో అధ్యాయం | ఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం  మూడో అధ్యాయం రెండో అధ్యాయం |  తొలి అధ్యాయం  | రచయిత పరిచయం

మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article