Editorial

Wednesday, January 22, 2025
Serial‘రక్ష’ - 16th Chapter : కుడి చేత్తో కంఠం దగ్గర ముట్టుకుని...

‘రక్ష’ – 16th Chapter : కుడి చేత్తో కంఠం దగ్గర ముట్టుకుని…

నిన్నటి కథ

మోక్ష మాటలతో రక్షకు కొండంత ధైర్యం వచ్చింది. “సరే ఇప్పుడు నేనేం చేయాలి?” మోక్షను ప్రశ్నించింది. “శరత్ ను వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు”  అంటూ తరవాత ఏం చేయాలో వివరంగా చెప్పి వెళ్లిపోయింది మోక్ష.

రక్ష ఫోన్ చేసిన అరగంటలో అక్కడికి చేరుకున్నాడు శరత్. ఆ తర్వాత?

పదిహారో అధ్యాయం

డా.వి.ఆర్.శర్మ

శ్రీశైలం రిజర్వాయర్ కు కుడివైపున కొంత దూరంలో ఉన్న కొండ మీద, దాని వాలులో అక్కడి ఉద్యోగుల కోసం ఇటీవలే నిర్మించిన పది క్వార్టర్లు ఉన్నాయి. వాటికి ప్రహరీ గోడలూ, వాటి లోపల పెద్ద పెద్ద చెట్లూ, పూల మొక్కలూ, క్రోటన్లూ కనిపిస్తున్నాయి. వాటికి కొద్ది దూరం నుంచి మెలికలు తిరుగుతున్న ఒక రోడ్డు కొండపై ఉన్న టవర్ వరకు వెళుతోంది. ఉదయం ఆరు గంటలు కావస్తోంది. దూరం నుంచి గాలిలో తేలి వస్తూ, శివ గీతాలు మంద్రంగా వినిపిస్తున్నాయి. కొండకు కింది భాగంలో కృష్ణా నది నిండు కుండలా, ఒక పెద్ద సరస్సులా నీలిరంగులో కనిపిస్తోంది. చుట్టూ కొండలు, చెట్ల పచ్చదనం. ప్రకృతీ, మనుషులూ కలిసి సృష్టించిన సుందరమైన స్వప్నంలా మనస్సులను పరవశింప చేస్తోంది.

బ్యాక్ప్యాక్ వేసుకుని శరత్ వచ్చేశాడు. అతడు వచ్చేసరికి రక్ష తలుపులు తెరిచి అతని కోసం ఎదురు చూస్తోంది. “ఏమైంది, రక్షా? ఎందుకంత కంగారుగా రమ్మని ఫోన్ చేశావ్?” రక్ష కనబడగానే అడిగాడు. తన తల్లిదండ్రులను ఎవరో కిడ్నాప్ చేసిన విషయం చెప్పింది రక్ష. వాళ్లకు కావలసిన వస్తువు ఒకటి ఈ నల్లమలలో ఎక్కడో ఒక రహస్య ప్రదేశంలో ఉందని, దానిని తెచ్చి వాళ్లకు అప్పగిస్తే తన తల్లిదండ్రులను విడిచిపెడతారని, లేకుంటే నిర్దాక్షిణ్యంగా చంపేస్తామని బెదిరించారని చెప్పింది. ఆ వస్తువును వెతకడానికి వెళ్లాలని, అందుకే శరత్ ను పిలిచానని చెప్పింది. చెప్పకూడని రహస్యాలు మాత్రం చెప్పకుండా దాచింది. చివరికి, “నాతో రావడానికి నీకు వీలు అవుతుందా, అన్నా?” అని అడిగింది.

ఆమె చెప్పింది విని, కొంత ఊహించుకుని పరిస్థితిని అర్థం చేసుకున్నాడు శరత్. ఆమె కొన్ని విషయాలు తనకు చెప్పడం లేదని కూడా అనుకున్నాడు. “నేను రడీ అయ్యే వచ్చాను. నా ప్రోగ్రామ్స్ క్యాన్సల్ చేసుకున్నాను. ఇంతకన్నా ముఖ్యమైన పని మరేం ఉంటుంది? పద వెళదాం. మనం ఎక్కడికి వెళ్లాలో నీకు తెలుసా?” అడిగాడు.

“తెలుస్తుంది,” అంటూ వీపున తన బ్యాక్ప్యాక్ను వేలాడదీసుకుంది. తరవాత తలుపు వైపు చూస్తూ తన కంఠం దగ్గర కుడి చేతి వేళ్లతో ముట్టుకుంది. ఎదురుగా ఉన్న తలుపులు నిదానంగా వాటంతట అవే మూసుకున్నాయి. తరవాత బయటి నుంచి ఎవరో గొళ్లెం పెట్టి తాళం వేసిన శబ్దం వినిపించింది. తరవాత కిటికీ లోంచి తాళం చెవి ఎగిరి వచ్చి రక్ష కాళ్ల దగ్గర పడింది. రక్ష దానిని తీసుకుని తన బ్యాగ్లో వేసుకుంది. శరత్ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. తాను అనుకున్నట్టే, తనకు కొన్నేళ్ల కిందట కలిగిన అనుభవాల్లాగానే ఎవరూ నమ్మలేనిది, ఎవరూ ఊహించలేనిది ఏదో రక్ష జీవితంలో జరుగుతోంది. ఆలోచిస్తూనే రక్షవైపు చూస్తున్నాడు శరత్.

రక్ష మళ్లీ తన కుడి చేత్తో కంఠం దగ్గర ముట్టుకుని, తరవాత చేతిని ముందుకు చాపి గుండ్రగా గాలిలో గీస్తున్నట్టు తిప్పి, పిడికిలి తెరిచి అటువైపు విసిరింది. మరుక్షణంలో… అక్కడ గాలిలో ఒక నీలిరంగు కాంతి వలయం చక్రంలా ప్రత్యక్షమైంది.

రక్ష మళ్లీ తన కుడి చేత్తో కంఠం దగ్గర ముట్టుకుని, తరవాత చేతిని ముందుకు చాపి గుండ్రగా గాలిలో గీస్తున్నట్టు తిప్పి, పిడికిలి తెరిచి అటువైపు విసిరింది. మరుక్షణంలో… అక్కడ గాలిలో ఒక నీలిరంగు కాంతి వలయం చక్రంలా ప్రత్యక్షమైంది. అది గాలిలో భూమికి అడుగు ఎత్తున నిలువుగా తిరుగుతోంది. దాని మధ్య తెల్లటి కాంతి నీళ్ల మీద సూర్యుని వెలుతురులా తళతళలాడుతూ ఉంది. దాని వెనక వైపు ఏమీ కనిపించడం లేదు. “శరతన్నా! వెళదాం పద,” అంటూ మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా శరత్ చేతిని పట్టుకుని ఆ కాంతి వలయంలోకి నడిచింది రక్ష. ఒక చల్లటి కాంతి కెరటంలోకి వెళుతున్నట్టు అనిపించింది. మరుక్షణం వాళ్లు దానిలోంచి అటువైపు చేరుకున్నారు.

అక్కడ చుట్టూ దట్టమైన కీకారణ్యం. చెట్లూ, ముళ్లపొదలు, రాళ్లు. నేల కనబడకుండా పెరిగిన రకరకాల గడ్డి, చిన్న చిన్న పొదలూ. ఎక్కడా తోవ అన్నది లేదు. ఆకాశం కూడా కనబడనంత దట్టంగా తమ చుట్టూ ఉన్న చెట్లు, వాటి కొమ్మలు పెరిగి ఉన్నాయి. అది నల్లమల అడవిలో ఇంతవరకూ బయటి ప్రపంచం అడుగుపెట్టని ప్రాంతం. పులులూ, ఎలుగుబంట్లూ తిరిగే ప్రదేశం. బయటివారు ఎవరైనా అక్కడికి రావాలంటే కనీసం దారిలేని ఆ ప్రాంతానికి యాబై కిలోమీటర్లు నడుచుకుంటూ కొండలు ఎక్కుతూ, దిగుతూ రావాలి. చివరికి ఆ అడవుల్లో ఉండే చెంచులు, కూడా అక్కడికి రావడానికి సాహసం చేయరు.

తాము నిలబడ్డ చోటు నుంచి తల తిప్పి చుట్టూ చూశారు. చెట్లు, పొదలు, గడ్డీ, ముళ్లచెట్లతో కూడిన పెద్ద పెద్ద బండరాళ్లు. దట్టంగా, ఆకులతో నిండిన చెట్ల కొమ్మలు కనిపిస్తున్నాయి. ఎదురుగా ఉన్న బండరాళ్ల వైపు కదిలింది రక్ష. శరత్ ఆమెను అనుసరించాడు. నడవడం చాలా కష్టంగా ఉంది. వాడిగా ఉన్న ముళ్ల చెట్ల కొమ్మలు అడ్డుతగులుతున్నాయి. కింద నేల కనబడకుండా ఉన్న ఆ గడ్డిపొదల్లో ఏ పాములు ఉన్నాయో, తేళ్లు ఉన్నాయో తెలియదు. దారి చేసుకుంటూ వాళ్లు అలా కొంతదూరం నడిచి బండరాళ్లదగ్గరికి చేరుకున్నారు.

ఆమె అక్కడికి వెళ్లి నిలబడగానే నాలుగు అడుగుల ఎత్తున్న ఒక బండరాయి మెల్లగా కొద్దిగా పక్కకు జరిగింది. జాగ్రత్తగా చూస్తే తప్ప ఆ రాతి కింద నేలలోకి ఒక సొరంగం లాంటిది ఉన్నట్టు తెలియడం లేదు.

అవి ఇరవై ముప్పై అడుగుల ఎత్తున్న బండరాళ్లు. వాటి చుట్టూ చిన్న చిన్న పొదలూ, వంపు తిరిగిన మొనదేలిన ముళ్లతో ఉన్న చెట్లు ఉన్నాయి. వాటిల్లో ఒక బండరాయి ముందుకు వెళ్లి ఆగింది రక్ష. ఆమె అక్కడికి వెళ్లి నిలబడగానే నాలుగు అడుగుల ఎత్తున్న ఒక బండరాయి మెల్లగా కొద్దిగా పక్కకు జరిగింది. జాగ్రత్తగా చూస్తే తప్ప ఆ రాతి కింద నేలలోకి ఒక సొరంగం లాంటిది ఉన్నట్టు తెలియడం లేదు. దానిని దాచి ఉంచుతూ అక్కడ దట్టమైన పొదలు ఉన్నాయి. వాటిని వాళ్లు ఒక కర్ర సహాయంతో పక్కకు తొలగిస్తూ ఆ సొరంగంలోకి దిగబోతున్నారు.

ఇంతలో అదిరిపడేలా పక్కనే భయంకరంగా పులుల గాండ్రింపులు వినిపించాయి. అంత అకస్మాత్తుగా అవి అక్కడికి ఎలా వచ్చాయో తెలియదు. రెండు పెద్ద పులులు. చాలా బలంగా, ఎత్తుగా కనబడుతున్నాయి. అవి వాళ్లిద్దరికి చెరొక వైపున నిలబడి, మరోసారి భయంకరంగా గర్జించాయి. పదునైన వాటి పళ్లు, వేటాడబోతున్న విధంగా చూస్తున్న వాటి కళ్లు… మరుక్షణంలోనే అవి దాడి చేయబోతున్నట్టు తెలుస్తోంది.

రక్ష కంగారు పడకుండా తన కంఠాన్ని ముట్టుకుని, వాటి వైపు చూసింది. ఆవి కదలకుండా అలాగే నిలబడిపోయాయి. “వెళ్లండి,” వాటిని చూస్తూ మృదువుగా చెప్పింది రక్ష. అవి నిదానంగా రక్ష దగ్గరికి వచ్చి ఆమె చుట్టూ తిరిగి, మరోవైపుకి చెంగున దూకి అడవిలోకి వెళ్లిపోయాయి. “మనం వెళదాం,” అంటూ ఆ సొరంగంలోకి దిగింది రక్ష. శరత్ తన ఆశ్చర్యాన్ని పక్కన పెట్టి ఆమెను అనుసరించాడు. నేలలో చిన్న కలుగులా బయటికి కనిపించిన ఆ మార్గం లోపలికి దిగి, కొద్ది దూరం పాకుతూ వెళ్లిన తరవాత పెద్ద గుహలా మారింది.

రక్ష ఎడమ వైపు ఉన్న సొరంగ మార్గంలోకి నడిచింది. ఆ మార్గంలో దాదాపు వంద గజాలు నడిచిన తరవాత వాళ్లకు కనిపించిన దృశ్యాన్ని చూసి శరత్ ఒళ్లు అనుకోకుండానే జలదరించింది.

వాళ్లు లేచి నిలబడ్డారు. ఆ సొరంగంలో మసక వెలుతురు మాత్రమే ఉంది. దాదాపు పది అడుగుల ఎత్తు ఉంది ఆ సొరంగం. చుట్టూ బండరాళ్లు. పైన గబ్బిలాలు వేలాడుతున్నాయి. ఏదో తెలియని దుర్వాసన. కొంతదూరం వెళ్లిన తరవాత ఆ మార్గం మూడుగా చీలిపోయింది. ఎటు వెళ్లాలో తెలిసిన దానిలా రక్ష ముందుకు నడుస్తోంది. కొంత దూరం నడిచిన తరవాత పూర్తిగా చిమ్మ చీకటిగా మారింది. వాళ్లు తమ బ్యాగుల్లోంచి టార్చ్ లైట్లు తీసి వెలిగించారు. అలా మరికొంత దూరం వెళ్లిన తరవాత నేల మీద నీళ్లు తగిలాయ్.

ముందుకు వెళుతున్న కొద్దీ ఆ నీటి ప్రవాహం పెరుగుతోంది. దాదాపు నడుము దాకా నీళ్లు వచ్చాయి. దారి ఇరుకుగా మారింది. అలాగే వాళ్లు జాగ్రత్తగా ముందుకు నడుస్తున్నారు. కొంత దూరం నడిచిన తరవాత మళ్లీ ఆ మార్గం రెండుగా చీలింది. “అటు వెళ్లాలి,” అంటూ రక్ష ఎడమ వైపు ఉన్న సొరంగ మార్గంలోకి నడిచింది. ఆ మార్గంలో దాదాపు వంద గజాలు నడిచిన తరవాత వాళ్లకు కనిపించిన దృశ్యాన్ని చూసి శరత్ ఒళ్లు అనుకోకుండానే జలదరించింది.

గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి

పదిహేనో అధ్యాయంపద్నాలుగో అధ్యాయం | పదమూడో అధ్యాయం | పన్నెండో అధ్యాయం | పదకొండో అధ్యాయం | పదో అధ్యాయం | తొమ్మిదో అధ్యాయం | ఎనిమిదో అధ్యాయం | ఏడో అధ్యాయం | ఆరో అధ్యాయం | ఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం  మూడో అధ్యాయం రెండో అధ్యాయం |  తొలి అధ్యాయం  | రచయిత పరిచయం

మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article