Editorial

Wednesday, January 22, 2025
Serialనల్లమలలో 'రక్ష' – 14th Chapter

నల్లమలలో ‘రక్ష’ – 14th Chapter

నిన్నటి కథ

శరత్ ఇంటికి వెళ్లిన తరవాత కూడా రాత్రి కలిగిన అనుభవం గురించి చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. నిన్న రాత్రి మగత నిద్రలో ఒక కలలాంటి దృశ్యం… రక్ష తనతో మాట్లాడుతోంది. తాము రేపు నల్లమల వెళుతున్నామని, కూడా తమతో తప్పకుండా రమ్మని అడుగుతోంది. అంతేకాదు ఆమె రక్షలాగే కనబడుతున్నా ఎందుకో కొంత కొత్తగా అనిపించింది. అన్నట్టు, రక్ష తన తల్లితో కలిసి రేపు నల్లమల అడవిలోని శ్రీశైలం వెళ్లబోతోంది. ఏం జరగబోతోందో… ఆ తర్వాత?

పద్నాలుగో అధ్యాయం

డా.వి.ఆర్.శర్మ

రచయిత డా.విఆర్ శర్మ

వాళ్లు హైదరాబాద్ దాటి శ్రీశైలం రోడ్డు ఎక్కేసరికి ఉదయం ఎనిమిది గంటలు దాటింది. శరత్ కారు నడుపుతున్నాడు. అతడి పక్క సీట్లో రక్ష కూర్చుంది. నందన వెనక సీట్లో కూర్చుంది. ఎనబై, వంద దాటని వేగంతో జాగ్రత్తగా కారు వెళుతుంటే రక్ష ఆ మార్గాన్నీ, చుట్టూ కనిపిస్తున్న వాటినీ చూస్తూ కూర్చుంది. నందన ఏదో పుస్తకం పట్టుకుని చదువుకుంటోంది. మ్యూజిక్ సిస్టంలోంచి సన్నగా పాత హిందీ పాటలు వినపిస్తున్నాయి. ‘ఖిల్తే హై గుల్ యహా…’ కిశోర్ కుమార్ పాట మొదలైంది. అప్పుడప్పుడు వాళ్లు ఏవేవో కబుర్లు చెప్పుకుంటున్నారు.

“శరత్! నువ్వు రాసిన నీ మొదటి నవల చదివాను. చాలా బాగా రాశావు. చదువుతుంటే నిజంగా అలా జరుగుతుందేమో అనిపించింది,” అభినందిస్తూ చెప్పింది నందన.

“థాంక్స్ ఆంటీ! నవల రాయడంలో అది నా మొదటి ప్రయత్నం. పేరు నాదైనా నిజానికి అది నా మిత్రులు కొందరం కలిసి చేసిన ఉమ్మడి రచన. ఆ విషయం నేను ఆ పుస్తకం ముందుమాటలో చెప్పాను.”
“ఔను, చదివాను. ఐతే శరత్! నిజంగా మనకు తెలియకుండా మన చుట్టూ అలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందంటావా?” అడిగింది నందన. “ఉండొచ్చనే నేను నమ్ముతున్నాను ఆంటీ,” జవాబు చెప్పాడు శరత్.

“అంతులేని విశ్వాంతరాళాలలో ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉంటుంది.”

“కానీ, మానవ విజ్ఞానం ఇంత పెరిగింది. అంతరిక్షంలో కోట్ల మైళ్ల దూరాన ఉన్న వాటినీ ఆధునిక టెలిస్కోపులతో చూడగలుగుతున్నారు. పరమాణువులో లక్ష రెట్లు చిన్న వాటిని చూడగలిగే సూక్ష్మదర్శినులు వచ్చాయి. స్థూల, సూక్ష్మ ప్రపంచాలను చూడగలిగే అనేక పరికరాలూ, పద్ధతులను మనుషులు కనిపెట్టారు. అయినా మనకు తెలియకుండా అలాంటిది జరగొచ్చా?” నందన ప్రశ్నించింది.

“నిజమే ఆంటీ! కానీ, ‘విజ్ఞాన సముపార్జన ముగింపులేని పరుగు పందెపు బాట లాంటిది’ అన్నారు ఆధునిక శాస్రవేత్తలు. శాస్త్రీయ రంగంలో చివరి హద్దులు, పరిశోధనల్లో చివరి పరిశోధనలూ అంటూ ఉండవు. ఎంతో కాలం చలామణి అయిన ఎన్నో సిద్ధాంతాలు మార్పులూ, చేర్పులకు లోను అవుతుంటాయి. వాటిలో కొన్నిటికి పొడిగింపులు కూడా ఉంటాయి. ఇప్పటివరకు మానవ విజ్ఞానానికి అందని ప్రకృతి నిమయాలు ఎన్నో ఉన్నాయని, అవి ఇప్పుడు మనం ఏమాత్రం నమ్మలేని విధంగా ఉండొచ్చని నేను నా కథలో పరోక్షంగా చెప్పాను. అంతులేని విశ్వాంతరాళాలలో ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉంటుంది.”

“అంటే. ఇంకా మనకు తెలియని ప్రకృతి నియమాలు, రహస్యాలు ఎన్నో ఉన్నాయంటావ్?” అంది నందన.

“అంతే కాదు, ఆంటీ! మానవ విజ్ఞానం మరెంతో సాధిస్తుందని నమ్ముతున్నాను. అంతవరకు ఇలాంటి కథలన్నీ కల్పనలే. ఇలా నా రచనలతో ఈనాటి పిల్లల్లో, పెద్దల్లో చదివే ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఆధునిక భౌతిక శాస్త్రం పట్ల కూడా ఆసక్తిని కలిగిస్తున్నాను,” చిరునవ్వుతో చెప్పాడు శరత్.

“ఇంతకూ, ఏముంది ఆ కథలో?” కుతూహలంగా అడిగింది రక్ష.

“గ్రహాంతరవాసుల వల్ల మానవజాతి అంతా మాయమైపోతే, ఈ భూమి మీద కేవలం ఐదుగురు పిల్లలు మిగిలి ఉంటారు. వాళ్లు తమ ధైర్య సాహసాలతో మానవజాతిని రక్షించి, తిరిగి మామూలు స్థితికి ఎలా తెచ్చారన్నది ఆ కథలో విషయం,” చెప్పింది నందన. ‘ఇప్పటి పరిస్థితి కూడా దాదాపు అదే కదా,’ అనుకుంది రక్ష. కాసేపు అలాగే మాట్లాడకుండా ముందుకు చూస్తూ కూర్చుంది. శరత్ డ్రైవ్ చేస్తూనే ఆమె మొహంలోని భావాలను చదివే ప్రయత్నం చేస్తున్నాడు. చాలా సేపటి వరకు రక్ష ఏమీ మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ కూర్చుంది.

సుమారు రెండు గంటల ప్రయాణం తరవాత వాళ్లు ఒక చోట ఆగి, టీ తాగారు. మరో రెండు గంటల ప్రయాణం తరవాత నల్లమల అడవి ప్రారంభమైంది.

సుమారు రెండు గంటల ప్రయాణం తరవాత వాళ్లు ఒక చోట ఆగి, టీ తాగారు. మరో రెండు గంటల ప్రయాణం తరవాత నల్లమల అడవి ప్రారంభమైంది. రోడ్డుకు కుడి వైపున అమ్రాబాద్ పులుల అభయారణ్యం అన్న బోర్డు కనిపించింది, దాని పక్కనే అటవీ శాఖ వారు ఏర్పరచిన గేటు, సిమెంట్ గద్దెపైన ఠీవిగా కూర్చున్న పెద్ద పులి విగ్రహం ఉన్నాయి.

అక్కడ కారును పక్కకు ఆపి చెప్పాడు శరత్, “ప్రయాణికులు చూడటానికి అటవీ శాఖ ఏర్పరచిన సఫారీ ఎంట్రెన్స్ ఇది. ఇక్కడి నుంచి వాళ్ల జీపులో అడవి లోపలికి ఎనిమిది కిలోమీటర్లు వెళ్లి, అక్కడ ఉన్న వ్యూ పాయింట్ నుంచి నల్లమల సౌందర్యాన్ని చూసి రావొచ్చు. నేను రెండు సంవత్సరాల కిందట మా స్నేహితులతో చూశాను. ఇప్పుడు కరోనా కాలంలో దీనిని మూసివేశారు. ఇక్కడ కాస్త ఆగి, మరోసారి టీ తాగి వెళదాం. ఇక్కడి నుంచి ప్రయాణం అంతా అడవి దారే. చాలా బాగుంటుంది,” అంటూ కిందకు దిగాడు.

అతనితో పాటే వాళ్లూ దిగారు. రోడ్డుకు రెండు వైపులా వెదురూ, టేకూ, ఇంకా చాలా రకాల ఎత్తైన వృక్షాలు దట్టంగా కనిపిస్తున్నాయి. అడవిలోంచి గాలి ఆహ్లాదకరంగా వీస్తోంది, మనసులను కూడా ఎంతో తేలికపరుస్తోంది. పులి విగ్రహం పక్కన ఉన్న టీ కొట్టులో కాగితపు కప్పుల్లో టీ తాగారు. పది నిమిషాలు అక్కడ ఆగి, జ్ఞాపకంగా ఫొటోలు తీసుకుని, మళ్లీ బయలుదేరారు.

అక్కడి నుంచి నందన తాను డ్రైవ్ చేస్తానని డ్రైవింగ్ సీట్లోకి వచ్చింది. శరత్ ఆమె పక్కన ముందు సీట్లో కూర్చుంటే, రక్ష వెనక సీట్లోకి మారింది. రోడ్డుకు రెండు వైపులా పచ్చగా కనబడుతున్న అడవి. అక్కడక్కడా మెలికలు తిరుగుతున్న దారి. నందన నిదానంగా డ్రైవ్ చేస్తుంటే నల్లమల గురించి శరత్ చెపుతున్నాడు.

“నల్లమల ప్రాంతం తూర్పు కనుమల్లో భాగమే. ఇది దాదాపు పది వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉందంటారు. కోరమండల్ తీరానికి సమాంతరంగా, కృష్ణా, పెన్నా నదుల నడుమ వ్యాపించి ఉన్న ప్రాచీన అరణ్యం ఇది. ఈ నల్లమలలోని నాగార్జున సాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం దేశంలోని అతి పెద్ద పులుల అభయారణ్యమని అంటారు. ఇది ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది. కర్నూలు, కడప, గుంటూరు, చిత్తూరు, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో ప్రధానంగా విస్తరించి ఉంది. ఈ అడవి సౌందర్యాన్ని ఆస్వాదించడానికీ, ట్రెక్కింగ్ చేయడానికీ వీలుగా పర్యాటకుల కోసం రెండు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అటవీ శాఖ వారు కొన్ని వసతులు, సౌకర్యాలు కల్పించారు.”

శరత్ చెపుతుంటే నందన మధ్యలో కల్పించుకుంటూ చెప్పింది, “ఈ నల్లమల గురించి నాకూ కొంత తెలుసు, శరత్. నేను ఈ ప్రాంతానికి చెందిన దాన్నే. నంద్యాల నా జన్మ స్థలం.”

“ఔనా ఆంటీ! అదృష్టవంతులు. ఇంత మంచి ప్రకృతిలో పుట్టడం నేనైతే నిజంగా ఒక గొప్ప వరం లాంటిదే అనుకుంటాను,” సంతోషపడుతూ అన్నాడు శరత్.

“ఔనా ఆంటీ! అదృష్టవంతులు. ఇంత మంచి ప్రకృతిలో పుట్టడం నేనైతే నిజంగా ఒక గొప్ప వరం లాంటిదే అనుకుంటాను,” సంతోషపడుతూ అన్నాడు శరత్. తరవాత మళ్లీ నల్లమల గురించి తనకు తెలిసిన విషయాలు చెప్పడం కొనసాగించాడు.

“నల్లమలలో శ్రీశైలం, మహానంది, అహోబిలం, సలేశ్వరం, గుండ్ల బ్రమ్హేశ్వరం, నెమలిగుండ్ల, కదళీవనం, పంచలింగాలకోన వంటి ఎన్నో ఆధ్యాత్మిక ప్రదేశాలు ఉన్నాయి. అక్కమహాదేవి గుహలు, బెలూం గుహలు ఉన్నాయి. ఈ అరణ్యంలో పన్నెండు తీర్థాలు, ఐదు శివలింగాలు ఉన్నాయంటారు. ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ స్థాపించిన ఒక శివలింగం ఉందంటారు. అతడు కూడా మరణం లేని చిరంజీవిలా ఈ అడవిలోనే జీవించి ఉన్నాడని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ అడవి పరిధిలో ఉన్న కంబం చెరువు అతి పురాతన మానవ నిర్మిత విశాల జలాశయం అని చెపుతారు.

రాత్రి తొమ్మిది తరవాత ప్రయాణికులను అనుమతించక పోవడానికి అది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. ఈ నల్లమలను రక్షించడానికి ‘సేవ్ నల్లమల’ అంటూ కొంత కాలం సోషల్ మీడియా క్యాంపేన్ కూడా జరిగినట్టుంది…

“ఇది ప్రకృతి రమణీయ ప్రాంతాలకు నిలయం. అనేక రహస్యాలు నల్లమల అరణ్య గర్భంలో దాగి ఉన్నాయని అంటారు. కానీ, మనుషుల స్వార్థానికి ఇంత అద్భుతమైన నల్లమల క్రమక్రమంగా నశించిపోతోంది.

“యురేనియం నిక్షేపాలు ఉన్నాయని, వజ్రాల నిక్షేపాలు ఉన్నాయని, విజయనగర రాజుల అమూల్యమైన వజ్రాలు, బంగారం ఈ ప్రాంతంలో ఉన్నాయని గత కొన్ని దశాబ్దాల్లో ఇక్కడ వేట జరుగుతోంది. కొందరు రాజకీయ నాయకుల అండదండలతో కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు నల్లమలలో యురేనియం, డైమండ్ హంట్లకు ప్రయత్నాలు చేస్తున్నాయి. రాత్రి తొమ్మిది తరవాత ప్రయాణికులను అనుమతించక పోవడానికి అది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. ఈ నల్లమలను రక్షించడానికి ‘సేవ్ నల్లమల’ అంటూ కొంత కాలం సోషల్ మీడియా క్యాంపేన్ కూడా జరిగినట్టుంది…” అలా శరత్ నల్లమలకు సంబంధించిన అనేక విషయాలు వాళ్లకు చెపుతూనే ఉన్నాడు. వాళ్లు శ్రీశైలం డ్యాం దగ్గరికి చేరుకున్నారు. అక్కడి నుంచి మాణిక్యానికి ఫోన్ చేసింది నందన.

‘తాను దేవాలయం దగ్గరే ఉన్నానని. పని ఉండడం వల్ల అక్కడికి వచ్చానని, వాళ్లను కూడా అటే వచ్చేయమని, దర్శనం చేసుకుని ఇంటికి వెళదామని,’ చెప్పాడు మాణిక్యం. హరిత రిసార్ట్ దగ్గర శరత్ దిగిపోయాడు. దిగుతూ, ఆంటీ “ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి. నేను వీలయితే రేపు కలుస్తాను. బై, రక్షా!” అని చెప్పాడు.

గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి

పదమూడో అధ్యాయంపన్నెండో అధ్యాయం | పదకొండో అధ్యాయం | పదో అధ్యాయం | తొమ్మిదో అధ్యాయం | ఎనిమిదో అధ్యాయం | ఏడో అధ్యాయం | ఆరో అధ్యాయం | ఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం  మూడో అధ్యాయం రెండో అధ్యాయం |  తొలి అధ్యాయం  | రచయిత పరిచయం

మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article