Editorial

Wednesday, January 22, 2025
Serialరక్ష – 13th Chapter : అది కల కాదు!

రక్ష – 13th Chapter : అది కల కాదు!

నిన్నటి కథ

“తల్లీ! ఇప్పుడు నువ్వు మాత్రమే ఈ రెండు లోకాలను కాపాడగలవు. అందుకే నీకు మా లోకానికి ప్రవేశం దొరికింది. ఈ పని కోసమే నిన్ను ఆ లోకం వాళ్లు ఎన్నుకున్నారు. ప్రకృతిమాత కూడా నిన్ను ఈ పని కోసం ఎన్నుకుంది. కాబట్టే, నీకు పుట్టుకతో కొన్ని అద్భుతమైన ప్రకృతి శక్తులను ప్రసాదించింది. వాటిని ఉపయోగించవలసిన సందర్భం వచ్చినప్పుడు అవి నీకు తెలుస్తాయి. నిన్ను ఆ శక్తులే రక్షిస్తాయి… నేను ఆ రహస్యం దాచి ఉంచిన ప్రదేశానికి నీ లాకెట్ తోవ చూపిస్తుంది. జాగ్రత్త తల్లీ, మళ్లీ కలుద్దాం!” ఆ వ్యక్తి ఎంతో ఆత్మీయంగా, సుతారంగా రక్ష నుదుటి మీద ముద్దుపెట్టుకున్నాడు. చటుక్కున కళ్లు తెరిచింది రక్ష.

పదమూడో అధ్యాయం

డా.వి.ఆర్.శర్మ

ఉదయం టిఫిన్ చేస్తున్నప్పుడు తల్లిని అడిగింది రక్ష, “అమ్మా! నాలుగు రోజులు నాన్న దగ్గరికి వెళ్లి వద్దామా?”

“అలాగే, తప్పకుండా వెళదాం,” నందన చెప్పింది. “నాకూ అలాగే అనిపిస్తొంది. రాత్రి ఫోన్ చేసినప్పుడు నాన్నను రమ్మని అడిగాను. నాకు ఎందుకో తనను వెంటనే చూడాలని అనిపించింది. చాలా మిస్సవుతున్నట్టు అనిపించింది. అందుకే తనను రమ్మని అడిగాను. తనకూ అలాగే ఉందని, కానీ తాను రావడం వీలు కాదని, వీలయితే నాలుగు రోజులు సెలవు తీసుకుని మనల్నే రమ్మన్నాడు. ఆ ప్రశాంతమైన చోట చాలా బాగుంటుందని, దగ్గరలో చూడాల్సిన ప్రదేశాలు కూడా చూద్దామని అన్నాడు.”

“మరి ఎప్పుడు వెళదాం? రేపు నీకు సెలవు పెట్టడం కుదిరితే శని, ఆదివారాలు కలిసి వస్తాయి కదా!” ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్లాలని రక్షకు ఉంది.

“సరే, అలాగే చేద్దాం. నేను శుక్ర, సోమ వారాలు సెలవు కోసం ప్రయత్నిస్తాను. నాన్నతో ఈ విషయం ఫోన్ చేసి చెప్పు,” అని చెప్పి, ఆఫీసుకు వెళ్లడానికి సమయం అవుతోందని నందన లేచింది. తల్లి వెళ్లిపోయిన తరవాత చాలా సేపు ఉదయం జరిగిన దానిని గురించి ఆలోచిస్తూ అలాగే కూర్చుంది రక్ష.

ప్రతి రోజూ ఉదయం ఎనిమిది గంటల లోపే స్నానం చేయడం తన అలవాటు. ఈ రోజు కూడా అలాగే స్నానం చేసి, బట్టలు మార్చుకుని, తల దువ్వుకుంటూ నిలబడినప్పుడు తన మెడలోని లాకెట్ను చూస్తూ అనుకుంది. “నీలి బిలం రహస్యం ఎక్కడ ఉందో ఈ లాకెట్ తెలియచేస్తుందట, అక్కడికి వెళ్లే మార్గం చూపిస్తుందట! నిజమేనా? నిజంగా ఇది జరుగుతుందా…??”

తన ప్రమేయం ఏమీ లేకుండానే అద్దం లోంచి తన ప్రతిబింబం మాట్లాడుతోంది.

 “నువ్వు ఇతరులకు కూడా కనిపిస్తే బాగుంటుంది కదా?” అని రక్ష అడిగితే ఆ అవసరం వచ్చినప్పుడు తప్పకుండా కనిపిస్తానని ఆ లాకెట్ అమ్మాయి మోక్ష చెప్పింది.

“ఔను, తప్పకుండా జరుగుతుంది,” అనే మాటలు అద్దం లోంచి వినిపించాయి. ఆశ్చర్యంగా అద్దంలోని తన ప్రతిబింబాన్ని చూస్తూ, ఏ కదలిక లేకుండా అలాగే నిలబడిపోయింది. తన ప్రమేయం ఏమీ లేకుండానే అద్దం లోంచి తన ప్రతిబింబం మాట్లాడుతోంది.

“నిజమే రక్షా! మన నాన్న చెప్పింది నిజం. ఆ రహస్య ప్రదేశానికి చేరడానికి నీకు నేను సహాయం చేస్తాను. నేను నీ మెడలో ఉన్న లాకెట్నే. నా పేరు మోక్ష, ఇది నేను పెట్టుకున్న పేరు. నాకు మన తల్లిదండ్రులు ఏ పేరునూ నిర్ణయించ లేదు. కాబట్టి, ఇప్పుడే నీ పేరుకు దగ్గరగా అనిపించేలా నేనే పెట్టుకున్నాను. ఇక నువ్వు నా అక్కవు,” షేక్హ్యాండ్ ఇస్తున్నట్టుగా తన కుడి చేతిని ముందుకు చాస్తూ అంది. రక్ష అప్రయత్నంగా తన చేతిని ముందుకు చాచింది. ఆ ప్రతిబింబం రక్ష చేతిని సుతారంగా పట్టుకుని అద్దం లోంచి బయటకు వచ్చేసింది.

తరవాత, వాళ్ల ఇద్దరి మధ్య చాలా సమయం కబుర్లతో గడిచింది. ఇక నుంచి తాను ఇలాగే కనిపిస్తానని, తనతో మాట్లాడాలని అనుకున్నప్పుడు ఇలా వచ్చి, తనకు మాత్రమే కనిపిస్తానని మోక్ష చెప్పింది. “నువ్వు ఇతరులకు కూడా కనిపిస్తే బాగుంటుంది కదా?” అని రక్ష అడిగితే ఆ అవసరం వచ్చినప్పుడు తప్పకుండా కనిపిస్తానని ఆ లాకెట్ అమ్మాయి మోక్ష చెప్పింది. ‘ఇంకా ఆలస్యం చేయకుండా చేయాల్సిన పని మొదలు పెట్టమని, అందుకోసం రేపు శ్రీశైలంలో ఉన్న ఇప్పటి తండ్రి మాణిక్యం దగ్గరికి వెళ్లాలని, అందుకు తల్లిని అడిగి అక్కడికి వెళ్లేలా కార్యక్రమం రూపొందించమని,’ చెప్పింది. అక్కడికి వెళ్లిన తరవాత అటునుంచి ఎటు వెళ్లాలో అక్కడ చెపుతానని చెప్పింది. తనతో మాట్లాడుతున్నంత సేపూ రక్షకు నిజంగా తన తోబుట్టువుతోనే మాట్లాడుతున్న అనుభూతి కలిగింది. ఎంతో ఊరట, ధైర్యం అనిపించింది. మోక్ష చెప్పినట్టే ఇప్పుడు అమ్మతో మాట్లాడి, తాము నాన్న దగ్గరికి వెళ్లిరావడానికి ఒప్పించ గలిగింది. రక్ష మెల్లగా తన ఆలోచనల్లోంచి బయటపడి, లేచి తండ్రికి ఫోన్ చేసి తాము వస్తున్న విషయం చెప్పింది. ఫోన్ పెట్టేస్తుండగా కాలింగ్ బెల్ మోగింది.

డోర్ తెరిస్తే పక్కింటి ఆంటీ, ఆమెతో బాటు శరత్ కనబడ్డారు. వాళ్లను లోపలికి పిలిచి కూర్చోబెట్టింది. “ఏం లేదమ్మా. మీ ఫ్లాట్లో జరిగిన దొంగతనాన్ని గురించి ఏమీ తెలియలేదని పోలీసులు చెప్పారని, ఏ వస్తువులూ పోలేదు కాబట్టి దీని గురించి వాళ్లు పెద్దగా పట్టించుకోకపోవచ్చని మన ప్రెసిడెంటు గారు చెప్పారు. ఇప్పుడు మన అపార్ట్మెంట్లో వాళ్లందరూ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కొత్తవాళ్లను ఎవరినీ గేటుదాటి లోపలికి రానివ్వడం లేదు. మన శరత్ ఒకసారి కలిసి మాట్లాడతానంటే నేను కూడా వచ్చాను. అమ్మ ఉన్నారా? ఆఫీస్ కి వెళ్లారా?” అంటూ ఇంటిని కలియచూసింది పక్కింటి ఆంటి.

“అమ్మ లేదు ఆంటీ, ఇంతకు ముందే ఆఫీస్కి వెళ్లింది,” చెప్పింది రక్ష.

“రక్షా! అక్కడ ఊళ్లో కూడా అచ్చం ఇలాగే జరగడం నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది. అక్కడ ఆ పని చేసిన వాళ్లు ఎవరైనా దొరికారా?” అడిగాడు శరత్. అతడు ఏదో ఊహిస్తున్నట్టు, ఏదో శోధిస్తున్నట్టూ రక్షకు అనిపించింది.

“లేదు. అక్కడ కూడా ఇలాగే జరిగింది. కానీ, ఏమీ పోలేదు, ఎవరూ దొరకలేదు.”

“మీకు సంబంధించిన రెండు చోట్లా ఇలా ఎందుకు జరిగిందో? ఇది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తోంది, రక్షా. సరే, ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకండి. ఇది కేవలం దొంగతనం మాత్రమే అని నాకు అనిపించడం లేదు,” అన్నాడు శరత్.

“రేపు నాన్న దగ్గరికి వెళుతున్నాం. మూడు రోజులు ఉండి వస్తాం,” అనాలోచితంగా చెప్పింది రక్ష. నిజానికి ఆ విషయం వాళ్లకు చెప్పాలా, వద్దా అని కూడా ఆలోచించ లేదు, చెప్పేసింది.

“ఔనా…! అయితే శ్రీశైలం వెళుతున్నారన్న మాట. మీ నాన్న అక్కడే ఉంటారు కదా?”

ఔనన్నట్టు తల ఊపింది రక్ష. “ఎలా వెళుతున్నారు, బస్సులోనా?” అడిగాడు శరత్.

“లేదు, కార్లోనే వెళుతున్నాం. కరోనా వచ్చిన తరవాత గత మార్చ్ నుంచి ఇంతవరకు మేం బస్సు ప్రయాణం చేయ లేదు,” చెప్పింది రక్ష.

శరత్ ఇంటికి వెళ్లిన తరవాత కూడా రాత్రి కలిగిన అనుభవం గురించి చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. నిన్న రాత్రి మగత నిద్రలో ఒక కలలాంటి దృశ్యం… రక్ష తనతో మాట్లాడుతోంది. తాము రేపు నల్లమల వెళుతున్నామని, కూడా తమతో తప్పకుండా రమ్మని అడుగుతోంది.

“మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే నేనూ మీతో వస్తాను. రేపు మా పాత మిత్రులం కొందరం అక్కడ కలుసుకోవాలని అనుకున్నాం. అక్కడ హరితలో రూమ్స్ కూడా బుక్ చేసుకున్నాం. కాబట్టి నేనూ రేపు శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. మీరు ఓకే అంటే నాకూ బస్సులో వెళ్లడం తప్పుతుంది,” రిక్వెస్టు చేస్తున్నట్టు అడిగాడు శరత్. తరవాత మళ్లీ అన్నాడు, “కార్లో అయితే మీ ఇద్దరే వెళ్లడం సరి కాదు. అడవి దారి. మీ మమ్మీ చాలా బాగా డ్రైవ్ చేస్తుందని నాకు తెలుసు. కానీ ఘాట్ రోడ్లో, ఇప్పుడు జరుగుతున్న సంఘటనల దృష్ట్యా అది సరికాదని నాకు అనిపిస్తోంది. మీకు అభ్యంతరం లేకపోతే నేనూ మీతో వస్తాను. మా నాన్న కూడా నల్లమల ప్రాంతంలోనే చాలా కాలం పని చేశారు. నాకూ నల్లమలతో అనుబంధం ఉంది. పరిచయం ఉంది. రక్షా! నేను రిక్వెస్ట్ చేశానని మీ అమ్మకు చెప్పు. అభ్యంతరం లేకపోతే ఫోన్ చేసి చెప్పండి,” అన్నాడు. అతడు కూడా తమ వెంట రావడం మంచిదనే రక్షకు అనిపించింది. వాళ్లు కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు.

శరత్ ఇంటికి వెళ్లిన తరవాత కూడా రాత్రి కలిగిన అనుభవం గురించి చాలాసేపు ఆలోచిస్తూనే ఉన్నాడు. నిన్న రాత్రి మగత నిద్రలో ఒక కలలాంటి దృశ్యం… రక్ష తనతో మాట్లాడుతోంది. తాము రేపు నల్లమల వెళుతున్నామని, కూడా తమతో తప్పకుండా రమ్మని అడుగుతోంది. అంతేకాదు, ఆమె రక్షలాగే కనబడుతున్నా ఎందుకో కొంత కొత్తగా అనిపించింది. అది కలలా అనిపించలేదు. దాదాపు ఇలాంటి అనుభవం ఒకటి తనకు కొన్నేళ్ల కిందట కలిగింది. కానీ దానిని ఎవరికీ చెప్పడానికి వీలులేక పోయింది. అది మానవ జాతి ఉనికే ప్రమాదంలో పడ్డ విషయం. ఆ విషయాన్ని తరవాత తాను ఒక కల్పిత కథగా రాశాడు. మళ్లీ ఇప్పుడు, అలాంటి అనుభవం కలగడం ఏమిటి? నిన్న తనకు ఆ కలలో కనిపించింది నిజం అవుతోంది. రక్ష తన తల్లితో కలిసి రేపు నల్లమల అడవిలోని శ్రీశైలం వెళ్లబోతోంది. ఏం జరగబోతోందో…
వెంటనే తన స్నేహితురాలు ప్రణవికి ఫోన్ చేశాడు శరత్. తనకు రేపు శ్రీశైలంలోని హరితా రిసార్ట్లో ఎలాగైనా రూం బుక్ చేయమని చెప్పాడు. ఆమె తండ్రి శ్రీశైలంలో హరితలో ఏదో ఉద్యోగం చేస్తున్నాడు.

గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి

పన్నెండో అధ్యాయం | పదకొండో అధ్యాయం | పదో అధ్యాయం | తొమ్మిదో అధ్యాయం | ఎనిమిదో అధ్యాయం | ఏడో అధ్యాయం | ఆరో అధ్యాయం | ఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం  మూడో అధ్యాయం రెండో అధ్యాయం |  తొలి అధ్యాయం  | రచయిత పరిచయం

మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article