Editorial

Wednesday, January 22, 2025
Serialరక్ష – 12th Chapter : తెలుపు డైలీ సీరియల్

రక్ష – 12th Chapter : తెలుపు డైలీ సీరియల్

నిన్నటి కథ

రక్ష చిన్ననాటి వస్తువులు ఉన్న ఆ పాత పెట్టెను మాత్రమే ఆ దొంగలు తీసుకుని వెళ్లారు. పోలీసులు వెళ్లిపోయిన తరవాత తల్లీ కూతుళ్లు ఆ విషయం గుర్తించారు. అది ఆ దొంగలకు ఎందుకు ఉపయోగపడుతుందో, ఏ విధంగా అవసరమైందో నందనకు ఏమాత్రం అర్థం కాలేదు. కానీ, రక్షకు మాత్రం ఏదో అర్థం అవుతున్నట్టే ఉంది.

పన్నెండో అధ్యాయం

డా.వి.ఆర్.శర్మ

వాళ్లకు ఆ రాత్రి చాలా సేపటి వరకు నిద్రపట్టలేదు. జరిగిన సంఘటనలు, ప్రయాణపు బడలిక వాళ్లను అలసటకూ, ఆందోళనకూ లోను చేశాయి. ఒంటి గంట దాటిన తరవాత ఎప్పుడో నందన మెల్లగా నిద్రలోకి జారుకుంది. రక్ష కూడా తల్లి పక్కనే పడుకుని ఉన్నా ఎన్నో సందేహాలు ఆమెను సుడిగుండాల్లా చుట్టుముడుతున్నాయి, సుడిగాలుల్లా కల్లోల పరుస్తున్నాయి. ఆ దొంగలు ఎవరో కానీ తప్పకుండా తన చిన్ననాటి వస్తువుల కోసమే వచ్చారని తనకు నమ్మకం కలుగుతోంది. తన చిన్ననాటి అన్ని వస్తువుల కోసం కాకపోవచ్చు, కేవలం ఆ లాకెట్ కోసమే వచ్చి ఉంటారు. కానీ అది వాళ్లకు తన వస్తువులలో కనిపించక పోవడం వల్లనో, సమయం సరిపోకపోవడం వల్లనో ఆ పెట్టెను ఎత్తుకుపోయి ఉంటారు. లేదా, వాళ్లు తన చిన్ననాటి వస్తువుల్లో దేని కోసం వెతుకుతున్నారో వాళ్లకే సరిగా తెలిసి ఉండకపోవచ్చు. అందుకే తన వస్తువులు ఉన్న ఆ పెట్టెను మొత్తంగా తీసుకెళ్లి ఉంటారు. తాతయ్య వాళ్ల ఇంట్లో కూడా బహుశా దాని కోసమే వెతికి ఉంటారు.

ఆ లాకెట్ ను నిన్నటి నుంచి తన మెడలో వేసుకునే ఉంది. ఎవరైనా దాని గురించి అడుగుతారేమో అని ఎదురు చూసింది. కానీ అమ్మతో సహా ఎవరూ దానిని గుర్తించ లేదు. అంటే అది తనకు మాత్రమే కనబడుతోంది. అంటే అది సాధారణమైనది కాదన్నమాట. మరి దాని గురించి తెలుసుకోవడం ఎలా?

రక్ష తన మెడలో ఉన్న ఆ లాకెట్ను చేత్తో పట్టుకుని, పరీక్షగా చూస్తూ తన ముఖానికి దగ్గరగా పెట్టుకుంది. బెడ్లైట్ వెలుగులో తెల్లగా వెండి పువ్వులా కనిపిస్తోంది అది. దానిని చూస్తూ, ‘దీని రహస్యం ఏమిటో నేను తెలుసుకోవాలి,’ అనుకుంటూ, ఆలోచిస్తూ దానిని కళ్ల మీద పెట్టుకుంది. కళ్లు మూసుకుంది. కనురెప్పల మీద దాని స్పర్శ ఎంతో హాయిగా ఉంది.

రక్ష : ఇది పిల్లల సైన్స్ ఫిక్షన్ నవల. ‘తానా’ – ‘మంచి పుస్తకం’ సౌజన్యంతో ప్రచురణ. రచయిత డా.వి.ఆర్.శర్మ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కామారెడ్డి వాస్తవ్యులు. తెలుగు భాష బోధనతో తన ఉద్యోగ జీవితాన్ని సార్థకం చేసుకున్న శర్మ గారు బాల సాహిత్యానికి చేసిన సేవ అమూల్యమైనది. వారు అనేక సాహిత్య సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ స్వయానా తానే ఒక సంస్థ అనడం సముచిత గౌరవం. ‘సాహు జీవితం – రచనలు’ వారు ఎం.ఫిల్ పరిశోధనాంశం కాగా ‘ఆధునిక కవిత్వంలో బాల్య చిత్రణ’పై వారు పి.హెచ్ డి చేయడం మరో విశేషం. మీరు చదివే ‘రక్ష’ పిల్లక కోసం వారు రాసిన సైన్స్ ఫిక్షన్ నవల. ఇప్పటివరకు శర్మ గారు 8 కవిత సంపుటులు,  4 పాటల పుస్తకాలు, రక్ష నవలతో కలిపి 4 నవలలు వెలువరించారు. వారి పూర్తి పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రచయిత ఇ – మెయిల్ : dr.v.r.sharma@gmail.com

“అమ్మా, రక్షా! నీకు తెలియవలసిన విషయాలు నేను చెపుతాను, విను,” అంటున్న ఆ పెద్ద మనిషి ఎవరో తనకు తెలియదు. కానీ ఇతడిని ఇంతకు ముందే చూసింది. తన మెడలో ఆ లాకెట్ కట్టిన వ్యక్తి ఇతడే. ఔను, తాను అతడిని గుర్తుపట్టగలుగుతోంది. అతని పక్కన ఉన్న స్త్రీని కూడా తాను గతంలో చూసింది. ఆమె అప్పుడు తనను ఎత్తుకుంది. తాను పసిపాపలా ఆమె ఎదమీద ఉంది. వాళ్లు ఆ కొండలమధ్య శిథిలమైన ఇళ్ల మధ్యలోంచి తనను ఎత్తుకుని, ఎవరి నుంచో రక్షించుకోవడానికి పరిగెత్తడం అప్పుడు తాను చూసింది. ఆయన ముఖంలో కూడా తన పోలికలు కనిపిస్తున్నాయి. ఆయన ఆ రోజు తన మెడలో ఆ లాకెట్టును కట్టడం, తనను ఒక పెద్ద పక్షికి అప్పగించడం, తరవాత ఆ చోట ఒక పెద్ద విస్ఫోటనం జరగడం వరకు తాను చూసింది. అదంతా తన భ్రమో, వాస్తవమో తేల్చుకోలేక పోతోంది. కానీ ఇప్పుడు మళ్లీ అతను కనిపిస్తున్నాడు.

“నిజమే నా బంగారు తల్లీ! ఇదంతా నిజమే! కానీ, ఇది నువ్వు మాత్రమే తెలుసుకోవలసిన నిజం. నీకు మాత్రమే తెలియవలసిన నిజం,” అతడు ఎంతో ప్రేమగా, నిదానంగా చెపుతున్నాడు.

“నిజమే నా బంగారు తల్లీ! ఇదంతా నిజమే! కానీ, ఇది నువ్వు మాత్రమే తెలుసుకోవలసిన నిజం. నీకు మాత్రమే తెలియవలసిన నిజం,” అతడు ఎంతో ప్రేమగా, నిదానంగా చెపుతున్నాడు. “నేను ఈ మనుషులకు కనిపించని మరో ప్రపంచంలో ఉండేవాడిని. ఆ ప్రపంచానికి నువ్వు వెళ్లివచ్చావని నాకు తెలుసు. కాబట్టి ఆ ప్రపంచం గురించి వివరాలు మళ్లీ చెప్పను. ఆ ప్రపంచంలో నువ్వు చూసిన విద్యాలయంలో నేను ఒక ముఖ్యమైన ఉపాధ్యాయుడిని. మాలో చాలా తక్కువ మందికి ప్రకృతి తన శక్తులను ఇస్తుంది. వాళ్లల్లో నేను ఒకడిని. కానీ, అక్కడి ప్రకృతి నియమాలకు వ్యతిరేకంగా ఒకసారి నేను ఈ భూలోకం వచ్చాను. ఇక్కడ హిమాలయల్లోని కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లు తిరిగి, వాటి సౌందర్యానికి ముగ్ధుడిని అయ్యాను. అయస్కాంతానికి ఇనుప ముక్కలా బలంగా ఆకర్షితుడినయ్యాను. మా లోకంలో హిమ పర్వతాలు లేవు. అందుకే మా లోకంకన్నా ఆ ప్రాంతాలు నాకు ఎక్కువ ఇష్టమయ్యాయి. అదొక్కటే కారణం కాదేమో! అలా నేను మా వాళ్లకు తెలియకుండా రహస్యంగా తరచు వచ్చేవాడిని.

దాదాపు భారత దేశంలోని చాలా ప్రాంతాలు తిరిగి చూశాను. అలా నా పర్యటనలో దక్షిణ భారత దేశం వచ్చినప్పుడు ఒక రోజు విశాఖపట్టణం దగ్గర భీమ్లీలో ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాను. ఆమె లేకుంటే నా జీవితం వ్యర్థం అనిపించింది. మా లోకపు నియమాలను ధిక్కరించి నేను ఆమెకు కనబడ్డాను. ఆమెకు కూడా నేను నచ్చాను. మేం పెళ్లి చేసుకున్నాం. ఆమెకు తప్ప నా గురించి ఎవరికీ నిజం తెలియదు. నేను ఈ విషయం అప్పుడు కూడా మా వాళ్లకు తెలియనివ్వ లేదు.

“నేను మా ప్రపంచానికి వెళ్లి వస్తూ ఉండేవాడిని. నువ్వు ఆమె కడుపులో పడ్డావు. ఒక రోజు మా పెద్దలకు ఈ విషయం చెప్పి, నా భార్యను మా లోకానికి తెచ్చుకోవడానికి అనుమతిని కోరాను. అది వాళ్లకు చాలా ఆగ్రహం కలిగించింది. నేను చేసింది ప్రకృతి నియమాలకు విరుద్ధమైన పని. ద్రోహం. కాబట్టి దాని వల్ల ఆ లోకం చాలా నష్టపోవలసి వస్తుంది. ఊహకు అందని మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఇక నుంచైనా నేను మానవ లోకానికి వెళ్లడం మానేయాలని, జరిగిన తప్పును సరి చేయడానికి పరిహారంగా చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉంటాయని చెప్పారు. అలాగే, నేను ఇక గురువుగా కొనసాగే అర్హత కోల్పోయానని ప్రకటించారు.”

ఆ లాకెట్ ఒక అంగరక్షకుడిలా పని చేస్తూ నిన్ను నిరంతరం కాపాడుతుంది. అది నువ్వు పుట్టిన సంవత్సరమే ‘పుట్టింది’. కానీ, అది పూర్తిగా తనను తాను ఫీడ్ చేసుకోవడానికీ, చార్జ్ చేసుకోవడానికీ దాదాపు పద్నాలుగేళ్లు పట్టింది.

అతను విచారంగా కాసేపు తల వాల్చుకున్నాడు. తరవాత మళ్లీ దుఃఖంతో, జీరపోయిన గొంతుతో చెప్పడం కొనసాగించాడు. “నేను నా భార్యను వదిలి ఉండలేనని, ఆమెను నాతో అక్కడికి తెచ్చుకోవడానికి అవకాశం లేకపోతే నేనూ మానవ లోకంలోనే ఉండిపోతానని చెప్పాను. కానీ వాళ్లు అందుకు కూడా అంగీకరించ లేదు. వాళ్లకు చెప్పకుండా నేను రహస్యంగా మానవ లోకానికి వచ్చేశాను. హిమాలయాల సౌందర్యంతో అలరారే హిమాచల్ ప్రదేశ్లో, మనాలికి దూరంగా పర్వతాల ఒడిలో లహోల్ ప్రాంతంలో ఒక మారుమూల పల్లెలో నా భార్య ఉషతో కలిసి జీవించడం ప్రారంభించాను. అలా నా లోకానికి వెళ్లే అర్హతను నేను పూర్తిగా పోగొట్టుకున్నాను…

“నా భార్య తమ్ముడు కూడా వచ్చి, మాతోనే ఉండిపోయాడు. అతనికి అప్పుడు ఇరవై ఏళ్ల వయసు. తల్లిదండ్రులు చిన్నప్పుడే మరణించడం వల్ల అతని బాధ్యత కూడా మాదేనని నా భార్య భావించింది. ఆమెకు తమ్ముడంటే అవ్యాజమైన ప్రేమ ఉండేది. కాబట్టి మేం కలిసి ఉండేవాళ్లం. నా భార్యకు తప్ప అతనికి నా గురించి నిజం తెలియదు. మేం కూడా మామూలు మనుషుల్లాగే ఏవో పనులు చేసుకుంటూ బతికే వాళ్లం. కొంత కాలానికి మా ప్రేమకు ప్రతిరూపంగా నువ్వు పుట్టావు. మా ఆనందానికి అవధి లేకుండా పోయింది.

“సరిగ్గా ఆ సంతోష సమయంలోనే మమ్మల్ని ఊహించని ప్రమాదాలు చుట్టుముట్టాయి. ఆ సమయంలో నా గురించిన నిజాలు మీ అమ్మ తన తమ్ముడితో చెప్పింది. అదే మనందరి జీవితాలను అల్లకల్లోలం చేసింది. మీ అమ్మను బలి తీసుకుంది. నన్ను బంధించి, నా ద్వారా ఆ నీలి ద్వారం రహస్యాన్ని తెలుసుకోవాలని, మానవ లోకాన్నీ, మా లోకాన్నీ గుప్పిట్లో పెట్టుకోవాలనీ అప్పటి నుంచి నా భార్య తమ్ముడు ప్రయత్నించడం మొదలు పెట్టాడు.

“మాకు తెలియకుండా అంతకు ముందే కొంత కాలంగా అతడు ఒక మాఫియా ముఠాతో సంబంధాలు పెట్టుకున్నాడు. బొంబాయిలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో ఆ ముఠాలో ప్రధానమైన వాళ్లు మరణించారు. మిగిలిన వాళ్లు పారిపోయారు. వాళ్లు మేం ఉన్న ప్రాంతానికి ఎప్పుడు చేరుకున్నారో, అతడు వాళ్లతో సంబంధాలు ఎలా పెట్టుకున్నాడో మాకు తెలియదు. అప్పటికే వాళ్లను నడిపించే బాస్ స్థానంలోకి అతడు చేరుకున్నాడు. తన కార్యక్రమాలన్నీ రహస్యంగా నడిపించేవాడు. అంతేకాదు, ఒక తీవ్రవాద సంస్థతో కూడా సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నాలు కూడా ప్రారంభించాడు. వాళ్ల నుంచి నిన్ను రక్షించుకోవడానికే మేం ప్రయత్నించాం. ఆ ప్రయత్నంలోనే నిన్ను దూరం చేసుకున్నాం. మేం వాళ్ల చేతుల్లో మరణించాం.

“అదే సమయంలో డల్హౌసీకి టూర్కు వెళ్లిన మాణిక్యం, నందనలకు చంబా లోయలో రావి నది ఒడ్డున నువ్వు దొరికినప్పటి నుంచి వాళ్లు నిన్ను తమ బిడ్డగానే పెంచుకుంటున్నారు. భౌతికంగా మరణించినా ఆ లాకెట్ వల్లనే నేనూ, మీ అమ్మా నీతో ఇలా మాట్లాడగలుగుతున్నాం. అది మీ అమ్మ కంప్యూటర్ పరిజ్ఞానాన్నీ, నాకు ఉన్న ప్రకృతి శక్తులనీ జోడించి తయారు చేసిన అసామాన్యమైన సాంకేతిక పరికరం. మేం దానిని కూడా మా బిడ్డలాగే అనుకున్నాం. ఆ లాకెట్ ఒక అంగరక్షకుడిలా పని చేస్తూ నిన్ను నిరంతరం కాపాడుతుంది. అది నువ్వు పుట్టిన సంవత్సరమే ‘పుట్టింది’. కానీ, అది పూర్తిగా తనను తాను ఫీడ్ చేసుకోవడానికీ, చార్జ్ చేసుకోవడానికీ దాదాపు పద్నాలుగేళ్లు పట్టింది. నీకు కూడా పుట్టుకతో సంక్రమించిన కొన్ని అద్భుత ప్రకృతి శక్తులు మొన్నటి సంక్రాంతి నుంచే, అంటే నీకు పద్నాలుగేళ్లు నిండిన రోజు నుంచే ఉపయోగించుకునే దశకు వచ్చాయి.

వాళ్లు ఎత్తుకుని పోయిన వస్తువుల్లో వాళ్లకు ఏ సమాచారం దొరకదు. కాబట్టి వాళ్లు ఇక నిన్ను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తారు. నీలి బిలం రహస్యాన్ని వాళ్లు నీ ద్వారా కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నాను.”

“మీరు కవల పిల్లల్లాంటి వాళ్లు. ఇక నుంచీ నీ శరీరాన్ని అంటి పెట్టుకుని, నీలో ఒక భాగంగానే అది ఉంటుంది. నీ నుంచి ఎవరూ దానిని దూరం చేయలేరు. నీకు మాత్రమే కనిపిస్తుంది. కొంతకాలం కిందట మమ్మల్ని చంపిన వాళ్లకు నీ ఆచూకి తెలిసింది. నీకు తెలియచేయాలని నేను రాసి పెట్టిన ఆ నీలి బిలం రహస్యం కోసం, నీ కోసం వాళ్లు వేట కొనసాగిస్తున్నారు. వాళ్లు ఎత్తుకుని పోయిన వస్తువుల్లో వాళ్లకు ఏ సమాచారం దొరకదు. కాబట్టి వాళ్లు ఇక నిన్ను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తారు. నీలి బిలం రహస్యాన్ని వాళ్లు నీ ద్వారా కనిపెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నిన్ను హెచ్చరిస్తున్నాను.”

“ఆ నీలి బిలం రహస్యాన్ని మీరు ఈ లోకంలో దాచిపెట్టారా?” విస్మయంగా అడిగింది రక్ష.

“ఔను, అదే నేను మా లోకానికి చేసిన క్షమించరాని అపకారం. అది ఈ లోకం వాళ్ల చేతిలో పడితే, మొదట మా లోకం, తరవాత మీ లోకం నాశనం కావడం తప్పదు…” అతడు విచారంగా తలవంచుకున్నాడు. అతని కంఠం జీరపోతోంది, ప్రాధేయపడుతున్నట్టు ఉంది.

నేను ఆ రహస్యం దాచి ఉంచిన ప్రదేశానికి నీ లాకెట్ తోవ చూపిస్తుంది. జాగ్రత్త తల్లీ, మళ్లీ కలుద్దాం!” ఆ వ్యక్తి ఎంతో ఆత్మీయంగా, సుతారంగా రక్ష నుదుటి మీద ముద్దుపెట్టుకున్నాడు.

“తల్లీ! ఇప్పుడు నువ్వు మాత్రమే ఈ రెండు లోకాలను కాపాడగలవు. అందుకే నీకు మా లోకానికి ప్రవేశం దొరికింది. ఈ పని కోసమే నిన్ను ఆ లోకం వాళ్లు ఎన్నుకున్నారు. ఈ పనిని చేస్తానని నువ్వు కూడా వాళ్లకు మాట ఇచ్చావు. ఈ పనిని నువ్వు సాధిస్తే, లోక కల్యాణంతో బాటు నేను చేసిన తప్పుకు పరిష్కారం లభిస్తుంది. మీ అమ్మనూ, నన్నూ మా లోకం వాళ్లు కూడా క్షమిస్తారు. ప్రకృతిమాత కూడా నిన్ను ఈ పని కోసం ఎన్నుకుంది. కాబట్టే, నీకు పుట్టుకతో కొన్ని అద్భుతమైన ప్రకృతి శక్తులను ప్రసాదించింది. వాటిని ఉపయోగించవలసిన సందర్భం వచ్చినప్పుడు అవి నీకు తెలుస్తాయి. నిన్ను ఆ శక్తులే రక్షిస్తాయి… నేను ఆ రహస్యం దాచి ఉంచిన ప్రదేశానికి నీ లాకెట్ తోవ చూపిస్తుంది. జాగ్రత్త తల్లీ, మళ్లీ కలుద్దాం!” ఆ వ్యక్తి ఎంతో ఆత్మీయంగా, సుతారంగా రక్ష నుదుటి మీద ముద్దుపెట్టుకున్నాడు.

చటుక్కున కళ్లు తెరిచింది రక్ష. సమయం ఐదు గంటలని ఎదురుగా కనిపిస్తున్న గోడ గడియారం చూపిస్తోంది. నిద్రపోతున్న నందన నిద్రలోనే పక్కకు తిరిగి, తన కుడి చేతిని రక్షపైన వేసి పడుకుంది. రక్ష కూడా తల్లివైపు తిరిగి గట్టిగా ఆమెను కౌగలించుకుని పడుకుంది

గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి

పదకొండో అధ్యాయంపదో అధ్యాయం | తొమ్మిదో అధ్యాయం | ఎనిమిదో అధ్యాయం | ఏడో అధ్యాయం | ఆరో అధ్యాయం | ఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం  మూడో అధ్యాయం రెండో అధ్యాయం |  తొలి అధ్యాయం  

మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article