Editorial

Monday, December 23, 2024
Serialరక్ష – 11th Chapter : తెలుపు డైలీ సీరియల్

రక్ష – 11th Chapter : తెలుపు డైలీ సీరియల్

నిన్నటి కథ

తల్లి ఆ గది లోంచి వెళ్లిన తరవాత కాసేపు రక్ష అలాగే కూర్చుంది. ఆ లాకెట్ గుండ్రంగా ఉన్న రెండు వెండి పొరలతో కనిపిస్తోంది. పైపొర మీద కొన్ని గీతలూ, బొమ్మలూ ఉన్నాయి. వాటి నడుమ అక్కడక్కడా కొన్ని సన్నటి రంధ్రాలు ఉన్నాయి. కింది పొరలో వెనక వైపున కూడా ఏవో రాతలు, గీతలు కనబడుతున్నాయి. లాకెట్ ఇలా ఉంటుందా? ఆ లాకెట్ తనకు మాత్రమే కనబడుతోందని, సాధారణమైంది కాదని అప్పుడు అర్థమైంది రక్షకు.

పదకొండో అధ్యాయం

డా.వి.ఆర్.శర్మ

ఊళ్లో వాళ్ల తాత గారి ఇంట్లో దొంగలు పడ్డారనీ, కానీ ఏమీ పోలేదు, కంగారు పడొద్దనీ మరుసటి రోజు పొద్దున్నే అమ్మ నందనకు ఫోన్ వచ్చింది. ఆ వార్త తెలియగానే నందన కంగారు పడుతూ మాణిక్యానికి ఫోన్ చేసి చెప్పింది. తాను వెంటనే వెళ్లి చూసి వస్తానని చెప్పి, హడావుడిగా తయారై బయలుదేరింది. కారులోనే వెళుతోంది కనుక, రక్షను కూడా రమ్మని చెప్పింది.

‘ఈ తొందరలో డ్రైవింగ్ చేయడం అంత మంచిది కాదని, ఎవరినైనా కారు నడిపే వాళ్లను తీసుకెళ్లమని,’ పక్కింటి వాళ్లు సలహా ఇచ్చారు. ఇప్పటికిప్పుడు ఎవరు వస్తారు అని సందేహపడింది నందన. “మా బంధువుల అబ్బాయి శరత్ ఉన్నాడు. అతడు మీకు కూడా తెలుసు కదా. చాలా మంచివాడు. ఉండండి నేనే అడుగుతాను,” అంటూ, పక్కింటి ఆమె శరత్ కు ఫోన్ చేసింది. పది నిమిషాల్లో వచ్చేశాడు శరత్.

“అయ్యో, నీకు ఏమైనా పని ఉందేమో,” మొహమాట పడుతూ అంది నందన. “పెద్ద పనేం లేదు ఆంటీ. నాకు కూడా ఈ కాంక్రీట్ అడవి లోంచి ఒక పూటయినా బయటపడే అవకాశం దొరుకుతుంది. నేనూ కాస్తా రిలాక్స్ అవుతాను,” అంటూ కారు తాళాలు తీసుకున్నాడు.

రక్ష : ఇది పిల్లల సైన్స్ ఫిక్షన్ నవల. ‘తానా’ – ‘మంచి పుస్తకం’ సౌజన్యంతో ప్రచురణ. రచయిత డా.వి.ఆర్.శర్మ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కామారెడ్డి వాస్తవ్యులు. తెలుగు భాష బోధనతో తన ఉద్యోగ జీవితాన్ని సార్థకం చేసుకున్న శర్మ గారు బాల సాహిత్యానికి చేసిన సేవ అమూల్యమైనది. వారు అనేక సాహిత్య సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ స్వయానా తానే ఒక సంస్థ అనడం సముచిత గౌరవం. ‘సాహు జీవితం – రచనలు’ వారు ఎం.ఫిల్ పరిశోధనాంశం కాగా ‘ఆధునిక కవిత్వంలో బాల్య చిత్రణ’పై వారు పి.హెచ్ డి చేయడం మరో విశేషం. మీరు చదివే ‘రక్ష’ పిల్లక కోసం వారు రాసిన సైన్స్ ఫిక్షన్ నవల. ఇప్పటివరకు శర్మ గారు 8 కవిత సంపుటులు,  4 పాటల పుస్తకాలు, రక్ష నవలతో కలిపి 4 నవలలు వెలువరించారు. వారి పూర్తి పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రచయిత ఇ – మెయిల్ : dr.v.r.sharma@gmail.com 

మధ్యలో ఒక చోట ఆగి, టిఫిన్ చేసి, ఊరికి చేరే సరికి మధ్యాహ్నం కావస్తోంది. వీళ్లు వెళ్లేసరికి ఆ ఇంటి దగ్గర కొంతమంది ఊరి వాళ్లు, శివ స్నేహితులు ఇంకా అక్కడే ఉండి మాట్లాడుకుంటున్నారు. అప్పటికే పోలీసులు వచ్చి వెళ్లారు. ఇంట్లోంచి పూచిక పుల్ల కూడా పోలేదు కాబట్టి పెద్దగా కేసు ఏమీ నమోదు చేయడం లేదని, ఐనా ఎంక్వయిరీ చేస్తామని, ఆ పని చేసిన వాళ్లను పట్టుకుంటామని చెప్పారట.
జరిగిన విషయాలన్నీ వాళ్లకు వివరంగా నానమ్మ, పిన్నీ, బాబాయి, తాతయ్యలు చెప్పారు.

పడుకునేటప్పుడు అన్ని తలుపులు, గొళ్లాలు పెట్టుకునే పడుకున్నారు. కానీ తెల్లారే సరికి తలుపులన్నీ తెరిచి ఉన్నాయి. ఇంట్లో వస్తువులన్నీ దేని కోసమో వెతికినట్టు చిందరవందరగా పడేసి ఉన్నాయి. చీమ చిటుక్కుమన్నా నిద్రలేచే శివకు కూడా ఏమాత్రం మెలకువ రాలేదు. అందరూ ఎన్నడూ లేనంత గాఢంగా మొద్దు నిద్ర పోయారు. అలా ఎందుకు జరిగిందోనని ఆశ్చర్యపోతున్నారు. అంతకన్నా విచిత్రమైన విషయం, ఆ దొంగలు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, బంగారం అన్నీ అక్కడే వదిలేసి పోయారు. బంగారు నగలను కూడా ముట్టుకోకుండా వాళ్లు దేని కోసం వెతికారో, వాళ్లకు కావలసిన వస్తువు ఏమిటో ఎవరికీ అంతుబట్టలేదు. ‘ఇది ఎవరో ఆకతాయిలు చేసిన పని కూడా కావచ్చునేమో,’ అన్నారు కొందరు. ఆ సంఘటనలో ఎవరికీ, ఏ విధమైనా నష్టం జరగలేదు కాబట్టి మంచిదే అనుకున్నారు అందరూ.

నందన వాళ్లు సాయంత్రం ఏడు గంటలకు అక్కడినుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకునే సరికి రాత్రి పదకొండు అయింది. శరత్ కారును పార్కింగ్లో పెట్టేసి, వాళ్లకు ‘శుభరాత్రి’ అని చెప్పి, వెళ్లిపోయాడు.

వాళ్లు ఏడో అంతస్తులో ఉన్న తమ ఫ్లాట్ కు లిఫ్ట్ ఎక్కి వెళ్లారు. తమ ఫ్లాట్ డోర్ ని తెరవడానికి పర్సులోంచి కీ తీసింది నందన. తాళం చెవిని పట్టుకుని డోర్లాక్లో ఉంచబోతుంటే ఆ తలుపు మెల్లగా లోపలికి తెరుచుకుంది.

వాళ్లు ఏడో అంతస్తులో ఉన్న తమ ఫ్లాట్ కు లిఫ్ట్ ఎక్కి వెళ్లారు. తమ ఫ్లాట్ డోర్ ని తెరవడానికి పర్సులోంచి కీ తీసింది నందన. తాళం చెవిని పట్టుకుని డోర్లాక్లో ఉంచబోతుంటే ఆ తలుపు మెల్లగా లోపలికి తెరుచుకుంది. ‘ఇదేమిటీ తొందరలో నేను తాళం సరిగా వేయలేదా?’ అనుకుంటూ నందన తలుపులు నెట్టి లోపలికి అడుగు వేసింది. తల్లి తోపాటే అనుమాన పడుతూ రక్ష కూడా లోపలికి వచ్చింది.

అన్ని బెడ్రూముల తలుపులు తెరిచి ఉన్నాయి. ఆ తలుపులన్నీ తానే మూసి, గొళ్లాలు పెట్టినట్టుగా రక్షకు బాగా గుర్తుంది. వాళ్లిద్దరూ గబగబా అన్నీ గదులూ తిరిగి చూశారు. అన్ని గదుల్లో సామానంతా చిందర వందరగా పడి ఉంది. అలమారీలు, కప్బోర్డులూ అన్నీ సగం సగం తెరిచి ఉన్నాయి. వాటిలో సామానంతా మంచాల మీదా, నేల మీదా పడి ఉంది. లాకర్లు కూడా తెరిచి ఉన్నాయి. వాటిలోంచి కూడా డబ్బులు, నగలు మంచాల మీదా, నేల మీదా పడేసి ఉన్నాయి.

రక్ష చిన్ననాటి వస్తువులు ఉన్న ఆ పాత పెట్టెను మాత్రమే ఆ దొంగలు తీసుకుని వెళ్లారు. పోలీసులు వెళ్లిపోయిన తరవాత తల్లీ కూతుళ్లు ఆ విషయం గుర్తించారు. అది ఆ దొంగలకు ఎందుకు ఉపయోగపడుతుందో, ఏ విధంగా అవసరమైందో నందనకు ఏమాత్రం అర్థం కాలేదు. కానీ, రక్షకు మాత్రం ఏదో అర్థం అవుతున్నట్టే ఉంది.

“ఏంటమ్మా ఇది? అక్కడ తాతగారి ఇంట్లో కూడా ఇలాగే జరిగింది!?” రక్ష తల్లితో అంటూ, తల్లి చేతిని గట్టిగా పట్టుకుంది. నందనకు కూడా అంతా అయోమయంగా ఉంది, ఏమీ అర్థం కావడం లేదు. రక్ష వెళ్లి పక్కింటి వాళ్ల కాలింగ్ బెల్ నొక్కింది. వాళ్లు తలుపులు తెరవగానే జరిగిన విషయం చెప్పింది. వాళ్లు గబగబా వచ్చి చూశారు. నిమిషాల్లో ఆ వార్త ఆ అపార్ట్మెంట్ అంతా పాకిపోయింది.

రెండు వైపులా గేట్ల దగ్గర ఉన్న వాచ్మెన్లు, ‘అనుమానితులు ఎవరూ రాత్రయిన తరవాత రాలేదని,’ చెప్పారు. పోలీసులు వచ్చి అందరినీ ప్రశ్నించారు. వాచ్మెన్లను కూడా రకరకాల ప్రశ్నలు అడిగారు. వచ్చి వెళ్లిన వాళ్లందరి పేర్లు, వివరాలు రిజిస్టర్లలో పరిశీలించారు. ఫొటోలు తీసుకున్నారు. అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ సహకారంతో సిసిటీవీల ఫుటేజ్లను పరిశీలించారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో కొరియర్ సర్వీసు నుంచి వచ్చిన అతను ముఖం కనబడకుండా మాస్క్ వేసుకుని ఉన్నాడు. అపార్ట్మెంట్ లోనికి వచ్చే వారందరూ కరోనా మాస్క్ తప్పకుండా ధరించాలన్న నియమం ఉంది. అతడు ఎందుకో తలవంచుకుని వెళ్లినట్టు కనిపించింది. అదే సమయంలో ఏడో అంతస్తులో టీవీ కనెక్షన్ ఇవ్వడానికని వచ్చిన ఇద్దరు కూడా మాస్కులు వేసుకుని, తలలు వంచుకుని, తమ ముఖాలు కనబడకుండా వెళ్లారు. వాళ్ల ఆఫీసులకు పోలీసులు ఫోన్ చేసి వివరాలు అడిగితే, ‘తమ వాళ్లు ఎవరూ ఆ రోజు ఆ అపార్ట్మెంట్లోకి వెళ్లలేదని’ చెప్పారు.

విలువైన వస్తువులు ఏమీ పోలేదు. కాబట్టి పోలీసులు కూడా మామూలుగానే తీసుకున్నారు. ఆ వివరాలు రాసుకుని, ఫొటోలు తీసుకుని, ‘ఎంక్వయిరీ చేస్తాం’ అని చెప్పి వెళ్లారు. దొంగతనానికి వచ్చిన వాళ్లు ఎన్నో విలువైన నగలూ, డబ్బులూ కనిపించినా ఎందుకు తీసుకుని పోలేదు అనేది అందరికీ వింతగా అనిపించింది. రకరకాల కారణాలు ఊహించుకున్నారు. నందన తన భర్తకూ, అత్త, మామలకూ ఈ విషయం ఫోన్ చేసి చెప్పింది. వాళ్లు కూడా చాలా ఆశ్చర్యపోయారు.

అందరికంటే ఎక్కువగా రక్ష, నందన ఆశ్చర్యపోయారు. రక్ష చిన్ననాటి వస్తువులు ఉన్న ఆ పాత పెట్టెను మాత్రమే ఆ దొంగలు తీసుకుని వెళ్లారు. పోలీసులు వెళ్లిపోయిన తరవాత తల్లీ కూతుళ్లు ఆ విషయం గుర్తించారు. అది ఆ దొంగలకు ఎందుకు ఉపయోగపడుతుందో, ఏ విధంగా అవసరమైందో నందనకు ఏమాత్రం అర్థం కాలేదు. కానీ, రక్షకు మాత్రం ఏదో అర్థం అవుతున్నట్టే ఉంది.

గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి

పదో అధ్యాయంతొమ్మిదో అధ్యాయం | ఎనిమిదో అధ్యాయం | ఏడో అధ్యాయం | ఆరో అధ్యాయం | ఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం  మూడో అధ్యాయం రెండో అధ్యాయం |  తొలి అధ్యాయం  

మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article