రామాయణ మహాభారతాలలోని ఘట్టాలనే కాదు, ఒక్క మాటలో దేవతల చిత్రాలకు పేరొందిన రాజా రవి వర్మ పలు వినాయకుడి బొమ్మలను కూడా చిత్రించారు. అందులో ‘అష్టసిద్ది’ వినాయకుడు ప్రసిద్ధి పొందిన చిత్రం.
భారతీయ సాంప్రదాయిక, పాశ్చాత్య చిత్రకళా మెళకువలు రెండింటి సంగమానికి రాజా రవివర్మ చిత్రాలని చక్కని మచ్చుతునకలుగా చెప్పుకుంటాము. చీరకట్టుకున్న స్త్రీలను అందంగా, చక్కని వంపు సొంపులతో చిత్రించడంలో వారికి సరిరారు మరొకరు అని మీకు తెలుసు. అటువంటి అద్వితీయ చిత్రకారులు కొన్ని గణేషుడి బొమ్మలూ వేశారు. వాటిని వినాయక చివితి సందర్భంలో చూస్తూ ఆ కళాకారుడిని మరోసారి యాది చేసుకుందాం.
రాజా రవివర్మ చిన్నతనంలోనే చూపిన ప్రతిభ కారణంగా ఇతనిని, ట్రావెన్కూర్ మహారాజా అయిల్యమ్ తిరునాళ్ చేరదీసి ప్రోత్సహించాడు. అక్కడి ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు వద్ద రవి వర్మ శిష్యరికం చేశాడు. తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నాడు. ఆ క్రమంలోనే పాశ్చాత్య చిత్రకళలోని శక్తి, కొట్టొచ్చినట్లున్న భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి. ఆ శైలిని జోడించి తనదైన మార్గాన్ని ఎంచుకున్న రవి వర్మ చిత్రించిన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడం విశేషం. అయన చిత్రించిన దేవతల బొమ్మలు సామాన్య జనానికి చేరువ కావడం అప్పట్లో సంచలనం.
రాజా రవివర్మ అనంతరం భారతీయుల ఊహలలో పౌరాణిక పాత్రలన్నీ రవివర్మ చిత్రాలలాగా మారిపోయాయి.
ఆయన తన చిత్రాల ఇతివృత్తాల కోసం భారత దేశమంతటా పర్యటించేవారట. తరచుగా ఆయన హిందూ దేవతాస్త్రీల చిత్రాలను దక్షిణ భారత స్త్రీలలాగా ఊహించి చిత్రించేవారు. వారు ఎంతో అందంగా ఉంటారని ఆయన భావించేవారు. ముఖ్యంగా మహాభారతంలోని నల దమయంతుల, శకుంతలాదుష్యంతుల కథలలోని ఘట్టాలను చిత్రాలుగా చిత్రించి ఎంతో పేరు సంపాదించారు. రాజా రవివర్మ అనంతరం భారతీయుల ఊహలలో పౌరాణిక పాత్రలన్నీ రవివర్మ చిత్రాలలాగా మారిపోయాయి.
రవివర్మ తరచుగా తన చిత్ర శైలిలో ప్రదర్శనాత్మకంగానూ, ఛాందసంగానూ వ్యవహరిస్తారని విమర్శలను ఎదుర్కొన్నాడు. అయినా అతని పనితనం భారత దేశములో ఎంతో ప్రశస్తి పొందడం విశేషం.
1894 లో లిథోగ్రాఫిక్ యంత్రాలు, చిత్రించడానికి అనువైన రాళ్ళూ, సాంకేతిక నిపుణులను జర్మనీ నుంచి తెప్పించారు రవివర్మ. దేశంలోనే మొదటి సారిగా అత్యాధునిక ప్రెస్ ను ముంబైలో ప్రారంభించారు. అయితే అక్కడ స్థలాభావం కారణంగా, భయంకరమైన ప్లేగు వ్యాపించడం వల్ల, కార్మికులు సరిగా లభించకపోవడం వలన నాలుగు సంవత్సరాల తరువాత మహారాష్ట్ర లోనే కొండ కోనల నడుమ ఉన్న మలవాలి అనే గ్రామాన్ని ఎంచుకున్నారు. ప్రెస్ పక్కనే తన నివాసాన్ని కూడా ఏర్పరుచుకున్నారు.
అయన దేవతలను సామాన్యజనం చెంతకు తేవడం, ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టి మరీ అయన చిత్రాలను ప్రజలకు చేరువ చేయడం చెప్పుకోదగిన మరో అంశం. మీరు చూస్తున్న గణేష్ చిత్రాలన్నీ అప్పుడు వేసిన ప్రింట్ల కారణంగానే ఎక్కువ మంది దృష్టిలో పడ్డాయని మరువరాదు.
రవివర్మ చనిపోవడానికి రెండేళ్ళ ముందు ప్రెస్ ను తన స్నేహితుడైన ఒక జర్మన్ సాంకేతిక నిపుణుడికి విక్రయించారు. దానితో పాటు వంద చిత్రాలకు కాపీరైట్ కూడా ఇచ్చారు. అయితే 1972లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రెస్ కు భారీ నష్టం జరిగింది. ఆ తర్వాత మిగిలిన చిత్రాలను, రాళ్ళనూ ప్రెస్ చుట్టు పక్కల నివసించేవారికి పంచి పెట్టేశారు. ఆ తరువాత ముంబై, పుణే ప్రభుత్వాలు కొన్నింటిని మాత్రమే భద్రపరచగలిగాయి.
రవివర్మ తాత్విక దృష్టి గురించి సరిగా తెలియరాలేదు. ముఖ్యంగా పాశ్ఛ్యాత్య చిత్రకళా శైలి మీద అతని అవగాహన గురించి సరిగ్గా తెలియదు. రవివర్మ చిత్రకళపైన తీక్షణమయిన పరిశోధన చేసే వారికి రవివర్మ వ్రాసిన ఎటువంటి పుస్తకాలూ లేకపోవటము వలన వారి పరిశోధన అసంపూర్తిగా మిగిలి పోతుంది. కాని రవివర్మ తమ్ముడు, సి.రాజరాజవర్మ రాసిన దినచర్య ఎంతో ఉపయోగపడుతుంది. సి.రాజరాజవర్మ స్వతహాగా మంచి పేరున్న చిత్రకారుడు. ఆయన రవివర్మకు చిత్రాలు చిత్రించడంలో సహాయము చేసేవాడు, అతని ఆంతరంగిక సహాయకుడు.
చెలామణిలో ఉన్న పౌరాణిక సూత్రాలను విస్మరించటం ద్వారా రవివర్మ గొప్పవైన పౌరాణిక నాయకులను, సామాన్య మానవుల స్థాయికి దిగజార్చాడన్న విమర్శ కూడా ఉంది.
రవివర్మ తనదైన శైలిలో చిత్రించిన చిత్రాలను వివిధ రకాల ఉపయోగాల కోసం విపరీతంగా ముద్రించటం వల్ల, భారతీయ ఇతిహాసాలను తనదైనశైలిలో చిత్రించడం వల్ల సాంప్రదాయ భారతీయ చిత్ర కళా శైలి మరుగున పడిపోయిందనే విమర్శ ఎదురైంది.ఆయన చిత్రకళను సాంప్రదాయశైలి కోసం విద్యలాగా నేర్చుకోవచ్చు అన్న భావనకు ఊతమివ్వడము ద్వారా భారతీయ చిత్రకళను బలహీనపరిచాడని అతడిపై విమర్శలున్నాయి. అంతేకాదు, పోరాణిక పాత్రల రూపకల్పనలో అప్పటికే చెలామణిలో ఉన్న పౌరాణిక సూత్రాలను విస్మరించటం ద్వారా రవివర్మ గొప్పవైన పౌరాణిక నాయకులను, సామాన్య మానవుల స్థాయికి దిగజార్చాడన్న విమర్శ కూడా ఉంది.
ఏమైనా అయన దేవతలను సామాన్యజనం చెంతకు తేవడం, ఒక ప్రింటింగ్ ప్రెస్ పెట్టి మరీ అయన చిరాలను ప్రజలకు చేరువ చేయడం చెప్పుకోదగిన మరో అంశం. మీరు చూస్తున్న గణేష్ చిత్రాలన్నీ అప్పుడు వేసిన ప్రింట్ల కారణంగా ఎక్కువ మంది దృష్టిలో పడ్డాయని మరువరాదు.