Editorial

Monday, December 23, 2024
సినిమాఅద్భుతం అను Mucize : రఘు మాందాటి చిత్ర సమీక్ష

అద్భుతం అను Mucize : రఘు మాందాటి చిత్ర సమీక్ష

మ్యూకిజ్ అనగా ఇంగ్లీషులో మిరాకిల్, తెలుగులో అద్భుతం అని అర్ధం. నిజంగానే మ్యూకిజ్ అన్న అద్భుతాన్ని అసలు మాటలతో చెప్పలేం.

ఇది ఒక వినయపూర్వకమైన, హృద్యమైన, ఆహ్లాదకరమైన అనుభవం. ఇది కేవలం నమ్మకం మరియు మనిషి ఆశ యొక్క మాయా వ్యవస్థను బలపరుస్తుంది.

రఘు మాందాటి

Randhu Mandhatiమనం మనిషిగా చలించి హృదయంతో ప్రతిస్పందించడం అనే అలవాటు పోయి చాలా కాలం అయ్యింది.

మన మనసు కరగాలంటే ఏదో ఒక సునామి, ఒక విపత్తు, కరోనా లక్డౌన్ వల్ల వలస కార్మికుల తిరుగు ప్రయాణమో లేదా వారి కష్టాలో.. ఇలా ఏదో ఒక అంశం మనకి ఊతంలా నిలిస్తే తప్ప మనం మనిషిలా ప్రవర్తించలేని స్థితి.

మనలోని ఉదార భావం మేలుకోవడానికి ఏవో కారణాలు వెతుక్కోవడమో లేదా ఏవో కొన్ని అంశాలు తరసపడితేనో తప్ప ఎప్పటికి మేలుకోవు. కర్మ కొద్ది ఎవరైనా ఏదైనా ప్రయత్నించాలని చూస్తే మన చుట్టూ ఉన్న కూటమిలోనే న్యూనతల బావిని ఒకటి తవ్వి అందులోకి నిలువునా ముంచేస్తుంటాము. మనకెందుకు ఇవన్నీ అనుకొని చాలా మట్టుకు కాలాన్ని తిరిగి యధావిధిగా నెట్టుకుంటు పోతుంటాము.

ఈ ఉపోద్ఘాతము ఇప్పుడెందుకూ అంటే కారణం ఉంది. కొంత కాలంగా కాలంతో నెట్టుకుంటున్న క్రమంలో ఎంతో కొంత నా తోడుగా ఫోటోగ్రఫీ, లైన్ ఆర్ట్ ఉంది. అందుకు ప్రపంచాన్ని దర్శించాలనే నా తపన ఒక ఇంధనం.

చరిత్రని నా కళ్లతో చూడు అని పుస్తకాలు జోళ్ళు అయినట్టు ఇప్పుడు ప్రపంచాన్ని కనులముందు పరుస్తున్నాయి Netflix లాంటి మాధ్యమాలు. ఇప్పుడవి ప్రపంచాన్ని దర్శించాలనుకునే కుతూహలానికి చక్కగా నప్పే కళ్లద్దల్లాయ్యాయి. అ దర్శన భాగ్యం నుంచి మ్యుకిజ్ అన్న చిత్రాన్ని పరిచయం చేస్తాను.

నాకు ఈ సినిమా ద్వారా అజిజ్ అన్న అద్భుతమైన పాత్ర దొరికింది.

ఒక్క మాటలో చెప్పాలంటే, ఆనందాన్ని మనం అనుభవిస్తున్నప్పుడే కాదు, ఇతరుల అనుభవాల్లోనుండి కూడా ఆనందం పొందొచ్చు అని నిరూపించారు మ్యుకిజ్ చిత్ర రచయిత దర్శకులు ఈ చిత్రాన్ని ఒక దృశ్యకావ్యంగా మలిచి.

నేను ప్రత్యేకంగా దేనికోసం వెతకలేదు. కాని నాకు ఈ సినిమా ద్వారా అజిజ్ అన్న అద్భుతమైన పాత్ర దొరికింది. అజిజ్(Aziz) దర్శకుడు మహసున్ కార్మాజాగల్ (Mahsun Kırmızıgül) మలిచిన మ్యూకిజ్ పాత్ర.

గడుస్తున్న ప్రతి క్షణాన్ని ఆనందంతో స్వీకరించే అజీజ్ తత్వం ఎప్పటికి నా దృష్టిలో చిరస్మరణీయం.

అజీజ్ నా మనస్సును వదిలిపెట్టడానికి నిరాకరించాడు. తనతో పాటే నేను కూడా తిరుగుతూ నేను ‘నేను’ గా మారిన ఆ క్షణం ఇక నన్ను ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది.

తూర్పు టర్కిష్ పర్వతాల జీవితాన్ని, దాని లోపాలను వివరించలేని మరియు గడుస్తున్న ప్రతి క్షణాన్ని ఆనందంతో స్వీకరించే అజీజ్ తత్వం ఎప్పటికి నా దృష్టిలో చిరస్మరణీయం.

అజీజ్ ప్రతిరోజూ తన గుర్రంతో మాట్లాడాడు. అది చూసి తీరాలి.

వైకల్యం ఉన్న అజీజ్ అనే బాలుడు, తన మొదటి మాటలు మాట్లాడటానికి తన జీవితంలో ముప్పై సంవత్సరాలు తీసుకున్నాడంటే నమ్ముతారా? అయినప్పటికీ తానేమిటో తనకు తెలిసి, లోతుగా భావించి, ఎవరికీ చెప్పని అజీజ్ ప్రతిరోజూ తన గుర్రంతో మాట్లాడాడు. అది చూసి తీరాలి. అప్పుడంటారు నాలా. మహూసున్ కార్మాజాగల్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక అద్భుతం అని.

అక్కడ చేరుకొన్నాక అర్ధమవుతుంది అక్కడ పాఠశాల లేదని గ్రహించడానికి మాత్రమే ఇంత దూరం ప్రయాణం చేశాడని.

ఇది 1960 టర్కీ పర్వత ప్రాంతంలో తీర్చి దిద్ద బడింది.

పశ్చిమ టర్కీలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని తూర్పు టర్కీలోని ఒక చిన్న గ్రామ పాఠశాలకు బదిలీ చేస్తారు. రాజకీయంగా అల్లకల్లోలంగా ఉన్న దేశంలో తన ఉద్యోగానికి భయపడి, మహీర్ తన భార్యను నిరాశకు గురిచేస్తాడు. తన భార్యని మరియు తన ఇద్దరు కుమార్తెలను విడిచిపెట్టి, ఒక సూటుకేసు నిండా బట్టలను సర్దుకొని తన ప్రయాణాన్ని ఒక బస్సులో కొనసాగిస్తాడు. నెమ్మదిగా బస్సులోని ప్రయాణికులు ఒక్కొక్కరుగా దిగిపోయి ఇదే ఈ బస్సు యొక్క చివరి స్టేషను అంటూ ఒక పర్వతశికరపు అంచున నిలిపివేసి చెప్తాడు కండక్టర్. కానీ అతను వెళ్లాల్సిన గ్రామం మాత్రం అది కాదు. దానికోసం కండక్టర్ని అడిగితే ఇక్కడి నుండి సరిగ్గా కొన్ని పర్వతాలు రెండు మూడు నదులు దాటాక ఉంటుందని సెలవిచ్చి బస్సు వెళ్ళిపోతుంది. అతను పర్వతాలను తరిమివేసి, నదులను చెప్పులు లేకుండా దాటి, చివరకు మారుమూల గ్రామమైన జాజాకు చేరుకుంటాడు, అక్కడ చేరుకొన్నాక అర్ధమవుతుంది అక్కడ పాఠశాల లేదని గ్రహించడానికి మాత్రమే ఇంత దూరం ప్రయాణం చేశాడని. చివరికి, అతను తన పదవీకాలంలో బోధించడానికి గ్రామ పిల్లలకు ఒక పాఠశాలను నిర్మించాలని నిర్ణయించుకుంటాడు మరియు ఆశాజనక భవిష్యత్తు కోసం మార్గం సుగమం చేస్తాడు. గ్రామ పెద్దల నుండి, ముఖ్యంగా ముహతార్ దావుత్ (చీఫ్) మరియు అతని వికలాంగ కుమారుడు అజీజ్ నుండి అతను నేర్చుకునే పాఠాలు, రాబోయే సంవత్సరాల్లో మహీర్ మరియు అతని చర్యలను కార్యక్రమాల్ని అనుభవాల్ని చాలా చక్కగా నిర్వచించాయి.

నిజమైన గ్రామీణ టర్కీకి ఎన్నడూ రాని మరియు ప్రయాణించలేని మన లాంటి సాధారణ వ్యక్తులకోసం దృశ్యరూపాన్ని చెక్కడంలో సినిమాటోగ్రఫీ పనితీరు అమోఘం.

వివేకవంతమైన సంభాషణలు మరియు పాఠాలతో పాటు, ముసిజ్ తన నిర్మాణాత్మక సంవత్సరాల్లో మహసున్ కర్మాగెగల్ తను నివసించిన ప్రపంచానికి ఈ చిత్రం ఒక పరిశీలన గ్రంధం. జాజా కుర్దిష్ సంతతికి చెందిన ఒక కళాకారుడు, అతను అనాలోచిత సింహవలోకనపు పర్వతాలను బంధించడం, ఆ పర్వతాల్లో దాగిన సుగంధాలు అదే పర్వతాల్లో జీవనం సాగిస్తున్న మారుమూల గ్రామాలలోని జీవితం, ఆ జీవితాల్లోని బలమైన సాంస్కృతిక ప్రభావాలు, పద్ధతులు, సాంప్రదాయాలు వీటన్నిటిని ఈ చిత్రంలో ప్రకాశించేలా చేయగలిగారు. నిజమైన గ్రామీణ టర్కీకి ఎన్నడూ రాని మరియు ప్రయాణించలేని మన లాంటి సాధారణ వ్యక్తులకోసం, దీనిని చక్కగా మలిచి అందించిన తీరు, దృశ్యరూపాన్ని చెక్కడంలో సినిమాటోగ్రఫీ పనితీరు అమోఘం.

వధువు సరైన జోడినా కాదా అని తెలుసుకొనేందుకు పారంపర్యంగా సాగె ఆంక్షలకనుగుణంగా కొన్ని పరిక్షలని ప్రతి వధువు ఎదురుకోవాల్సిందే.’

ఈ చిత్రంలో ప్రస్ఫుటంగా కనిపించే అంశాలు ఇక్కడ ఇంటి స్త్రీలు గ్రామంలోని యువకులకు సరైన జోడిని ఎంపిక చేయడానికి గుంపుగా ఇతర దూర గ్రామాలకు వెళ్లి పురుషుని వివాహం చేసుకోవడానికి తగిన వధువును కనుగొంటారు. వధువు సరైన జోడినా కాదా అని తెలుసుకొనేందుకు పారంపర్యంగా సాగె ఆంక్షలకనుగుణంగా కొన్ని పరిక్షలని, సవాళ్ళని ప్రతి వధువు ఎదురుకోవాల్సిందే.

వధువు టీ తెస్తుంది మరియు ముఖానికి దగ్గరగా వచ్చి దంతాలు కనిపించేలా నవ్వుతూ వచ్చిన వాళ్ళకి స్వాగతం పలకాల్సి ఉంటుంది. ఆమెకు దుర్వాసన ఉందో లేదో తనిఖీ చేయడంలో ఇదొక భాగం ఇలా ఖురాన్ మరియు భోజన సన్నాహాల గురించి ఎన్ని రకాల వంటలు వచ్చో వాటిని ఎలా వండాలో వివరించాల్సి ఉంటుంది. చివరకు ఆమెకు కాళ్ళు ఉన్నాయా తను సరిగా నడవగలుగుతుందా లేదా అని గమనించడానికి నేలమీద ఒక తాడుని పరిచి దాని మీద నెమ్మదిగా నడవాల్సి ఉంటుంది. గర్భిణీ సమయంలో గర్భాన్ని మోయగలిగే శక్తి తన శరీరానికి ఉందా లేదా ప్రసవం సాఫీగా జరుగుతుందా లేదా అని నడుముని పొట్టని పరీక్షించడంకూడా ఒక భాగం.

స్త్రీ పరివారం వధువుని వెతకడం కోసం బయలుదేరే ముందు, వరుడు వారి వద్దకు పరిగెత్తుతాడు మరియు అతను తన భార్యలో ఏమి కోరుకుంటున్నారో వారికి చెబుతాడు. అందమైన కళ్ళు, కుహరం లేని తెల్లటి దంతాలు లేదా మరేదైనా. కానీ తెలివైన మహిళల కోసం, మతం మరియు వంటగది గురించి తెలిసి ఉండాలనే నియమాలని గనక పూర్తిచేయగలిగితే మిగతా అంశాలు అందం లాంటివి అలవాటైపోతాయనేది స్త్రీ పరివారం అనుకుంటారు. ఇలా మారుమూల పర్వతాలలో 1960 లలోని అనేకానేక అంశాల్ని మానవతా దృక్కోణాలని జత కూర్చిన కథ ఇది. ఇక ఇలాంటి దృక్కోణ సంప్రదాయాల కట్టుబాట్లు కలిగిన గ్రామంలోకి అడుగుపెట్టిన మహీర్ అంగవైకల్యం కలిగిన అజీజ్ జీవితంలో ఆసక్తి చూపుతాడు, వైకల్యాన్ని మెరుగుపరచడానికి మార్గాలను కనుగొంటాడు.

తన 34 సంవత్సరాల తరువాత ఒక మహిళ తన జీవితంలోకి రావడం దేవుని బహుమతి.

నగరంలో ఎక్కడో ఒక ముసలివాడు తన కుమార్తె చేతిని ముక్తార్ యొక్క పెళ్లికాని కొడుకుకై వాగ్దానం చేస్తాడు. చివరగా, వివాహం చేసుకోవడం అజీజ్ జీవితంలో ఒక గొప్ప మలుపు. తన 34 సంవత్సరాల తరువాత ఒక మహిళ తన జీవితంలోకి రావడం దేవుని బహుమతిగా గుర్తించి తన భార్య అజీజ్ మిజ్గిన్లో(Aziz Mizginlo) అతడు ఒక పరిపూర్ణ మనిషని గుర్తిస్తాడు. తమ జీవితం వారిపై విసిరిన అనేకానేక రుగ్మతలని బాగు చేసుకోడానికి ఈ జంట ప్రయత్నిస్తుండగా, సమాజం వారికి అక్కడ నివసించడం కష్టతరం చేస్తుంది. అజీజ్ మరియు మిజ్గిన్ గ్రామాన్ని విడిచిపెట్టి, తక్కువ విమర్శలు చేసే ప్రపంచానికి చేరుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు మరి.

ఈ చిత్రం హృదయంలో కళ్ళు ఉన్నవారికోసమే.

మ్యూకిజ్ ఇవన్నీ చెప్పే చిత్రం కాదు. ముహ్తార్ దావుత్ చెప్పినట్లు “కొంతమంది హృదయాలలో కళ్ళు ఉంటాయి. వారు ఆ కళ్ళ ద్వారా ప్రపంచాన్ని చూస్తారు. వారు ఆ కళ్ళ ద్వారా ప్రతిదీ చూస్తారు.”

ఈ చిత్రం కూడా హృదయంలో కళ్ళు ఉన్నవారికోసమే.

హృదయాంతరాల్లోని నిక్షిప్తమైన ఉదార స్వభావాన్ని మేలుకొల్పుకోవాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

కొన్ని దృశ్యాలు ఫోటోగ్రాఫర్ గా సినిమాటోగ్రాఫర్ గా నాలో ఎప్పటికి వెంటాడుతూనే ఉంటాయి

ప్రతి ఫ్రేమ్ చిత్రీకరించిన తీరు పర్వత శిఖరాల్లోని కాలానుగుణంగా మారే వాతావరణం. వాతావరణంలో మారే రంగుల ప్రపంచంలో సూర్యోదయ సూర్యాస్తమాయల నడుమన సాగె రంగుల విన్యాసం గోల్డెన్ హావర్ లో చిత్రీకరించిన కొన్ని దృశ్యాలు ఫోటోగ్రాఫర్ గా సినిమాటోగ్రాఫర్ గా నాలో ఎప్పటికి వెంటాడుతూనే ఉంటాయి. వీటన్నింటికి తోడు పాత్రల్లో నటులు ఒదిగిన తీరు. జీవితాలని కథగా రాసిన తీరు కథని చిత్రంగా మలిచిన తీరు హృద్యంగా బంధించిన తీరు  వీటన్నిటి సంగీతంతో మూడేసిన తీరు దేనికదే ఒక గొప్ప ప్రత్యేకతని పోటాపోటీగా మనల్ని కన్నులపండుగగా వీణులవిందుకి గురిచేస్తుంది.

పూర్తి చిత్రం Netflix లో చూడొచ్చు.

కథకుడు రఘు మాందాటి ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్. ట్రావెలర్ కూడా. తెలుపు ప్రచురించిన అతడి రచనల్లో సినిమా సమీక్ష ‘ఆనందం అంటే Lunana’, అలాగే తాను రాసిన కథ ‘నడకలు’.  రఘు మొబైల్ 9966225666

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article