Editorial

Wednesday, January 22, 2025
ARTSఆనందం అంటే Lunana : A Yak in the Classroom - రఘు మాందాటి...

ఆనందం అంటే Lunana : A Yak in the Classroom – రఘు మాందాటి తెలుపు

ఈ చిత్రం మానసిక ఆనందాన్ని నెలకొల్పే ఒక మంత్ర దండం.

రఘు మాందాటి

భూటాన్ లో చిత్రీకరించిన ఈ చిత్రం మనలోని ఆనందాన్ని వెలికితీసేందుకు హృదయంలో ఒక అద్భుతాన్ని పెనవేసెందుకు తీసిన చిత్రంగా చెప్పుకోవచ్చు.

సంతోషంగా ఉండటం అనేది చాలా సహజంగా ఉండాలి.
ఇంతకీ మన మనసుకి ఏం కావాలి?? మధురమైన వాసనలు, చెక్కిలిని గిలిగింత పెట్టే చల్లగాలులు,
ఎముకలు కొరికే చలిలో వెచ్చని ఆలింగనాల సూర్యకాంతి, కంటికి ఇంపుగా దర్శనమిచ్చే సహజ దృశ్యాలు మరియు హృద్యంగా ఉత్తేజపరిచే సంగీతం ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే, మన ఆనందానికి మనం అలాంటివి ఎన్నో అనుభూతి చెందినప్పటికీ మనకు అసలైన మానసిక స్థితి అంటే ఏంటో ఎప్పటికి అంతు చిక్కదు. అసలు సమస్య మన మనస్సులో ఉంది, మన మనసే ఒక ఫిల్టర్, స్క్రీన్, సెన్సార్ మరియు చివరికి మన మొత్తం ఆనందంపై తుది తీర్పును ఇస్తుంది.

మంచి అనుభవాల నుండి మంచి అనుభూతుల వరకు పెరగడాన్ని మనం చెప్పుకునే ప్రతికూల అంతర్గత కథనాల ద్వారా సులభంగా నిరోధించవచ్చు అందుకే నేనంటాను ఈ చిత్రాన్ని అలాంటి ఒక సహజత్వం కూడిన మానసిక ఆనందాన్ని నెలకొల్పే ఒక మంత్ర దండం అని.

కథ వినండి…

చైనా మరియు భారతదేశం మధ్య తూర్పు హిమాలయాలలోని అద్భుతమైన పర్వత ప్రాంతాలలో ఉన్న భూటాన్‌లో సమ్థింగ్ ఉగ్యెన్ దోర్జీ (షెరాబ్ దోర్జీ) నివసిస్తున్నారు. Ugyen తన అమ్మమ్మ (Tsheri Zom) తో తింపు నగరంలో నివసిస్తున్నాడు, అతను పాఠశాల టీచర్ గా ఐదు సంవత్సరాల ప్రభుత్వ కాంట్రాక్టును ఇప్పటికే నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు చాలా గర్వంగా ఉన్నాడు.

కానీ టీచర్ గా తన కెరీర్ ఎప్పుడు తనకి నచ్చదు. దానికి కారణం తన ధ్యాస అంత కూడా ఎప్పుడెప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్లి ప్రొఫెషనల్ సింగర్‌గా మారాలనే ఆశయం. దీంతో టీచర్ ఉద్యోగం మీద ఆసక్తి, పట్టు పోయింది. తన తోటివారిలో చాలా మందిలాగే, అతను కూడా మీడియా యొక్క మెరిసే పాశ్చాత్య ప్రపంచం మరియు అతని ఫోన్ ద్వారా యాక్సెస్ చేయబడిన ప్రసిద్ధ సంస్కృతికి ఆకర్షితుడయ్యాడు. అతని మనస్సులో ఎప్పుడు అతను సంతోషంగా ఉండటానికి ఒక కొత్త ప్రదేశంలో పూర్తిగా భిన్నమైనదాన్ని ఎదో చేస్తున్నట్లు ఊహిస్తుంటాడు.

అతన్ని పర్వతాలలోకి ఎక్కుతూ దిగుతూ అలిసిపోతు సొలసిపోతు ఆరు రోజులు నడిస్తే గానీ చేరుకొని ఒక 56 మంది జనాభా కలిగిన చిన్న గ్రామమైన లునానాకు పోస్టింగ్ ఇస్తుంది.

అతని వైఖరికి అతని సూపర్‌వైజర్ ఎలా ప్రతిస్పందిస్తుందంటే, అతన్ని పర్వతాలలోకి ఎక్కుతూ దిగుతూ అలిసిపోతు సొలసిపోతు ఆరు రోజులు నడిస్తే గానీ చేరుకొని ఒక 56 మంది జనాభా కలిగిన చిన్న గ్రామమైన లునానాకు పోస్టింగ్ ఇస్తుంది. నిజానికి ఇది ప్రపంచంలోనే అత్యంత మారుమూల పాఠశాల. ఈ చిత్రం కూడ ఆ గ్రామంలోనే అతి సహజమైన ప్రదేశంలో చిత్రీకరించబడింది. మరో ముఖ్య విషయం ఏంటంటే అక్కడ విద్యుత్తు లేనందున, సినిమాటోగ్రాఫర్ సౌరశక్తితో పనిచేసే బ్యాటరీలతో నడిచే కెమెరాలను ఉపయోగించాల్సి వచ్చింది.

శారీరకంగా ఎంతో అలసిపోయిన ప్రయాణం తర్వాత అతను వచ్చినప్పుడు గ్రామం మొత్తం స్వాగతంగా పలకరించినప్పటికీ, ఉగ్యెన్ కి మాత్రం తను ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అతను తన గదిలో రన్నింగ్ వాటర్ లేదా కరెంటు లేని అసౌకర్యంగా ఉన్న ప్రదేశానికి చేరుకున్నాను అని గుర్తించి ఆశ్చర్యపోతాడు; వంట చేసుకోవడం కోసం మరియు చలి నుండి తనని తాను కాపాడుకునే వేడి కుంపటి కోసం అతను యాక్ పేడతో పిడకలుగా చేసి కాల్చాలైందే వేరే దారి లేదు. అతని తరగతి గదిలో బ్లాక్‌బోర్డ్ కూడా లేదు మరియు పిల్లలకు కనీస విద్య సామాగ్రి కూడ లేకపోవడం చూసి అతను అక్కడినుండి వీలైనంత త్వరగా బయటపడి ఇంటికి తిరిగి రావాలని గ్రామ పెద్ద ఆశా (కుంజాంగ్ వాంగ్డి)కి చెప్తాడు.

కానీ ఇక్కడే ఒక మలుపు.

ఆనందం అనేది ఒక రహస్యమైన భావోద్వేగం. ఇది మన చుట్టూ తిరగగలదు మరియు మన ప్రణాళికలు మరియు మన కలలను మార్చగలదు. ఉగ్యెన్ విషయంలో, రెండు పరిణామాలు అతని పరివర్తనకు దోహదం చేస్తాయి.

ఒకటి

పిల్లలు కొత్త టీచర్‌ని కలుసుకోవడంతో ఎంతో థ్రిల్‌గా ఉన్నారు. అతను తన మొదటి రోజు క్లాస్ లోని తొమ్మిదేళ్ల పెమ్ సామ్ (పెమ్ జామ్) ని తన ఉత్సాహపూరితమైన చిరునవ్వుతో పలకరించడం చూసి మనసులో మురిసిపోయి అతను ఇక్కడ కూడా మార్పు తీసుకురాగలడని వెంటనే గ్రహించాడు. కానీ ఏం చేసినా లునాన గ్రామాన్ని మంచు రాకముందే మంచుతో కప్పబడి దారి మూసుకుపోక ముందే తిరిగి బయలుదేరాలి అని అనుకుంటాడు.

రెండోది సంగీతం

స్వతహాగా గాయకుడైన ఉగ్యెన్ కొండలపై పాడుతున్న అందమైన యువతి సాల్డన్ (కెల్డెన్ లామో గురుంగ్) తన గాత్రం విని మంత్రముగ్ధుడయ్యాడు.

తన గానం ఒక సమర్పణ అని ఆమె వివరిస్తుంది:

“ఇది నేను అన్ని జీవులకు, అన్ని ప్రజలకు, జంతువులకు, దేవతలకు, మా లోయలోని అన్ని ఆత్మలకు అర్పించే పాట. నల్ల మెడ గల కొంగలు పాడినప్పుడు అవి చింతించకుండా పాడతాయి. ఎవరు వింటారా లేదా ఇతరులు ఏమనుకుంటున్నారు అని అనుకోకుండా చాలా సహజంగా గానం వాటి లక్షణంగా అవి పాడుతాయి అవి ఆనందాన్ని అందించడానికి పాడతాయి నేను కూడా అలాగే పాడాలనుకుంటున్నాను.”

జడల బర్రె కూడా

ఉగ్యెన్ ఆమెను ఒక యాక్ (జడల బర్రె) పశువుల కాపరి గురించి ఒక పాట నేర్పించమని కోరాడు మరియు త్వరలోనే వారు కలిసి ప్రాక్టీస్ చేస్తుంటారు.

గ్రామానికి ట్రెక్కింగ్ సమయంలో, అతని మిత్రులు, మిచెన్ (ఉగ్యెన్ నోర్బు లెందుప్) మరియు సింగే (త్షెరింగ్ డోరిల్), వారి సురక్షితమైన ప్రయాణం కోసం పర్వత మార్గంలో అర్పించారు. వారి ద్వారానే ఉగ్యెన్ తన స్వంత బహుమతులను గ్రామానికి తీసుకువస్తాడు, తన గిటార్‌ని పొందాడు, తద్వారా అతను పిల్లలతో పాడవచ్చు మరియు తరగతి గదికి బోధనా సామాగ్రిని తెప్పించుకోగలిగాడు.

తరగతి గదిలోనే పిల్లల కోసం ఉగ్యెన్ చేస్తున పని తీరును గమనించిన సాల్డన్ తన కోసం తాను పిడకల కోసం కొండల మీద యాక్ పేడని సేకరించేందుకు పడుతున్న అవస్తని తగ్గించేందుకు పేడను సేకరించాల్సిన అవసరం లేకుండా పాఠశాల లోపల ఉంచడానికి గ్రామంలోని యాక్స్‌ లో ఒకటైన నోర్బు (అంటే “కోరికలు తీర్చే ఆభరణం”)ని తీసుకువస్తుంది.

నోర్బు యాక్ కూడ తరగతి గదిలో పిల్లలతో పాటే నెమ్మదిగా గడ్డిని నములుతూ ఉగ్యెన్ చెప్పే పాటాలని ( lessons) వినేది.

ఈ చిత్రంలో ఒక పాటని సాధన చేస్తున్న క్రమంలో ఆ పాట సాహిత్యంలో యాక్ కి మరియు పశువుల కాపరి మధ్యన ఉన్న ఒక అత్యుత్తమ అనుభందపు మధురిమని చిత్రం చివరలో అనుభూతి చెందొచ్చు ఆ అనుభూతి కోసమైనా చిత్రాన్ని చూడాలి.

ఆ గ్రామంలో గడిపిన తన జ్ఞాపకాలలో ఒకదానిలో, మన జీవితంలో సంతోషకరమైన సమయం ఉంటుందని ఆశించడం తప్పు అని తెలుసుకుంటాడు. దానికి బదులుగా, ఆనందం యొక్క అనుబుతులతో అనేక క్షణాలు ఉన్నాయని తెలుసుకుంటాడు.

దాదాపు ప్రతి రోజు కనీసం ఒక క్షణం ఆనందం తప్పక ఉంటుంది. ఈ చిత్రం ఆనందపు క్షణాలతో నిండి ఉంది. ఒకసారి ట్రైలర్ చూడండి. తర్వాత సినిమా తప్పక చూస్తారు.

ఆనందమే చిత్రం

అన్నట్టు, ఈ చిత్రంలో పర్వతాల అందాలను చూడడం ఒక ఆనందం, డాన్స్ చేస్తున్న పిల్లల బృందంతో “ఓల్డ్ మెక్‌డొనాల్డ్” పాడటం ఒక ఆనందం, కిటికీలకు చలి గాలి రాకుండా అంటించిన hand-made paper చేతితో తయారైన చలిని ఆపే పేపర్లను తీసి ముక్కలుగా చేసి పేపర్లని పిల్లలు రాసుకోవడానికి ఇచ్చినప్పుడు చుస్తున్నందుకు మనకు కలిగే ఆనందం, ప్రత్యేక చెక్క గిన్నెలో పంచుకున్న ఆహారం ఒక ఆనందం, అతనికి తన విద్యార్థుల నుండి లేఖలో ఇలా రాస్తారు “మంచి హృదయాలను కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతను మీరు మాకు చూపించారు.” అని అదంతా మనం గమనించడం ఒక ఆనందం.
చివరగా గ్రామ పెద్ద తన కోసం పాడిన యాక్ గీతం హృదయాలను తప్పక భావోద్వేగానికి గురిచేస్తుంది.
వీలైతే Prime Video లొ చూడండి.

కథకుడు రఘు మాందాటి ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్. ట్రావెలర్ కూడా. తెలుపు ప్రచురించిన అతడి కథ ‘నడకలు’ కూడా భిన్నమైన రచన. దాన్ని ఇక్కడ చదవొచ్చు. రఘు మొబైల్ 9966225666

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article