మీరు నిత్యజీవితంలో వేస్తున్న అడుగు వేరు. అది మీ వ్యక్తిగతం. కానీ నలుగురికోసం మరో అడుగు వేయడానికి మీకు సమయం లేకపోవచ్చు, తగిన ఆలోచనా లేకపోవచ్చు. కానీ మీ తరపున ఆ extra అడుగు వేసేందుకు తానున్నారు.
అలాగే మరి కొందరుంటారు. వారు ఒక దగ్గర ఆగిపోతారు. ముందుకు వెళ్ళలేకా వెనక్కు పోలేకా చతికిల బడుతారు. మరొక్క అడుగు వేయడానికి తోడ్పాటు లభిస్తే వారు ఎంత దూరమైనా వెళ్ళగలుగుతారు. సరిగ్గా అలాంటి వారికీ అండగా మీ తరపున వీరున్నారు.
రెండు రకాల వారికీ ఈయన ఒక Extra Mile. స్వచ్ఛంద సేవకై మరో అడుగు వేసిన జయ నాగమోహన్ గారు ఒక దారి దీపం. ఆయన ఎంచుకున్న పని ఒక ఆశ్చర్యం.
కందుకూరి రమేష్ బాబు
అడగందే అమ్మయినా పెట్టదంటారు. కానీ అడిగినా తీరని ఒకానొక చిన్న అవసరం విషయంలో ఈయన నిజంగానే ఆశ్చర్యకరమైన కార్యాచరణకు నాంది పలికారు.
‘లోదుస్తులు’( Inner wear) ఇవ్వడం ఏమిటీ? అని మీరు ముక్కు మీద వేలు వేసుకోవడం సహజం. కానీ, సిగ్గు బిడియం మొహమాటానికి ఎంతమాత్రం తావులేని పనిలో నిమగ్నమైన ఈ వ్యక్తి గురించి తెలిస్తే విస్మయం చెందడానికి బదులు అభినందించడానికి పూనుకుంటారు.
అవును. ఆయనది భిన్నమైన సేవానిరతి. ‘Extra Mile’ పేరిట స్వచ్ఛంద సేవాసంస్థను స్థాపించిన జయ నాగమోహన్ గారి ప్రధాన కార్య రంగం – Inner wears డెలివరీ. అదొక స్పూర్తిదాయక కథనం. ఒక చిన్న ‘నానో’ కారుతో ఎవరూ సాహసించని Extra mile ప్రయాణాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్న జయ నాగమోహన్ గారు ఏటా నాలుగు వందల బాలికలకు లోదుస్తులు అందిస్తుండటం విశేషం.
మండా జయ నాగమోహన్ బుద్ధిబలం కన్నా భావోద్వేగాల విలువ అపారం అని అర్థం చేసుకున్న మనిషి. కరుణామయి మదర్ థెరీసా మాదిరి బాధితులను ప్రేమగా గుండెకు హత్తుకోవాలన్న ఆలోచనతో తన సంస్థ లోగోను కూడా అ విధంగా రూపొందించారు.
యాభై ఏడేళ్ళ ఈ స్వచ్ఛంద సేవకుడిది గుంటూరు జిల్లా సత్తెనపల్లి. వీరు గత మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ లో వివిధ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ పదేళ్ళక్రితం ఒక కార్పోరేట్ కంపనీలో టీం లీడర్ గా చేరారు. అక్కడ పని చేసే రోజుల్లో వారాంతపు సెలవుల్లో స్వచ్ఛంద సేవలో చురుగ్గా పాల్గొనేవారు. తాను ఉద్యోగం చేస్తోన్న సంస్థ తరపున ఒక ప్రభుత్వ పాఠశాల దత్తత తీసుకోవడం, ఆ బాధ్యతలు చూడటం ఆయనలో మార్పుకు బీజం పడింది. అదే దశలో ఎదురైన మరో అనుభవం అనుకోకుండా అతడిని పూర్తికాలం సామాజిక సేవకు మరిలేందుకు ప్రేరణగా నిలిచింది. ఆ ప్రేరణే తాను ఒక అడుగు వేసి, పదుగురిని తనతో పాటు మరో అడుగు వేయించడానికి కారణమైంది. అలా పుట్టిందే Extra Mile.
ఆ సంస్థను స్థాపించేలా చేసిన ఆ అనుభవం ఏమిటో చూద్దాం.
ఆడపిల్ల కన్నందుకు అలక్ష్యం
కూతురుని కన్న కారణంగా ఒక వివాహిత తన కుటుంబంలో ఎంత అలక్ష్యానికి గురైందో తెలిసి జయ నాగమోహన్ విస్మయానికి గురయ్యారు. ఆ తల్లికి, తన బిడ్డకూ ఇంత తిండి పెట్టడం, ఇంటి చాకిరీ అంతా చేపించుకోవడం తప్పా భర్తకు ఆమె ఒక మనిషిగా కనిపించకపోవడం అతడిని కదిలించింది. కూడు, గూడు, గుడ్డ మౌలిక అవసరాలు అంటారు కదా. వాటిల్లో మొదటి రెండూ సరే, మూడో అంశమైన ‘గుడ్డ’ గురించిన ఆలోచనకు స్ఫూర్తి నిచ్చింది ఆమెనే.
భర్త ఇంత తిండి పడేసి ఇంట్లో ఆ తల్లీ బిడ్డలను జీవచ్చవాలుగా మార్చేశాడు. వారు ధరించేందుకు సరైన బట్టలు కూడా ఏర్పాటు చేసేవాడు కాదు. ఆ సంగతి ఆమె చెప్పడంతో తొలిసారిగా ఆమెకోసం బట్టలు ఖరీదు చేయడం ఆయనలో మార్పుకు నాంది పడింది. చిత్రమేమిటంటే, ఇల్లూ వాకిలీ ఉన్న వారే ఇలా ఉంటే ఇక అనాధలైన అమ్మాయిల సంగాతేమిటన్న ఆలోచన అప్పుడు కలిగింది. దాంతో నగరంలోని పలు అనాధ ఆశ్రమాలు సందర్శించారు. అక్కడి అమ్మాయిలు నోరు విడిచి చెప్పుకోలేని అవసరాలేమిటో స్వయంగా గ్రహించారు. అక్కడి నుంచి తాను మొహమాటానికి తావు లేకుండా, ఎవరేమనుకున్న సరే అని భావించి స్త్రీలకు లోదుస్తులు (Inner wear) అందించాలని సంకల్పించారు. ముఖ్యంగా అనాధ బాలికల కోసం పని చేయదాన్ని ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకున్నారు. మొదట ఈ సమస్యను తన దృష్టికి తెచ్చిన ఆ మహిళకు చీరతో పాటు బ్రా ప్యాంటీ, పెట్టికోట్ అందించడంతో మొదలైన ఈ ప్రయత్నం నేడు ఏటా నాలుగు వందల అమ్మాయిలకు క్రమం తప్పక అందించే స్థాయికి కారణమైంది.
తొలి అడుగులో పదుగురు …
“నేను వేసిన ఒక అడుగు చూసి నేను పనిచేసిన సంస్థలో పాత ఉద్యోగులు మొదలు, మిత్రులు మరి పదుగురు స్వచ్చందంగా అడుగు వేయడానికి సహకరించారు. అది నాకెంతో సంతోషాన్నిచ్చింది. ఇక ఈ పని నిరంతరాయంగా సాగాలని 2017లో Extra Mile అన్న పేరే ఖాయం చేసి ఒక ట్రస్టును ప్రారంభించాను” అని జయ నాగమోహన్ గారు వివరించారు.
“లోదుస్తులు’ ఇవ్వడం తన ప్రధాన కార్యం కాగా ఇక అనేక విధాలా సహకరించడం కూడా తన పనే అనుకున్నారు. ఒకటని కాదు, అవకాశం ఉన్న ప్రతి చోట ప్రతి పనిలో మరో అడుగు వేయడంలో అయన చొరవ ఆసక్తికరమైంది. వన్ మ్యాన్ ఆర్మీగా పని చేసే వారంటారు, “I take an extra mile where ever possible …Whatever direction” అని.
చుక్కలను కలుపు అడుగు
నిజానికి చాలా సులభమైన మార్గాన్ని అయన ఎంచుకున్నారు. “నేను చుక్కలను (Dots) కలిపే వ్యక్తి” అంటారు. అలాగే, “చిరునవ్వులు పూయించే పని నాది” అంటారు. అలా ఒకరికొకరిని కనెక్ట్ చేసుకొంటూ అయన సునాయాసంగా ముందుకు వెళుతున్నారు. “తమ పని తాము చేసుకుంటూనే కాస్తంత సహకారం ఇచ్చే ఎవరైనా నాకు మిత్రులే, బంధువులే. అందుకే దాదాపు ఈ ఐదేళ్లలో కొన్ని వందల మంది నుంచి సేకరించిన యాభై లక్షల రూపాయల మొత్తాన్ని నా ఆధ్యర్యంలో వివిధ రకాల సహకారానికి వినియోగించాను” అని అయన ఎంతో అభిమానంగా చెప్పారు.
ఇంతకీ అయన దేనికి సహకరిస్తారు?
వయోభేదం లేకుండా స్వయం ఉపాధికి సహకరిస్తుంటారు. అలాగే నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్న వాళ్లకు సహాయం చేస్తారు. ప్రతిభావంతులైన విద్యార్థుల ఫీజులు కడుతారు. మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తారు. ఎవరి అండా లేని వయోజనులకు చేయూత నిస్తారు. అత్యవసర పరిస్థితుల్లో అద్దె చెల్లించడానికి కూడా వెనుకాడరు. ఇక బ్రా ప్యాంటి, పెట్టికోట్లు వంటి లోదుస్తులు అందించడం ప్రతి ఏడూ రెండుసార్లు మామూలే. ఇదే ప్రధానం. ఒక షరతుగా చేస్తారు.
ఇటీవలే వొల్లంతా కాలిపోయిన ఒక యువకుడికి కిరణాషాపు పెట్టించడం, కరోనా సమయంలో ఒక అనాధాశ్రమం పిల్లలు బడికి వెళ్ళడానికి ఐదు లక్షల విలువైన బస్సు కొనివ్వడం, అది ఇప్పుడు వాడకంలోకి రావడం – తన సంతోషాల్లో ఈ రెండు ఉదాహరణలు తాజావి అని గర్వంగా చెప్పారాయన.
ఇన్నర్ వేర్ ఫస్ట్
మొదట వంద మంది ఆడపిల్లలకు లోదుస్తులు ఇవ్వడంతో మొదలుపెట్టి నేడు హైదరాబాద్ లో ఉన్న పది అనాధ ఆశ్రమాల్లో ఉన్న సుమారు నలుగు వందల మంది అమ్మాయిలకు ఏటా రెండుసార్లు, రెండు జతల చెప్పున అందిస్తున్నట్టు వివరించారు.
ఒక జతకు నూటా యాభై, రెండు జతలకు మూడొందల ఖర్చు. అంటే ప్రతి సారీ ఒక్కరికి మూడు వందల రూపాయల విలువైన లోదుస్తులు ఇస్తారు. ఇలా ప్రతి ఏటా రెండుసార్లు, సంవత్సరానికి మినిమం రెండు లక్షలా నలభై వేల విలువైన లోదుస్తులను ఐదు సంవత్సరాలుగా అందిస్తూ వస్తున్నట్టు అయన వివరించారు. “మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఆ రోజున ఇస్తాం. అలాగే మళ్ళీ సెప్టెంబర్ మాసంలో ఒక రోజు ఇస్తాం” అని తెలిపారు.
నిజానికి మగవాళ్ళ సహకారమే ఎక్కువ
ఇది సున్నితమైన విషయం. ఈ పనిలో మొదట్లో ఎదురైన ఎన్నో సమస్యలు రాను రాను అధిగమించాను” అన్నరాయన.
“నిజానికి బ్రా, ప్యాంటి, పెట్టికోట్ ల గురించి పిల్లలు కేర్ టేకర్ లను అడగలేరు. అందుకే కేర్ టేకర్ సహాయంతో ఎంతమంది అమ్మాయిలున్నారు? వారికీ అవసరమైన సైజులేమిటి? ఎన్ని అవసరం అని కాగితం మీద రాసివ్వమంటాను. వాటిని చార్టు రూపంలో రాసుకుని అనాధ ఆశ్రమాల్లోని అమ్మాయిలందరికీ క్రమం తప్పక ఇవ్వడం, ఇచ్చిన వారికి మళ్ళీ ఆరు నెలలలో మరో రెండు జతలు అందివ్వడం, ఇట్లా ఐదేళ్ళుగా చేస్తున్నాను.
నిజానికి ఇది ఆడవాళ్ళు చేయవలసిన పని అని నాతో చాలా మంది అంటారు. ఐతే, ఈ పనిలో అత్యధికంగా సహకరిస్తున్నది మగవాళ్ళే అన్న నిజం చాలా మందికి తెలియదు అని నవ్వి చెప్పారాయన.
కౌమార వయస్సులోకి వచ్చే బాలర సంగతి వదిలేయండి. వాళ్ళకు ఎలాగోలా నడుస్తుంది. కానీ ఒక వయసులోకి వచ్చిన బాలికలకు లోదుస్తుల అవసరం ఉంటుంది. ఇంటి పట్టున ఉండే పిల్లల విషయంలో తల్లి జాగ్రత్త పడుతుంది. ఎంత పేదరికంలో ఉన్నా ఎలాగోలా జాగ్రత్తగా తీసుకుంటుంది. కానీ, తల్లి తండ్రీ లేని అనాధ బాలికల సంగతి ఎవరు పట్టించుకుంటారు? నోరు తెరిచి అడిగినా సర్దే అవకాశం లేని స్థితిలో నా ప్రయత్నం కొద్దిమందికి ఒక చిన్న ఉపశమనమే కావొచ్చు. కానీ అది సంతృప్తిగా ఉంది” అన్నారాయన.
ఆడపిల్ల గౌరవం (Dignity) కోసం…
మొహమాటానికి తావు లేకుండా మరో అడుగు వేయడానికి అయన సిగ్గు పడరు. సహకారం కోసం సిగ్గు విడిచి అడగడం కూడా తన బాధ్యత అనే భావిస్తారు.
నిజానికి బ్రా ప్యాంటీ పెట్టికోట్ వంటి వాటిని పిల్లలు అడిగినా… వారికోసం తాను అడిగినా …అది నిజానికి ఇబ్బంది కరమైనదే. ఐతే, ఈ పని embarrassing అనుకునే సమాజంలో అయన ‘అవసరం కోసం అడగడం’, ఔదార్యంతో పంచడం’ ఒక Embracing (ఆత్మీయ ఆలింగనం) వంటిదని భావిస్తారు. అందులో ఎలాంటి న్యూనతా లేదంటారు. “వాస్తవానికి నేను చేస్తున్న ఈ పని గురించి చాలా మందికి తెలియదు. తెలిస్తే నగరంలోని వంద అనాధ ఆశ్రమాల్లోని అందరికీ లోదుస్తులు పంచగలం” అని నమ్మకంగా అన్నారాయన.
“ఆడపిల్ల గౌరవం (Dignity) కోసం చేసే పని అని మనసారా నమ్మడం వల్లే ఇది రోజు రోజుకూ విస్తరిస్తోంది. కొత్తగా సహకరించడానికి మరికొందరు ముందుకు వస్తున్నారు. నాకు సహకరిస్తున్న అందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు” అని చెప్పారాయన.
Extra Mile – for a smile
కాగా, నాగ మోహన్ తన సంస్థకు అధ్యక్షులు. అలాగే ఇతర సంస్థలు కొన్నింటికి చురుకైన కార్యకర్త. వారి సంస్థ కార్యకలాపాల్లో వాలంటరీ సహాయానికి వెళుతారు. సేవలో నిమగ్నమైతారు. అలాగే -తన సంస్థకు వాలంటరీ వర్క్ చేసేవారు అక్కరలేదు. చిరు విరాళం ఇచ్చే వారు చాలు గనుక ఇలా తాను వేరే సంస్థలకూ EXTRA MILE గా ఉంటానని చెప్పారు.
అన్నట్టు, తనకు వచ్చే విరాళాల నుంచి వారి వారి అనుమతితో పెద్ద సంస్థలకు కూడా తను చిరు సాయం చేస్తుంటారు.
ఎందుకూ అంటే అదే… చిరునవ్వు. EXTRA MILE…అంటే అదే అన్నట్టు.
వారిని సంప్రదించవలసిన నంబర్ : 9177404281
Gpay/PhonePe/PayTM: 9177404281 UPI: 9177404281@upi
విరాళాల కోసం మిలాప్ లింక్ ను కూడా క్లిక్ చేయవచ్చు.