Editorial

Thursday, November 21, 2024
Peopleనేనూ - నా గొడవ! - కాళోజి

నేనూ – నా గొడవ! – కాళోజి

ప్గోటో : భరత్ భూషణ్

ఇది ‘నా గొడవ’కు కాళోజీ రాసిన ముందుమాట. అసమ్మతి – నిరసన – ధిక్కారం – ఇవీ నా గొడవ లక్షణాలు.

‘జరిగినదంతా చూస్తూ ఎరగనట్లు పడివుండగ సాక్షీభూతుణ్ణిగాను, సాక్షాత్తు మానవుణ్ణి’ అని ‘నా గొడవ’లో చెప్పుకున్నా…అగో ఆ మానవుణ్ణి కాబట్టే చుట్టుపట్ల జరిగే ప్రతి విషయానికీ స్పందించడం, ఆలోచన-అసమ్మతి, నిరసన-ధిక్కారం, ప్రతిఘటన, ప్రతిఘటనా కార్యక్షికమం. నేననుకున్న అవకతవకలను సవరించే ప్రయత్నం. నా వంతుగా అవకతవకలను సవరించే వారితో సహకరించే ప్రయత్నం. ఎవరితోనూ సంపూర్ణంగా ఏకీభవించకపోవడం- మరెవరూ నాతో ఏకీభవించక పోవడం. నాకనిపిస్తుంది- ఒకరితో ఏకీభవించే ధోరణి కన్నా ఒకరిని మనతో ఏకీభవింపజేయాలనేదే పరస్పర సహకారానికి గొప్ప లోటేమోనని. ఇంతకూ మనస్సేమో క్షణమో తీరున మారి రకరకాలుగా అడిస్తున్నది. దాన్ని అచలం చేసే నా ప్రయత్నం ఎప్పుడూ ఫలించలేదు.

బతుక్కి బతుకు తప్ప మరో సిద్దాంతం లేదు. పెద్ద ఆపదలను అపాయాలను, ప్రాణాపాయాన్ని తప్పుకొని చిన్న అపాయానికి, హానికి తలఒగ్గి బతుకు సాగించడం.

మానవ సమాజంలో ప్రతిదీ తప్పుడు ప్రయోగమే. ప్రయోగాత్మకం బతుకు. బతుకు ప్రయాణం నిండా అడుగడుగున ప్రయోగాలు. బతుక్కి బతుకు తప్ప మరో సిద్దాంతం లేదు. పెద్ద ఆపదలను అపాయాలను, ప్రాణాపాయాన్ని తప్పుకొని చిన్న అపాయానికి, హానికి తలఒగ్గి బతుకు సాగించడం. అదే ప్రాణి ధర్మం. అది ప్రతి ప్రాణికి సహజంగానే అబ్బుతుంది. ఎన్నో రకాలుగా తమతమ ఆలోచనల పరిధిలోనే మార్గాన్ని నిర్ణయించి, ఆ మార్గాన్నే మనిషిని నడిపింపజేయాలనే మేధావి వర్గంలోని వ్యక్తుల కృషి. దానికి ఎన్నో ‘ఇజాలు’, ‘చాదస్తాలు’. ఇదంతా ఎందుకంటే మనిషి సహజంగా ఆలోచించి స్వంత నిర్ణయానికి రాకుండా చేయడానికి.

బతుకు వైరుధ్యాల పుట్ట. ఈ చీకట్లోనే ప్రమిదలు వెలిగించాలనే తహతహ. స్నేహం మాత్రం లేదు.

ఈ గందరగోళ బతుకులో పోలు పొంతనలేని ఆలోచనలలో, సమకూర్చుకున్న అస్తవ్యస్త అవగాహనతో, వ్యక్తిగతమైన మనుగడలో క్రమం స్థైర్యం లేక తికమక. మన ఆలోచనలతో, సరిపడేవారితో మైత్రి, లేనివారితో వైరం. వారిని సరిదిద్దాలనే ప్రయత్నం. మెట్టుకు బతుకు వైరుధ్యాల పుట్ట. ఈ చీకట్లోనే ప్రమిదలు వెలిగించాలనే తహతహ. స్నేహం మాత్రం లేదు. గీసిన అగ్గిపుల్లలు మాత్రం కాలి ఆరిపోతున్నాయి. కొద్దిపాటి వెలుగు. అంతే మళ్ళీ చీకటి. క్షణక్షణం రకరకాలుగా ఆలోచన.

దగాకోరు దుండగీడు దర్జాగా బతుకుచుండ సక్రమ మార్గాయానము సహియించెడి వాడెవ్వడు? ‘‘అవనిపై జరిగేటి అవకతవకలు చూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు. పరుల కష్టము చూచి కరిగిపోవును గుండె మాయమోసము చూచి మండిపోవును ఒళ్ళు’’. మరి అవకతవకలను సవరించే శక్తిసామర్థ్యాలా? అవి లేవు. ‘‘తప్పు దిద్దగలేను, దారి జూపగలేను, తప్పు చేసిన వాని దండింపగలేను, అవకతవకలను సవరింపలేనప్పుడు పరుల నష్టాలతో పనియేమి నాకనెడు అన్యులను జూచైన హాయిగా మనలేను’’. ఇట్లా వుంది నా మతి-గతి.

ఆశించిన ఫలితాలు అనుకున్న రీతిలో కలుగక పోవడం. అది చూచి మరో ప్రయత్నం- మరో రీతిలో. ఇదంతా నా గొడవలో రికార్డు చేసుకున్నాను.

అంటే బతుకు వ్యక్తిగత వ్యవహారాలైనా, ప్రజా జీవితంలోనైనా అడుగడుగునా సందేహాలు. చాలీచాలని అవగాహనతో రకరకాల ప్రశ్నలు. ఏవో సమాధానాలు. నిర్ణయాలు. నిర్ణయానుసారంగానే నడిచే ప్రయత్నం. ఏదో కొద్దిపాటి సఫలత. దాని విషయంలో మనకే సందేహం. ఆశించిన ఫలితాలు అనుకున్న రీతిలో కలుగక పోవడం. అది చూచి మరో ప్రయత్నం- మరో రీతిలో. ఇదంతా నా గొడవలో రికార్డు చేసుకున్నాను.

ఏదో సూత్రానికి, తత్వానికి, ఇజానికి కట్టుబడిపోయి జీవిస్తున్న ప్రాణులకు స్వేచ్ఛాజీవనం సున్న. పరాయి భావాలు, పరాయి చూపులు, పరాయి చెవులు, పరాయి బాస, పరాయి నడక, పరాయి చేతులు అన్నీ పరాయివే.

సామరస్యం స్వభావానికే సరిపడదు. కాబట్టి, అడుగడుగునా సంఘర్షణ. సామరస్యంతో బతకడంలో సంఘర్షణ తగ్గడం నిజమేగాని, దానికి కావలసిన పరిస్థితులు వుండి దానికి మనసు సిద్ధము కావలె గద. అయినా బ్రతుకు తప్పదు. బ్రతక్క తప్పదు. బ్రతుకు సాగిపోతున్నది. దాన్ని ఏదో ఒక సూత్రానికి బిగించి వేలాడి బతుకుదామనుకుంటే ఆ సూత్రం పుటుక్కుమనగానే చతికిలబడటం. నాగతిని ఆకట్టడానికి, నన్ను అదుపులో పెట్టడానికి ఎన్ని శాస్త్రాల కట్టడాలు. ఎన్నెన్ని ఇజాల గతులు. ఏదో సూత్రానికి, తత్వానికి, ఇజానికి కట్టుబడిపోయి జీవిస్తున్న ప్రాణులకు స్వేచ్ఛాజీవనం సున్న. పరాయి భావాలు, పరాయి చూపులు, పరాయి చెవులు, పరాయి బాస, పరాయి నడక, పరాయి చేతులు అన్నీ పరాయివే. అట్లా కాకూడదని నా తిక్క. చిరకాలం బతకాలని వుండగా చావొస్తే ఎట్లా అని కాదు ప్రశ్న. అనుక్షణం చావుకై నిరీక్షిస్తూ బతకడం ఎట్లా అన్నది ప్రశ్న. పరిస్థితుపూట్లా వున్నాయని కాదు. వున్న పరిస్థితుల్లో మనమెట్లా వున్నాము అన్నదే, ఇట్లా వుంది మానవుని మనుగడ. ఇదంతా మమత లేని మనుగడ అని నా గొడవ.

‘శాంతి శాంతట శాంతి, గుండె మండిపోతుంటే, కండ కరిగిపోతుంటే బతుకు చితికిపోతుంటే, ఎముక విరిగిపోతుంటే శాంతి శాంతట శాంతి.

శాంతిని అందరూ కోరుకుంటున్నట్లు మాట్లాడతారు. ‘‘శాంతిగ మెలగుట మంచిదె. కానీ, శాంతి పరిస్థితి కలదాసఖుడా!’’ అన్నది నా ప్రశ్న. ‘‘శాంతి శాంతట శాంతి, గుండె మండిపోతుంటే, కండ కరిగిపోతుంటే బతుకు చితికిపోతుంటే, ఎముక విరిగిపోతుంటే శాంతి శాంతట శాంతి.’’ హింస, హింస అని వూరికే అంటుంటారు. నా దృష్టిలోనూ హింస తప్పు. రాజ్యహింస మరీ తప్పు. ప్రతిహింస తప్పుకాదు. ‘‘ఏకీభవించనోని పీక నొక్కు సిద్ధాంతం’’ అంటే మరేమిటో కాదు అచ్చమైన ఫాసిజం అన్నాను నా గొడవలో.

అసమ్మతి – నిరసన – ధిక్కారం – ఇవీ నా గొడవ లక్షణాలు.

హిరణ్యకశివుడు అచ్చమైన ఫాసిస్టు. ప్రహ్లాదుడు సత్యాక్షిగహి. సత్యాక్షిగహం వల్ల ఫాసిస్టుల్లో పరివర్తన జరగనప్పుడు నరసింహులు అవతరించి ప్రతిహింస చేయక తప్పదు. అధికృత హింస చెలరేగినప్పుడల్లా, సత్యాక్షిగహం విఫలమైనప్పుడల్లా నరసింహుల్లా ప్రతిహింస తప్పదు. ‘‘చెల్లినోనికి నేరం చెల్లుబాటు అవుతుం నేరం చేయక తప్పకవుం విరుద్ధం చర్యల పుట్టైపోదా దేశం.’’ మానవుని మానవుడు మానవుని మాదిరిగ మన్నించ లేనంత మలినమైనాది, జగతి మలినమైనాది. ఈ హృదయ మాలిన్యం పోవడం ఎట్లా? మైత్రి. అది అక్కర తీర్చుకోవడానికి వేసే వల కాకూడదు- జీవిత విధానం కావాలి. అదిలేకనే మానవ సమాజంలో ప్రతి రంగంలో పోటీ బడికాటులాట. ఈ కాటులాటకు ‘నేను’, ‘నా’ అనే ‘‘నానా ఇజాల అడుగున జూడ నా ఇజందే కనిపించును జాడ’’ ఇదంతా నా గొడవలో చెప్పుకున్నది. అసమ్మతి-నిరసన-ధిక్కారం-ఇవీ నా గొడవ లక్షణాలు.

‘‘ఇచ్ఛయే నా ఈశ్వరుడని ఖచ్చితముగ నమ్ముతాను. ఇచ్ఛ వచ్చినట్టు నేను ఆచరించి తీరుతాను.

ఎట్లా జీవించాలని కోరిక? ఆ కోరిక ప్రకారం ఎట్లా జీవిస్తున్నాననే విషయం నా గొడవలో చెప్పుకున్నాను. ‘‘ఇచ్ఛయే నా ఈశ్వరుడని ఖచ్చితముగ నమ్ముతాను. ఇచ్ఛ వచ్చినట్టు నేను ఆచరించి తీరుతాను. జరిగిన దానిని తలవను, జరిగే దానికి వగవను, ఒరగనున్నదిదియదియని ఊహగానము చేయను, సంతసముగ జీవింపగ సతతము యత్నింతుగాని ఎంతటి సౌఖ్యానికైన ఇతరుల పీడింపలేను’’- ఇది అభిలాష, ఆదర్శము. ఈ అభివూపాయాల కనుకూలమైన ధోరణితో సమాజంలో జరుగుతున్న అలజడుల (సాంఘీక-రాజకీయ సాహిత్య)లో రాజ్యాంగబద్దంగా పాల్గొంటూ వస్తున్నాను.

More articles

1 COMMENT

  1. కాళోజీ మీద ఒకరు రాసింది కాకుండా,. కాళోజీ రాసుకున్నదే అందించారు. మంచి ఆలోచన.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article