Editorial

Wednesday, January 22, 2025
OpinionGargi : ఎవరీ అమ్మాయి? నా ఒళ్ళు ఝల్లుమన్న వణుకు : ప్రసేన్ తెలుపు

Gargi : ఎవరీ అమ్మాయి? నా ఒళ్ళు ఝల్లుమన్న వణుకు : ప్రసేన్ తెలుపు

ఎంత బాగుందీ సినిమా. ఊహు.. ఇలాంటి సినిమాలను బాగుంది అనడం సాంస్కృతిక సామాజిక ద్రోహమేమో. ఎంత బాధగా ఉందీ సినిమా అనాలి కామోసు. చాలా సార్లు గుండెను పట్టుకారుతో మెలిపెట్టేసింది. ఇంతకీ ఎవరీ అమ్మాయి. ఇంత గొప్పగా ఎలా చేయగలుగుతోంది.

ప్రసేన్ 

ఎందుకో తెలియదు సావిత్రి గుర్తొచ్చింది. అదే వరసలో జయసుధ గుర్తొచ్చింది. సౌందర్య కూడా గుర్తొచ్చింది. గార్గి లో సాయి పల్లవిని చూస్తున్నంతసేపు వీళ్ళతో పాటు షబానా ఆజ్మి గుర్తొచ్చింది. స్మితా పాటిల్ గుర్తొచ్చింది. సినిమా చూస్తుంటే అంకురం గుర్తొచ్చింది. అంకురంలో రేవతి గుర్తొచ్చింది. తొమ్మిదేళ్ళ పాప నుంచి నెత్తురు కారుతున్నపుడు అంకురంలో గిరిజన మహిళ గుంజీలుతీస్తున్నపుడు నా ఒళ్ళు ఝల్లుమన్న వణుకు గుర్తొచ్చింది. వీళ్లందరికీ వీటన్నింటికీ ఈ గార్గి సినిమాకీ ఏ సంబంధమూ లేదు. ఇవన్నీ నా సొంత జ్ఞాపకాల గొడవలు. లేదూ ఎక్కడో ఏదో సంబంధం ఉందేమో కూడా. ఒకానొక మిశ్రమ భావన.

ఎంత బాగుందీ సినిమా. ఊహు.. ఇలాంటి సినిమాలను బాగుంది అనడం సాంస్కృతిక సామాజిక ద్రోహమేమో. ఎంత బాధగా ఉందీ సినిమా అనాలి కామోసు. చాలా సార్లు గుండెను పట్టుకారుతో మెలిపెట్టేసింది.

అవునూ ఎవరీ అమ్మాయి. ఇంత గొప్పగా ఎలా చేయగలుగుతోంది. అసలేం తిని ఏం తాగుతుందీ అమ్మాయి. ఒక సినిమాను ఎంత అలవోకగా భుజానికెత్తుకుందో కదా. సాయి పల్లవీ.. నటన అనే సంగీతానికి నువు హాయి పల్లవి మాత్రమే కాదు సాకీ చరణమూ రాగమూ తాళమూ సప్తస్వరమూ సర్వస్వమూ కదా. చించేసావ్ పో.

గార్గి సినిమా గురించి మాట్లాడదామనుకుని సాయి పల్లవి గురించి మాట్లాడేస్తున్నాను. తప్పదు ఆ మాయ అలాంటిది. అయినా సరే ఉగ్గబట్టుకుని గార్గి సినిమా గురించి మాట్లాడాలి. చైల్డ్ అబ్యూజ్ గురించి చాలా సినిమాలు మాట్లాడాయి. కానీ గార్గి భిన్నంగా మాట్లాడింది. ఒక సామాజిక రుగ్మత గురించి గుండెలు చెమ్మగిలేట్టు మాట్లాడింది.

స్పాయిలర్ కాకుండా కథ చెప్పుకుందాం.

సాయి పల్లవి ఓ టీచర్. మధ్యతరగతి కుటుంబం. తండ్రి అపార్ట్మెంట్ లో వాచ్ మన్ గా పని చేస్తూ ఒక పెద్ద చిక్కులో పడతాడు. ఆ సమస్యనుంచి తండ్రిని తప్పించేందుకు గార్గి పడే ఇబ్బందులే కథ. చివరి సన్నివేశంలో ఆ కథ తిరిగే మలుపు ప్రేక్షకుడికి ఒక విద్యుత్ఘాతం.

‘అమ్మా నువ్వు కాలాన్ని, విధిని అన్నింటినీ నమ్ముతావ్. కానీ నన్ను నమ్మవు. ఎందుకంటే నేను కొడుకును కాదు కదా ‘ అనే ఓ కూతురు వేదనను’ మగవాడి యారోగన్స్, స్త్రీ పెయిన్ రెండూ నాకు మాత్రమే తెలుసు ‘ అనే ఓ ట్రాన్స్ జెండర్ న్యాయమూర్తి స్పష్టతను దర్శకుడు గొప్పగా ప్రెజెంట్ చేయగలిగాడు.

మీక్కూడా నాకులాగే చాలా చాలా తప్పక గుర్తొస్తాయి.

గార్గి తప్పక చూడండి. సాయి పల్లవి కోసం చూడండి. మంచి కథ కోసం చూడండి. తెలుగు సినిమాలు ఎందుకు బాగుండవో తెలుసుకునేందుకు చూడండి. ఇలాంటి సినిమాలు తెలుగులో వస్తే నెత్తికెత్తుకుంటాం అనే హామీ ఇచ్చేందుకైనా చూడండి.

మీక్కూడా నాకులాగే చాలా చాలా తప్పక గుర్తొస్తాయి.

కవి, రచయిత, విమర్శకులు ప్రసేన్ బెల్లంకొండ సీనియర్ పాత్రికేయులు కూడా. ఖమ్మంలో ఉంటారు. ఇటీవలే సొంతంగా P5 news telugu చానల్ ప్రారంభించారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article