Editorial

Sunday, November 24, 2024
కాల‌మ్‌"కొన్ని ప్రమాదాల వల్ల లాభం ఉంది" - వెలుతురు కిటికీ తెలుపు

“కొన్ని ప్రమాదాల వల్ల లాభం ఉంది” – వెలుతురు కిటికీ తెలుపు

67 ఏళ్ల వయస్సులో కొన్ని వేల పౌండ్లు విలువచేసే తన ఫ్యాక్టరీ అగ్నికి ఆహుతి అయిపోతే ఎడిసన్ మాత్రం నిబ్బరంగా, నిశ్చింతగా ఉన్నాడు! పైగా వాళ్ళ అబ్బాయి చార్లెస్ తో “నువ్వు వెళ్లి మీ అమ్మను ఆమె స్నేహితులను పిలుచుకొని రా. ఎందుకంటే ఇంత గొప్ప అగ్ని ప్రమాదాన్ని వాళ్లు మళ్లీ చూడలేరు!” అన్నాడు. ఇదే పాజిటివ్ రెస్పాన్స్.

” కొన్ని ప్రమాదాల వల్ల మనకు లాభం ఉంది. ఇప్పుడు మన తప్పులన్నీ కాలిపోయాయి, మళ్లీ మనం కొత్తగా మొదలుపెట్టవచ్చు.” అని చెప్పాడు. ఇదే  పాజిటివ్ థింకింగ్.

సిఎస్ సలీమ్ బాషా

డిసెంబర్ 10, 1914 తేదీన 5.30 గంటలకి అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న వెస్ట్ ఆరెంజ్ ప్రాంతంలోని ఒక ఫ్యాక్టరీ లో విస్పోటనం జరిగింది. ఉవ్వెత్తున అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆరు గంటల నుంచి, ఎనిమిది గంటల లోపు ఫైరింజన్లు వచ్చాయి. అయినా పెద్దగా ఉపయోగం కనపడలేదు. ఫ్యాక్టరీ చాలా భాగం బూడిద అయింది. భారీ ఎత్తున నష్టం జరిగింది. అప్పట్లో 919,788 పౌండ్లు దాకా నష్టం జరిగిందని అంచనా . ఇప్పటి అంచనా ప్రకారం అది 23 మిలియన్ల డాలర్లు. ఆ ప్రమాదంలో ఎన్నో విలువైన రికార్డులు, ప్రోటోటైప్ లు కాళీ బూడిదయ్యాయి. పైగా బీమా (insurance) కేవలం 1/3 కష్టాన్ని మాత్రమే భర్తీ చేయగలిగేది!! ఆ ఫ్యాక్టరీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శాస్త్రవేత్త, థామస్ అల్వా ఎడిసన్ ది!

సలీమ్ బాషా సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. ఉద్యోగ నైపుణ్యాల భోదకులు కూడా. సానుకూల దృక్పథానికి తెరిచిన కిటికీ ఈ వారం తాను తెలిపే అధ్బుత గాథలు.

67 ఏళ్ల వయస్సులో కొన్ని వేల పౌండ్లు విలువచేసే తన ఫ్యాక్టరీ అగ్నికి ఆహుతి అయిపోతే, అబ్బాయి చార్లెస్ బాధపడుతున్నాడు . కానీ, ఎడిసన్ మాత్రం నిబ్బరంగా, నిశ్చింతగా ఉన్నాడు! పైగా వాళ్ళ అబ్బాయి చార్లెస్ తో “నువ్వు వెళ్లి మీ అమ్మను ఆమె స్నేహితులను పిలుచుకొని రా. ఎందుకంటే ఇంత గొప్ప అగ్ని ప్రమాదాన్ని వాళ్లు మళ్లీ చూడలేరు!” అన్నాడు. చార్లెస్ అందుకు ఒప్పుకోకపోతే “పర్వాలేదు. ఇప్పుడు మన చెత్తంతా కాలిపోయింది” అని భరోసా ఇచ్చాడు!

“కొన్ని ప్రమాదాల వల్ల మనకు లాభం ఉంది. ఇప్పుడు మన తప్పులన్నీ కాలిపోయాయి, మళ్లీ మనం కొత్తగా మొదలుపెట్టవచ్చు.” అని చెప్పడం పాజిటివ్ థింకింగ్ కాకుండా మరేంటి?

“నాకు 67 ఏళ్ళు. అయినా సరే.. రేపటి నుంచే మళ్లీ మొదలు పెడతాను” ఎడిసన్ అని అయన చెప్పినట్లే మరుసటి రోజు ఉదయం నుంచే పని చేయడం మొదలు పెట్టాడు. అన్నిటికన్నా ముఖ్యంగా తన దగ్గర పనిచేసే వాళ్లను ఏమీ అనలేదు. ఒక్కరిని కూడా ఉద్యోగం నుంచి తీయలేదు!!

ఈ సంఘటన ఎం చెబుతోంది? మొదటిది అయిపోయిన దాని గురించి చింతించడం గానీ, రేపు ఏం జరుగుతుంది అన్న విషయం గురించి ఆందోళన పడటం గానీ వృధా అని! ప్రస్తుతం మనం ఏం చేయాలన్న ది మాత్రమే మనం ఆలోచించాలి. ఇదే పాజిటివ్ థింకింగ్

పైన చెప్పిన అగ్నిప్రమాదం సంఘటన తర్వాత ఎడిసన్ ఏం చేసి ఉండొచ్చు? బిగ్గరగా రోదించి ఉండవచ్చు, తన పని వాళ్ళ పై, ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఉండొచ్చు, తనని తాను ఒక గదిలో బంధించు కొని దుఃఖంతో కుమిలి పోయి ఉండవచ్చు. ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నప్పటికీ, ఎడిసన్ ఎంచుకున్న ఆప్షన్ ” పాజిటివ్ రెస్పాన్స్” అంటాడు The Obstacle Is the Way: The Timeless Art of Turning Trials into Triumph పుస్తక రచయిత “ర్యాన్ హాలిడే “.

మనం చేసే ప్రతి దాన్ని ప్రేమించాలి. దానివల్ల వచ్చే ఫలితం మంచైనా, చెడైనా! మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన ఆస్వాదించడం మనం నేర్చుకోవాలి అంటాడు. పాజిటివ్ థింకింగ్ వల్లనే అది సాధ్యం.

ఒకసారి ఇద్దరు సన్యాసులు కొన్ని నెలలు ఇంటికి దూరంగా ఉండి, ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉపన్యాసాలు ఇస్తూ, ప్రార్థనలు చేసిన తర్వాత, వారి స్థానానికి తిరిగి వచ్చారు. వారు అలిసిపోయి ఇంటికి తిరిగి వచ్చారు, విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు. కానీ వారు తమ ఇంటికి చేరుకున్నప్పటికీ భారీ వర్షాలు, గాలుల కారణంగా వారి గుడిసె సగానికి కొట్టుకుపోయింది. సగం మాత్రమే మిగిలి ఉంది. యువ సన్యాసికి అది చూసి కోపం వచ్చింది. అతను ఇంటికి చేరుకున్నప్పుడు బాగా విశ్రాంతి తీసుకోవచ్చని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అక్కడ చూస్తే శిథిలమైన గుడిసె ఉంది. యువ సన్యాసి వృద్ధ సన్యాసితో ఇలా అన్నాడు, “ఇది చాలా అన్యాయం! ఇలాంటివి దేవుని ఉనికిపై సందేహాన్ని సృష్టిస్తాయి. పాపులకి నగరాలలో రాజభవనాలు ఉన్నాయి, వారికి ఏమీ జరగదు కానీ మనలాంటి పేదలు పగలు, రాత్రి ప్రార్థనలలో గడుపుతారు, ఇప్పుడు చూడు మన ఏకైక నివాసం శిథిలావస్థలో ఉంది.

ఆ యువ సన్యాసి తన ప్రార్థనలు వ్యర్థం అని భావించి కోపంతో ఊగిపోయాడు. అలా అతను చెబుతూ ఉండగా ఆ వృద్ధ సన్యాసి రెండు చేతులు జోడించి ఆకాశంవైపు ఎత్తి, అతని కనుల వెంట ఆనంద భాష్పాలు రాలాయి. ఆ యువ సన్యాసి అది చూసి అడిగాడు “మీరు ఏమి చేస్తున్నారు”? దానికి వృద్ధ సన్యాసి ఇలా జవాబిచ్చాడు ” నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గాలి ఎంతటి విధ్వంసం సృష్టించేదో మనకు తెలియదు. కానీ దేవుడు దానికి కొన్ని అడ్డంకులు పెట్టి మన గుడిసెను పూర్తిగా శిధిలమై పోకుండా కాపాడాడు. దేవుడు మన లాంటి పేద ప్రజల గురించి ఆలోచించాడు, కాబట్టి మనం అతనికి కృతజ్ఞతలు చెప్పాలి. మన ప్రార్థనలను ఆయన ఆలకించాడు ”

“విరిగిన గుడిసెలో చాలా ఆనందం ఉంటుందని నాకు కు తెలియదు. ముందే తెలిస్తే, మన గుడిసె పైకప్పు సగం నేనే తీసేసి వాడిని”. అని కూడా చెప్పాడు

అది దాదాపు రాత్రి సమయం. ఆ సమయంలో వారు చేయగలిగింది ఏమీ లేదు. అలా వారిద్దరూ విశ్రాంతి కోసం లోపలికి వెళ్లారు, ఆ శిథిలమైన గుడిసెలోనే నిద్రపోవలసి వచ్చింది. యువకుడు కోపంతో ఊగి పోయాడు మరియు రాత్రంతా అటు ఇటు పొర్లుతున్నాడు, అసలు నిద్ర పోలేదు. ఎందుకంటే ఆకాశం మేఘావృతమై ఉంది, వర్షం పడేలా ఉంది. వృద్ధ సన్యాసి గాఢ నిద్రలో ఉండగా వర్షం ప్రారంభమైతే వారు ఏమి చేస్తారని అతను ఆలోచిస్తున్నాడు.

వృద్ధ సన్యాసి ఉదయం లేచినప్పుడు, అతను డ్యాన్స్ చేయడం, పాట పాడటం ప్రారంభించాడు. “విరిగిన గుడిసెలో చాలా ఆనందం ఉంటుందని నాకు కు తెలియదు. ముందే తెలిస్తే, మన గుడిసె పైకప్పు సగం నేనే తీసేసి వాడిని”. అని కూడా చెప్పాడు

“నేను ఇంత ఆనందంగా ఎప్పుడూ నిద్రపోలేదు. సగం పైకప్పు లేనందున, నేను రాత్రి సమయంలో కళ్ళు తెరిచినప్పుడల్లా ఆకాశంలో నక్షత్రాలను, మేఘాలను చూశాను, ఇప్పుడు వర్షాలు మొదలవుతున్నప్పుడు అది మరింత అందంగా ఉంటుంది. ఎందుకంటే సగం పైకప్పు పోయింది, వర్షపు చుక్కల సంగీతాన్ని మరింత స్పష్టంగా వినగలుగుతాము. యువ సన్యాసి విసుగు చెంది, “ఇదంతా అర్ధంలేనిది ? ఏమిటి ఈ పిచ్చి ?” అని విసుగ్గా చెప్పాడు

వృద్ధ సన్యాసి ఇలా సమాధానమిచ్చాడు, “నేను విషయాలను లోతుగా చూస్తాను. నా అనుభవం ఏమిటంటే, మనకి ఏది ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుందో, అదే మనకు జీవితంలో సరైన దిశ. ఏది మనకు మరింత కష్టాన్ని కలిగిస్తుందో, అది సరైన దిశ కాదు.

నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పాను. నా ఆనందం పెరిగింది. నువ్వు దేవుడిపై కోపం తెచ్చుకున్నావు నీ వేదన పెరిగింది. నిన్న రాత్రి నువ్వు అశాంతిగా ఉన్నావు, నేను ప్రశాంతంగా నిద్రపోయాను. ఇప్పుడు నేను పాట పాడగలను. నువ్వు కోపంతో మండి పోతున్నావు. జీవితం మరింత ఆనందదాయకంగా మారే దిశ సరైన దిశ అని నాకు చాలా ముందుగానే అర్థమైంది. నేను ఆ దిశగా మాత్రమే వెళ్తాను.

లైఫ్ అన్నది B D మధ్యలో ఉంటుంది. అంటే Birth and Death అన్నమాట. రెండు అక్షరాలు మధ్యలో C ఉంటుంది. అంటే Choice.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే. ఏ విషయాన్ని అయినా మనం సీరియస్ గా తీసుకున్న అంతకాలం బాధ తప్ప మరేమీ ఉండదు. ఏ విషయమైనా ఎలా తీసుకోవాలి అన్నది ఇది మన మీద ఆధారపడి ఉంటుంది, విషయం మీద కాదు. ఇదే పాజిటివ్ థింకింగ్ అంటే.

ఈమధ్య వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న వీడియో లో ఒక ఆవిడ చెప్పిన విషయం చాలా సింపుల్ గా ఉంది. లైఫ్ అన్నది B D మధ్యలో ఉంటుంది. అంటే Birth and Death అన్నమాట. రెండు అక్షరాలు మధ్యలో C ఉంటుంది. అంటే Choice. మనం ఎలా ఉండాలి అన్నది మన ఛాయిస్. దీని అర్థం ఏంటంటే. సమస్య ఒకటే అయినప్పుడు కొంతమంది ఒకరకంగా, మరికొంతమంది ఇంకో రకంగా స్పందిస్తారు. చాలామంది నెగిటివ్ గా స్పందిస్తే, కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తారు. అంతే తేడా.

“నా దగ్గర గాలిపటం ఒకటే ఉంది, కానీ దాన్ని ఎగిరేయడానికి బోలెడు ఆకాశం ఉంది” అన్నాడు. ఇది పాజిటివ్ థింకింగ్ అంటే

ఒక అబ్బాయి గాలిపటం ఎగిరేయడానికి గ్రౌండ్ కు వెళ్ళాడు. వాడి దగ్గర ఒకటే గాలిపటం ఉంది, పైగా అది అక్కడక్కడ చిరిగిపోయింది. అంతలో వాడి ఫ్రెండ్ వచ్చాడు. వాడి దగ్గర 4, 5 రంగురంగుల గాలిపటాలు ఉన్నాయి. ఈ అబ్బాయిని చూసి వాడు హేళనగా నవ్వి “నా దగ్గర బోలెడు గాలిపటాలు ఉన్నాయి. నీ దగ్గర ఒకటే ఉంది” అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి కూడా నవ్వి “నా దగ్గర గాలిపటం ఒకటే ఉంది, కానీ దాన్ని ఎగిరేయడానికి బోలెడు ఆకాశం ఉంది” అన్నాడు. ఇది పాజిటివ్ థింకింగ్ అంటే. పాజిటివ్ థింకింగ్ అంటే ఒక రకంగా ఆశావాదం కూడా.

Deewar సినిమాలో అమితాబచ్చన్ దేవుడిని నమ్మడు, శశి కపూర్ నమ్ముతాడు. గుళ్లో వాళ్ళ అమ్మ ప్రసాదం తీసుకొచ్చి పెడితే అమితాబ్ నేను తినను అంటాడు. వాళ్ళ అమ్మ తినమంటుంది. అప్పుడు శశి కపూర్ ” అన్నా, అమ్మ ప్రసాదం అని ఇస్తుంది, నువ్వు స్వీట్ అనుకొని తినేసేయ్” అంటాడు. ఇది పాజిటివ్ థింకింగ్ కి మంచి ఉదాహరణ. అక్కడ పదార్థం అయితే స్వీట్. ఒకరు ఒకరకంగా ఆలోచిస్తుంటే, మరొకరు ఇంకో రకంగా ఆలోచిస్తున్నారు.

నీళ్ల గ్లాసు లో నీళ్ళు సగం ఉంటే. కొంతమంది సగం గ్లాసు ఖాళీ ఉంది అంటారు. మరికొంతమంది గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయి అంటారు. అది తేడా.

పాజిటివ్ థింకింగ్ ఉంటే కష్టాలు ఉండవని కాదు, కష్టాలు ఉన్నా ఎదుర్కొనే మనస్తత్వం ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాజిటివ్ థింకింగ్ అనే ఈ వ్యాక్సిన్ ఎవరికి వాళ్లు వేసుకోవాలి. కరోనా వ్యాక్సిన్ తోపాటు ఈ వ్యాక్సిన్ కూడా వేసుకుంటే, కరోనా వచ్చే అవకాశాలు తగ్గుతాయి, ఒకవేళ వచ్చినా తగ్గే అవకాశాలు పెరుగుతాయి.

గతవారం కథనం : “ఒత్తిడి నుంచి లే…” దీన్ని క్లిక్ చేసి చదవండి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article