కలసి ఒక్కటైన జంటపై అపురూప పద్యం ఇది. శ్రీ శిష్ట్లా తమ్మిరాజు రాసిన ఈ సీస పద్యాన్ని వివాహ మహోత్సవ సందర్భంగా దాంపత్య జీవితానికి ఆశీర్వాదంగా పాడుతారు శ్రీ కోట పురుషోత్తం. వినండి…
‘ధర్మేచ’ ఈజంట ధన్యమైమసలంగ
ఆదర్శదాంపత్య మమరవలయు
‘అర్ధేచ’ ఈజంట అరమరికేలేక
కోర్కెలన్నియుతీర కూర్చవలయు
‘కామేచ’ ఈజంట కలసిఒక్కటయిన
భవితపంటయెపండి బ్రతుకవలయు
‘మోక్షేచ’ ఈజంట మ్రొక్కదైవంబుకు
సకలసంపదకల్గి సాకవలయు
పలుక ‘నాతిచరామిగ’ ప్రణయప్రతిన
‘బ్రహ్మముడి’ తోనదాంపత్య భావమొంది
‘ఏడుఅడుగల’ బంధమ్ము నేకమయ్యి
ఇదె ‘వివాహబంధమ్ము’గా యిలనునిలిచె
శ్రీ కోట పురుషోత్తం పరిచయం
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.