గతమాసం ప్రజాపక్షంలో ప్రచురితమైన అశోక్ గోనె కలం నుంచి జాలువారిన ఈ కవిత హమాలి గురించిన గొప్ప ఆర్తి గీతం. తెలుపు సగౌరవంగా పునర్ముద్రిస్తున్నది.
అశోక్ గోనె, 9441317361
అతడు మోస్తున్నది బరువుల
బస్తాల్ని కాదు.
మనందరి ఆకలిని
మనందరి అవసరాల్ని మోస్తున్నాడు.
కండలన్ని కొండల్లా
నరాలన్ని మర్రి ఊడల్లా
అతని దేహం కదులుతోంది
బరువుల బారాలతో.
శివున్ని మోసే నదీశ్వరుడిలా
విష్ణువుని మోసే గరుత్మంతుడిలా
తన పనిలో మునిగిపోయే
కర్మవీరుడతడు.
అతగాడు మోసేది బరువుల్ని కాదు…
తన పరివారపు స్వప్నాల్ని.
అతడి చేయి పడనిదే…
ఏ వస్తువు కదలదు.
తన హస్తాలతో సంతకాల
జాతర జరగాల్సిందే.
వస్తువులన్నింటిని గమ్యాల
బాట పట్టించే “నావ” అతడు.
దేహం అంతా చెమటలు కక్కుతున్న
హృదయంలో బాధలు సుడిగుండాల్లా
తిరుగుతున్నా…
కన్నీరంత కాలువలై ప్రవహించినా
కలత చెందని కష్టజీవి అతడు.
బరువులన్నీ అలవోకగా మోసే
భీముడు అతడు.
పిల్లా పాపలను సాకడానికి
ఏ మంచి కార్యానికి వెనుకాడడు.
మూటల కొద్దీ మనీ రాకపోయినా
పదో పరకో సంపాదించి
రోజుల్ని ఎల్లదీసే ధర్మాత్ముడతడు.
అన్నదాతలు పండించిన అమృతాన్ని
దూరతీరాలకు చేర్చేది ఈ హమాలినే.
అతని మొహం మీద కష్టాల పవనాలు
విస్తూనే ఉంటాయి.
ఎదలో టన్నులకొద్ది సంసార బాధలు
ఎపుడు మోస్తూనే ఉంటాడు.
ఈ బస్తాల బరువు ఓ లెక్కా అతనికి.
నిశ్శబ్దబు చీకటి బతుకుల్లో
వెళుతురులేని లోకాన్ని చూస్తుంటాడు.
అలుపెరుగని కార్మికుడై తన జీవిత
బరువుల్ని మోస్తుంటాడు.