ఒకనాడు, ఒక పొలంలో ఒక గిరిజన మహిళని చూసాను. వృద్ధురాలు. ఒక్కర్తీ మౌనంగా, ఓపిగ్గా కలుపు తీసుకుంటున్నది. ఆమెని చూడగానే ఈ కవిత పుట్టింది.
వాడ్రేవు చినవీరభద్రుడు
నా ప్రపంచం నా ఊరితోనే మొదలయ్యింది,
అది నా ప్రాచీన ధరిత్రి.
అక్కడ అప్పుడు నాకు ఆకలి లేదు, శోకం లేదు.
అరణ్యాన్ని వసంతాలు అలంకరించేవి, దిగంతాల్ని తుషారాలు ఆవరించేవి
భూమిపై శాద్వలాలు కుసుమించేవి, రాత్రులు వెన్నెల్తో తడిసిపొయ్యేవి.
నా జీవితం నా ఊరితోనే మొదలయ్యింది.
అది నా జనని గర్భం.
అప్పుడక్కడ గాలుల్లో పాటలు ప్రవహించేవి, పొలాల్లో కలలు పండుతుండేవి
నక్షత్రాల్ని తలలో తురుముకొని భూమి ఈశ్వరుడి వక్షాన్ని మమతతో హత్తుకునేది.
అది నా బాల్యం.
సంధ్య పడింది. సంత పలచబడింది.
బృందగానం సన్నగిల్లింది, మృణ్మయ పాత్రలు పగిలిపొయ్యాయి
ఎడతెరిపిలేని తుపాన్లు ఏటిదిశను మార్చేసాయి.
ఇప్పుడక్కడ గాలుల్లో పూలమధువులు లేవు,
పిల్లలనేత్రాల్లో నవ్వులు లేవు,
ఇప్పుడక్కడ సదా ఆకులు రాలుతున్న చప్పుడు, చెవుల్ని కాల్చే ఎండ.
పొలాల్లో ప్రేతాకారాలు, పసి శవాలు, పైని గద్దలు.
ఎండిన డొక్కలు, చిక్కిన పశువులు, కూలిన ఇళ్ళు.
ఇప్పుడు వినిపిస్తున్నవి గంగాలమ్మ పాటలు కావు
ఎక్కుపెట్టిన ప్రశ్నలు.
ఇప్పుడు కనిపిస్తున్నవి రంగుల జాతరలు కావు,
అడవుల్ని దువ్వుతున్న కాకీ దుస్తులు.
వృద్ధురాలయిన ఆ స్త్రీ మాత్రం సహనంగా, మవునంగా
పొలంలో కలుపు తీస్తోంది. దాని రుజాగ్రస్త వికృత వదనంలో
దూరవసంతం తొంగిచూస్తోంది.
నా ఊరు నన్ను కన్నది, దాన్ని ప్రేమించకుండా ఉండలేను,
ఇప్పుడు కొత్త వ్యవస్థని కంటోంది, కనుక ప్రణమిల్లకుండా ఉండలేను.
కవితా నేపథ్యం
అల్లూరి సీతారామరాజు తిరుగుబాటు తర్వాత దాదాపు అరవై ఏళ్ళు మా గ్రామాల్లో ఏ అలికిడీ లేదు. ప్రతి ఏడాదీ చెట్లు చిగిరించేవి. పక్షులు పాటలు పాడేవి. ఆకాశమూ, కొండలూ, కొండవాగులూ తమదైన ప్రపంచంలో తాముండేవి. ఆ గ్రామాల్లో గిరిజనులు దోపిడీకి గురవతూనే ఉండేవారు. ఏవో ప్రభుత్వ చట్టాలు ఉండేవి. కొందరు కట్టుబడి ఉండేవారు. చాలామంది వాటిని పట్టించుకునేవారు కారు. 1980లో మొదట్లో మా ఊళ్ళో శెట్టిగారి ఇంటిగోడమీద మొదటిసారి ఎర్ర అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి, ఆ వెనక, కరపత్రాలు, నినాదాలు, గద్దర్ పాటలు. ఒక దశాబ్దం పాటు ఆ గ్రామాలు అట్టుడికిపోయాయి. ఎన్నడూ చూసి ఉండని అశాంతి. నక్సలైట్లు, పోలీసులు, దాడులు, ఎదురుదాడులు, కూంబింగులు, ఎన్ కౌంటర్లు. అట్లాంటి రోజుల్లో ఒకనాడు, ఒక పొలంలో ఒక గిరిజన మహిళని చూసాను. వృద్ధురాలు. ఒక్కర్తీ మౌనంగా, ఓపిగ్గా కలుపు తీసుకుంటున్నది. ఆమెని చూడగానే వర్డ్స్ వర్త్ రాసిన The Solitary Reaper గుర్తొచ్చింది. వెంటనే మా ఊరు గురించి ఈ కవిత పుట్టింది. నిర్వికల్ప సంగీతం పుస్తకం విడుదల అయినవెంటనే, శీలా వీర్రాజు గారు ఏదో యువకవుల కవితాసంకలనంలో ఈ కవిత తీసుకుంటున్నామని ఉత్తరం రాసారు. మరెవరో దీన్ని ఇంగ్లిషులోకి అనువదించినట్టు కూడా గుర్తు. ఇది రాసింది 18 మార్చి 86లో.
వాడ్రేవు చినవీరభద్రుడు కవి, రచయిత, చిత్రకారులు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉన్నతాధికారి.