తెలుపు తొలి వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులు, రచయితా, పరిశోధకులు గోవిందరాజు చక్రధర్ గారు ఒక చక్కటి కవిత రాసి పంపించారు.
తరచి చూసుకుంటే ఎంత తృప్తి, సంతృప్తి!
గోవిందరాజు చక్రధర్
చిన్ననాటి జిగ్రీ దోస్తానొకడు
ఉన్నట్టుండి ఎదురుపడి
ఆశ్చర్యంతో ముంచినట్టు
పిలువని పెరంటానికొచ్చినట్టు
వర్షం తలుపు తట్టి
పలుకరిస్తోంది.
బాల్యం కాగితపు పడవలుగా
ఆలోచనల సుడులు తిరుగుతోంది
జీవితానికింతకంటే
మరింకేం కావాలనిపించడం లేదు.
కంటి ముందు వయ్యారంగా
కదలాడిందో బొమ్మ
పదహారేళ్ళ వయసు
వెనక్కి పరుగులిడుతూ పిలుస్తోంది
జ్ఞాపకాల ఎదను మీటుతొంది
కొత్త యవ్వనం నరనరాన
పరుగులు తీస్తోంది
జీవితానికింతకంటే
మరింకేం కావాలనిపించడం లేదు.
ఓ పుస్తకం రారమ్మని
కన్నుగీటుతూ కవ్విస్తోంది
అక్షరాల దారులంట
అలుపెరగని ప్రయాణమంట
ఓ వాక్యం ముందుకు
కదలనివ్వటం లేదు
అక్కడక్కడే చూపులు
తచ్చాడుతున్నాయి
మాటలకందని భావన
మనసులో ముప్పిరి గొంటున్నది
జీవితానికింతకంటే
మరింకేం కావాలనిపించడం లేదు.
తెలుగురాని గాయకుడొకడు
సరికొత్త చమక్కులతో
చెక్కిళ్ళను నిమురుతున్నాడు
అపభ్రంశాలన్నీ మధురోహాల
సుగంధాల్ని వెదజల్లుతున్నాయి
ఉద్విగ్న భరిత క్షణాలకు
ఊపిరులూదుతున్నాయి
జీవితానికింతకంటే
మరింకేం కావాలనిపించడం లేదు.
మండు వేసవి మధ్యాహ్నం
పెరుగన్నంతో మామిడి రసం
మిళాయించిన జుగల్బందీ
రుచుల ద్వారాలు తెరచుకొని
రసగంగలో ముంచెత్తుతోంది
జీవితానికింతకంటే
మరింకేం కావాలనిపించడం లేదు.
దొడ్లో వేప చెట్టు కొమ్మలు
వింజామరలు విసురుతున్నాయి
నులకమంచం సరిగమల
కూనీరాగం తీస్తోంది
సుతారంగా మేనిని
మీటుతున్న చల్లగాలి
జోలపాడుతోంది
ఎటు పోయిందో ప్రాణం
జీవితానికింతకంటే
మరింకేం కావాలనిపించడం లేదు.
అభినందనలు ..వేప గాలి హాయిగా. పుస్తకంత
పయనం
Pure poetry. Worth reading several times.