అనిల్ బత్తుల
అతను ఒంటరి ముసలి గని కార్మికుడు.
భార్య ఎప్పుడో కాలం చేసింది.
మెట్ల బావిలో బొక్కెన వదిలినట్లు
కొండపై నుండి ప్రియురాలు లోయలో దూకినట్లు
ఆలోచన సరస్సులో గుర్రం తలను వేలాడదీసినట్లు
అతను ఆ బొగ్గు గని లోతుల్లోకి వెళ్ళి రాక్షస బొగ్గుని తవ్వుతాడు.
అతనికి బొగ్గుని తవ్వడమంటే తన జ్ఞాపకాల్ని తవ్వటం.
తనని తాను తవ్వుకోవటం.
అలా రోజంతా తవ్వుతాడు, నేలలు, సంవత్సరాలు తవ్వుతాడు.
బొగ్గు తరుగుతుంటుంది, ఇతని శరీరం వడలుతుంది.
ప్రతి నెల మొదటి తారీఖు జీతం రాగానే పూటుగా సారాయి తాగుతాడు.
ఎంత తాగుతాడంటే..
శివుడు విషాన్ని తాగినట్లు
ఆకలిగొన్న శిశువు తల్లి చనుబాలు తాగినట్లు
కుక్క పిల్లలు గోముగా తల్లి పాలు కుడిచినట్లు
ఇతను ప్రపంచ దు:ఖ సారాయిని కడుపారా తాగుతాడు.
తాను పెళ్ళి చేసుకోలేకపోయిన ప్రియురాలు,
మరణించిన భార్య,
సమాధైన స్నేహితులు
అందరూ ఇతని ముందుకు వచ్చి వాలుతారు..
నల్లగా విషాదంగా పెద్దగా రాక్షస బొగ్గులా నవ్వుతూ..
వాళ్ళను బూతులు తిడుతూ
తన పారతో, గునపంతో వాళ్ళ రూపాల్ని తవ్వుతాడు.
వాళ్ళు చిద్రం ఆయ్యేదాకా..
లేదా తను చిద్రం అయ్యేదాకా…
“నీ ప్రేమ కౌగిలి నాకు కావాలి ” అని మృత్యు దేవతను ప్రార్థిస్తాడు.
కానీ ఆమె కరుణించదు.
శాపగ్రస్థ ముసలివాడు తాగి, వాగి సొమ్మసిల్లి సారాయి దు:కాణంలో పడిపోతాడు.
ఆ రాత్రి…
గుర్రం కలలో, ముసలాడి తల బొగ్గు గని గుమ్మానికి వేలాడుతూ కనిపిస్తుంది.
- అముద్రిత ధారావాహిక : మధుశాల’ నుంచి …