Editorial

Wednesday, January 22, 2025
కథనాలుఇక 'ప్రపంచపల్లె' మన పోచంపల్లి : UNESCO విశిష్ట గుర్తింపు

ఇక ‘ప్రపంచపల్లె’ మన పోచంపల్లి : UNESCO విశిష్ట గుర్తింపు

పోచంపల్లిని ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసిన నేపథ్యంలో ఇక్కత్ కు పేరున్న పోచంపల్లి , అక్కడి గ్రామ సముదాయాల గురించి తెలుసుకుందాం. వాటన్నిటినీ కలిపి ప్రభుత్వం ‘సిల్క్ సిటీ’ గా అభివృద్ధి చేయాల్సిన అవసరమేమిటో గమనిద్దాం.

కందుకూరి రమేష్ బాబు 

ఇక్కత్ చీరలకు పేరుగాంచిన పోచంపల్లి నేడు ఉత్త‌మ ప్ర‌పంచ ప‌ర్యాట‌క గ్రామంగా (Best touisam village) ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. తెలంగాణలోని ఈ గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి అత్యుత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.

భారత్ నుంచి ఈ అవార్డుకు మూడు గ్రామాలు రేసులో నిలవగా సిల్క్ సిటీగా పేరున్న పోచంపల్లి మిగతా గ్రామాలను వెనక్కి నెట్టి అరుదైన ఈ పురస్కారాన్ని సొంతం చేసుకోవడం విశేషం.

ఇప్పటికే రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు దక్కగా ఇప్పుడు పోచంపల్లికి కూడా ఈ గుర్తింపు దక్కడం ప్రపంచపటంలో తెలంగాణకు మరింత ప్రాధాన్యం పెరిగినట్టు అయింది. కాగా, వచ్చే నెల 2న స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరంలో జరిగే ఐరాస వరల్డ్ టూరిజం 24వ మహాసభల్లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రధానం చేయనున్నారు.

పోచంపల్లి ఈ పురస్కారానికి ఎంపిక కావడంపట్ల కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ గ్రామ ప్రజల శ్రమ, స్వయం కృషి, అధికారుల కృషి వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. అంతేకాదు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ప్రధాని మోదీ ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్రం ద్వారా పోచంపల్లికి సంబంధించిన ప్రత్యేకమైన నేత శైలులు, నమూనాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి దోహదపడ్డాయని అన్నారు. పోచంపల్లి గ్రామానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందిస్తూ  ఇందుకు ఆ గ్రామస్తుల నైపుణ్యమే కారణం అంటూ అక్కడి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

పోచంపల్లి వెళ్ళే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం

 

నేడు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పోచంపల్లి నిజానికి ప్రస్తుతం వస్త్ర వ్యాపార కేంద్రం. ఇక్కడ యాభై నుంచి ఎనభై దుఖానాలున్నాయి. మూడు షాపింగ్ కాంప్లెక్స్ లూ ఉన్నాయి. హైదరాబాద్ కు ముప్పయ్ నలభై కిలోమీటర్ల దగ్గరే ఉండటం వల్ల ఇది కొనుగోలుకు సుప్రసిద్ద కేంద్రంగా మారింది. ఐతే, నిజానికి పోచంపల్లి అంటే  చుట్టుముట్టు ఉన్న నలభై గ్రామాల సముదయగా చూడాలి. ఇదంతా కలిసే సిల్క్ సిటీగా గమనించాలి. యునెస్కో పురస్కారం వచ్చ్చ్యిన సందర్భంగా వీటన్నిటినీ ఒక గొడుగుగా మార్చి టూరిజం అభివృద్ధి చేయవలసి ఉన్నది.

కాగా వస్త్రోత్త్పత్తికి మూలమైన పోచంపల్లి కేంద్రంగా ఈ గ్రామాల విశిష్టత చూడాలి. ముఖ్యంగా ఇక్కత్ వస్త్రాల కొనేందుకు కార్లపై వెళ్ళే వాళ్ళు మరి ఇరవై కిలోమీటర్ల పరిధిలోనే ఉన్న ముఖ్యమైన ఇంకొన్ని గ్రామాలను సందర్శిస్తే మరింత చౌకగా ఇంకా నాణ్యమైన వస్తాలను కొనుక్కోవచ్చని గ్రహించాలి.

ఆ గ్రామాల వివరాలు క్లుప్తంగా చెప్పేముందు కాటన్ కు ప్రసిద్ధి చెందిన గ్రామాల్లో కొయ్యలగూడెం తప్పక వెళ్ళాల్సిన గ్రామం. అట్లే, సిరిపురం, వెల్లంకి ముఖ్యమైన గ్రామాలు. కాగా సిల్క్ వస్త్రాలకు పేరెన్నిక గలవి – పుట్టపాక, గట్టుప్పల్ కూడా దర్శించవలసిన గ్రామాలు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పోచంపల్లి మాదిరే ఈ గ్రామాలకు కూడా పేరు తేవడం, వస్త్ర వినియోగదారులు అక్కడకు వెళ్లి షాపింగ్ చేసుకునేలా తీర్చి దిద్దడం ప్రభుత్వం చేయవలసి ఉండింది.  ఆ పని చేయవలసిన అవసరాన్ని ఈ యునెస్కో పురస్కారం వచ్చిన సందర్భంగా పెద్దల దృష్టికి తెస్తూనే మనంతట మనం అవగాహన పెంచుకుని నేరుగా ఆయా గ్రామాలకు వెళ్లి షాపింగ్ చేయడం మంచిది.

తెలంగాణలో మొదటి చేనేత సహకార సంఘం ప్రారంభమైంది కూడా కొయ్యలగూడెం లోనే. ఇది చారిత్రాత్మకంగానే కాదు, వస్త్ర శైలిలో కూడా భిన్నత్వం ఉన్న గ్రామం.

తెలంగాణలో మొదటి చేనేత సహకార సంఘం ప్రారంభమైంది కూడా కొయ్యలగూడెం లోనే. ఇది చారిత్రాత్మకంగానే కాదు, వస్త్ర శైలిలో కూడా భిన్నత్వం ఉన్న గ్రామం. ఇక్కడి వస్త్రాలను కొందరు ‘కోయాస్ ఇక్కత్’ పేరుతో ప్రాచుర్యంలో పెడుతున్నారు. ఇప్పటికీ ఇక్కడి సహకార సంఘం చాలా బాగా పనిచేస్తోంది. ముఖ్యంగా ఇక్కడి బెడ్ షీట్లు అమెరికా శ్వేత సౌధాన్ని అలంకరించిన విషయాన్ని పత్రికలూ ఇప్పటికే ప్రస్తావిస్తూనే ఉంటాయి. నేటికే విదేశాలకు ఇక్కడినుంచి వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఇక్కడి వెరైటీలకు మరింత ప్రాచుర్యం కల్పించవలసే ఉన్నది. అన్నట్టు, అక్కడ సేల్స్ కౌంటర్ కూడా పెద్దది. పోచంపల్లి వెళ్ళిన వారు ఇక్కడకు తప్పక వెళ్ళాలి.

సిరిపురం, ఇది కూడా కాటన్ కు పేరు. వీళ్ళు ‘సిరికో ఫ్యాబ్రిక్స్’ పేరుతో ప్రాచుర్యంలో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా బెడ్ షీట్లు తయారవుతాయి. అలాగే డ్రెస్ మెటీరియల్ కూడా

రెండో గ్రామం, సిరిపురం, ఇది కూడా కాటన్ కు పేరు. వీళ్ళు ‘సిరికో ఫ్యాబ్రిక్స్’ పేరుతో ప్రాచుర్యంలో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా బెడ్ షీట్లు తయారవుతాయి. అలాగే డ్రెస్ మెటీరియల్ కూడా ఉత్పతి చేస్తారు. ఈ రెండూ స్వయంగా ఇక్కడి నుంచి కొనుగోలు చేస్తే మీకు మరింత లాభం.

పుట్టపాక డబుల్ ఇక్కత్ కు పేరుమోసిన గ్రామం. పట్టు చీరలు, దుపట్టాలు, డ్రెస్ మెటీరియల్ వంటి నాణ్యమైన ఉత్త్పత్తులకు ప్రధాన కేంద్రం ఇది. మన రాష్ట్రంలోని పద్మశాలీలు ఇప్పటిదాకా మూడు పద్మశ్రీలు అందుకోగా ఇద్దరు ఈ గ్రామస్తులే కావడం విశేషం. వాళ్ళు శ్రీ గజం రాములు, శ్రీ గజం అంజయ్యలు. వారి మూలంగా ఇక్కడి నేతకారులలో చాలా మంది చిన్నా చితకా పురస్కారాలు కూడా పొందారు. ఐతే, వారి జీవన స్థితిగతుల్లో మార్పేమీ లేదనే చెప్పాలి. పద్మశ్రీల పేరిట వీరు కోట్లకు పడగలెత్తినా ఆ ప్రముఖులు ఇప్పటికీ ఇక్కడి నేతకారుల, ఇలాంటి నిపుణులైన రెండు తెలుగు రాష్ట్రాలలోని నేతన్నల రెక్కల కష్టం మీదనే అంత సంపాదించారని అంటే అతిశయోక్తి కాదు. కాకపోతే వారు ఈ వస్త్ర ప్రపంచాన్ని బతికిన్చారని కూడా అంటారు. లేకపోతే పరస్పరం లబ్ది పొందారనే అంటారు. ఏమైనా మీరు ఈ గ్రామాన్ని సందర్శించడం, ఇక్కడి చేనేత సహకార సంఘాలకు వెళ్లి కొనుగోలు చేయడం మంచిది. వాస్తవాలు స్వయంగా గమనించడం అన్ని విధాలా ఉపయోగం.

గట్టుప్పల్ కూడా సిల్క్ షర్టింగ్ కి పేరు. ఇక్కడ సింగిల్ ఇక్కత్ వస్త్రాలు తయరవుతాయి.

గట్టుప్పల్ కూడా సిల్క్ షర్టింగ్ కి పేరు. ఇక్కడ సింగిల్ ఇక్కత్ వస్త్రాలు తయరవుతాయి. తేలియా రుమాళ్ళు కూడా ఇంకా తయారు చేస్తున్న వాళ్ళు ఇక్కడున్నారు. పుట్టపాకలో, కోయ్యలగూడెంలో కూడా తేలియా రుమాళ్ళు చేసే వారు కొందరు మిగిలారు.

ఈ సమాచారం క్లప్తంగా రాయడంలోని ఉద్దేశ్యం ఏమిటంటే, పోచంపల్లి ఒక్కటే వస్త్ర కేంద్రం కాదన్న సంగతి మీకు తెలియాలనే. మొత్తం పోచంపల్లి ‘ఇక్కత్’ బ్రాండ్ కింద దాదాపు నలభై గ్రామాల్లో భిన్న రకాల వస్త్రోత్పత్తి జరుగుతోందన్న అవగాహనకే.

పై గ్రామాలు ఒక్కో రకానికి ఒక బ్రాండ్ గా భావించవచ్చు. ఈ గ్రామాలు సందర్శిస్తే కాటన్, సిల్క్ చీరలే కాదు, డ్రెస్ మెటీరియల్ తో పాటు, బెడ్ షీట్లు, కండువాలు, టవల్స్, కర్టెన్లు, దీవాన్ సెట్లు, టేబుల్ టాప్స్ తదితరాలన్నీ మీ కంట పడుతాయి.

చేనేత పట్ల ఏంతో అభిమానం చూపే ఆధునిక మహిళలు మరో విషయం గ్రహించాలి. నేతకారుల చేతిలో వస్త్రం లేదిప్పుడు. వారు కేవలం కూలీలే. మాస్టర్ వీవర్స్ వారికి ముడి సరకు ఇచ్చి తయారు చేసుకుని కూలీ ఇస్తారు. కావున పోచంపల్లిలో కొనుగోలు చేసినా ఈ గ్రామాల్లో కొనుగోలు చేసినా అది నేతకారులకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదని కూడా గ్రహించాలి. నాణ్యమైన మన్నికైన వస్త్రాలు, కాస్త తకువ ధరకు నేరుగా తీసుకోవాలంటే మటుకు ఈ గ్రామాల్లో ఉన్న సహకార సంఘాల కార్యాలయాలకు వెళ్ళడం మంచిదని మాత్రమే ఈ వ్యాసం తెలుపుతోంది.

ఐతే, పెద్ద ఎత్తున కొనుగోలు చేయాలంటే ఆయా ఊర్లలో ఉన్న స్థానిక మాస్టర్ వీవర్స్ ఎవరో తెలుసుకొని వాళ్ళను కలవండి. మరింత చవగ్గా లభిస్తాయి. అలాగే కొన్ని గ్రామాల్లో రసాయనాలు వాడకుండా సహజ రంగుల్లో వస్త్రాలు నేసె నేతకారులు కొద్ది మంది ఉన్నారు. వారి వద్ద నుంచి ఆ వెరైటీలు కొనుగోలు చేసుకోవచ్చు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article