ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి గెలుపుకోసం జతకట్టిన రాజకీయ వ్యూహకర్త పికె రాష్ట్ర రాజకీయాల్లో గల్ఫ్ ఓటర్ల పాత్ర కనీసం ముప్పయ్ నియోజక వర్గాల్లో ప్రాధాన్యం వహించబోతుందని చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు కేసిఆర్ తగిన చర్యలు చేపట్టకపోతే ఎన్నికల్లో టి ఆర్ ఎస్ కి ‘గల్ఫ్ గండం’ ఖాయంగా అనడంలో సందేహం లేదు.
మంద భీంరెడ్డి
‘గల్ఫ్ గండం’పై రాజకీయ వ్యూహకర్త పికె టీం పరిశీలనలో తేల్చిన విషయం ఇదే…
ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాలలో 2019 ఎన్నికలలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు ఓడిపోయిన విషయం తెలిసిందే. కర్ణుడి చావుకు కారణాలు చాలా ఉన్నట్లుగానే ఇక్కడ టీఆరెస్ ఓటమికి గల్ఫ్ కార్మికుల ఓటు బ్యాంకు కారణం అయిందని పికె టీం సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఉత్తర తెలంగాణ లోని 30 అసెంబ్లీ స్థానాలలో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం ఏ మేరకు ఉంటుందో పరిశీలన జరిపి ఎక్కువ ప్రభావం, ఓ మోస్తరు ప్రభావం అనే ఏ, బీ అనే రెండు క్యాటగిరీలుగా వర్గీకరించినట్లు తెలిసింది. ఆ మేరకు కేసేఆర్ ని అప్రమత్తం చేసినట్లు వినికిడి.
ఆ 30 అసెంబ్లీ నియోజకవర్గాలివే…
ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు: ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, సిర్పూర్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బోథ్ లలో గల్ఫ్ ఓటర్లు పాత్ర అధికం.
కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు: కరీంనగర్, వేములవాడ, సిరిసిల్ల, హుజురాబాద్, హుస్నాబాద్, చొప్పదండి, మానకొండూర్ కూడా అదే కోవలో చూడాలి.
అలాగే, నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు: నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, బాల్కొండ, ఆర్మూర్, కోరుట్ల, జగిత్యాలలో కూడా ఈ ప్రభావం అధికం.
కెసిఆర్ ఇకనైనా ప్రవాస తెలంగాణీయులు ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న వారిపట్ల తగిన సంక్షేమ పథకాలు, అవసరమైన పాలసీ విధానాల విషయంలో పునరాలోచన చేసి తక్షణం తగు చర్యలు తీసుకోకపోతే ఈ 30 నియోజక వర్గాల్లో గెలుపు కష్టమే అన్నది పీకే హెచ్చరికగా తెలుస్తోంది.
పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు: పెద్దపల్లి, రామగుండం, ధర్మపురిలో కూడా అదే పరిస్థితి.
జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు: యెల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడలో కూడా గల్ఫ్ ఓటర్ల ప్రభావం ఉంటుంది.
అలాగే, మెదక్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని మూడు నియోజకవర్గాలు: మెదక్, సంగారెడ్డి, దుబ్బాకలో కూడా వీరి పాత్ర ప్రముఖం.
మంద భీంరెడ్డి పూర్వ పాత్రికేయులు, ప్రవాసి సంక్షేమ వేదిక అధ్యక్షులు. మొబైల్ +91 98494 22622
Nice story
ఓటమిపై కొత్త పాయింట్. భీంరెడ్డి బాగా పట్టుకున్నారు. ఇలాగైనా గల్ఫ్ బాధితులకు మంచి జరిగితే చాలు. భీంరెడ్డి కృషి ఫలించాలి.