నేడు తేది అక్టోబర్ 19
క్రీ.శ 1292 అక్టోబర్ 19 నాటి పాతర్లపాడు (సూర్యాపేట జిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో పెండ్లికొడుకు మల్లిదేవమహారాజుల తండ్రి భీమదేవమహారాజు పాతర్లపాడు మూలస్థాన సోమనాథ అన్నేశ్వర కొమరేశ్వర దేవరలకు అనేక దానములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. అట్లే ఆలయ సేవకులకు (ఉద్యోగులకు) కూడా అనేక దానములనిచ్చినట్లు వివరాలతో చెప్పబడ్డది. [నల్లగొండ జిల్లా శాసనాలు II నెం 63].
అట్లే క్రీ.శ 1580 అక్టోబర్ 19 నాటి చెంగల్పట్ (తమిళనాడు) శాసనంలో రంగరాయ దేవమహారాజుల కాలంలో శ్రీమన్మహామండలేశ్వర రామరాజు వెంకటపతి రాజయ్య దేవమహారాజుల నాయంకరములోని చెంగిలిపట్టు ప్రతినామమైన వెంకటాపురంసీమ దళవాయి తిరుమలనాయనింగారి వశమైన (?) విశ్వనాథయ్యగారు మెయ్యూరు గ్రామాన్ని చెంగళిపట్టు పాళెం రఘునాయకులకు నిత్యోత్సవ మాసోత్సవ రధోత్సవ తిరుణాళ్ళకు యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XL నెం 209,Etd. 2019].\
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.