ప్రతి వ్యక్తి రచనగా వ్యక్తమైతే ముఖ్యంగా స్త్రీలు లేదా ఒక తల్లి గనుక తన కథ తాను చెబితే కల్పిత సాహిత్యం కళ తప్పిపోతుంది. చరిత్రగా మనం చదివిన గాథ ఎంత అర్ధ సత్యమో కూడా అవగతమవుతుంది. పరకాల కాళికాంబ గారి జీవితం చదివితే ఈ మాటలు చెప్పబుద్ది అవుతోంది.
కందుకూరి రమేష్ బాబు
‘నా జీవితం…కొన్ని జ్ఞాపకాలు…ఘట్టాలు’ అన్న శీర్షిక చూస్తే, 204 పేజీల ఈ ఆత్మకథను చదవడం మొదలు పెడితే ఒక సాధారణమైన మహిళ జీవితం చదువుతున్నామనే అనిపిస్తుంది. ఒక సాదా సీదా మహిళ గాథను వింటున్న భావన కలుగుతుంది. కానీ చదువుతూ పోతే అది ఒక సాంఘిక నవలగా, రాజకీయ చరిత్రగా పరిణామం పొందడం చూసి విస్మయానికి గురవుతాం. అంతేకాదు, ఈ పుస్తకం పూర్తిగా చదివితే స్త్రీల భూమికగా ఇలా విరివిగా సాహిత్యం వస్తే- ఇల్లు వాకిలి ఉన్న సాంఘిక చరిత్రలు, రాజకీయ చరిత్రలు జీవకళతో తారాడే రచనలుగా మారి మన సారస్వతాన్ని సుసంపన్నం చేస్తాయనిపిస్తుంది.
పుస్తకం మామూలుగా మొదలైనప్పటికీ చివరాఖరికి సాహసోపేత వ్యక్తిగా కాళికాంబ గారు మనకు దర్శనమిస్తారు. ఎంతో అత్మీయురాలు అవుతారు. ప్రస్తుతం వారు జారిపడి మంచాన ఉన్నారని తెలిసింది. అందరినీ గుర్తు పట్టడం లేదట. కానీ ఈ బుక్కు చదివితే, ఆమె జ్ఞాపకాల పేటిక ఇక్కడ ఉందనిపిస్తుంది. ఆమె ఆరాటాలు పోరాటాల రామ చిలుక వంటి జీవితం ఇక్కడ ఈ పుస్తకంలో దాచి, అక్కడ వారు భౌతికంగా అవసాన దశలో విశ్రాంతి తీసుకుంటున్నారని నాకు తోచింది. ఆ తల్లికి అభివాదాలు తెలుపుతూ ఈ పుస్తక పరిచయాన్ని కొంచెం వివరంగా రాయబుద్ది అవుతోంది.
‘పురుష ప్రపంచం గడప’ దాటి స్త్రీలు వీధుల్లోకి సమాజంలోకి వెళ్ళి మనుషులుగా వ్యక్తమయ్యే క్రమంలో స్త్రీలుగా ఎదుర్కొనే ఇబ్బందులు వారిని అవకాశం లబిస్తే తప్పక రాసేలా చేస్తాయి.
స్త్రీ వాద పత్రిక భూమిక 30 సంవత్సరాల సంబరాన్ని ఏప్రిల్ 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిపగా ఈ పుస్తకం విడుదలైంది. ఇది నిజానికి స్త్రీ వాదానికి సంబంధించినది కాదు. కానీ ఆ ఉద్యమానికి దోహదపడే సామాన్య స్త్రీ రచనగా చెప్పాలి.
నిజానికి కాళికాంబ గారు పుస్తకం చివరికి వచ్చేసరికి ఒకసారి ఎంపికై పది మాసాలు పనిచేశారు. ఇక రెండో దఫా శాసన సభకు పోటీ చేయాల్సి ఉంటుంది. రాజకీయాల్లో ఆరితేరి ఉన్నారు కూడా. ఐనప్పటికీ ‘సామాన్య రచన’ అనడానికి కారణం ఆమె తన ప్రస్థానాన్ని ఎంచుకొని సాగించిన వారు కాదు. జీవితాన్ని సహజంగా సుందరంగా అంగీకరిస్తూ ఉత్సాహంతో బ్రతికిన వారు. జీవితం ఎన్నో ఇబ్బందులతో సాగినప్పటికీ ఆమెకు సంతోషం ఉంది. తృప్తీ ఉన్నది. దాన్ని ఆమె బాధ్యతగా నిర్వహించడమూ ఉన్నది. ఆ కారణాల వల్ల ఈ రచన ‘విశేష రచన’ అయింది.
చేయి తిరిగిన రచయితల రాసే పుస్తకాల కంటే ఇలాంటి సామాన్య వ్యక్తుల పుస్తకాల్లో రచన మరింత వాస్తవికంగా ఉంటుంది. వ్యక్తీకరణ స్వతంత్రంగా ఉంటుంది. శషబిషలు లేకుండా చెప్పడమూ ఉంటుంది. ఎవరినో మెప్పించడానికో లేదా నొప్పించడానికో కాకుండా సహజంగా ఉంటాయి. ఎక్కడా న్యూనత లేకుండా నిందలు వేయకుండా నిర్మొహమాటంగా ఆత్మవిశ్వాసంతో రాసిన ఈ పుస్తకమే అందుకు మంచి ఉదాహరణ.
సాధారణంగా పితృసామ్య సమాజంలో స్త్రీలు పురుషుల భావజాలానికి లోనై జీవించడం మామూలే. కుటుంబంలో, సమాజంలో వారి పాత్ర పురుషుడి కనుసన్నల్లోనే ఉంటుంద్నది కాదనలేని వాస్తవం. పేరుకు మహిళలుగా స్వతంత్రంగా వారి వ్యాపకాలు వారికి ఎన్ని ఉన్నప్పటికీ అదంతా పురుష ప్రపంచ ఆధిపత్య భావజాలంలోంచే, వారి ఇరుసుగానే సాగుతుందనడంలో సందేహం లేదు. పురుషులు విజయం సాధిస్తే ఆ విజయం వెనుక మహిళగా వీరు గౌరవం పొందుతారు. వారే గనుక ఓడిపోతే అందులో స్త్రీ సహకార రాహిత్యం ఎత్తి చూపుతారు. ఐతే, ఆమెను ‘జీవిత భాగస్వామి’ అని అంటాం గానీ ఇద్దరి జీవన పయణంలో సమన భాగస్వామ్యం ఉన్న విషయం పితృస్వామ్య సమాజంలో అభినందనలు అందుకోదు. ఇక్కడే ఈ పుస్తకం ప్రాధాన్యతగల అంశాలను అలవోకగా గుర్తు చేస్తుంది.
మహిళలు విరివిగా రచనలు చేయడం, ముఖ్యంగా వారు అత్యధికంగా ఆత్మ కథలు గనుక రాయగలిగితే అందులో ఆయా స్త్రీల స్వీయ అస్తిత్వపు గొంతును మనం వినగలుగుతాం. అంత:స్రవంతిగా స్త్రీగా తన ప్రత్యేక జీవన భాగస్వామ్యం ప్రశంసనాత్మకంగా వ్యక్తమవుతుంది. వాదన లేకుండానే ఆమె ‘వాణి’ని కూడా వినగలుగుతాం. కల్పనాత్మక సాహిత్యంలో కన్నా నిజ జీవిత రచనల్లో అదీనూ ఆత్మ కథల్లోనే ఈ సౌలభ్యం ఎక్కువ. ఈ పుస్తకం ఆ దిశలో మరో చేర్పుగా ఉంటుంది.
తెలుగు నాట రాజకీయాల్లో కొత్తగా కమ్యూనిస్టు కుటుంబాలు ఏర్పడటం, ఆ క్రమంలో వారి ఇంటనుండే స్త్రీలకు లభించిన స్వేచ్ఛా సమానత్వాలు కూడా ఈ పుస్తకం గమనింపులోకి తెస్తుంది. అలాగే అగ్రకులాలే ఐనప్పటికీ ఎంతో ఆదర్శంగా భావించిన కులాంతర వివాహాల వల్ల అదనంగా ఒత్తిడికి గురైంది మహిళలే అన్న అంశం కూడా గ్రహిస్తాం.
తమదే ఐనట్టు కన్పించినప్పటికీ ‘పురుష ప్రపంచం గడప’ దాటి స్త్రీలు వీధుల్లోకి సమాజంలోకి వెళ్ళి మనుషులుగా వ్యక్తమయ్యే క్రమంలో స్త్రీలుగా ఎదుర్కొనే ఇబ్బందులు వారిని అవకాశం లబిస్తే తప్పక రాసేలా చేస్తాయి. అట్లా ఈ పుస్తకంలో కూడా నిండు మనిషైన కాళికాంబ గారు స్త్రీగా పడ్డ బాధలు అలాంటి అనివార్య వాదాన్ని ఇచ్చాయి. జాగ్రత్తగా చదివితే పోల్చుకోగలం. వాటిని బట్టి స్త్రీ వాదం అనేక అంశాలను స్వీకరించి విశ్లేషించుకోవచ్చు. సిద్దాంతం కన్నా అప్పుడే జీవితంలో భాగంగా స్త్రీ వాదం బలపడుతుందని నా విశ్వాసం.
ఈ పుస్తకంలో కమ్యూనిస్టు జీవితం తాలూకు సాహచర్యం గురించి స్త్రీ భూమికగా చెప్పిన అంశాలు ముఖ్యమైనవి. ముఖ్యంగా సమ సమాజం ఆదర్శంగా ఎంచుకున్న కమ్యూనిస్టులు తమ పోరాటాల పురోగతికి స్త్రీలు చేసిన అసామాన్య త్యాగాలు, తమతో సమానంగా సహచర కార్యాచరణ ప్రత్యేకంగా ఈ పుస్తకం అవగాహనలోకి తెస్తుంది. అలాగే స్వాతంత్ర్యానికి పూర్వం మొదలై ఆ తరువాత దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్తగా కమ్యూనిస్టు కుటుంబాలు ఏర్పడటం, ఆ క్రమంలో వారి ఇంటనుంచి స్త్రీలకు లభించిన స్వేచ్ఛా సమానత్వాలు కూడా ఈ పుస్తకం గమనింపులోకి తెస్తుంది. అలాగే అగ్రకులాలే ఐనప్పటికీ ఎంతో ఆదర్శంగా భావించిన కులాంతర వివాహాల వల్ల అదనంగా ఒత్తిడికి గురైంది మహిళలే అన్న అంశం కూడా గ్రహిస్తాం. కమ్యూనిస్టుల ఆదర్శాల కారణంగా ఇక్కడ కాళికాంబ కమ్మ కుటుంబం నుంచి వచ్చి బ్రాహ్మణుల అబ్బాయిని పెళ్ళాడుతుంది. అట్లా ఆదర్శ జీవనంలో ఆమె భాగస్వామ్యం విలువైన అంశాలను ఈ పుస్తకం ప్రస్తావనకు తెస్తుంది. తాను మొదట తండ్రి, తర్వాత భర్తల రాజకీయ కార్యాచరణ నుంచి ప్రారంభమై కాంగ్రెస్ రాజకీయాల్లో తానూ భాగం అవుతుంది. భర్త మరణించాక ఆమె శాసన సభ్యురాలుగా ఎంపిక అవుతుంది. అందుకే ఆమె జీవితాన్ని ఇల్లూ వాకిలి నుంచి అసెంబ్లీ దాకా అనడం.
రాజకీయాలు మొదలయ్యాక ఎంత ఆసక్తిగా చదువుతామో ఆమె బాల్యం యవ్వనం కూడా అంతే బాగా చదివించేలా రాశారు. ఎందుకూ అంటే ఆమె సహజంగా చైతన్య పూరితమైన మనిషి. రాజకీయాలు ఆమెకు కలిసి వచ్చాయంతే. చిన్నప్పుడు అందరికంటే ముందు లేచి వాకిట్లో ముగ్గులు పెట్టడం మొదలు, తోడపుట్టిన వాళ్ళను తయారు చేయడమే కాదు, ఆఖరికి ఏటా పిల్లలను కంటూ వస్తున్న అమ్మకు అన్నీ తానై చేయడమూ చూస్తాం. ఎక్కడా తల్లి మాదిరే తనకూ విసిగు లేదు. విమర్శా లేదు. జాలి తప్ప. ఉదయం పూజ, తీరిక వేళల్లో లేసులు అల్లడంతో సహా వంటలు వార్పులతో సహా అన్నింటిలో భక్తి శ్రద్ధ గౌరవం, పనిపట్ల ఆసక్తి, విశ్రాంతి పట్ల ఎరుకా అన్నీ ఉన్నాయ్. వారికి జీవితం సంఘర్షణ కాదు, ఎదురీతా కాదు. తనొక జీవితేచ్చగల మనిషి. చూపున్న వనిత. తన తోటి అమ్మాయి పేరు ‘పాము’. ఆమె కడుపులో ఉన్నప్పుడు వాళ్ళమ్మ కలలో పాము కనపడిందట. ఇలాంటి విషయాలను కూడా ఎంతో బాగా చెప్పారు పుస్తకంలో.
ఒక సందర్భంలో ప్రభాకర్ గారు వారి తల్లి రాసుకున్న చరిత్ర చదవమని సత్యవతి గారికి ఇవ్వడం, చదివాక తనకు తెలియని మనిషి రూపుగట్టి ఇది తప్పక తేవాల్సిన పుస్తకంగా భావించి వారు ఈ పనికి పూనుకున్నారు. అట్లా ఒక స్త్రీ చరిత్ర మరొక స్త్రీ పూనిక వల్ల ప్రపంచానికి వెల్లడవడం విశేషం.
కాగా, ‘భూమిక’ తరపున కొండవీటి సత్యవతి గారు ప్రచురించిన ఈ ఆత్మకథ తేవడానికి కారణం కాళికాంబ గారికీ తమ కుటుంబానికీ మధ్య ఉన్న సాన్నిహిత్యం. పరకాల ప్రభాకర్ గారు సత్యవతి గారు బాల్య మిత్రులు కావడం. నర్సాపురంలో ఒకేచోట పెరిగిన వారు కావడం. ఒక సందర్భంలో ప్రభాకర్ గారు వారి తల్లి రాసుకున్న చరిత్ర చదవమని సత్యవతి గారికి ఇవ్వడం, చదివాక తనకు తెలియని మనిషి రూపుగట్టి ఇది తప్పక తేవాల్సిన పుస్తకంగా భావించి వారు ఈ పనికి పూనుకున్నారు. అట్లా ఒక స్త్రీ చరిత్ర మరొక స్త్రీ పూనిక వల్ల ప్రపంచానికి వెల్లడవడం విశేషం. దీంతో వ్యాఖ్యాత, విశ్లేషకులు, రాజకీయ నాయకులూ ఐన పరకాల ప్రభాకర్ గారెవరో, వారి రాజకీయ మూలాలు ఏమిటో వివరంగా తెలిశాయి. వారి తండ్రి ఐన శ్రీ పరకాల శేషావతారం గారి యవ్వనం, వారి రాజకీయ ప్రస్థానం, అందలి ఎదురీత – యాభయ్యవ దశకం నుంచి మొదలై కనీసం మూడు నాలుగు దశాబ్దాల కాలంలో ఒక ఉన్నతమైన నాయకుడిగా ఆయన ఎదిగి నిలదొక్కుకున్న తీరు, కమ్యూనిస్టుగా మొదలై నాటి రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకుడిగా మూడు పర్యాయాలు శాసన సభకు ఎంపికై మంత్రి వర్యులుగా సేవలు అందించడం – అంతా – అన్నీ సన్నిహితంగా వెల్లడయ్యాయి. ఇట్లా ఒక మహిళ, కామన సత్యనారయణ గారి కూతురిగా మొదలై, భార్యగా పరకాల కుటుంబాన్ని మెట్టినిల్లుగా చేసుకున్నాక అష్కారమైన చరిత్రను రాయడమే కాదు, అంతకు ముందరి పుట్టింట ఉన్న తన చరిత్రనూ ఎంతో శ్రద్ధతో అక్షరబద్ధం చేశారు. అట్లా ఒక స్త్రీ రచించిన ఈ పుస్తకం మూడు తరాల పురుషుల జీవన వికాసాన్ని, కొడుకు ప్రభాకర్ గారి వెనుక మాటల ద్వారా తల్లి స్థిరమైన వైఖరి, తద్వారా రాజకీయాల్లో అతడికి ఎదురైన సంకట పరిస్థితులతో సహా తెలియజేస్తుంది.
పాప నివృత్తి చేసుకున్నట్టు ప్రభాకర్ గారు భావిస్తారు. వ్యక్తిగతంగా ఆ మాట నిజమే ఐనప్పటికీ దానివల్ల పుణ్యమే జరిగింది. ఇప్పుడు ఆ పుస్తకం చదివిన వారికి, వారే అన్నట్టు నిజంగా దగ్గరి వారికీ తెలియని అసలైన ‘కాళికాంబ’ను మనందరం చూడగలిగాం.
నిజానికి చివరి మాటలను ప్రభాకర్ గారు రాసేటప్పుడు చాలా నిజాయితీగా తన తప్పిదాన్ని అంగీకరించారు. తల్లి రాసిన వెంటనే అక్కడక్కడా కాకుండా ఆ రాత ప్రతిని మొత్తం పూర్తిగా చదవక పోవడం పొరబాటు అయిందని చెబుతారు. తండ్రి పట్ల హీరో వర్షిప్ కారణంగా తల్లి వ్యక్తిత్వం, విలువ తనకు అర్థమవడానికి చాలా కాలమే పట్టిందని కూడా అంగీకరిస్తారు. అది అర్థమయ్యాక ఆవిడ తన ప్రోద్భలంతోనే జీవిత చరిత్రను రాసినప్పటికీ – ( ఏ సంవత్సరం రాశారో చెబితే బాగుండేది ) దాన్ని ఆలస్యంగా వెలుగులొకి, అదీ ఆమె జ్ఞాపక శక్తి నశించే సమయానికి తేవడం పట్ల అమిత విచారం వెలుబుచ్చుతారు. ఇది నిజానికి ‘పాపం’ అనే అంటారు. ఎట్టకేలకు అది కొండవీటి సత్యవతి గారి చేతుల్లో పడ్డాక వారిద్దరూ కలిసి, దానికి చెరొక మాట చేర్చి ఆ ధీర వనితను మన చెంతకు చేర్చారు. చేర్చే సమయంలో రాసిన మాటలో పాప నివృత్తి చేసుకున్నట్టు ప్రభాకర్ గారు భావిస్తారు. వ్యక్తిగతంగా ఆ మాట నిజమే ఐనప్పటికీ దానివల్ల సమాజానికి పుణ్యమే జరిగింది. ఇప్పుడు ఆ పుస్తకం చదివిన వారికి, వారే అన్నట్టు నిజంగా దగ్గరి వారికీ తెలియని అసలైన ‘కాళికాంబ’ను మనందరం చూడగలిగాం.
ఛాయాదేవి గారు 1994లో ఈ ఉత్తరం రాశారు. అదే నిజం అయితే, మళ్ళీ ఒక మహిళ ప్రేరణతోనే ఈ పుస్తకం రాయడం జరిగినట్లు లెక్క.
పుస్తకంలో కాళికాంబ గారి ఛాయ చిత్రాలు, కుటుంబంతో ఉన్నవీ ప్రచురించారు. బాగున్నాయి. అలాగే అబ్బూరి ఛాయాదేవి గారు కాళికాంబ గారికి ఒక ఉత్తరం ఒకటి అచ్చు వేశారు. అందులో ఆవిడ కాళికాంబ గారిని తన ఆత్మకథ రాయమని సూచిస్తారు. బహుశా ఇది ప్రేరణ ఇచ్చి ఆమె రాశారా అనికూడా అనిపిస్తుంది. ఛాయాదేవి గారు 1994లో ఈ ఉత్తరం రాశారు. అదే నిజం అయితే, మళ్ళీ ఒక మహిళ ప్రేరణతోనే ఈ పుస్తకం రాయడం జరిగినట్లు లెక్క.
అందులో ఛాయాదేవి గారు అంటారు, “మీరు మీ రాజకీయ స్మృతులను రాయడం మొదలు పెట్టండి. ముఖ్యంగా “మీ వారు మా ఇంట్లో ఉన్నప్పటి రోజుల గురించి మీరు తప్ప మరొకరు రాయలేరు కదా!” అంటూ “ఆ నాటి రాజకీయ వాతావరణం గురించి, మీ నాన్నగారి ప్రమేయం గురించీ – రాజకీయ కార్యకర్త భార్యగా, మంత్రి భార్యగా, ఎం.ఎల్. ఏగా – ఇలా మొత్తం జ్ఞాపకం చేసుకుంటూ ఈ నాటి అనుభవాల వరకూ రాయండి. ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు” అని కోరుతారు ఆవిడ. “భాష విషయం పట్టించుకోవద్దు. ప్రచురణ విషయం కూడా మాకు వదిలేయండి” అని కూడా చెబుతారు. మొత్తానికి కాళికాంబ గారు రాస్తారు. ఐతే, ఛాయాదేవి గారు సూచించినట్టు రాజకీయ కార్యకర్త భార్యగానే కాకుండా ఒక వ్యక్తిగా రాయడం వల్ల ఈ రచన విశేషంగా మారింది.
కమ్యూనిస్టులు చేసే రచయితల మాదిరిగా ఈ రచనలో ‘ఆదర్శం’ లేదు. అంతేకాదు, ఇతర రచయితలు ఏ విషయాలైతే మనం చెప్పడానికి వెనుకాడుతారో ఆ అంశాల ప్రస్తావన అలవోకగా సూటిగా ఉంటంది. ఉదాహరణకు ముందు పేర్కొన్నట్లు, పదిహేను మంది సంతానం విషయం ప్రస్తావిస్తూ “మా అమ్మ అస్తమానూ పిల్లలను కంటూ ఉంటుంది. ప్రతి ఏటా ఒకరిని కంటుంది” అని యధాలాపంగా అంటారు. “ప్రతి పురుడుకూ తానే అమ్మకు అన్నీ చేసిందనీ” కూడా చెబుతారు. అలాగే భగవంతుడి పట్ల తనకు గల విశ్వాసాన్ని కూడా ఎంతో బాగా చెబుతారు. భర్త నిద్ర లేవక ముందే పూజ చేసుకోవడం కూడా ఆసక్తిగా చెప్పి, ఎవరి అభిప్రాయాలు వారివని కూడా అంటారు. అంతేకాదు, భగవంతుడి ప్రస్తావన వచ్చినప్పుడు మనిషి తప్పొప్పుల పట్ల, దైవ భీతి పట్ల మొత్తంగా మనవ ప్రవృత్తి పట్ల కూడా వారి మీమాంస ఎంతో ఉదాత్తంగా ఉంటుంది. తాత్వికత ధ్వనిస్తుంది. అంతేకాదు, ఈ రచనలో ఆమె రెండు మూడు ఎం ఎల్ ఎ క్వార్టర్ల గురించి అక్కడి వసతులు సరిగా లేకపోవడం గురించి కూడా చెబుతరు. నీళ్ళ ఇబ్బందుల గురించి కూడా రాస్తారు. ఒక స్త్రీగా మాత్రమే చూడగల విషయాలు ఇట్లా ఎన్నో ఉన్నాయ్. అదే సమయంలో చెన్నారెడ్డి, అంజయ్య, పివి నరసింహరావులు వంటి కాంగ్రెస్కూ నేతలు, వారి ప్రవర్తనలు, రాజకీయాల పట్ల తన అభిప్రాయాలు కూడా సున్నితంగా ఉంటాయి.
నిజానికి ప్రతి వ్యక్తి వ్యక్తమైతే ముఖ్యంగా స్త్రీలు లేదా ఒక తల్లి తన కథ గనుక తాను చెబితే కల్పిత సాహిత్యం కళ తప్పిపోతుంది. చరిత్రగా మనం చదివిన గాథ ఎంత అర్ధ సత్యమో కూడా అవగతమవుతుంది. కాళికాంబ గారి జీవితం చదివితే ఈ మాటలు చెప్పబుద్ది అవుతోంది.
చివరగా, భర్త మరణానంతరం ఎన్నికల్లో నిలబడి వారు గెలుస్తారు. ఆ తర్వాత కూడా ఎన్నికల్లో నిలబడాల్సి వచ్చినప్పుడు ఆమె రాజకీయాల కన్నా కుటుంబానికే ప్రాధాన్య మిస్తారు. పిల్లల కోసం రాజకీయాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్ వచ్చ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి ఆ నిర్ణయం చెబుతారు కూడా. కానీ ‘మీరు తప్పకుండా నిలబడాలి’ అని వారంటారు. అక్కడ పుస్తకం ముగుస్తుంది.
ఇప్పుడు అర్థమవుతోంది, ప్రభాకర్ గారు తాను ప్రచిరించదాన్ని ఆలస్యం చేయడం ‘పాపం’ అని ఎందుకు అన్నారో! బహుశా తల్లి రాసిన వెంటనే గనుక ఆ పుస్తకం తెచ్చి ఉంటే ఆమె జ్ఞాపక శక్తి బాగున్నప్పుడే చూసుకొని మురిసిపోయేవారేమో! ఆ ఉత్సాహంతో రెండవ భాగం కూడా రాసి ఉండేవారేమో! అందులో మరింత విశాల జీవితం వ్యక్తం చేయగలిగి ఉండేవారు!
చివరగా ఒక మాట. ఈ పుస్తకానికి ‘నా జీవితం కొన్ని జ్ఞాపకాలు, ఘట్టాలు’ అన్న శీర్షిక కాళికాంబ గారు రఫ్ గా పెట్టి ఉంటారు. ప్రచురణకర్తలు అదే పుస్తకం పేరుగా కాకుండా మరొక మంచి శీర్షిక పెట్టి ఉంటే, అట్ట వెనుక పుస్తకం గురించి కూడా కొన్ని మాటలు ప్రచురించి బాగుండేది. పుస్తకం పాటకులను ఇంకా బాగా ఆకర్షించేది. ఇప్పుడు ‘పరకాల కాళికాంబ’ పేరు చూసి, ఆ ఇంటిపేరును గుర్తుపట్టిన వారే చదివేలా ఉంది. మలిముద్రణలో ఆలోచిస్తారని ఈ సూచన. అందుకోసమే ఇంత వివరమైన పరిచయం. కృతజ్ఞతలు.
పుస్తకం వెల పెట్టనందున ‘అమూల్యం’.
కాపీలకు ‘భూమిక ఉమెన్స్ కలెక్టివ్’. ఫోన్ నంబర్ – 040 27660173