తెరిచిన పుస్తకం వంటి ఈ పాఠశాల స్థాపకుడి నుంచి మనం ఐక్యూ కాదు, ఇక్యూ గురించి చదువుకోవాలి. నారింజ పండును చూసినపుడు అయన్ని గుర్తు చేసుకోవాలి.
కందుకూరి రమేష్ బాబు
తన గ్రామంలో నారింజ పండ్లు అమ్ముకుని జీవించే హరేకల హజబ్బ రాష్ట్రపతి చేతుల మీదుగా నేడు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న ఫోటోలు, వీడియోలు మీరు చూసి ఉంటారు. చెప్పులు కూడా లేకుండా అయన రాష్ట్రపతి దగ్గరకు నడిచి వెళుతున్న దృశ్యం కూడా చూసే ఉంటారు. అయన పండ్లు అమ్మి తన గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలను స్థాపించి బాలబాలికల విద్యకోసం కృషి చేస్తున్నారని తెలిసి మీ హృదయం ఉప్పొంగి ఉంటుంది కూడా. ఈ సందర్భంలో ఒక మాట.
బిజెపి ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ప్రతి ఏటా కొందరు సామాన్యులకు పద్మశ్రీ పురస్కారాలు ఇవ్వడం ఒక విధానంగా పెట్టుకోవడం అభినందనీయం. ఆ క్రమంలోనే కొన్నేళ్ళ క్రితం మన దగ్గరి ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య కూడా పద్మశ్రీ పురస్కారం అందుకున్న విషయం తెలిసిందే. ఐతే, ఇలాంటి సామాన్యమైన వ్యక్తులు గొప్ప సంకల్పంతో ఎవరూ ఊహించని స్థాయిలో పని చేయడానికి కారణం ఏమిటీ?
నిజానికి కర్నాటకకు చెందిన హరేకల హజబ్బ నిరక్ష రాస్యుడు, ఆర్థికంగా ఆ రోజు గడిస్తే చాలనుకునే సాధారణ వ్యక్తి. కానీ అయనకు ఇంతటి అసాధారణ సంకల్పం ఎలా వచ్చింది?
నిజానికి కర్నాటకకు చెందిన హరేకల హజబ్బ నిరక్ష రాస్యుడు, ఆర్థికంగా ఆ రోజు గడిస్తే చాలనుకునే సాధారణ వ్యక్తి. కానీ అయనకు ఇంతటి అసాధారణ సంకల్పం ఎలా వచ్చింది? ఆయనకే కాదు, కోటి మొక్కలు నాటిన రామయ్యకు అంతటి దీక్ష ఎక్కడిది?
ఇలాంటి పద్మశ్రీలను చూసినప్పుడు ‘సాయం చేయడానికి ధనవంతులే కానక్కరలేదు, మంచి మనసుంటే చాలు’ అని చెప్పుకుని ఊరుకుంటే సరిపోతుందా? కాదనే ఈ చిరువ్యాసం తెలుపు.
హరేకల హాజబ్బ విషయం తెలుసుకుంటే అయన జీవితంలో జరిగిన ఒక సంఘటన తనను గొప్ప సంఘ సేవకుడిని, అపురూపమైన విద్య వితరణ వాదిగా మార్చిందని గ్రహిస్తే అంతకన్నా లోతైన ఒక అంశం మనకు భోదపడాలి.
ఒకసారి ఒక విదేశీ జంట తన వద్దకు వచ్చి పండ్ల ధర ఎంత అని ఆంగ్లంలో అడిగారట. తనకు ఇంగ్లీషు రాదు. స్థానిక భాషలో చెప్పిన సమాధానం వారికి అర్థం కాలేదు. కాసేపు అడిగి విసుగు పుట్టి వారు వెళ్లిపోయారట. అ సంఘటన తాను మరచిపోలేదు. అది తన బుద్దిని ప్రశ్నించింది. హృదయాన్ని గాయ పరిచింది. నేను చదువుకుని ఉంటే ఇలా జరిగేది కాదు కదా అన్న ఒక్క క్షణం ఆలోచనకు అతడికి గొప్ప మార్గం చూపింది. ‘నా లాగా ఇంకొకరు బాధ పడకూడదు’ అని అప్పటికప్పుడు నిర్ణయించుకుని వారు పేద పిల్లల చదువుకోసం సహాయం చేయడం ప్రారంభించాడు. కొన్ని రోజులకు తన గ్రామంలో కొద్ది మంది పిల్లలతో స్థానికంగా ఉన్న మదర్సాలోనే చిన్నగా ఒక పాఠశాలను ప్రారంభించాడు.మెల్లగా పిల్లల సంఖ్య పెరగడంతో పూర్తి స్థాయిలో పాఠశాలను నిర్మించడానికి నడుం కట్టడాయన. అందుకోసం తాను నారింజలు అమ్మగా మిగుల్చుకున్న కొంత మొత్తంతో ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు. అయన చొరవను చూసిన ఇరుగు పొరుగు, మరికొందరు తనకు సహాయంగా ముందుకు వచ్చారు. అధికారులూ సహకరించారు. అలా అందరి సహకారంతో అయన న్యూపడపు గ్రామంలో పాఠశాలను నిర్మించారు. ఇప్పుడది ప్రాథమికోన్నత పాఠశాలగా మారింది. ఆయనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించినప్పుడు రేషన్ షాప్ క్యూలో నిలబడి ఉన్నారట. పురస్కారం వచ్చిన సందర్భంగా అయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ తమ గ్రామంలో కళాశాలను నెలకొల్పాలని అక్కడికక్కడే విజ్ఞప్తి చేశారు.
ఇక్కడ చెప్పదల్చుకున్నది ఏమిటంటే, అయన పాఠశాల ఏర్పాటుకు కారణం ఒక సంఘటన. ఆ ఘటన. అది తన వ్యక్త్యిగత అనుభవంలోనిది. తాను చదువుకోలేదన్న బాధ… గాయపడ్డ మనసు నుంచి జనించినది. అది ఎమోషనల్ అంశం.
ఇక్కడ చెప్పదల్చుకున్నది ఏమిటంటే, అయన పాఠశాల ఏర్పాటుకు కారణం ఒక సంఘటన. ఆ ఘటన. అది తన వ్యక్త్యిగత అనుభవంలోనిది. తాను చదువుకోలేదన్న బాధ… గాయపడ్డ మనసు నుంచి జనించినది. అది ఎమోషనల్ అంశం. తక్షణం స్పందన ఫలితం కూడా అది.
మనం చదువుకునే విద్యార్థులకు ఇంటలిజెన్స్ గురించి చెబుతాం. జెనరల్ నాలెడ్జ్ పెంచుకోమని పోరుతాం. అలాగే ఐ.క్యూ కి (Intelligence quotient)కి అధిక ప్రాధాన్యం ఇస్తాం. అలంటి పుస్తకాలు, వ్యక్తుల జీవితానుభావాలు, ఆత్మకథలు చదవమంటాం. వ్యక్తిత్వ వికాస నిపుణులూ అదే చెబుతూ ఉంటారు. కానీ గొప్ప గొప్ప ఆవిష్కరణలకు, ఇలాంటి సామాన్యుల అసామాన్యమైన మహత్యానికి కారణం ఇ.క్యూ అని గ్రహించం. అది Emotional quotient. భావోద్వేగాలతో అలోచించి ముందుకు సాగే ధీరోదాత్తత. తక్షణ చర్య.
అది వ్యక్తిగతం. దానికి చదువు సంపదా అక్కర్లేదు. మీనమేషాలు లెక్కించే అవసరం లేదు. మనిషిగా సంస్పందనకు గురయ్యే సున్నితమైన వ్యక్తిత్వం కలిగి ఉండటం కీలకం.
తనకు ఎదురైన అనుభవంతో తక్షణం బాధకు గురైనప్పటికీ ఆ బాధ కారణంగా అతడి భావోద్వేగాలను సానుకూల దృక్పథానికి మలుచుకుని, గొప్ప సంకల్పంతో సమస్య పరిష్కారానికి పూనుకుని, అచంచలమైన విశ్వాసంతో ముందుకు సాగడం.
తెలివి కాదు తేట. ఈ గుణమే అతడిని పాఠశాల స్థాపించేలా చేసింది. నేడు మనందరి మధ్య అతడిని అత్యున్నత పురస్కార గ్రహీతగా నిలిపింది.
అంతేగానీ, అతడికి చెప్పులు కూడా లేవని, బీదవాడని. అయినా ఎంత మంచి పని చేశాడని అభినందించడంలో వివేకం లేదు.
నేడు పద్మశ్రీ అందుకున్న హరేకల హజబ్బ నుంచి మనం స్ఫూర్తి పొంధవలసింది అదే. మనం అక్షరాస్యులు కానక్కరలేదు. ధనికులు కాకపోయినా మంచిదే. కానీ స్పందించే గుణం కలిగి ఉండటం ముఖ్యం. ఆ స్పందన తెలివితేటలతో నిమిత్తం లేనిదని, అది సహృదయంతో కూడినదని, దానికి గొప్ప ఔదార్యంతో సాగిపోయే ఆత్మవిశ్వాసం అవసరం అని గ్రహించడం అవశ్యం. యువతకు ఆ విలువను చెప్పడానికి మనకు ఇలాంటి పద్మశ్రీలు ఉదాహరణీయం కావాలి.
తెరిచిన పుస్తకం వంటి ఈ పాఠశాల స్థాపకుడి నుంచి మనం ఐక్యూ కాదు, ఇక్యూ గురించి చదువుకోవాలి. నారింజ పండును చూసినపుడు అయన్ని గుర్తు చేసుకోవాలి.
అంతేగానీ, అతడికి చెప్పులు కూడా లేవని, బీదవాడని. అయినా ఎంత మంచి పని చేశాడని అభినందించడంలో వివేకం లేదు.
పద్మశ్రీ హరేకల హాజబ్బ. మీకు హృదయపూర్వక అభివాదాలు.