నేడు పితృ దినోత్సవం
తల్లుల గౌరవార్థంగా మాతృ వందన దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు కూడా ఒక రోజును కేటాయించాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకోవడం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తుండటం విశేషం.
ప్రతి రోజూ ఒక పద్యం అందిస్తున్న తెలుపు టివి ఈ విశిష్టమైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆచార్య జక్కంపూడి మునిరత్నం, శ్రీ ఆముదాల మురళి గార్లు రచించిన చెరొక పద్యాన్ని శ్రీ కోట పురుషోత్తంగారు పాడి వినిపిస్తున్నారు.
శ్రీ కోట పురుషోత్తం పరిచయం
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.