బట్టతల ఆరంభం కావడానికి భూమి ఆకర్షణ శక్తి కూడా కారణం అంటారు గానీ అంతకన్నా ముఖ్యం టెస్టోస్టిరాన్‌లో మార్పులే అని అమెరికన్ పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు. హార్మోన్‌లో ఈ మార్పును డిహైడ్రోటెస్టోస్టిరాన్ అంటారట. డీహెచ్‌టీ వల్ల తలపై ఉండే చర్మంలో కొవ్వు మోతాదు తగ్గడం వల్ల ఒత్తిడిని తట్టుకోలేక జట్టు ఊడిపోతుందన్నది పరిశోధనలో సారాంశం. ఏమైనా పురుషుల కన్నా స్త్రీలు ఎంతో నయం. జుట్టు రాలిపోవడంలో పురుషుల్లో టెస్టోస్టిరాన్ కీలక ప్రాత పోషిస్తే వారిలో మటుకు ఇలా వెండ్రుకలు ఊడిపోకుండా ఈస్ట్రోజన్ హార్మోన్ నివారిస్తుందని చెబుతారు. ఏమైనా, ఇది సీరియస్ విషయం. కానీ సరదాగా బట్టతలలోని సానుకూల అంశాలను పద్యం గట్టి చెప్పుకోవడానికి మాత్రం ఇబ్బంది ఏముంది? అందుకే బట్టతల గల్గు వాడే భాగ్యశాలి అంటూ సరదాగా శ్రీ ఆముదాల మురళి రాసిన పద్యమిది. గానం శ్రీ కోట పురుషోత్తం. విని ఆనందించండి మరి.
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.