పున్నమి జాబిల్లి పుడమికి దిగివచ్చి …పులకింతలు ఎదపైన చిలికినట్లు….సడిలేని చిరుగాలి ఒడిలోన కూర్చొని… వింజామరమ్మలు విసరినట్లు… విలువకందని వర్ణన… అలవిగాని పారవశ్యం నిలువెల్లా పాదుకొల్పే పద్యం…పద్యం మొక్కటి తోడున్న పదవులేల…సుఖములింఖేల…
పద్యం ఎంత రసరమ్యం. అది పాడేవారితోనే పునరుజ్జీవం పొందు. అటువంటి స్థితి లేనందునే కదా మనకింతటి దారిద్ర్యం. ఆ లోటును పూడ్చే చిరు ప్రయత్నం ‘తెలుపు’ది. శ్రీ కోట పురుషోత్తం శీర్షిక ఇది. ఇది మల్లెమాల సుందర రామిరెడ్డి రచన. పద్యం మీద పద్యం ఇది. సీస పద్యమిది.
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తారు.