తల్లి గర్భమునుండి ధనముఁదేఁడెవ్వఁడు
వెళ్ళిపోయెడినాఁడు వెంటరాదు
లక్షాధికారైన లవణ మన్న మెకాని
మెఱుఁగు బంగారంబు మ్రింగఁబోఁడు
విత్తమార్జనఁజేసి విఱ్ఱవీఁగుటె కాని
కూడఁబెట్టిన సొమ్ము గుడువబోఁడు
పొందుగా మఱుఁగైన భూమిలోపలఁబెట్టి
దానధర్మము లేక దాఁచి దాఁచి
తుదకు దొంగల కిత్తురో? దొరల కవునొ?
తేనె జుంటీ గ లియ్యవా తెరువరులకు?
భూషణవికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్ట సంహార! నరసింహ! దురితదూర!
– శేషప్ప కవి రాసిన పద్యం ఇది. నరసింహ శతకం నుంచి గైకొని గానం చేసింది శ్రీ కోట పురుషోత్తం. గొప్ప భావం గల ఈ పద్యం వినడం ఒకంత శాంతి. మెలకువ. ఉన్నంతలో సంతృప్తిగా జీవించడానికి గొప్ప స్ఫూర్తినిచ్చే తాత్విక పద్యం.