పరిచయం అక్కరలేని తేనె మాటల తెలుగు సంతకం శ్రీ కొసరాజు రాఘవయ్య. వారి పాటలను ఒకటి రెండు ఉటంకిస్తే చాలు, తెలుగు హృదయాలు కరుగు.
ఏరు వాక సాగాలోరన్నో…’ అంటూ సేద్యగాళ్ళకు ఉత్సహాన్ని రేకెత్తించినా, ‘రామయ తండ్రీ ఓ రామయ తండ్రీ.. మా నోములన్ని పండినాయి ఓ రామాయ తండ్రీ’ అంటూ గుహుడి చేత శ్రీరాముడి ఏరు దాటించినా…ఆడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సొలుపూ ఏమున్నది అంటూ శ్రమైక జీవన సౌందర్యాన్ని చాటినా…తెలుగు పదం, పద్యం, తెలుగు తనం మూర్తీభవించిన వారి మహోన్నత వ్యక్తిత్వం స్పురణకు రాక మానదు. జానపదం నుంచి అభ్యుదయ గీతాల వరకూ వారి లాలిత్యం, పొగరూ, వగరూ రుచి చూడని తెలుగు వారుండరు.
“పేరు కొసరాజు. తెలుగంటే పెద్ద మోజు” అని స్వయంగా ప్రకటించుకున్న ఆ తేనె మాటల కవి వర్యులపై శ్రీ ఏరాసు అయ్యపురెడ్డి ఆత్మీయంగా రాసిన సీస పద్యమిది. ఇది కొండవీటి వైభవం అన్న పుస్తకం లోనిది.
కూని రాగము తీయ గొంతులో కదలాడు
పాట ఎవ్వరిది నీ పాట గాక…
పల్లె పట్టుల ప్రాకి పైరు గాలుల దెలు
పాట ఎవ్వరిది నీ పాట గాక…
రోజులు మారినా మోజింత తీరని
పాట ఎవ్వరిది నీ పాట గాక…
నిప్పు వంటి నిజమ్ము నిర్భయంబుగ పల్కు
పాట ఎవ్వరిది నీ పాట గాక…
తెలుగు నేలను బుట్టిన తీయ్యదనము
తెలుగు ఏరుల పొంగెడు తేట దనము
తెలుగు గుండెల నలరించు తెగువదనము
చాటు పాట ఎవ్వరిది నీ పాట గాక…
కోట పురుషోత్తం పరిచయం
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు టివి’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తున్నారు.