Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌‘మనసు పొరల్లో…’ : అవును. నా మేని ఛాయ నలుపు – పి. జ్యోతి తెలుపు

‘మనసు పొరల్లో…’ : అవును. నా మేని ఛాయ నలుపు – పి. జ్యోతి తెలుపు

స్త్రీ అందాన్ని ఎంచేది ఆమె శరీరపు రంగు… నాజూకుతనముతోనేనా? అన్న ప్రశ్నకు నాదైన సమాధానమే నా మేని ఛాయ.

ఓ నల్ల పిల్లగా పది మందితో మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని, వ్యంగ్యోక్తులు ఎదుర్కున్న నేను ఆ తెల్లటి రంగున్న అందమైన వ్యక్తుల మధ్య నాదైన అందంతో ఎదిగాను అని గర్వంగా చెప్పగలను. చాలా మందికి అందమైన స్త్రీగానే నేను గుర్తుండిపోతాను అని కూడా నిస్సంకోచంగా చెప్పుకుంటాను.

పి.జ్యోతి

ఒక స్త్రీని తక్కువగా చూడాలంటే ఆ స్త్రీ శరీర రంగు మొదటి ఆయుధం అవుతుంది సమాజానికి.

ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా నలుపుని అసహ్యించుకుంటారు ప్రజలు. అందం అంటే తెల్లటి తెలుపు అన్నది ప్రతి ఒక్కరిలో కలిగే భావన. జీవితం గురించి తెలియని అయోమయపు పిల్లల దగ్గర నుండి జీవితంలో పండిపోయిన ముదుసలుల వరకు తెల్ల రంగు అంటే చొల్లు కార్చుకుంటారు. మగవారు నల్లగా ఉంటే నీలిమేఘశ్యాములవుతారు. లేదా రాముళ్ళవుతారు, లేదా ఏడుకొండల స్వామి అవుతారు. ఎంత దుర్మార్గంగా నలుపుని మగవారిలో దైవత్వంగా మార్చి స్త్రీల విషయంలో నలుపు అంటే ఓ తాటకి, ఓ హిడింబి, ఓ శూర్పనఖ మళ్ళీ మాట్లాడితే రక్తం తాగే కాళీ అని పురాణాలలో చొప్పించేసారు. ఆధునిక సమాజం అంటూ ఇప్పటి తరం కూడా ఈ తెలుపు రంగుని ఓ క్రెడిట్ గా మలచుకోవడం చూసినప్పుడు ఇబ్బంది అనిపిస్తూ ఉంటుంది. నా యాభై సంవత్సరాల జీవితంలో తెలుపు పై క్రేజ్ పెరుగుతుందే తప్ప మానవత్వంతో ఆలోచించే గుణం సమాజంలో కనిపించట్లేదు.

పసుపు పచ్చ ఓణీలో ఉన్న నన్ను నా రంగునీ ఆ ఓణీ కలర్ ని జోడించి ఆమె చేసిన కామెంట్ కొంత బాధించినా ఇంటికి వచ్చి అమ్మకు చెప్పబుద్ది కాలేదు.

మన దేశంలో నల్ల పిల్ల ఇలాగే కనబడుతుంది చాలా మందికి

చిన్నతనంలో నేను ఈ రంగు విషయం పెద్దగా పట్టించుకోలేదు. పైగా నేను నల్లగా ఉంటానన్న స్పృహ నాకు లేకుండానే పెరిగాను. పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులో మొదటి సారి మా యింటికి చుట్టపు చూపుగా వచ్చిన ఓ కొత్త పెళ్ళి కూతురు నా రంగును చూసి విమర్శించినప్పుడు పైగా ఏం చూసుకుని అంత గర్వం నీకు… ఆ రంగు చూడు ఎంత వికారంగా ఉన్నావో… అన్నప్పుడు మనసు చివుక్కుమంది. అంతకు ముందు ఆ రకమైన అవమానం నేనెప్పుడూ పొందలేదు. ఆ మాట అన్న ఆ స్త్రీలో ఓ అక్కసు ఉంది. అది నాకు అర్ధం అవుతూనే ఉంది. ఏ విషయంలోనూ పోటీ పడలేక నా రంగు నాకు గుర్తు చేసి మొదటి సారి నన్ను నేను చూసుకునేలా చేసింది. ఈ సంభాషణ రోడ్దు మీద జరిగింది. పసుపు పచ్చ ఓణీలో ఉన్న నన్ను నా రంగునీ ఆ ఓణీ కలర్ ని జోడించి ఆమె చేసిన కామెంట్ కొంత బాధించినా ఇంటికి వచ్చి అమ్మకు చెప్పబుద్ది కాలేదు. ఆ జంట అంటే మా ఇంట్లో ఓ ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. ఇప్పటికీ కొన్ని సార్లు నా క్లాస్ రూం లో పీతాంబరుడు అంటూ విష్ణుమూర్తి గురించి చెబుతున్నప్పుడు ఈ సంఘటన గుర్తుకొస్తుంది నాకు. పసుపు పచ్చ వస్త్రములు ధరించిన నల్లటి విష్ణుమూర్తి ఎలా సుందరుడయ్యాడు నేనెలా అనాకారినయ్యాను అని అనుకుంటూ ఇప్పుడు నవ్వుకుంటాను. అప్పట్లో అంత తెలివి లేదు కాబట్టి జీవితంలో ఒంటరిగా మొదటి సారి ఫీల్ అయ్యాను. అయినా ఆ వయసులో కూడా అ స్టేట్మెంట్ ని హుందాగానే తీసుకున్నాను. అప్పటి నుండి నా చుట్టూ ఉన్న వారిని పరిశీలించడం మొదలెట్టాను.

నేను నల్లగా ఉన్నా కళగా ఉంటాననే కామెంట్లు వినిపించేవి. ‘నల్లగా ఉన్నా కానీ’ అన్న మాటను నొక్కి మరీ చెప్పేవారు.

వయసు వస్తున్న నన్ను, నా శరీరపు రంగుతో సమాజం ఎంచడం మొదలయింది. అడపా తడపా నా రంగు ప్రస్తావన ఇంట్లో వస్తూనే ఉంది. వారిలో కూడా నన్ను ఇష్టపడేవారుండేవారు. నేను నల్లగా ఉన్నా కళగా ఉంటాననే కామెంట్లు వినిపించేవి. ‘నల్లగా ఉన్నా కానీ’ అన్న మాటను నొక్కి మరీ చెప్పేవారు. వీటన్నిటి మధ్య నాలో ఉన్న కాన్పిడెన్స్ ఎవరినీ లెక్కచేయని తత్వం పెద్దగా ఈ విషయాలు పట్టించుకోకుండా నేను నా ప్రపంచంలో ఉండిపోయేలా సహాయపడేది. ఆ కాన్ఫిడెన్స్ కారణంగానే నేను ఎప్పుడూ న్యూనతా భావానికి లోను కాలేదు. సొసైటీలో ఎవరినీ నన్ను తక్కువగా చూడనివ్వలేదు.

ఇక పెళ్ళి విషయం వచ్చేసరికి నా పరిస్థితి తారుమారయింది. ఓ నల్ల పిల్లకు పెళ్ళి జరగాలి. ఇంట్లో వారికి నా రంగు అప్పుడు ప్రతిబంధకం అవుతుందన్నది నాకు చూచాయగా అర్ధం అవుతూనే ఉంది. పెళ్ళి కుదిరి ఎంగేజ్మెంట్ రోజున మా నాన్నగారి ప్రెండ్ ఒకాయన నా దగ్గరకు వచ్చి “నిన్నుచేసుకుంటూ అతను కాదు, అతన్ని చేసుకోబోతూ నీవు అదృష్టవంతురాలివయ్యావు. ఈ పెళ్ళితో ఇది గుర్తు పెట్టూకో” అని స్వయంగా కాబోయే దంపతులుగా నిలుచున్న మా వద్దకు వచ్చి చెప్పివెళ్ళారు. మా యిద్దరి రంగుని పోల్చి చూసి ఆయన వేసిన కామెంట్ అది. అరుణ్ రావు అనే ఆ అంకుల్ మా నాన్నగారి స్నేహితులలో చాలా డిగ్నిఫైడ్ అని అందరం గౌరవించేవాళ్ళం. ఆయన నన్ను బాధించడానికి అలా అనలేదు. సహజంగా ఆయన నోటినుంఛి ఆ మాట వచ్చింది. ఆ నాటి మత్తులో అది నిజమే సుమా అని అనిపించేలా ఉండింది చూట్టూ ఉన్న వారి ప్రవర్తన కూడా కారణం.

ఓ నల్ల పిల్లకు తెల్లటి భర్త దొరికితే అదృష్టం అనుకునే స్థాయిలో నా చుట్టూ ఉన్న వారందరూ ఉంటే అబ్బో ఇదేదో మహా అదృష్టమే అనుకునే స్థితిలో కొన్ని రోజులు గడిచిపోయాయి.

నన్ను పెళ్ళి చేసుకోబోతున్న వ్యక్తి మంచి తెలుపు, అందగాడు. నల్లటి పిల్ల జ్యోతికి మంచి సంబంధం దొరికింది అని నా ముందే కుల్లి కుల్లి ఏడ్చింది మా ఇంట్లో కొన్నాళ్ళబట్టీ చదువు కోసం ఉంటున్న మా చెల్లెలి స్నేహితురాలు. నాకివన్నీ అర్దం కాని ఎమోషన్స్. ఓ నల్ల పిల్లకు తెల్లటి భర్త దొరికితే అదృష్టం అనుకునే స్థాయిలో నా చుట్టూ ఉన్న వారందరూ ఉంటే అబ్బో ఇదేదో మహా అదృష్టమే అనుకునే స్థితిలో కొన్ని రోజులు గడిచిపోయాయి. పెళ్ళైన రోజు నుండి నా రంగుపై అడపా తడపా కామెంట్శ్ విని స్పోర్టీవ్ గా తీసుకున్నాను. అలా తీసుకోవడం సగటు భారతీయ స్త్రీ కర్తవ్యం కదా.

నా జీవితంలో మాత్రం నాకు ఏ తెల్ల రంగు సహయపడలేదు, మనసుకు దగ్గరవ్వలేదు. మళ్ళీ పుట్టిల్లు చేరాను. అప్పటికి ప్రపంచ సత్యాలు అవగతమవుతున్నాయి. మా నాన్నగారు చాలా నల్లగా ఉంటారు నాది అయన పోలిక. ఏ రోజు నా రంగు గురించి పెద్దగా బాధపడని ఆయనకి కూడా తెల్లరంగు పట్ల ఎంతటి క్రేజీ ఉందో నాకు ప్రత్యక్షంగా తెలిసిన రోజులవి. నేను నల్లగా ఉండడం, ఏ రోజూ డైటింగులు చేయకుండా పుష్టిగా ఉండడం, నా కన్నా పదేళ్ళ పెద్దవానితో నా వివాహం జరిపించడానికి ముఖ్యమైన కారణాలు అని, అతన్ని అల్లుడిగా చేసుకోవడానికి మరో ముఖ్య కారణం అతని రంగు అని తెలిసి మొదటి సారి ఆశ్చర్యపోయాను. నేను వయసుకన్నా పెద్దగా కనిపిస్తానన్నది మా ఇంట్లోవారి మరో అభిప్రాయం. భార్యా భర్తల జోడీ బావుండాలట. మన చుట్టూ అన్నీ కాల్కులేషన్లే కదా. నేను ఉన్న వయసుకన్నా పెద్దగా కనిపిస్తాను, అతను వయసుకన్నా చిన్నగా కనిపిస్తాడు. అందుకని ఆ వయసు తేడా సరిపోతుందట. ఇది మా ఇంటివారి కాలుక్యులేషన్. కుటుంబం కాలిక్యులేషన్ల మధ్య నేను చాలా సంవత్సరాలు బందీనే. మరి మంచి కూతురు అనిపించుకోవాలనే తాపత్రయం అప్పట్లొ నాకాస్త ఎక్కువగానే ఉండేది. పైగా నేనో వస్తువుగా ఎంచబడుతున్నానన్న అవగాహన ఆ వయసులో నాకు లేదు. నిజం చెప్పాలంటే కుటుంబం మధ్యలో నేను జీవిత కాలం బలహీన మనస్కురాలిగానే మిగిలిపోయాను. అయినా కూడా నాకో సొంత ఆలోచన ఉండేది. అందుకని ఎవరి కోసం కూడా నన్ను నేను మార్చుకోవడానికి ఇష్టపడేదాన్ని కాదు. నా చుట్టూ ఉన్న వాళ్ళలా ప్రతిదానికి నాజూకులుపోవడం నాకు ఆ రోజుల్లోనే అసహ్యం. ఎప్పుడూ ఓణీలు చీరలే కట్టేదాన్ని. సాంప్రదాయాన్ని ప్రేమిస్తూ పెరిగాను అనుకున్నాను కాని ఆ సమయంలో అదే పెద్ద ప్రతిబంధకం అని నాకు అర్ధం కాలేదు.

ఇలాంటి పనులు చేసే ఆడవారిని ‘బండది’ అని పిలుస్తారని అప్పుడే తెలుసుకున్నాను. ఇప్పటికీ మా కుటుంబంలో నా ముద్దు పేరు అదే.

నాజూకుల విషయానికి వస్తే నాకు చాలా విషయాలు మనసుకు ఎక్కేవి కావు. నా పనులు నేనే చేసుకోవడం, నా సూట్కేసులు నేనే మోసుకోవడం, ఎంత బరువులయినా ఎత్తాలని ప్రయత్నించడం, ఫాన్లు నించి లెట్రిన్ దాకా నేనే క్లీన్ చెసుకోవడం నాకిష్టం. ముఖ్యంగా ప్రతి చిన్న దానికి “ఏవండీ” అంటూ నాజూకులు పోవడం నాకస్సలు తెలియని విషయం. ఎంత ఆడవాళ్లమయినా ఓ సూట్ కేస్ మోయలేమా…. ఓ గాస్ సిలిండర్ ఎత్తలేమా, ఓ చెట్టుకు పందిరి కట్టుకోలేమా. ఇలాంటి పనులు చేసే ఆడవారిని ‘బండది’ అని పిలుస్తారని అప్పుడే తెలుసుకున్నాను. ఇప్పటికీ మా కుటుంబంలో నా ముద్దు పేరు అదే.

రేల్వే స్టేషన్ లో భర్తతో సామానుని, బిడ్డనీ మోయిస్తూ హాండ్ బాగ్ తో నాజూకుగా నడిచే స్త్రీ నాజూకైనది అంటే ఆ నాజూకుతనం ఎందుకు పనికివస్తుందో నాకిప్పటికీ అర్ధం కాదు. చాలా మంది ఆడపిల్లలు పనులు చేయగలరు, బరువులు ఎత్తగలరు, కాని నాజూకుతనం నటిస్తారు. అదే తరువాత కొన్ని పనులు ఎగ్గొట్టడానికి వీరికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆ సౌకర్యం కోసం మగవారిపై ఆధారపడినట్లు నటిస్తారు. మగవాళ్ళేమో ఎదో భార్యని అపురూపంగా చూసుకుంటున్నాం అన్న మార్కు కొట్టేయాలని, వారి ఈగో సంతృప్తికి ఇలాంటి భార్యలను భరిస్తూ ఉంటారు. ఈ అవకాశం ఇవ్వడానికి ఇష్టపడని స్త్రీలంటే పాపం భయం ఈ మగవారికి అందుకని వారిని వింత మనుష్యులుగా చూస్తూ వారి చుట్టూ అటువంటి వాతావరణాన్ని సృష్టిస్తారు. ఇది ఎందరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా గత రెండు తరాల నాగరిక దంపతులలో కనిపించే ఓ పచ్చి నిజం.

నన్ను ఆ రోజుల్లో బలహీనపరచాలనుకున్న ప్రతి ఒక్కరూ నా రంగు గురించే ప్రస్తావించేవాళ్ళూ. ఎవరికో పెళ్ళీ సంబంధం చూడాలనుకోండి. ఆ అమ్మాయి ఎలా ఉంది అని మా అమ్మ కాని ఎవరన్నా కాని అడుగుతే, మీ పెద్దమ్మాయి కన్నా కాస్త చాయగా ఉంది, మీ పెద్దమ్మాయి కన్నా నదురుగా ఉంది, నలుపే కాని మీ పెద్దమ్మాయిలా కాదు … అంటూ ఇలాంటి పోలికలు వచ్చేవి. ముఖ్యంగా ఆ తరువాత మా కుటుంబానికి పరిచయం అయిన వాళ్ళందరికీ పెళ్ళి కూతుర్లను వెతుక్కోవడానికి నేనొక బెంచి మార్కుని.

ఆమె చూపే అసహ్యంలో ఓ కసి, ఏదో పై చేయి ఉండాలన్న కోరిక తప్ప మానవత్వం ప్రేమ అసలు ఉండేవి కావు.

మా అన్నయ్య స్నేహితులుగా చెలామణీ అవుతున్న ఓ కుటుంబం గురించి చెబుతాను. వీరికి ఇద్దరు మగ పిల్లలు. వీరిద్దరి పెళ్ళి సంబంధాలప్పుడు జరిగే చర్చలలో నా రంగు ప్రస్తావన తప్పకుండా వచ్చేది. ఆ మగపిల్లల తల్లి ఎలా ప్రవర్తించేది అంటే నలుపు అంటే నా ముందే మొఖం చిట్లించేది. నా చిన్నప్పుడు ఆ చిన్న క్వార్టర్స్ లో చిన్న ఇంటి వాళ్ళు ఎవారూ ఈ రకమైన అహంకారాన్ని నా ముందు చూపలేదు. ఈమె చూపే అసహ్యంలో ఓ కసి, ఏదో పై చేయి ఉండాలన్న కోరిక తప్ప మానవత్వం ప్రేమ అసలు ఉండేవి కావు. ఈ కుటుంబం తరువాత మా కుటుంబపు శ్రేయోభిలాషుల మధ్య చేరారు కాని అడపాతడపా నా రంగు ప్రస్తావన తెస్తూనే ఉండేవాళ్ళూ.

నేను ఉద్యోగం చేయడం మొదలు పెట్టిన రోజు నుండి నా పని, నా టాలెంట్, నా వ్యక్తిత్వం ఇవి నాకు నలుగురిలో గౌరవప్రదమైన స్థానాన్నే తీసుకొచ్చాయి. ఎక్కడా నా ఎదుగుదలకు నా రంగు ప్రతిబంధకం కాలేదు. నా వ్యక్తిత్వాన్ని నేను ప్రతి క్షణం మెరుగుపరుచుకునే క్రమంలో నేను ప్రొఫెషనల్ గా పైకి ఎదుగుతూ వచ్చాను. ఒక్క సారి మనకు మన శక్తి అర్ధం అయిందా ఈ రంగూ రూపం గురించి ఆలోచన మానేస్తాం. నా కుటుంబంతో స్నేహంగా ఉండే వాళ్ళే నా రంగు ప్రస్తక్తి తీసుకొస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళూ కాకుండా కొందరు బంధువులు కూడా. ఇది నాలో ఓ రకమైన కసిని రేపింది. అయ్యో నేను నల్లగా ఉన్నానే అని నేను అనుకోవాలని వారి భావన. కాని దాని విరుద్దంగా నేను నల్లగానే ఉంటాను, అస్సలు మేకప్ వేసుకోను. నల్లగా ఉన్నానని బాధపడను. నాకు నేను అందమైన దాన్నే. నేను ఇలాగే ఉండి మీతో సమానంగా నిలబడతాను అన్న మొండి వాదం నాలో ఆ రోజులలోనే పేరుకుపోయింది. నాతో సమానంగా నిలిచే తెల్ల వాళ్ళు ఎందరో చూద్దాం అన్న చాలెంజ్ నాలో అప్పట్లోనే ఆక్రమించుకుంది. నా నల్ల రంగును అసహ్యంగా చూసి విమర్శించే వారి మధ్య నేను గర్వంగా ఉండేదాన్ని. ఎంత అంటే నాలోని ఆ కాన్పిడేన్స్ ఎవరికీ అర్ధం అయ్యేది కాదు. వాళ్ళ మాటలకు నేనే ఓ చాలెంజ్ గా నిలిచే దాన్ని. మనల్ని అవమానించాలనుకుని అది సాధ్యపడని వాళ్ళకి మనపై ఓ కసి పెరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలకు. నా చుట్టూ ఉన్న చాలా మందిలో ఆ కసిని ఇప్పటికీ నేను అనుభవిస్తున్నాను.

ముప్పై ఏళ్ళ నుండి ఒంటరి స్త్రీగా జీవిస్తున్న నేను సహయం కోసం ఇతరుల వైపు చూపు మరల్చి నాజూకులు పోతే నేను ఇప్పటి నేనుగా ఉండగలిగేదాన్నేనా.

అలాగే ఎంతటి బరువైన పని అయినా ముందు నేను ప్రయత్నించి అది నాకు సాధ్యం కాదు అంటేనే మరొకరి సహాయం తీసుకునేదాన్ని. ముప్పై ఏళ్ళ నుండి ఒంటరి స్త్రీగా జీవిస్తున్న నేను సహయం కోసం ఇతరుల వైపు చూపు మరల్చి నాజూకులు పోతే నేను ఇప్పటి నేనుగా ఉండగలిగేదాన్నేనా?

ఇప్పటికే.. మీరు చదివారు. నా జీవితంలో ప్రతి స్కిల్ నేను సొంతంగా నేర్చుకున్నదే. పుస్తకం కోసం సినిమా కోసం కిలోమీటర్లు ప్రయాణం చేసి తెలుసుకోవడం, పని చేస్తున్న స్కూలుకి సంబంధించిన ప్రతి పని, స్పోర్ట్ కావచ్చు, స్కౌట్శ్ అండ్ గైడ్శ్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, కల్చరల్ కావచ్చు స్టేజీ మీద నిలబడి మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ నేను పని చేస్తూ నేర్చుకున్న అంశాలే. రాత్రుల్లు పది, పన్నెండింటికి కూడా ఏదో పని మీద స్వయంగా నేనే ఒంటరిగా వెళ్ళడం నాకు అలవాటు. నా ఇంటి సామాను మోసుకోవడం నుంచి, ప్రతి పని నేను స్వయంగా చేసుకోవడం నాకు అలవాటు. నాజూకులుపోతే నేను ఎవరికీ పనికి రాని ఓ వస్తువులా మూలన పడి ఉండేదాన్ని. అందంగా ఉండేదాన్నేమో ఓ ఇంట్లో మూలన ఉండే ప్లవర్ వాజ్ లా… అలా ఉండకూడదనుకోవడం నా చాయిస్. కాని అది చాలా సంతోషాన్నిచ్చిన చాయిస్. నా వ్యక్తిత్వానికి వన్నె తెచ్చిన చాయిస్.

ఇలాంటి స్త్రీల సంఖ్య పెరగడానికి కారణం రంగు రూపం నాజూకుతనం పట్ల సమాజానికున్న అభిప్రాయాలే అన్నది గుర్తించవలసిన ఓ సత్యం.

తెల్లటి తెలుపుతో వచ్చిన అ కోడళ్ళ నాజూకుతనం నేను గమనిస్తూనే ఉంటాను. పాపం ఏ పనీ సొంతంగా చేయలేరు. రంగు తగ్గిపోతుందని భయం. బ్యూటీ పార్లర్లు వీరి ఆహ్లాద స్థలాలు. లైబ్రరీల మొహం పాపం వీరికి తెలియదు. వీరి కాన్పిడేన్స్ అంతా కూడా ఐబ్రో షేపుల్లోనూ, లిప్స్టీక్ కలర్ లోనూ ఉంటుంది. కన్న బిడ్డలను పది నిముషాలకన్నా ఎక్కువ సేపు ఎత్తుకోవడానికి కూడా పాపం వీరికి బలం ఉండదు. అయినా ప్రామ్శ్ ఉన్నాయి కదా ఈ నాజూకు తల్లుల కోసం. ఆధునిక స్త్రీ గొంతుకలుగా మారి వీరు మాట్లాడుతూ ఉంటారు. ప్రతి దానికి మరొకరిపై ఆధారపడుతూ, తమ సుఖం కోసం భర్తను ఓ పావుగా చేస్తూ అదే సంసారం అని నమ్మించే ఇలాంటి స్త్రీలను చూస్తున్న ప్రతి సారి నాకు వారి భర్తల పైన జాలి కలుగుతుంది. కాని ఇలాంటి స్త్రీల సంఖ్య పెరగడానికి కారణం రంగు రూపం నాజూకుతనం పట్ల సమాజానికున్న అభిప్రాయాలే అన్నది గుర్తించవలసిన ఓ సత్యం. నాగరిక కుటుంబాలన్నీ కూడా ఇలాంటి స్త్రీలను తయారు చేస్తున్నవే. ఆధునికులం అనుకునే భర్తలు ఇలాంటి పేరాసెట్ భార్యలను భరిస్తున్న వాళ్ళే. ఎవరికీ పనికి రాని ఈ నాజూకు రాణులను ఈ సమాజమే తయారు చేస్తుంది. వీళ్ళంతా నగరంలో పెరిగుతున్న చదువూ, నాగరికతకు ఆనవాళ్ళు.

నల్లగా నిగనిగలాడే స్త్రీలు, వారి కళ్ళల్లో ఆ మెరుపు, ఎటువంటి కష్టానైన్నా ఎదుర్కొనే ధైర్యవంతులు, వారి కళ్లల్లో కనిపించే సవాళ్ళు, ఇవి నాకు చాలా ఇష్టం.

శ్రమను నమ్ముకున్న స్త్రీలలో చూడండి కనిపించే ఆ అత్మవిశ్వాసం

శ్రమపడే స్త్రీలను చూడండి. వారిలో ఉండే ఆత్మవిశ్వాసం ఎంతమంది నాగరిక స్త్రీలలో ఉంటుంది? విశ్వనాధుని కిన్నెరసాని, నండూరి ఎంకి ఒకప్పుడు తెలుగువారందరికి తెలుసు. శ్రమను గౌరవించి, అది జీవితంలో ఓ భాగం అనుకునే స్త్రీల నడుమ పుట్టిన పాత్రలు అవి. ఎప్పుడు ఆ నాటి స్త్రీ నాయికలు ఇప్పటి నాజూకు నాగరికులుగా మారారో మరి నాకు అర్ధం కాదు. ‘ఆడుతు పాడుతు పని చేస్తుంటే’ అంటూ మగవానితో సమానంగా ఒకప్పటి సినీ హీరోయిన్లు శ్రమపడుతూ కనిపించేవాళ్ళూ, అంట్లు తోమేవాళ్ళు పిండి రుబ్బేవాళ్ళూ, ఒడ్లు దంచేవాళ్ళూ, దేనికీ భయపడేవాళ్ళు కాదు. (అంటే ఇప్పుడు స్త్రీలను అవన్నీ చేయమని అడగడం నా ఉద్దేశం కాదు. కనీసం తమ బరువు తమను మోసుకొమ్మని అడగడం) మరి ఆ స్త్రీలందరూ మాయమయి. ఓ చిన్న హాండ్ బాగ్ భుజాల చుట్టూ తిప్పి వేసుకునే నాజూకు నారీమణూలెప్పుడు పుట్టుకు వచ్చారో, వీళ్లు సమాజానికి ఏం మేలు చెస్తారో మరి ఈ తరమే చెప్పాలి. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అనే దిశగా ప్రయాణించవలసిన సమాజం ఎక్కడికి చేరుకుంటుంది.

ఇలాంటి నాజూకు ఆధునిక స్త్రీల సాన్నిహిత్యం నాకు ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది. ఆ పల్లెటూర్లలో మగవానితో సమంగా ఒళ్ళు వంచి పని చేసే ఆడవాళ్ళూ, తెల్లటి తెలుపుకు చొంగ కార్చకుండా శ్రమతో నల్లగా నిగనిగలాడే స్త్రీలు, వారి కళ్ళల్లో ఆ మెరుపు, ఎటువంటి కష్టానైన్నా ఎదుర్కొనే ధైర్యవంతులు, వారి కళ్లల్లో కనిపించే సవాళ్ళు, ఇవి నాకు చాలా ఇష్టం. వారిని చూసినప్పుడు ఆడతనాన్ని చూసిన ప్రేమ కలుగుతుంది.

చదువు లేని కష్టజీవులైన పల్లెటూరి సామాన్య స్త్రీలను. ఇలాంటి నాగరిక స్త్రీలను చూసిన తరువాత చూసినప్పుడు నాకు వారిలో ఓ వింత అందం కనిపిస్తుంది. అలాంటి సందర్భాలలో అబ్బూరి చాయాదేవి గారి “బోన్సాయ్ మొక్క” కథ గుర్తుకు వస్తుంది.

ఈ బోన్సాయ్ మొక్క ఎంతమందికి నీడనివ్వగలదు

నా రంగుని విమర్శించిన వాళ్ళు, నన్నో బండదానిగా చిత్రీంచిన వాళ్ళు ఇప్పటికీ పారసెట్లుగా సెటిల్ అయిపోయారు. విపరీతమైన అభద్రతా భావం వాళ్లలో ప్రతి స్టేజీలో కనిపిస్తూ ఉంటుంది. భర్త సొంత తల్లి తండ్రులతో చనువుగా ఉన్నా కూడా భరించలేనంత అభద్రతా భావం వారిలో నిండి ఉంటుంది. వారి తెల్లని శరీరాల నుండి ప్రతి క్షణం ఇన్సెక్యూరిటితొ కొట్టూకునే గుండే కనిపిస్తూనే ఉంటుంది. చదువు లేని కష్టజీవులైన పల్లెటూరి సామాన్య స్త్రీలను. ఇలాంటి నాగరిక స్త్రీలను చూసిన తరువాత చూసినప్పుడు నాకు వారిలో ఓ వింత అందం కనిపిస్తుంది. అలాంటి సందర్భాలలో అబ్బూరి చాయాదేవి గారి “బోన్సాయ్ మొక్క” కథ గుర్తుకు వస్తుంది.

నిటారుగా నిలిచే వటవృక్షాలు ఇదిగో ఇలా నిలువెత్తు ఆత్మవిశ్వాసంతో ఉంటారు

మేము అందమైన వాళ్ళం కామని ఇతరుల నుండి అవమానాలను పొందాం. కాని వాటిని పట్టించుకోక శ్రమనే ప్రేమించి ముందుకు నడిచాం. ఇప్పుడు వృక్షాలమై మరికొందరికి చేయీతనిచ్చే స్థితిలో మీ ముందు నిలబడి ఉన్నాం. మరి మా చుట్టూ ఉన్న బోన్సాయి మొక్కలను చూసి అవి అందమైనవి అంటే ఎలా ఒప్పుకుంటాం. ఓ చిన్న గాలి వానకే అల్లాడి పోయే బోన్సాయి మొక్క ఎంత అందమైనదైనా దాని ఉపయోగం ఎవరికని?

ఓ నల్ల పిల్లగా పది మందితో మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని, వ్యంగ్యోక్తులు ఎదుర్కున్న నేను ఆ తెల్లటి రంగున్న అందమైన వ్యక్తుల మధ్య నాదైన అందంతో ఎదిగాను అని గర్వంగా చెప్పగలను. చాలా మందికి అందమైన స్త్రీగానే నేను గుర్తుండిపోతాను అని కూడా నిస్సంకోచంగా చెప్పుకుంటాను. అందం అన్నది ఎవరో కౌన్ కిస్కా గాళ్ళు పెట్టిన కొలబద్ద కాదు. మన కుటుంబమయినా సరే మనలను క్రిందకు లాగే అవకాశం వారికి మనం ఇవ్వకూడదు. అందం అంటే మనకు మనం నిర్దేశించుకున్న మన జీవిన శైలి. ఇది నా జీవితాన్ని నడిపించిన ఫిలాసఫీ.

ఈ విషయం నా లాంటి అనుభవాలున్న వారందరికీ అర్ధం కావాలి. తెల్ల రంగున్న వాళ్ళ వద్ద ప్రత్యేకంగా దొరికే ఆనందకరమైన క్షణాలు ఏవీ ఉండవని, అందమన్నది ఒకరి వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుందని, శరీరపు రంగు, అసహజమైన నాజూకుతనం జీవితాలను నడిపించవని తెలుసుకుని ముందుకు సాగినప్పుడే మీరెంత ఉన్నతంగా ఎదిగారో మీకే అర్దం అవుతుంది. అందుకే మిమ్మలను రంగు పేరుతో, శరీరం బరువు పేరుతో, ఎవరన్నా తక్కువ చేసి చూస్తే వారి మాటలను నమ్మకండి. వారిని గెలవనీయకండి. ఒక్క సారి బలహీనులమయ్యామా, ఓడిపోతాం, మన చుట్టూ ఉన్న వాళ్ళూ ఆ ఓటమిని ఆనందిస్తారు. వారికి ఆ ఆనందాన్ని ఇచ్చే ప్రయత్నం చేయకండి.

నేను పాఠాలు చెప్పే పిల్లలో కొంత మంది బులీమియా తో బాధపడుతున్నారు. వీరు ఆకలికి తాళలేక కొంచెం అన్నం తింటారు. తరువాత లావయిపోతాం అనుకుని అది వాంతి చేసుకుంటారు.

చాలా సంవత్సరాలుగా నా లాంటి స్త్రీలు మా రంగుపై రూపంపై వచ్చే కామెంట్లకు ధీటూగా మా పనులతో, మా వ్యక్తిత్వంతో జవాబిస్తూ పోరాడాం. కాని ఇప్పటి తరాన్ని చూస్తే ఏమి అనాలో తెలీయట్లేదు. నేను పాఠాలు చెప్పే పిల్లలో కొంత మంది బులీమియా తో బాధపడుతున్నారు. వీరు ఆకలికి తాళలేక కొంచెం అన్నం తింటారు. తరువాత లావయిపోతాం అనుకుని అది వాంతి చేసుకుంటారు. ఎందుకంటే అందంగా ఉండడం అంటే వీరి దృష్టిలో సన్నగా నాజూకుగా ఉండడం. తెల్లగా ఉండడానికి మినరల్ వాటర్ తో ముఖాలు కడుక్కుంటారు. కడుపుకు తిండి లేకపోయినా ముఖానికి క్లీనింగులు, ఐబ్రోలు చేసుకుంటూనే ఉంటారు. అలాంటి స్టూడెంట్లకు నేను ఎప్పుడూ ఇదే చెబుతాను, ఆ తెల్ల రంగు నా జీవితంలో నాకిచ్చిన గొప్ప సుఖం ఏం లేదు. నా నలుపు రంగు నాకు తీసుకొచ్చిన కష్టం ఏమీ లేదు. మన సుఖం దుఖం మన ఆలోచనల నుండే పుడతాయి. నన్ను నేను సంపూర్ణంగా ప్రేమించుకుంటాను. నా శరీరపు రంగుతో నా కళ్ళ క్రింద ఎప్పుడూ ఉండే ఈ నల్ల చారలతో నేను చాలా అందంగా ఉన్నాను, అందంగా జీవిస్తున్నాను. మరి మీకెందుకు అది సాధ్యం కాదు!

రచయిత్రి పి. జ్యోతి హిందీ ఉపన్యాసకులు. చక్కటి సమీక్షకురాలు. హైదరాబాద్ లో పుస్తకాల పట్ల అభిరుచి పెంచడంలో విశేషంగా కృషి చేస్తున్న spreading Lights నిర్వాహకురాలు కూడా. పుస్తకం, సినిమా తనకు రెండు కళ్ళు. ప్రపంచానికి గవాక్షాలు. ఇటీవలే వీరు రచించన దిలీప్ కుమార్ సినిమాల సమగ్ర పరిచయ పుస్తకం కోసం ఈ లింక్ క్లిక్ చేసి తెప్పించుకోవచ్చు.

కాగా, తెలుపు కోసం రాస్తున్న ఈ శీర్షికలో తాను మొదటిసారిగా అంతర్ముఖంలోకి చూసుకుంటున్నారు. జీవితాన్నే పుస్తకంగా అనుభవాలనే చలన చిత్రంగా ఎంచి సరళమూ, నిరాడంబరమూ, సామాన్యమూ ఐన జ్ఞాపకాలను ఆత్మీయంగా పంచుకుంటున్నారు. ఈ శీర్షికలో మొదటి వ్యాసం మనసు పొరల్లో. రెండో వారం చిన్ననాటి చిరుతిళ్లు. మూడో వారం చిన్ననాటి సంగతులు. నాలుగో వారం పంచుకోవడంలో అనందం. ఐదో వారం ఒంగోలు గిత్తలు ….మా తాత. ఆరో వారం ‘చందమామ’తో మొదలు.  ఏడో వారం ఎవరు రౌడీలు? ఎవరు మర్యాదస్తులు??. ఎనిమిదో వారం నాకు తెలిసిన స్త్రీ వాది – My First Feminist. తొమ్మిదో వారం ఆ మూమెంట్ గోదావరి లాంటిదే. పదోవారం నేను వెతుకుతుంది గురు దత్ లాంటి స్పందించే హృదయాన్ని. మీరు చదువుతున్నది పదకొండో వారం జ్ఞాపకాలు.

More articles

6 COMMENTS

  1. Vyakthi color ni batti vaalla vaalla vyaktitvanni anchana veyadam.. vaallki leni sugunaalani.. aapadinchadam mana samaajamlo yeppatinunchoo vundi.. Aala velethhi choopadam valla aatmanyunathatho.. venukabadipoyinavaallu..balipashuvulugaa marinavaalu endaroo.. alaage meela aatmavishvaasamtho.. niladokkukuni.. veduti vaalu visirina raallani metlugaa malachukuni yedigi paikochinaa vaallu marendaroo.. meeku abhinandanalu.. meeru raasina prathi vvakyamlo meeru prayhibimbistharu.. keep it up Jyothi garu..👏👏👍👍..

  2. చాలా బాగా మీ అనుభవాలను,వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు

  3. చక్కగా చెప్పారు. ఏది అందం, ఏ రంగు అందం అనేవి మనకు కళ్ళకు కట్టిన రంగుటద్దాల వల్ల మాత్రమే.
    రంగు పట్ల చూపించే వివక్ష, అవమానాన్ని దాటుకుని మీలా ఎంతమంది ఎదుగుతారు. నల్లరంగు వున్నవారు కూడా ఎంతోమంది తెల్లరంగును ఇష్టపడడం, దానిపట్ల మక్కువ పెంచుకోవడం, తెల్ల రంగువారిని ఆరాధనగా, అదృష్టవంతులుగా చూడడం చేస్తారు. మన మైండ్‌సెట్ మారాలి.

  4. As a fair, non-Brahmin girl who had to repeatedly explain to strangers that my color is an “aberration”, I saw the ugliness of color politics in our society. I can deeply empathize with the authors personal experiences. Her grit as she navigated and rised above them are commendable.
    That said, is there wisdom in subscribing to another stereotype? Parasitic, dependent women is how she categorizes and generalizes the other camp. Although I identified a lot with her independence and self-reliance, and pleasantly surprised to know that she seems to have grown up just like me, (quite a rare breed it seems as we rarely do hear as many narratives such as this), her conclusions about their shallowness and superficiality are a reflection of the depth that she freely ascribes to them. I am sorry to see that.
    Going through such hardships comes at a cost. Rising against the tide is a tiring and exhausting battle everyday and we all can do well without such labels and prejudices. I wish she would take a deep and empathetic look at what these labels do each of us, irrespective of which side of the camp one identifies with.
    I request the author to please consider researching the reasons behind bulimia and body shame that she mentions in this article. She may be surprised to find these modern ailments are also a consequence of same conditioning and prejudices that she has been a subjected to. The bone she picked with the “parasitic women” does no credit to her intelligence.

    Let me end it by quoting Brooke Hampton ” admire other people’s beauty with our questioning your own” and by extension vice versa.

  5. As a fair, non-Brahmin girl who had to repeatedly explain to strangers that my color is an “aberration”, I saw the ugliness of color politics in our society. I can deeply empathize with the authors personal experiences. Her grit as she navigated and rised above them are commendable.
    That said, is there wisdom in subscribing to another stereotype? Parasitic, dependent women is how she categorizes and generalizes the other camp. Although I identified a lot with her independence and self-reliance, and pleasantly surprised to know that she seems to have grown up just like me, (quite a rare breed it seems as we rarely do hear as many narratives such as this), her conclusions about their shallowness and superficiality are a reflection of the depth that she freely ascribes to them. I am sorry to see that.
    Going through such hardships comes at a cost. Rising against the tide is a tiring and exhausting battle everyday and we all can do well without such labels and prejudices. I wish she would take a deep and empathetic look at what these labels do each of us, irrespective of which side of the camp one identifies with.
    I request the author to please consider researching the reasons behind bulimia and body shame that she mentions in this article. She may be surprised to find these modern ailments are also a consequence of same conditioning and prejudices that she has been a subjected to. The bone she picked with the “parasitic women” does no credit to her intelligence.

    Let me end it by quoting Brooke Hampton ” admire other people’s beauty with our questioning your own” and by extension vice versa.

    • Please add the correction ” among several other factors, these modern ailments are also a consequence of same conditioning and prejudices that she has been a subjected……”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article