Editorial

Monday, December 23, 2024
కాల‌మ్‌నా ఇల్లు : పి. జ్యోతి తెలుపు

నా ఇల్లు : పి. జ్యోతి తెలుపు

తెలుగు సాహిత్యంలోకి ఇప్పటిదాకా స్త్రీలు రచించగా వచ్చిన రచనలు వేరు. ఈ రచన వేరు. భద్ర జీవితపు గుట్టును రట్టు చేస్తూ ఒక కాంతి వలయంలా మనల్ని చుట్టి ముట్టేసే పి.జ్యోతి రచనలు పూర్తిగా భిన్నం. ఆవిడ తన మనసు పొరల్లోంచి ఒక్కో భాగం ఆవిష్కరిస్తున్న ఈ వ్యాస పరంపర తెలుగునాట ఒక ఒంటరి మహిళ జీవిత చరిత్రగానే ప్రత్యేకం కాదు, అది మన కుటుంబ వ్యవస్థలోని నిశ్శబ్ద హింసను వెల్లడిస్తుంది. అది సంఘంలో అడుగడుగునా ఎలా వ్యాపించి ఉన్నదో చూపుతుంది. ఆ పితృస్వామ్యం తాలూకు ఆధిపత్యం స్త్రీల జీవితాల్లోకి సైతం ఇంకి వాళ్ళూ తోటి స్త్రీలను హింసించే విధానాన్నీ ఆవిష్కరిస్తుంది. ఐతే ఇదంతా భాదితురాలిగా కాదు, ఎదురీదే వ్యక్తిగా చెప్పడం విశేషం. ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త వివక్షలను ఖండించే ఒంటరి మానవిగా, తానే దీపంగా వెలిగే జ్యోతి రచనలు విశిష్టమైనవి.

ఈ వారం చదవండి. ‘ఇంటికి దీపం ఇల్లాలు’ అన్న ధోరణికి భిన్నంగా తన జీవితానికి తానే చేతులడ్డు పెట్టుకుని, తనను తాను కాపాడుకున్న ఇంటి యజమానిగా వారి మనోగతం.

పి.జ్యోతి

నా ఇల్లంటే నాకు చాలా యిష్టం. ఇందులో ఏం కొత్త విషయం ఉంది. అందరికీ వారి వారి ఇళ్లంటే ఇష్టమే కదా అనొచ్చు. కాని అందరి స్త్రీల కన్నా నా యిల్లంటే నాకున్న ఇష్టం చాలా ప్రత్యేకం. నా యిల్లు నా అస్థిత్వం. దానికి ప్రాణం లేకపోవచ్చు. కాని అదే నా జీవితంలో నేను సాధించిన పెద్ద విజయం. నా ఆర్ధిక ఉన్నతినో, గొప్పతనాన్నో చూపడానికి నా యిల్లు ప్రస్తావన నేను తీసుకు రావట్లేదు. ఓ మధ్యతరగతి స్త్రీని నేను. నా ఇల్లు అదే బాపతు. కాని అదంటే నాకు చాలా చాలా యిష్టం. ఆ నాలుగు గోడల మధ్య ఉండడం నాకు గొప్ప ప్రశాంతతను ఇస్తుంది. నన్ను నేను ఈ ఇంట్లో చూసుకుని గర్వపడతాను. ప్రపంచంలో ఇంకెక్కడికీ వెళ్లాలని అనిపించనంత ఇష్టంగా ఈ ఇంట్లో గడుపుతాను.

అలాగని నాదో పెద్ద ఇంధ్ర భవనం కాదు. మార్బిల్ ప్లోరింగులు, అల్ట్రా మాడరన్ ఫర్నిషింగులు లేవు. ఓ సారి వెనుక తలుపు వేయకుండా ముందు తలుపుకు తాళం వేసుకుని కాలేజీకి వెళ్ళిపోయాను. తిరిగి వచ్చి నా పొరపాటు తెలుసుకుని టెన్షన్ పడిపోయాను. అది చూసి నా కుమారుడు గేలి చేస్తూ “ఏం ఉంది అమ్మా నీ ఇంట్లో, అలమారలో చీరలు, ఇంటి నిండా పుస్తకాలు, ఎవరికీ అర్ధం కాని పెయింటింగులు. ఇల్లు తెరిచి పెట్టి పోయినా నీ ఇంట్లోకి దూరిన దొంగకు కూడా పనికి వచ్చేది ఏదీ దొరకదు. ఇప్పుడు నీ టైపు చీరలు కట్టేవాళ్లు ఎవరూ లేరు. ఈ పుస్తకాలు ఎవరికీ అక్కర్లేదు. దానికి రోజూ తాళం వేసుకోవడం అనవసరం” అన్నాడు. నిజమేనేమో… అయినా ఎవరికీ పనికిరాని వస్తువులతొ నిండి ఉన్న నా ఇల్లంటే నాకు చాలా చాలా ఇష్టం.

ఈ ఇంటి వరకు చేరిన నా జీవితంలో, ఎన్నో నిరాశలు, భగ్న ప్రేమలు ఉన్నాయి. ఎన్నో గాయాలున్నాయ్.

ప్రాణం లేని వస్తువుల పట్ల అతి ప్రేమ ఉండడం, లేదా ఇదుగో ఇది నాది అని తమ తాహతు కోసం ప్రదర్శనకు వస్తువులను పెట్టుకోవడాన్ని నేను ఎప్పుడూ విమర్శిస్తాను. కాని నా యింటి పై నాకున్న ప్రేమ, ప్రదర్శనకు సంబంధించింది కాదు. దాని వెనుక నాది అంటూ ఎవరూ లేని, ఏది లేకుండా జీవించిన రెండున్నర దశాబ్దాల నా ఒంటరితనాన్ని దాటిన నా ధైర్యం ఉంది. నన్ను నేను మలచుకుంటూ, మార్చుకుంటూ, ఆ దారిలో ఎన్నో అపజయాలను, గాయలను ఎదుర్కొంటూ, ఒక్కొక్కరిని, ఒక్కొక్క దశను కాలానికి వదిలేసి ప్రయాణించిన నా జీవితం ఉంది. ఈ ఇంటి వరకు చేరిన నా జీవితంలో, ఎన్నో నిరాశలు, భగ్న ప్రేమలు ఉన్నాయి. ఎన్నో గాయాలున్నాయ్. రక్తం ఓడుతున్న మనసుతో ఈ ఇంటి దాకా చేరుకుంది నా శరీరం. అందుకే ఈ యిల్లు నా విజయానికి చిహ్నంగా భావిస్తాను. ఎన్నో కోరికలను, ఆశలను ఒక్కొక్కటిగా వదిలించుకుంటూ నేను కేవలం నేనుగా మిగిలి, చేరుకున్న గూడు ఇది. అందుకే నా యిల్లు అంటే నాకు చాలా ఇష్టం. ఈ ప్రపంచంలో నాకు ఏ చోటూ లేకుండా చేసిన మనుష్యుల మధ్య నా చోటుగా ఇది నిలిచి నాకో అస్థిత్వాన్ని ఇచ్చిందని ఈ ఇంటి పట్ల నాకు అమితమైన ప్రేమ.

ఇల్లంటే నాలుగు గోడలు కాదు నలుగురు మనూష్యులు అన్న మాటను నిజం అనుకునే చాలా రోజులు జీవించాను. అదే నిజమని నమ్మడానికి ప్రయత్నించాను. కాని ఆ నలుగురు మనుషులతో పాటు ఎన్నో అహంకారాలు, మోసాలు, అధికార దాహాలు, అణచివేతలు ఇంటి చుట్టూ ఉంటాయని అర్ధం అయిన తరువాత, ఇంటి పేరు మీద అధికారం, ఆర్ధిక భద్రతతో కూడిన అహంకారం, ప్రాముఖ్యతలను అనుభవిస్తూ అందులోకి నన్ను రానివ్వలేని వ్యక్తుల మధ్య ఓ పోటీదారిగా ఉండలేకపోయాను. తమ స్థానాలు సుస్థిరం చేసుకోవడం కోసం, మనుష్యులు జరిపే అంతర్గత యుద్దాలు, వాటి వెనుక రాజకీయాలను గమనించిన తరువాత, వాటి మధ్య పోటీ పడి నిలబడలేని నా చేతకానితనం నాకు మరో మనిషి లేని నాలుగు గోడల పట్ల ప్రేమను కలిగించింది. ముఖ్యంగా ఆ ఎవరూ లేకపోవడంలోనే ఓ నిశ్చింతతను అనుభవించడం నేర్పింది. ముఖ్యంగా ఓ ఇంట్లో ఉండే అందరిని ఒకే తీరున ప్రపంచం చూడదని, మన యింటికి వచ్చే స్నేహితులు, బంధువులు, ఆ ఇంటి అధికారిగా ఎవరిని చూస్తారో, అలా ఆ ఇంట్లోని ఇతరులను చూడరని, గౌరవించరని, ఆ ఇంట ఆధారపడి జీవిస్తున్న ఇతరుల పట్ల చూసే విధానంలో ఓ వివక్ష ఖచ్చితంగా ఉంటుందని గమనించాను.

ఇంటి యజమానికి ఓ ఆర్ధిక తాహతు ఉండాలి. ఇంటి సభ్యులపై వారికి కంట్రోల్ ఉండాలి. ఆ ఇంటిలోని ప్రతి విషయం పట్ల వారి నిర్ణయాధికారమే ఉండి తీరాలి. ఇంట్లో ఉండే పెద్దవారికి వారి వయసు పెరుగుతున్న కొద్దీ ఆ యింటిపై అధికారం సన్నగిల్లుతూ ఉంటుంది. అందువలన వారిలో ఓ అభద్రతా భావం, తమ పూర్వ స్థానం కోసం తాపత్రయం, మొదలవుతుంది. అప్పటిదాకా యజమాని స్థానంలో ఉండి ఇప్పుడు సాధారణ సభ్యులుగా మారిపోవడానికి వారి మనసు సంఘర్షణను అనుభవిస్తుంది. తమ స్థానాన్ని కాపాడుకోవడానికి వారికి తెలియకుండానే ఓ యుద్దం మొదలవుతుంది. దీని ప్రభావం ఇతర సభ్యులపై పడుతుంది.

నాలాంటి భర్త లేని స్త్రీలు ఈ యుద్దంలో మొదటి టార్గెట్ అవుతారు. మారుతున్న ఈ ఈక్వేషన్లతో ఆ ఇంట మా స్థానం దిగజారిపోతూ ఉంటుంది. మా పిల్లలకు ఇది అర్ధం అయి మా పట్ల ఓ చులకన భావం పెరిగిపోతుంది. మా పై వాళ్లు అప్పర్ హాండ్ తీసుకుంటూ ఉంటారు. అది వారికి ఓ పెద్ద విజయంగా కనిపించి ఆ పై చేయిని ప్రతి సందర్భంలోనూ మా పై ప్రదర్శిస్తూ ఉంటారు.

ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు, హితులు, ఆ యింటి యజామానికి, అతను ఆధారపడే వాళ్లకి ఇచ్చే గౌరవం అదే ఇంట్లో ఉండే ఇతర సభ్యులకు ఇవ్వరు.

మరో తరానికి ప్రతినిధులయిన ఈ పిల్లల పట్ల ఆ ఇంట అందరికీ ప్రేమ ఉండే ఉంటుంది. కాని ఆ పిల్లల్లో మా లాంటి తల్లుల పట్ల కలిగే ఆ చులకన భావాన్ని ఏ మాత్రం ఆలోచన లేకుండా పోషిస్తూ ఉంటారు ఇతర కుటుంబ సభ్యులు, ఆ ఇంటితో సంబంధం పెట్టుకునే బంధువులు, స్నేహితులు, అటు యజమాని స్థానంలోని వ్యక్తులకు మేం పరిగణించవలసిన వ్యక్తులం కాము. మా తరువాతి తరానికీ ఏ మాత్రం ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరం లేని వ్యక్తులుగా మిగిలిపోతాం. అన్ని రకాల మర్యాదలు మనుష్యుల అవసరాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఆ ఇంటికి వచ్చే బంధువులు, స్నేహితులు, హితులు, ఆ యింటి యజామానికి, అతను ఆధారపడే వాళ్లకి ఇచ్చే గౌరవం అదే ఇంట్లో ఉండే ఇతర సభ్యులకు ఇవ్వరు. పైగా ఓ చులకన భావం వారిలో నిత్యం కనిపిస్తూ ఉంటుంది. ఇది మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది. ఇలా కొన్నాళ్లు బతికిన ఒంటరి స్త్రీలు ఏవో కొన్ని కారణాలకు, మర్యాదలకు లొంగిపోయి ఈ మర్యాద లేని జీవితాలను జీవించడం తప్ప మరో దారి లేని స్థితికి చేరుకుంటారు. ఏదో రకంగా పిల్లలు సెటిల్ అయితే చాలు. నలుగురు అండ నాకు లేకపోతే ఎలా? అంటూ వారిలోని అభద్రతా భావానికి తల వంచుతారు. మరి నాలాంటి మొండి వాళ్ళు, ప్రశ్నించడం తమ హక్కుగా భావించేవాళ్ళు, మనిషిగా, స్త్రీగా నాకు చెందవలసిన గౌరవం నాకు దక్కవలసిందే అని అనుకునే వారు ఇలాంటి పరిస్థితులకు ఎదురు తిరుగుతారు. ఫలితం ఘర్షణ.

ఈ ఘర్షణలో తమలోని కాంప్లెక్సులను అధికార పక్షంలో వాళ్లు ఒప్పుకోరు. పైగా లభిస్తున్న సౌకర్యాలకు కృతజ్ఞత చూపలేని హీనులుగా నా లాంటి స్త్రీలను పరిగణిస్తూ ఉంటారు. దానితో మా తరువాతి తరం మమ్మల్ని దోషులుగా నిర్ణయించేసుకుంటుంది. వ్యక్తులుగా గౌరవించని ఆ మన వారి మధ్య నా పరిస్థితి ఇది కదా, నేను ఒంటరి ఆడదాన్ని కదా సర్దుకుపోయి, కళ్లు చెవులు మూసుకుని జీవించడం నా అవసరం కదా అని ఒప్పుకోలేని నా లాంటి స్త్రీలను ఎవరు మాత్రం సమర్ధించగలరు? ఒంటరి స్త్రీ అంటే అన్నిటినీ మౌనంగా భరించాలి. అస్థిత్వం కోసం ఆమెకు పోరాడే హక్కు మాత్రం ఎందుకుంటుంది అన్న భావన అందరితోపాటు ఇంటివారిది కూడా అవుతుంది. దీనికి ఎవరినీ తప్పుపట్టలేం. స్త్రీ పట్ల ఉన్న భావాలు, స్త్రీ వైవాహిక స్థితి ఆధారంగా మాత్రమే ఆమెకు ఈ పితృస్వామ్య వ్యవ్యస్థలో లభించే గౌరవం, ఆమెను మనిషిగా పరిగణించే విషయంలో ప్రతి ఒక్కరి మెదళ్ళపై, మనసులపై నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ వ్యవస్థలో భాగస్తులే. తమకి తెలియకుండా ఆ వ్యవస్థకు పోషకులుగా మారిపోతారు.

నేను మా కుటుంబంతో కలిసి ఉండేటప్పుడు కొన్ని సంఘటనలు గమనించాను. మా నాన్న, అన్నగార్ల సోషలిస్టిక్ నేపద్యాన్ని ఒంటపట్టించుకుని జీవించడం నాకు అలవాటయ్యింది. అసలు వారి పెంపకంలోనే నా మొండి స్వభావం ఏర్పడింది. దీనికి వారికెప్పుడూ కృతజ్ఞత చూపుతూనే ఉంటాను. కాని వారిని ప్రశ్నించే గుణం కూడా ఈ మొండి తనం లోనించే వచ్చింది. ఆ ఇద్దరు కూడా ఇంటి తలుపులను స్నేహితులకు, బంధువులకు, ఓ రకంగా సమాజానికి ఎప్పుడూ తెరిచే ఉంచారు. ఆ ఇంటికి ప్రతి రోజు పదుల సంఖ్యలో ఎవరో ఒకరు రావడం నా చిన్నప్పటి నుండి నాకు అలవాటయిన విషయమే. కాని అలా వచ్చే వ్యక్తుల ఆలోచనల స్థాయిలో మాత్రం నా చిన్నతనం నుండి గమనిస్తే ఈ నాటి వరకు చాలా మార్పు ఉంది. రాను రాను అతి సంకుచితమైన వ్యక్తులకు ఆ ఇల్లు ఆవాసంగా మారడం నాకు అర్ధం అవుతూనే ఉంది. మజ్జిగ నీళ్లు, రొట్టే ముక్కలు మాత్రమే దొరికే సమయంలో ఆ యింటికి వచ్చిన వారికి, ఇప్పుడు క్షణాలలో యిష్టమైన తిండి సిద్దంగా ఉంచగలిగే తాహతుకు చేరిన ఆ కుటుంబంలోకి వచ్చేవారికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. కొందరు ఆ రోజుల నుండి మా యింటికి వస్తూ ఉన్నవారే. కాని వారి ఆలోచనలలో చాలా మార్పు వచ్చింది.

మెల్లగా ఆ ఇంట నా ఉనికే లేనట్లుగా అందరూ ప్రవర్తించడం మొదలయింది.

ఒకప్పుడు ఇంటి పెద్దగా మా నాన్నగారికి మా యింట్లో ముఖ్యమైన స్థానం ఉండేది. ఆయన రిటైర్ అయి మా అన్న ఆ స్థానంలోకి వచ్చాక ఇంటికి వచ్చేవారి ప్రేమలు, ప్రాముఖ్యతలు, అన్నవైపు మళ్లాయి. ఎంతలా అంటే మా నాన్నగారు అక్కడే కూర్చుని ఉన్నా ఆయనను దాటుకుని అన్నను వెతుక్కుని వెళ్లిపోతారు ఆ బంధుజనం, స్నేహితులు అందరూ కూడా. ఇక మీతో మా అవసరం ఏమిటి అన్న ఓ భావాన్ని నాన్నగారి ముఖం ముందే వాళ్లు ప్రదర్శించేవాళ్ళు. మా అన్నకు, నాన్నకు మధ్య పెద్దగా దాపరికాలు ఉండవు. కాని వీరి ప్రవర్తనతో నాన్నగారిలో పెరిగిన ఓ అభద్రతా భావాన్ని అది ఆయనను తినేసిన విధానాన్ని నేను నిశితంగా గమనించాను. మా నాన్నగారి సహాయంతో ఎదిగిన కుటుంబంలోని వ్యక్తులు, ఆయన ద్వారా లాభపడిన వ్యక్తులు కూడా ఆయనను పక్కకు తోసి అన్నతో దగ్గరితనాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించడం నాన్నను మానసికంగా ఒంటరిని చేయడమే. పక్కన కూర్చుని బాగోగులు చర్చిస్తూ ఆయన పెద్దరికానికి విలువ ఇచ్చే అవసరం కూడా ఆ వ్యక్తులకు ఇప్పుడు కనిపించదు. ఈ మానవ నైజాన్ని ఒప్పుకుని ఈ జీవితానికి మా నాన్నగారు అలవాటు పడే క్రమంలో ఆయన తడబాటు, బాధను నేను స్పష్టంగా గమనించాను.

ఇదే పరిస్థితి మా అమ్మకు, వదినకు ఇచ్చే గౌరవంలోకూడా వాళ్లు చూపించడం మొదలయింది. ఆ సమయంలో అనుకోకుండా రెండు వంట గదులు మా ఇంట్లో మొదలయ్యాయి. ఒకే సమయంలో అందరూ భోజనం చేసే పరిస్థితులు ఇంట్లో ఉండేవి కావు. అందుకని నిర్ణయించుకుని రెండు పొయ్యిలపై వంట చేసుకోవడం మొదలయ్యింది. ఇది ఆ ఇద్దరు ఆడవారికీ మంచే చేసింది. రెండు వంట గదులవ్వడం వలన ఎవరి వంట గదిపై అధికారం వారిది. కలిసి కూరలు మార్చుకోవడం, ప్రతి రోజు అక్కడి గిన్నె ఇక్కడకు, ఇక్కడి గిన్నె అక్కడకు చేరడం మామూలే కాని ఎవరి స్పేస్ వారికి లభించింది. దాంతో నాన్నగారు బాధపడినంతగా మా అమ్మ ఆ వెలితిని అనుభవించవలసిన అవసరం లేకుండా పోయింది. ఆమె దగ్గరకు, ఒదిన దగ్గరకు వెళ్ళి కలిసే వారు, వారి వారి పరిచయాలను బట్టి వారితో సమయం గడిపేవారు. ఈ విడి వంట గదుల వలన ఎవరి ప్రాముఖ్యతను వాళ్ళు నిలుపుకునే అవకాశం వారికి దక్కింది. అందువలన అమ్మ, నాన్న అనుభవించినంత ఎక్కువగా ఈ మార్పును ఫీల్ అవలేదు.
మారిన మా నాన్నగారి స్థితి వలన వచ్చిన తేడాను ముందుగా అనుభవించింది నేను. చెల్లెలు భర్తతో ఉంటుంది కాబట్టి ఆమెకో సెపరేట్ ప్రపంచం, ఐడెంటిటీ ఉంది. ఆమెకు భర్త ద్వారా వచ్చే గృహిణి గుర్తుంపు వలన ఆమెను పరిగణించవలసిన అవసరం బంధువులకు ఉంది. కాని నేను ఆ తండ్రి కూతురునే తప్ప నాకో ఐడెంటిటీ ఎదీ లేదు. ఆ పెద్దాయన అవసరం ఇప్పుడు ఎవరికీ లేదు. వాళ్ల బొంద, వాళ్లిచ్చే ఐడెంటీటీ నాకెందుకు అని కొన్ని సంవత్సరాలు నెట్టేసాను. నిజంగా ఎవరినీ పట్టించుకునేదాన్ని కాను. నా ప్రపంచంలో నేను ఉండే దాన్ని. లేని ప్రేమలను నటించడం నాకు ఎప్పుడూ చేతకాలేదు. కాని మెల్లగా ఆ ఇంట నా ఉనికే లేనట్లుగా అందరూ ప్రవర్తించడం మొదలయింది.

రెండు పెళ్లిళ్లు, ఒంటరి జీవితంలో కూడా నా పద్దతిలో నేను జాం జాం అంటూ తిరుగుతుంటే మరి ఆ ఇంటికి వచ్చే పతివ్రతలకు, పతివ్రతల పతులకు నేను ఎలా నచ్చుతాను. బంధువుల దగ్గరకు వెళ్లి అన్న మీదో, వదిన మీదో, అమ్మ మీదో వాళ్లు వినాలనుకుంటున్న విషయాలను చెప్పి వారి భుజం పై తల పెట్టుకుని ఏడిస్తే వారికి కొంత ఊరట. అది నేను చేయలేను. నా కొడుకు విషయంగా నాకు మొదలయిన సమస్యలను ఎవతోనైనా మనిషిలా పంచుకుందామన్నా ఆ విషయంలో ఎవరికీ పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. వారికి కావలసింది కుటుంబంలో స్త్రీల మధ్య రాజకీయాలను విని సంతృప్తి అనుభవించడం. నాకు తోడుగా, స్నేహంగా ఉండాల్సిన అవసరం వారికి లేదు. పైగా అలా ఉంటే నాకేదైనా చేయవలసి వస్తుందేమో. అందుకని నా అసలు సమస్యలతో ఎవరికీ పని లేదు. నా లాంటి పరిస్థితిలో ఉండే స్త్రీల వద్ద నుండి సాధారణంగా వచ్చే ఎంటర్ టైన్మెంట్ వారికి రాకుండా పోతుందన్న దుగ్ధ మాత్రమే అందరిదీ. వారి ఇంటి పెళ్ళిళ్లకు, ఎవో రక రకాల కార్యాలకు మా అన్న ఒదినల అవసరం ఉంది కాబట్టి అవి వారితోనే చర్చించే వాళ్లు. కనీసం ఓ మంచి కబురు చెప్పడానికి కూడా ఈ ఒంటరి స్త్రీ అవసరం వారికి లేదు అన్నట్టుగానే ప్రవర్తించేవాళ్లు. నా ఉనికి పట్టించుకోవడమే అనవసరం అన్నట్లుగానే మా బంధువులు స్నేహితులు నఢుచుకునేవాళ్లు.

క్రమంగా ఆ ఇంట్లో ఉండే పర్నిచర్ లో నేను ఓ భాగం అయ్యాను తప్ప అక్కడి మనుష్యులలో ఒకదాన్ని అన్న ఫీలింగ్ నాలో కూడా లేకుండా పోయింది. ఆ ఇంట ఏ నిర్ణయాలలో నా ప్రమేయం ఉండదు. ఇంటికి ఎవరు వస్తున్నారో, ఎందరు వస్తున్నారో, ఎందుకు వస్తున్నారో, ఏం జరుగుతుందో ఇవేవి నాకు తెలిసేవి కావు. చెప్పే వాళ్ళు లేరు, చర్చించేవాళ్లు లేరు అసలు అలాంటి చర్చ నాతో చేయాలన్న ఆలోచన ఎవరికీ లేదు. నాతో ఏదన్నా పని ఉంటే ఇదిగో ఇది చేయ్ అని చెప్పడం తప్ప నా ఇష్టాలు, నా ప్రాధాన్యతలు ఎవరికీ ఆలోచించవలసిన విషయాలుగా అనిపించకుండా పోయాయి . చివరకు నేను నా కన్న బిడ్డకు కూడా ఆ ఇంట అలంకారం కోసం పడి ఉన్న ఓ సోఫా సెట్టు లాంటి దానిలాగే మిగిలిపోయాను.

ఇలాంటి వాతావరణంలోనే నా ప్రపంచాన్ని నేను నిర్మించుకున్నాను. నన్ను ఇష్టపడే స్నేహితులను నిలుపుకున్నాను. నా స్టూడెంట్స్ ఎప్పుడు నా చుట్టూ ఉండేవాళ్ళు. నా ఇష్టాలు, నా సాహిత్యం, నా హాబీలు వీటిని నేను నిరాశతో ఎప్పుడూ ఒదులుకోలేదు. ఆ ఇంటిని దాటుకుని నాదైన ప్రపంచాన్ని నేను నిర్మించుకున్నాను. ఎవరికీ తలవంచలేదు. ఎవరి వద్దా పెదవి విప్పి నా మానసిక ఒంటరితనాన్ని పూరించుకోవాలని ప్రయత్నించలేదు. నా పరిస్థితులతో యుద్దం చేయడానికి నన్ను నేను గౌరవించుకుంటూ ఎటువంటి సెల్ప్ పిటీకి లోను కాకుండా జీవించడానికి నాతోనూ చుట్టూ ఉన్నవారితోనూ నేను నిరంతరం యుద్దం చేస్తూనే ఉన్నాను.

నా కుటుంబం నాలోని ఒంటరితనాన్ని ఆర్ధం చేసుకోవాలని మాత్రమే కోరుకున్నాను. వారికి ఆ విషయం పెద్ద ప్రయారిటీగా అనిపించలేదు. ఒకప్పుడు ఈ ఆలోచన నాకు కోపం తెప్పించేది. కాని ఇప్పుడు ఆలోచిస్తే ఈ సిస్టంలో స్త్రీ మానసిక ఒంటరితనం ప్రాద్యాన్యత గల విషయంగా పరిగణించే స్థితి ఎక్కడ ఉంది? ఇది అర్ధం అయినప్పుడు నాకు అందరిపై కోపం పోయింది. ప్రతి ఒక్కరూ ఈ సిస్టంలో బానిసలే. దానికి నా కుటుంబం మాత్రం అతీతం ఎందుకు అవుతుంది? వారు చాలా మంది కన్నా ఉన్నతులు అని చెప్పడానికి నేనే ఒక నిదర్శనం కదా. నా ఆలోచనలు, నా ఆకాంక్షలు అన్నీ ఆ ఇంటి పెంపకం నుండి వచ్చినవే. ఆ ఇంట కాక మరో చోట నేను పెరిగినట్లయితే నేను ఎదుర్కున్న పరిస్థితులలో ఓ వెన్నెముక లేని స్త్రీగా జీవించి ఉండేదాన్ని. అలా కాకుండా ప్రతి దానికి నాదైన ఆలోచనను కలిగి నేననుకున్న దారిలో నేను జీవించగలుగుతున్నానంటే నా బాల్యంలో ఆ యింట నేను అనుభవించిన జీవితం, గడిపిన రోజులు కారణం అన్నది నేను విస్మరించలేని నిజం.

నా కుటుంబం కూడా ఈ సమాజంలో భాగమే. ఎంత ఎదురొడ్డి జీవిస్తున్నా ఒంటరి స్త్రీ పట్ల సమాజ ప్రభావం నుండి వారు మాత్రం ఎలా తప్పించుకుంటారు. పైగా సమాజంలో పూర్తిగా నిమగ్నమై జీవిస్తున్న వ్యక్తులు వారు. ఆ పితృస్వామ్యపు ఆలోచనలు వారికి అంటకుండా ఉంటాయా? అందరిలా కాకపోయినా కొంత సమాజ ప్రభావం వారిపై ఉండి తీరుతుంది.

ది నా ఇల్లు కాదు, మరో ఇల్లేదో నాకున్నది అన్న భావాన్ని ఆ ఇంట్లో అనుభవించాను. అక్కడే నాకు పెళ్లి అయింది.

నా చిన్నప్పుడు మేము ఆలుగడ్డబావి రైల్వే క్వార్టర్స్ లో ఉండేవాళ్ళం. నాకు ఇల్లు అంటే గుర్తుకు వచ్చేది ఆ క్వార్టర్ మాత్రమే. నా జీవితంలో అవి గొప్ప రోజులు. RB II 1206/7 Alugaddabavi, Secunderabad 500017. ఈ అడ్రస్సు నాకింకా గుర్తుందంటే ఆ ఇల్లు నా మనసులో ఎంతగా నాటుకుపోయిందో నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నా ఇప్పటి ఆలోచనలకు బీజం అక్కడే పడింది. అన్నయ్యకు వివాహం చేయాలనుకున్నప్పుడు ఆ ఇల్లు సరిపోదని మెట్టుగుడలో మరో ఇంటికి మారాం. 12-7-2/5/1, Mettuguda Secunderabad, 500017. ఇది ఆ ఇంటి అడ్రస్సు. కాని ఎందుకో అది నా యిల్లు అని నాకు అనిపించేది కాదు. ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుండి నా పెళ్ళి విషయాలు మాట్లాడేవాళ్లు అందరు. ఇది నా ఇల్లు కాదు, మరో ఇల్లేదో నాకున్నది అన్న భావాన్ని ఆ ఇంట్లో అనుభవించాను. అక్కడే నాకు పెళ్లి అయింది. మహేంద్రాహిల్స్ లోని ఓ ప్లాట్ నా ఇల్లయింది. ఎంత గుర్తుకు తెచ్చుకుందామన్నా ఆ ఇంటి అడ్రస్సు నాకు గుర్తుకు రాదు. అక్కడ ఉన్నన్ని రోజులు ఎవరి ఇంట్లోనో ఉన్న ఫీలింగ్ తప్ప అది నా ఇల్లు అని పెళ్ళి చేసుకున్న రోజు నుండి నాకేనాడూ అనిపించలేదు. తరువాత గొడవలు, అమ్మవాళ్ళ దగ్గరకు రావడం, మళ్ళి వెళ్ళడం, ఇలాగే మూడు సంవత్సరాలు గడిచాయి. ఆ రెండు ఇల్ల మధ్య తిరగడంలో ఏదీ నా ఇల్లు అనిపించలేదు. ఆ చేసుకున్న వాడు అలాగే చనిపోయాడు. ఆ పెళ్ళే పెద్ద మోసం అని తరువాత తెలిసింది. అప్పుడు మొదలయింది అసలు నా జీవితం ఏంటి, నా ఉనికి ఎంటి అన్న ఆలోచన. అప్పుడు కూడా ఆ ఇల్లు ఎవరికి చెందుతుంది అన్న గొడవే. నేను నష్టపోయిన జీవితానికి, జీవితాంతం మోయవలసిన భారానికి వెల కట్టారు అందరూ.

ఈ సమయంలోనే అమ్మవాళ్లు వారి మొట్ట మొదటి సొంత ఇల్లు అంటే తార్నాక లో ఓ ప్లాట్ లోకి మారారు. తరువాత మరో వివాహం. ఈ ఉద్దరింపు పెళ్లికి అన్న భాద్యతగా ఇచ్చిన ఇంకో ఫ్లాట్ కి మారాను. అక్కడకు అప్పుడప్పుడూ వచ్చే నా భర్త, ఆ యింటికి అధికారిగా ఫీల్ అవడం, నా ద్వారా తాను ఎదగాలని చేసే ప్రయత్నాలు అసలు ఆ ఇల్లు, ఆ భర్త, ఆ జీవితం ఏవీ నావి కావు అనిపించాయి. అప్పటి దాకా నాకు కావల్సింది గట్టిగా చెప్పడానికి అలవాటులేని నేను ఆ రోజుల్లోనే తిరుగుబాటు మొదలెట్టాను. ఇక ఆ పెళ్ళి కాదని మళ్లి అమ్మ వారింటికి చేరే సమయంలో అన్న ఆ ప్లాట్స్ లోనే ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఇంటిని నాది అని డిక్లేర్ చేస్తూ అక్కడికి రమ్మని చెప్పాడు. పైగా నాకు పెళ్లి తరువాత ఇచ్చిన ఇంటిని వెంటనే అమ్మేశాడు. ఏదీ అమ్మకుండా మరో ఇల్లు సమకూర్చుకోగల స్థాయి మాకు లేదు. సరే ఆ ఇల్లన్నా నాది అవుతుందని తార్నాకాకు చేరాను.

ఇల్లు అంటే ఓ మూల కాదని సమాజంలో ఓ స్థానం అని నాకు అప్పుడు అర్ధం కాలేదు.

అప్పుడే మా కుటుంబ స్నెహితులయిన ఓ అంకుల్ బిజినెస్ పరంగా హైదరాబాద్ షిప్ట్ అవవలసిన పరిస్థితి. ఆయన ఉండడానికి ఆ ఇల్లు వారికి ఇచ్చి పైనే అంటే తమతోనే ఉండిపొమ్మని అన్న ప్రస్తావన. ఆ అంకుల్ ని అందరం మా కుటుంబంలో ఓ సభ్యునిగానే చూసాం. నేను పైకి రావడం వలన ఆయనకు ఇప్పుడు మరో ఇల్లు అమర్చుకునే భారం తగ్గుతుంది. సరే ఆయన కుటుంబానికి ఉపయోగపడతాను. మా ఇంట్లో వారికీ ఇది సంతోషాన్ని ఇస్తుంది. మంచిదే కదా అనిపించింది. అప్పుడు నాతో క్లోజ్ గా ఉండే ఓ ఆంటి, “తప్పు చేస్తున్నావ్ జ్యోతి, నీకంటూ ఓ ఇల్లు ఉండాలి. దీన్ని వదులుకోకు” అని అనుభవంతో చెప్పినా నేను ఆ విషయం పెద్దగా ఆలోచించలేదు. నా సామాను అంతా ఆ ఇంట్లో అలాగే ఉంచి బట్టలు తీసుకుని పైకి షిప్ట్ అయ్యాను. అప్పుడు నెలల కోడుకు నాకు. ఆ తల్లితనం అనే మత్తులో ఉన్నాను. అప్పటి దాకా నాది అనేవి ఏవీ నాకు లేవు. సమకూర్చుకోవాలన్న కోరికా లేదు. నా బిడ్డ తప్ప నాకింకేమీ ఒద్దు అనే అర్ధం లేని ఎమోషన్ లో మునిగిపోయి ఉన్నాను. పైగా నా బిడ్డకు ఓ కుటుంబం దొరుకుతుంది. నాదేముంది? అన్న ఫీలింగ్ నన్ను ఆలోచించుకోనివ్వలేదు. ఆ ఇల్లు వదిలి పైకి షిప్ట్ అయ్యాను. నాదనే జీవితాన్ని నేను వదులుకుంటున్నానని నాకు అప్పుడు అనిపించలేదు. ఏ మూలనయినా నేను అడ్జస్ట్ అవగలను. నాకంటూ ప్రత్యేకంగా ఇల్లు ఎందుకు అనుకున్నాను. ఇల్లు అంటే ఓ మూల కాదని సమాజంలో ఓ స్థానం అని నాకు అప్పుడు అర్ధం కాలేదు. మర్రి చెట్టు లాంటి నాన్న, అన్నగార్ల మధ్య నేను సెదతీరతాను అనుకున్నాను కాని పరిస్థితులు నన్ను ఓ మూలకు నెట్టివేస్తాయని నేను అనుకోలేదు. నా విషయంలో వారు కూడా అశక్తులు అవుతారని ఊహించలేదు.

అక్కడ ఉండేటప్పుడు పిల్లవాడి భవిష్యత్తు నాకు పెద్ద ప్రయారిటీ అయింది. వాడికేవో నేర్పీంచాలి. ఎంతో విభిన్నంగా పెంచాలి. ముఖ్యంగా అన్నిట్లో వాడు టాలెంటెడ్ అవ్వాలి అనుకునేదాన్ని. అదొక్కటే నా ప్రయారిటీ అయింది. కేవలం అకడమిక్ సక్సెస్ జీవితం అని నేను ఎప్పుడూ అనుకోలేదు. వాడి గురించి ఏవో కోరికలు, ప్రణాళికలు ఉండేవి. కాని అవి సక్సెస్ అవ్వాలంటే ఓ వాతావరణం ఉండాలి అని, అది నేను ఏర్పరుచుకోవట్లేదని అనుకోలేకపోయాను. నా అనుకున్న కొడుకు చుట్టూ కూడా ఓ సమాజం ఉంటుందని, అది నాలాంటి ఒంటరి స్త్రీల బిడ్డలను తమలోకి లాక్కుంటుందని, ఆ ఉదృతాన్ని అంతగా కుటుంబపై ఆధారపడుతున్న నేను ఆపలేనని ఊహించలేకపోయాను. అసలు అలాంటి పరిస్థితులు నా జీవితంలో వస్తాయని అనుకోలేదు.

చాలా పోరాడాను. కాని నేను అనుకున్న విధంగా నా కొడుకుతో రిలేట్ అవ్వలేని పరిస్థితుల మధ్య చిక్కుకుపోయాను. అప్పుడు నిజంగా ఆత్మహత్య చెసుకోవాలనుకున్నాను. అంత పెద్ద ఓటమిని భరించే శక్తి నాలో లేకుండా పోయింది. పైగా కొడుకుపై నేను పెట్టుకున్న మెంటల్ అటాచ్మెంట్ ఓ డిపెండెంట్ స్టేట్ కి నన్నుతోసేసింది. నా జీవితంలో నేను అనుభవించిన భయంకరమైన స్థితి అది. నా వివాహాలు, నేను ఎదుర్కున్న మోసాలు ఇవేవి కూడా నా కొడుకు ఇచ్చిన ఆశాభంగం అంతగా నన్ను కృంగతీయలేదు. ఆ సమయంలో ఎంత కృంగి పోయానంటే చావు తప్ప మరో అప్షన్ కనిపించలేదు. కాని నాలోని ఆలోచన మాత్రం ఆ పరిస్థితులలోనూ చచ్చిపోలేదు. అదే నన్ను కాపాడింది. అప్పుడు కూడా నా పక్కన ఆ యుద్దంలో ఎవరూ లేరు. నా అనుకున్న కొడుకుతో సహా ప్రతి ఒక్కరు నన్ను అధఃపాతాళానికే నెట్టేసారు. పైగా నాదో విలువ లేని, అవసరం లేని జీవితం అని తేల్చిపడేసారు.

అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టాను. నా జీవితంలో ప్రతి పేజీని తెరిచి చూసుకున్నాను. నేనేంటి. ఈ స్థితికి ఎందుకు వచ్చింది నా జీవితం? అసలు నాకేం కావాలి? నేను ఎక్కడ తప్పు చేశాను? ఇతరుల మాటలు, సమాజం నాపై పెడుతున్న ప్రెషర్, ఇవన్నీ పక్కకు పెట్టి, నా గురించి మాత్రమే ఆలోచించుకున్నాను. నిజం చెబితే నా వివాహాలు, నా చుట్టూ ఏర్పరుచుకున్న బాంధవ్యాలతో ఘర్షణ కన్నా నేను చేసిన చాలా పెద్ద తప్పిదం “నాదనే ఓ జీవితాన్ని, ఓ స్థానాన్ని నేను ఏర్పరుచుకోలేకపోవడం” అని, ఇంకొకరి వెనుక జీవించడం నా భాద్యత అనుకుని గడపడం నేను చేసిన పెద్ద తప్పు అని అనిపించడం మొదలు పెట్టింది.

ఈ కుటుంబానికి దూరంగా నాతో రిలేట్ అవుతున్నవారందరూ నన్ను గౌరవిస్తారు, సమాజంలో నన్ను చూసి కొందరు భయపడతారు. నన్ను అప్రోచ్ అవడానికి వంద రకాలుగా ఆలోచిస్తారు. కాని ఈ ఇంటికి సంబంధించిన వాళ్లు మాత్రం నా పట్ల ఓ చులకన భావాన్ని ప్రదర్శిస్తారు. నా ప్రమేయం లేకుండా ఈ వాతావరణంలో నేనో విలువ లేని వస్తువుగా మారిపోయాను. ఇక్కడ నాదంటూ ఏమీ లేదు. గుండే చీల్చి ఇచ్చినా, ఎంత ప్రాణం పెట్టినా ఈ వాతావరణంలో నేను ఎవరికీ పనికిరాని దాన్నే. ఇక్కడ ఉండి నేనెంత భాద్యతగా ప్రవర్తించినా అది నేనోదో అవసరార్ధం చేస్తున్న పనిలా అనిపిస్తుందే తప్ప అది నా వ్యక్తిత్వంలా గుర్తించలేనంత గుడ్డితనం నా చుట్టూ ఉన్నవారి ఆవహించి ఉంది. అది నా కుటుంబం కావచ్చు, ఈ యింటికి వచ్చే వాళ్లు కావచ్చు. ఈ వాతావరణంలో నేనో పనికిరాని వస్తువుని. దీనికి కారణం నేను స్త్రీని, పైగా ఒంటరిని.

ఒంటరిగా బ్రతకాలని నిర్ణయించుకునే ప్రతి స్త్రీ తనకో గూడును తప్పకుండా ఏర్పరుచుకోవాలి. ఇది నేను నా జీవితంలో మిస్సయిన పాయింట్. ఆ గూడు వలన సమస్యలు తీరవు. కాని ఆ సమస్యలను ఎదుర్కునే స్థితిలో మాత్రం మార్పు వస్తుంది. మా నాన్నమ్మ, చినమ్మమ్మలు ఇంకొకరి అండలో జీవించినంత కాలం వారు పడిన ప్రస్టేషన్ వారినే స్థితికి నెట్టిందో నేను చూసాను. కాని అప్పుడు నాకు అది అర్ధం కాలేదు. చాలా మంది ఆ స్థితిలోనే జీవిస్తారు. ఒంటరిగా మిగిలిపోయినందుకు గిల్ట్ తో లేదా, తప్పకో సర్దుకుపోతారు. కాని నాలో ఆ గుణం లేదు. ఒంటరిగా మిగిలినందుకు నేను గర్వపడతాను తప్ప సిగ్గు పడను. ఆ సిగ్గు పడని తత్వమే నన్ను మనిషిగా నా కుటుంబం గుర్తించాలని, స్వీకరించాలని, గౌరవించాలని కోరుతుంది. ఆ కోరికే నా సంఘర్షణకు కారణం. కాని అది కేవలం కోరిక కాదు నా హక్కు. ఆ హక్కును నేను డిమాండ్ చేస్తున్నాను కాబట్టే నా చుట్టూ విషపూరితమైన వాతావరణం అలుముకుంటుంది.

నన్ను నేను మిగుల్చుకోవడానికి నేను ఆ రెండో దారినే స్వీకరించాను. కుటుంబం నుండి బైటికి వచ్చేసాను. అలా నా అనే ఈ యింటిలోకి ప్రవేశించాను.

ఈ స్పష్టత వచ్చిన తరువాత నాకు రెండు ఆప్షన్స్ కనిపించాయి. నా హక్కును మర్చిపోయి కాంప్రమైజ్ అయిపోయి నా చుట్టూ ఉన్న పరిస్థితులకు సరెండర్ అవడం. లేదా నా జీవితాన్ని ఆ హక్కుతో పునర్నిర్మించుకోవడం. మొదటిది చాలా సులువు. దానితో నేను కావాలనుకునే కొడుకుని నా దగ్గరకు రప్పించుకోవడం పెద్ద కష్టం కాదు. కాస్త ఓపిక, కొంచెం నటన చాలు. రెండో ఆప్షన్ నన్ను ఇంకా ఒంటరిని చేస్తుంది. చాలా మందికి శతృవును చేస్తుంది. కాని నన్ను నన్నుగా మిగులుస్తుంది. ఖలీల్ గిబ్రన్ “ది ప్రాఫెట్” లో ఓ మాట అంటారు. “నిన్ను ఎవరన్నా ప్రేమిస్తే వారిని స్వేచ్చగా వదిలేయి. వారు తిరిగి వస్తే ఆ ప్రేమ నిజమైనదని, రాకపోతే ఆ ప్రేమ ఎప్పుడూ లేదని తెలుసుకో”. అదెంత నిజమో అప్పుడు అర్ధం అయింది. నెను నా చుట్టూ ఉన్న ఈ మాయా ప్రపంచాన్ని వదిలి వేద్దామనే నిర్ణయించుకున్నాను. నేను ఇప్పుడు కొత్తగా పోగొట్టుకోవడానికి మరేమీ లేదు కూడా. చివరకు నాతో మిగిలింది నేను, నా వ్యక్తిత్వం. ఎన్ని పోగొట్టుకున్నా నన్ను నన్నుగా నిలిపింది నా వ్యక్తిత్వమే. ఇప్పుడు అదే నాకు తోడుగా నిలిచింది తప్ప మరెవ్వరూ నాకు లేరు. అలాంటప్పుడు ఆ వ్యక్తిత్వం ఇచ్చే బలంతో నేను ముందుకు అడుగు వేయాలి తప్ప నన్ను గౌరవించని మనుష్యులకోసం ఆరాట పడితే వాళ్లు కాళ్ళు తుడుచుకునే గుడ్డగా మాత్రమే మిగిలిపోతాను. నా కుటుంబం, నా కొడుకు పైన నాకు ఆరాటం ఉంది. కాని నేనంటూ ఉంటే కదా ఆ ఆరాటానికి గౌరవం, ఉపయోగం. నన్ను నేను మిగుల్చుకోవడానికి నేను ఆ రెండో దారినే స్వీకరించాను. కుటుంబం నుండి బైటికి వచ్చేసాను. అలా నా అనే ఈ యింటిలోకి ప్రవేశించాను.

కలిసి ఓ కుటుంబంలా జీవిస్తున్నప్పుడు కూడా నా డబ్బులో రూపాయి మా యింట్లో వాళ్లు ముట్టుకోలేదు. వారికి తెలియకుండా నేనెప్పుడూ ఓ రూపాయి ఖర్చుపెట్టలేదు. మా అన్నయ్య, నాన్నగార్లే డబ్బుకు సంబంధించి అన్ని విషయాలు చూసుకునేవారు. నా ఖర్చులు చాలా లిమిటేడ్ గానే ఉంటాయి. అందువలన ఎప్పుడూ డబ్బు విషయంలో ఏ తేడాలు ఫిర్యాదులు మా కుటుంబంలో ఒకరిపై మరొకరికి లేవు. నేను సంపాదించింది, నాదనుకున్నది ఎదో రకంగా పెంచాలని, భద్రపరచాలని తప్ప, అనుభవించాలని మా ఇంట్లో ఎవరూ అనుకోలేదు. అలా ఈ పాత ఇల్లును నా పేరున కొన్నారు. ఇది అద్దెల కోసం ఎప్పుడో కట్టిన ఇల్లు. ఈ ఇంట్లో ఉండడం కోసం కాక ఓ ప్రాపర్టీగా దీన్ని ఉంచాలన్న ఆలోచనతో కొన్న ఇల్లు ఇది.

ఈ ఇంటిలోకి నేను మొండిగానే ప్రవేశించాను. ఇల్లంటే నాకు చాలా అభిప్రాయాలు ఉండేవి. నేనున్న ప్రతి ఇంటిని అతి శ్రద్దగా అలంకరించేదాన్ని. అలా నా చేతులతో నేను అలంకరించిన ఇల్లు ఎన్నో. ప్రతి సారి ఇది నా ఇల్లు అని అనుకుంటూ దాన్ని అలంకరించడం, చివరకు అది నాది కాదు అని వదిలేసి రావడం. మెట్టుగుడలో మా యింటి నుండి ఈ రోజు నేను ఉంటున్న ఈ యింటి దాకా ప్రతి ఇంటిని గోడలనుండి గుమ్మాలదాకా డిజైన్ చేయడం, దాన్నివదిలెయడం, ఆ బాధను పదాలలోకి మార్చలేను. ఎంత కోరికతో ఒకో ఇంటిలో అడుగుపెట్టానో చివరకు అంతే విరక్తిగా ప్రతి ఇంటి నుండి బైట పడ్డాను. అలా నా జీవితంలో లెక్కించి చూస్తె అరడజను సార్లు నిరాశకు గురయ్యాను. ప్రతి సారి మనసు మూగగా ఏడ్చింది. అందుకే చాలా నిర్లిప్తంగా ఈ ఇంట అడుగుపెట్టాను.

ఈ ఇంటికి వచ్చినప్పుడు ప్రతి అంగుళం చెత్తా చెదారంతో, మరకలతో అసహ్యంగా అద్దెకున్న వారు చూపిన దాష్టికంతో నిండి ఉంది. అచ్చునా జీవితం లాగానే. నా నిర్ణయాన్ని మొదటి సారి ఇద్దరు స్నెహితులకు చెప్పాను. వుడ్ వర్క్ బిజినెస్ లో ఉన్న నా స్నెహితురాలు నాతో ఈ ఇల్లు నివాస యోగ్యంగా మార్చడం కోసం ఏం చేయాలో చూద్దాం అని వచ్చి మొదటి సారి ఇంటిని చూసి ఈ యింట్లో నువ్వు ఎలా ఉంటావు అంది. “సరే నీకేం కావాలో చెప్పు పని మొదలెడదాం” అని అడిగింది. ఒక్కో గదిని, ఒక్కో బండను, ఒక్కో మూలను చేత్తో గొకి బాగు చేసుకున్నాను. యీ ఇంటి మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ప్రతిదీ వంకరగానే ఉంటుంది. రెండు పోర్షన్ల కోసం కట్టిన ఇల్లు ఇది. బోలుడు తలుపులు. సరైన ప్లాన్ లేకుండా చేసిన కంస్ట్రక్షణ్. ఏవీ పగలగొట్టకుండా, ఒకో గదిని నా కున్న పరిజ్ఞానంతో నాకున్న తక్కువ ఆప్షన్లతో నాకు నచ్చిన విధంగా సిద్దం చేసుకున్నాను. పట్టుదలతో ఈ ఇంటి రూపానే మార్చివేయగలిగాను. పాడు పడిన ఇల్లు అన్నవారే ఇది అదె ఇల్లా అనిపించే విధంగా మార్చుకున్నాను.

ఇంటి రూపంతో పాటు నాలోనూ మార్పు వస్తూ పోయింది. చాలా నిబ్బరం వచ్చి చేరింది. అమితమైన ధైర్యం వచ్చింది. ఇంటితో పాటు నన్ను నేను స్వస్థపరుచుకున్నాను. ఇప్పుడు నాకు ఎవరిపై కోపం లేదు. ఎవరి పై కోరికా లేదు. నేను కావాలనుకున్నవారు నా ఇంటికి వస్తారు. నాతో పని ఉన్నవాళ్లు గేటుదాటి బెల్లు కొట్టి మర్యాదగా నిలబడి మాట్లాడి వెళతారు. నన్నో డోర్ మాట్ గా చూడాలనుకున్నవారు, నా ఇంటి డోర్ మాట్ కి కాళ్లు తుడుచుకుని నేనిచ్చిన నీళ్లు తాగి వచ్చిన విషయం చెప్పి వెళతారు. నన్ను కావాలనుకున్న వ్యక్తులకు నా ఇల్లు ఎప్పుడూ ఆహ్వానం పలుకుతూనే ఉంటుంది. నేను వద్దని అనుకున్నవారిని భరించవలసిన స్థితి ఇప్పుడు నాకు లేదు. ఎవరి దయకూ నేను పాత్రురాలిని కాదు. ఉన్నంతలో జీవిస్తాను. ఉంటే తింటాను. లేదా కడుపులో కాళ్ళు ముడుచుకుని పడుకుంటాను కాని నా అనే యింట్లో ఉంటాను. ముఖ్యంగా “ఇది నీ ఇల్లు కాదు, బైటికి నడువ్” అంటూ ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నాకు సూచనలిచ్చేవారు నా చుట్టూ ఎవరూ లేరు. ఇంతకు మించిన నెమ్మతి జీవితంలో మరొకటి ఉంటుందా?

కొన్నాళ్లు తండ్రి, తరువాత భర్త లేదా అన్న, ఆ తరువాత కొడుకు ఇలా ఎవరో ఒకరి చేతి క్రింద నాదనే ఇల్లు లేకుండా బతకడం ఒంటరి స్త్రీకి అవసరం అన్నది నేను ఎప్పటికీ అంగీకరించను.

స్త్రీకి తనదనే ఇల్లు కావాలంటే వివాహం ఓ ఆప్షన్. దాన్ని కాదన్న నా లాంటి వారికి జీవితంలో తనదనే ఇల్లు లేకుండా చేయాలనే ప్రయత్నం అందరిలో ఏదో ఓ కారణంతో ఉంటుంది. గమనిస్తే వివాహం అయిన స్త్రీలకు కూడా వారి ఇంటిపై అధికారం ఆ భర్త ద్వారా మాత్రమే వస్తుంది. ఆ పురుషుడు ఎప్పుడు ఆమె జీవితంలోనుంచి తప్పుకున్నా కుటుంబంలో ఆమెకిచ్చే ప్రయారిటీలో మార్పు వస్తుంది. తరువాత కొడుకు యింటి యజమాని అవుతాడు. ఆమె ఇల్లు ఎప్పటికీ ఆమెది కాదు. ఇలాంటి జీవితాలూ నేను చూస్తూనే ఉన్నాను.

వయసులో ఉన్న స్త్రీ ఒంటరిగా ఓ ఇంట్లో ఉంటుందంటే ఎందరికో ఇబ్బంది. ముఖ్యంగా ఆమె ఆ ఇంటికి ఎవరిని ఆహ్వానించాలన్నా ఆలోచించి ఆచి తూచి అడుగువేయాలి. ఆ స్థితిని నా జీవితంలో దాటేసాను. ఇప్పుడు, ఎవరి అమోదం నాకు వద్దు అన్న స్థితికి వచ్చాక ఎవరి పట్ల ఏ భయం నాలో లేదు. ఒంటరిగా చస్తాను అన్న భయం నాకు అస్సలు లేదు. నేను ఎక్కడ ఉన్నా ఒంటరిగానే చస్తాను అన్నది నిజం. ఎవరూ నా వాళ్లు కారు. ఇలా ఒంటరిగా ఉంటూ నా చుట్టూ ఉన్నవారి డ్రామాల నుండి తప్పించుకున్నాను. కొన్నాళ్లు తండ్రి, తరువాత భర్త లేదా అన్న, ఆ తరువాత కొడుకు ఇలా ఎవరో ఒకరి చేతి క్రింద నాదనే ఇల్లు లేకుండా బతకడం ఒంటరి స్త్రీకి అవసరం అన్నది నేను ఎప్పటికీ అంగీకరించను. నేను ఎలా ఉండాలో, ఎలా చావాలో నా శక్తి మేరా నేనే నిర్ణయించుకోదలిచాను. ఎంత మంది పిల్లలున్నా, తానుంటున్న ఒంటి గది ఇల్లు దాటి ఎవరి దగ్గరకూ రాకుండా ఉండాలని మా పెద్దమ్మమ్మ ఎందుకు అనుకుందో ఇప్పుడు నాకు పూర్తిగా అర్ధం అయింది. ఓ రకంగా ఆమె జీవితం నాకు ఈ విషయంలో ప్రేరణగా మారింది.

ఇప్పుడు నా ఇంట్లో నా కిష్టమైన పుస్తకాలు, నా కిష్టమైన పెయింటింగ్స్, నా కిష్టమైన వాతావరణం ఉంది. ఎవరైనా నన్ను పెళ్ళికో పేరంటానికో పిలవాలంటే నా ఇంటి గుమ్మం ముందుకొచ్చి పిలుస్తారు. నేను వద్దనుకున్నవారు నాకు ఎదురే పడరు. ఎంత నిశ్చింత. ఎంత ఇండివిడ్యుయాలిటీ ఉన్నా మరొకరి పంచన పడి ఉన్నందుకు ఏదో ఓ నెపంతో తేలిక భావంతో చూసేవాళ్ళు, మంచి చెప్పబోతే నీ సంగతి నువ్వు చూసుకోరాదా అని పరోక్షంగా మందలించే వాళ్లు ఎవరూ లేరు. ఇది నా యిల్లు, అన్నీ ఓడిపోయి, అందరూ వీడిపోయినాక కూడా నన్ను నేనుగా మిగుల్చుకోవడానికి నాకు తోడు నిలిచిన నా గూడు. ఈ యిల్లంటే అందుకే నాకు చాలా చాలా యిష్టం. గిల్ట్ తోనో, భయంతోనో, అభద్రతా భావంతోనే జీవించవలసిన అవసరం నాకు ఇక లేదు.

నా స్నేహితులు, నేను కావాలనుకున్న వాళ్లు నా కోసం వస్తూనే ఉన్నారు. అంతే గౌరవంతో నాతో కొంత సమయం గడిపి వెళతారు. రాని వారి కోసం ఆలొచించే సమయం నాకు లేదు. నా భాద్యతలను నేను మరవను. కాని నన్నో వస్తువుగా చూసే వారిని నేను క్షమించను. ఆ ధైర్యాన్ని ఇచ్చిన ఈ ఇల్లు ఇచ్చే ప్రశాంతత నేను నా జీవితంలో సాధించిన గొప్ప విజయం. అందుకే నా ఇల్లంటే నాకు చాలా చాలా ఇష్టం.

రచయిత్రి పి. జ్యోతి హిందీ ఉపన్యాసకులు. చక్కటి సమీక్షకురాలు. హైదరాబాద్ లో పుస్తకాల పట్ల అభిరుచి పెంచడంలో విశేషంగా కృషి చేస్తున్న spreading Lights నిర్వాహకురాలు కూడా. పుస్తకం, సినిమా తనకు రెండు కళ్ళు. ప్రపంచానికి గవాక్షాలు. ఇటీవలే వీరు రచించన దిలీప్ కుమార్ సినిమాల సమగ్ర పరిచయ పుస్తకం కోసం ఈ లింక్ క్లిక్ చేసి తెప్పించుకోవచ్చు. కాగా, తెలుపు కోసం రాస్తున్న ఈ శీర్షికలో తాను మొదటిసారిగా అంతర్ముఖంలోకి చూసుకుంటున్నారు. జీవితాన్నే పుస్తకంగా, అనుభవాలనే చలన చిత్రాలుగా ఎంచి సూటిగా తన జ్ఞాపకాలను నిర్మొహమాటంగా పంచుకుంటున్నారు. చదివితే మీరు ఆలోచనల్లో పడతారు.

చదవండి…ఈ శీర్షికలో మొదటి వ్యాసం మనసు పొరల్లో. రెండో వారం చిన్ననాటి చిరుతిళ్లు. మూడో వారం చిన్ననాటి సంగతులు. నాలుగో వారం పంచుకోవడంలో అనందం. ఐదో వారం ఒంగోలు గిత్తలు ….మా తాత. ఆరో వారం ‘చందమామ’తో మొదలు.  ఏడో వారం ఎవరు రౌడీలు? ఎవరు మర్యాదస్తులు??. ఎనిమిదో వారం నాకు తెలిసిన స్త్రీ వాది – My First Feminist. తొమ్మిదో వారం ఆ మూమెంట్ గోదావరి లాంటిదే. పదోవారం నేను వెతుకుతుంది గురు దత్ లాంటి స్పందించే హృదయాన్ని. పదకొండో వారం అవును. నా మేని ఛాయ నలుపు. పన్నెండో వారం ఇప్పుడు నేను ఎవరికీ కొరకరాని కొయ్యను. పదమూడో వారం ఆయన లేని లోటు బాధిస్తోంది.  పద్నాలుగో వారం శుభకార్యాల్లో ఒంటరి స్త్రీలు. పదిహేనో వారం అవును. దేశాన్ని ఉద్దరిస్తోంది మేమే. పదిహేనో వారం మోసమా – దురదృష్టమా? 16 వ వారం మరోసారి భార్యగా. 17 వ వారం నాకు తోడుగా నీడగా ఉన్నవి పుస్తకాలే. మీరు చదువుతున్నది 18 వ వారం జ్ఞాపకాలు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article