Editorial

Monday, December 23, 2024
Peopleదిలీప్ కుమార్ పై పుస్తకం ఎందుకు తెచ్చాను - పి.జ్యోతి తన మాట

దిలీప్ కుమార్ పై పుస్తకం ఎందుకు తెచ్చాను – పి.జ్యోతి తన మాట

సినిమాలు ఏం నేర్పిస్తాయి అన్న వారికి నా జీవితమే జవాబు.

పి.జ్యోతి

పుస్తకం, సినిమా ఈ రెండూ నాకు అన్ని సమయాలలోనూ తోడు, నీడ. సినిమా, పుస్తకం తీర్చిన మనిషిని అని నేను ఎప్పుడు చెపుతూ ఉంటాను. ఒక మధ్య తరగతి ఇంట్లో, పుస్తకాలని గౌరవించే వ్యక్తుల మధ్య గడిచిన నా బాల్యంలో పెద్ద కాలేజీ చదువులు చదవని, తెలుగు తప్ప మరో భాష సరిగ్గా రాని కుటుంబ సభ్యుల మధ్య నేను పెరిగి, నాది కాని భాషను బోధించే స్థాయికి ఎదగడం వెనక సినిమా, పుస్తకం ఇవి రెండూ చేసిన మేలు మరచిపోలేనిది.

కాలేజీలకు వెళ్లక పోయినా జీవితాన్ని చదివి, విలువలకు పెద్ద పీట వేసే మా కుటుంబంలో నాకు లభించిన స్వేచ్ఛ కూడా అత్మగౌరవంతో నేను జీవించడానికి సహాయపడింది. నేను నా జీవితంలో, చాలా ప్రేమించేది నేను చేస్తున్న నా ఉద్యోగాన్ని. ఒక హిందీ అధ్యాపకురాలిగా, నేను చేసిన ఈ ప్రయాణంలో భాషా పరమైన సహాయం నాకు అందించే స్థితిలో నా కుటుంబం లేదు. హిందీ, ఇంగ్లీషు రెండూ కూడా వారికి దూరం. అయినా, తెలుగుతో పాటు సమాన స్థాయిలో ఆ రెండు భాషల్లో నేను ఈ మాత్రం పట్టు సాధించానంటే, నా కాలేజీ విద్య కన్నా ఎక్కువ సహాయపడింది నేను చదివిన సాహిత్యం, చూసిన సినిమాలు.

సినిమాలు ఏం నేర్పిస్తాయి అన్న వారికి, నా జీవితమే జవాబు. హిందీలో అప్పట్లో వినే రఫీ పాటల్లోని మాధుర్యం, అతని గానంలోని ఆ ఆకర్షణ నాకు ఆ భాష పట్ల మమకారాన్ని కలిగించింది. పాత పాటల పట్ల పెరిగిన ఆ మమకారం, ఎలా అయినా ఆ భాషను అంత బాగా పలకాలనే పట్టుదలను కలిగించింది. కాని నా చుట్టూ ఉన్న ఎవ్వరూ కూడా, హిందీ బాగా వచ్చిన వారు కారు. హిందీ మాట్లాడుతున్న వారు, బోధిస్తున్న వారిలో దక్షిణ భారత ఉచ్చారణ ఉండి నాకు వారి మాట నచ్చేది కాదు. హిందీలో నలబై మార్కులు వస్తే గానీ, స్కూల్లో పాస్ చేసేవారు కాదు. ఐదో తరగతికి వచ్చే దాకా, అన్ని సబ్జెక్టులలో మంచి మార్కులు వస్తున్నా హిందీలో పాస్ అవడం కష్టంలా ఉండేది. అప్పుడు నాకు హిందీ టీచర్లుగా వచ్చిన జగదీశ్వర్, పరమేశ్వర్ సార్లు నాపై చూపిన ప్రభావం నాతో ఇప్పటికీ ఉంది. పట్టుదలతో హిందీ పరీక్షలకు రాస్తున్నా, ఉత్తర భారత ఉర్దూ ప్రభావిత హిందీ మాట్లాడాలనే నా కోరికకు దారి దొరకలేదు.

దిలీప్ కుమార్ డిక్షన్ లో ఉన్న ఆ రాజసం హై స్కూలు రోజుల్లోనే చాలా ఆకర్షించింది.

ఆ సమయంలో, నాకు దొరికిన గురువు దిలీప్ కుమార్. హిందీ పాత సినిమాలు అన్నీ చూస్తున్న దిలీప్ కుమార్ డిక్షన్ లో ఉన్న ఆ రాజసం హై స్కూలు రోజుల్లోనే చాలా ఆకర్షించింది. రఫీ పాటలు, హిందీ పాత సినిమాలు, దిలీప్ కుమార్ డిక్షన్, ప్రతి రోజు వివిధ భారతిలో రాత్రి వచ్చే ‘ఛాయాగీత్’ కార్యక్రమం నాకు హిందీ పాఠాలయినాయి. అప్పట్లో రేడియోలో వచ్చే ‘ఛాయాగీత్’ కార్యక్రమం లో, కాంతా గుప్తా అనే ఒక అనౌన్సర్ ఉండేవారు. ఆవిడ పలికే పదాలను, కవితలను కాగితాలపై రాసుకునే దాన్ని. తరవాత నేను హిందీ మాట్లాడుతుంటే తెలుగు వ్యక్తిని అని ఎవరికీ తెలియనంతగా ఆ భాషపై పట్టు సాధించడమే కాకుండా షేరో షాయరీని, హిందీ కవిత్వాన్ని, సాహిత్యాన్ని తృప్తిగా చదివగలిగే స్థాయికి చేరడం నేను ఇష్టపడి సాధించిన విజయం.

నేను చదివిన మొదటి నవల హిందీ భాషలోనే, మొదటి సాహితీ కథ కూడా హిందీదే, మొదటి కవిత కూడా, హిందీ భాషలోదే. అలా హిందీ ద్వారా పెరిగిన సాహిత్యాభిలాష, తరువాత తెలుగు వైపుకు ఆ తరువాత ఇంగ్లీషు సాహిత్యం వైపుకు మళ్లింది. అందుకే వీటన్నిటికి ప్రేరణగా నిలచిన దిలీప్ కుమార్ అంటే, నాకు గౌరవం. తరువాత పరిచయం అయిన గురుదత్ సినిమాలంటే ప్రాణం.

యాబై సంవత్సరాలకు ఆరు నెలలు తక్కువున్న నా జీవిత కాలంలో నన్ను తీర్చిదిద్దడంలో సినిమాలు ముఖ్య పాత్ర పోషించాయని చెప్పడానికి బిడియపడటంలేదు. సినిమాను ఎలా చూడాలి? ఒక నటుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి లాంటి విషయాలనే కాకుండా అంతర్జాతీయ నటుల సినిమాలను అర్ధం చేసుకునే స్థాయికి నేను ఎదగడానికి కారణం దిలీప్ కుమార్ లాంటి నటుడిని చిన్నప్పటి నుండి పరిశీలించడమే.

గురుదత్ సినిమాలను అర్ధం చేసుకోవడానికి, సాహిర్ లుధియాన్విని ఇష్టపడడానికి వెనక కూడా దిలీప్ కుమార్ తో నేను చేసిన ఏకలవ్య శిష్యరికమే కారణం. నేను చూసిన సినిమాలు, చదువుకున్న కవిత్వం, సాహిత్యం ఎప్పుడూ ఉన్నతమైన జీవితాన్ని, వ్యక్తిత్వం ఉన్న స్నేహాలను కోరుకునేలా ప్రేరేపించేవి. ఇది ఒక రకమైన ఒంటరితనం వైపుకు నన్ను నడిపించినా, జీవితంలో ఒక టేస్ట్, నాదైన ఒక వ్యక్తిత్వం నాకు వచ్చేలా తోడ్పడ్డాయి.

ఈ రోజు యాబై సంవత్సరాలకు ఆరు నెలలు తక్కువున్న నా జీవిత కాలంలో నన్ను తీర్చిదిద్దడంలో సినిమాలు ముఖ్య పాత్ర పోషించాయని చెప్పడానికి బిడియపడటంలేదు. సినిమాను ఎలా చూడాలి? ఒక నటుడికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి లాంటి విషయాలనే కాకుండా అంతర్జాతీయ సినిమాను అర్ధం చేసుకోవడానికి ఆంతోని హాప్కిన్స్, రిచర్డ్ బర్టన్, క్లార్క్ గెబిల్, జేమ్స్ స్టీవర్ట్, డానియల్ డే లూయిస్, మార్లన్ బ్రాండ్, సిడ్నీ పాయియర్, రాబర్ట్ రెడ్ఫోర్డ్, డస్టిన్ హాఫ్మాన్, అల్ పాచినో లాంటి హాలివుడ్ యాక్టర్లు, రికార్డ డారిన్, బడ్ స్పెన్సర్, ఉల్రిచ్ ముహె, కార్లో బాతిస్తీ లాంటి అంతర్జాతీయ నటుల సినిమాలను అర్ధం చేసుకునే స్థాయికి నేను ఎదగడానికి కారణం దిలీప్ కుమార్ లాంటి నటుడిని చిన్నప్పటి నుండి పరిశీలించడమే.

భారతీయులకు ఐక్యత తక్కువ, మన వారిపై మనకే చులకన భావం, వెరసి భారతీయ సినిమాలోని మొదటి మెథడ్ యాక్టర్ నే స్టడి చేయని వారికి, ఈ వాతావరణంలో పెరుగుతున్న కొత్త తరం సినీ ప్రేమికులకు దిలీప్ కుమార్ అని పరిచయం చేయాలని అనిపించడంతో నేను చేసిన ఈ ప్రయత్నమే “తల్జాబ్ కా బాద్షాహ్” దిలీప్.

తెలుగు సినిమా ప్లాటినం జూబ్లి వేడుకలను నిర్వహించినప్పుడు దిలీప్ కుమార్ ని కనీసం గౌరవ అతిధిగా కూడా పిలిపించలేని మన తెలుగు సినీ మేధావులను చూసినప్పుడు, హిందీ సినిమాకు దూరంగా ఉండే తమిళ, మళయాళ సోదరుల భాషా రాజకీయాలను గమనించినప్పుడు బాధ అనిపించేది. ప్రపంచ సినిమాను అధ్యయనం చేసే తమిళ సినిమా ప్రేమికులు, భాషా రాజకీయాల కారణంగా దిలీప్ కుమార్ లాంటి ఇన్స్టిట్యూషన్ను విస్మరించడం చూసినపుడు వారి మూర్ఖత్వానికి జాలి కలిగేది. మన భారతీయులకు ఐక్యత తక్కువ, మన వారిపై మనకే చులకన భావం, వెరసి భారతీయ సినిమాలోని మొదటి మెథడ్ యాక్టర్ నే స్టడి చేయని వారికి, ఈ వాతావరణంలో పెరుగుతున్న కొత్త తరం సినీ ప్రేమికులకు దిలీప్ కుమార్ అని పరిచయం చేయాలని అనిపించడంతో నేను చేసిన ఈ ప్రయత్నమే “తహ్జీబ్ కా బాద్షాహ్” దిలీప్.

తొంబై ఎనిమిది సంవత్సరాల జీవితం, అరవై రెండు సినిమాల ప్రయాణం ముగించుకుని జూలై ఏడు 2021న దిలీప్ కుమార్ మరణించడంతో ఒక శకం, ఒక తరం, ఒక సంస్కృతి మాయం అయ్యాయి. ఇది తెలుసుకోవాలంటే వారి సినీ ప్రయాణాన్ని, తద్వారా భారతీయ సినిమా ప్రస్థానాన్ని అర్ధం చేసుకోవాలి.

తెలుగు సినీ ప్రియులు దిలీప్ సాబ్ ని మరచిపోకూడదన్న ఒక గురు భక్తి కూడా ఈ పుస్తకాన్ని ఇలా తీసుకు రావడానికి కారణం.

నేను దిలీప్ సాబ్ తరానికి చెందిన దానిని కాను. ఒక సినీ ప్రేమికురాలిగా, భాషాభిమానిగా, సాహిత్యాభిమానిగా వారి తరువాతి రెండవ తరానికి చెందిన నాలాంటి సామాన్యురాలిని కూడా ప్రభావితం చేసిన నటుడు ఆయన. సినిమాను సీరియస్ సబ్జెక్ట్ తీసుకుని విశ్లేషించే వారందరూ దిలీప్ కుమారిని మిస్ అవడం దురదృష్టం అని చెప్పాలనే ఈ ప్రయత్నం.

తెలుగు సినీ ప్రియులు దిలీప్ సాబ్ ని మరచిపోకూడదన్న ఒక గురు భక్తి కూడా ఈ పుస్తకాన్ని ఇలా తీసుకు రావడానికి కారణం. ఒక ప్రేక్షకురాలి దృష్టితో విశ్లేషించిన ఈ సినిమాలన్నిటి ద్వారా దిలీప్ సాబ్ సినిమా అనే మాధ్యమంతో కమ్యూనికేట్ చేసిన కళా విలువలను చూపించే ప్రయత్నం నాకు సాధ్యమయినంత వరకు నిజాయితీగానే చేశానని అనుకుంటున్నాను.

రచయిత్రి పి. జ్యోతి హైదరాబాద్ లో పుస్తకం పట్ల అభిరుచి పెంచుదమలో విశేషంగా కృషి చేస్తున్న spreading Lights నిర్వాహకురాలు. వీరు రచించన దిలీప్ కుమార్ సినిమాల సమగ్ర పరిచయ పుస్తకం కోసం ఈ లింక్ క్లిక్ చేసి తెప్పించుకోవచ్చు. పుస్తకం గురించి లోతుగా రచయిత్రి చేసిన ఫేస్ బుక్ లైవ్ ఇది క్లిక్ చేసి వినవచ్చు. మరిన్ని వివరాలకు వారి నంబర్ 9885384740

More articles

2 COMMENTS

  1. a nice discription on dilip kumar and cinima
    hatus up to you madam.
    being born in telugu mother tongue family you are intrested in hindi
    and became one author i like your interest in languages

  2. సంజీవ్ కుమార్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లాంటి మేటి నటులకు దిలీప్ కుమారే ఇన్స్పిరేషన్ అన్న సంగతి ఈ తరం తెలుగు వాళ్ళకి ఎంతమందికి తెలుసు ! ధర్మేంద్ర నటుడుగా ప్రయత్నం చేస్తున్న రోజుల్లో తను విపరీతంగా అభిమానించే దిలీప్ కుమార్ ను చూడడానికి, అయన ఇంటి కాంపౌండ్ దూకి, దొంగతనంగా ఇంట్లోకి ప్రవేశించాడని ఎంత మందికి తెలుసు ! అయన పుట్టిన రోజు వచ్చిందంటే చాలు, ధర్మేంద్ర, అమితాబ్, షారుక్, ఆమీర్ ఖాన్ లాంటి మేటి నటులు ఆయన్ని ఎంతో ఆరాధనగా చూస్తూ, కేరింతలు కొడుతూ, కేక్ కట్ చేయిస్తారని ఎంత మందికి తెలుసు! దిలీప్ కుమార్ లోని నటుడ్ని ఈ తరం తెలుగు ఫిలిం మేకర్స్ కి, సినిమా అభిమానులకు పరిచయం చేయాలన్న మీ తపన, ప్రయత్నం చాల గొప్పది జ్యోతి గారు ! కేవలం ప్రయత్నం చేయడమే కాదు, దాన్ని విజయవంతంగా సాకారం చేసారు ! మీకు అభినందనలు అని చెప్పడం చాల చిన్న మాట జ్యోతి గారు !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article